రైతుబంధు డబ్బు కాజేసేందుకు అడ్డదారులు | Revenue Officers Finding New Ways To Get Rythu Bandhu Scheme Benefits | Sakshi
Sakshi News home page

రైతుబంధు డబ్బు కాజేసేందుకు అడ్డదారులు

Published Sat, Sep 7 2019 12:05 PM | Last Updated on Sat, Sep 7 2019 12:05 PM

Revenue Officers Finding New Ways To Get Rythu Bandhu Scheme Benefits - Sakshi

సాక్షి, కామారెడ్డి:  అస్తవ్యస్తంగా ఉన్న దశాబ్దాల నాటి భూ రికార్డులను సరిచేయడం కోసం చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం కొందరు రెవెన్యూ సిబ్బందికి కాసుల పంట పండించింది. రైతుబంధు డబ్బులు నొక్కేసేందుకు అడ్డదారులు తొక్కిన పలువురు రెవెన్యూ అధికారులు.. ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వ భూమిని తమ సంబంధికుల పేర్లపై రాసేశారు. కొన్ని సంఘటనలు రుజువు కావడంతో ఉన్నతాధికారులు బాధ్యులపై చర్యలు కూడా తీసుకున్నారు. అక్రమాలపై ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. 

భూ రికార్డులు అస్తవ్యస్తంగా ఉండడం వల్లే భూ వివాదాలు తలెత్తుతున్నాయని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ప్రస్తుత రికార్డులను సరిచేయడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా చూడాలన్నది ఈ కార్యక్రమ ఉద్దేశం. 2017 సెప్టెంబర్‌ 15న ఈ ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు అన్ని గ్రామాలలో రైతుల సమక్షంలో రికార్డుల ప్రక్షాళన చేపట్టారు.

కొందరు అవినీతి అధికారులకు ఈ కార్యక్రమం వరంలా మారింది. అధికారులు రైతుల వద్దనుంచి డబ్బులు తీసుకుని, రికార్డుల ప్రక్షాళన చేశారన్న ఆరోపణలు వచ్చాయి. రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా రైతుల వద్ద డబ్బులు డిమాండ్‌ చేసి, అక్రమాలకు పాల్పడి జిల్లావ్యాప్తంగా పలువురు తహసీల్దార్‌లు, డిప్యూటీ తహసీల్దార్‌లు, ఆర్‌ఐ స్థాయి అధికారులు సైతం సస్పెండయ్యారు. ఒక తహసీల్దార్, ఒక ఆర్‌ఐ, ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్‌లు, 20 మంది వీఆర్‌వోలు, వీఆర్‌ఏలపై సస్పెన్షన్‌ వేటు పడింది. పలువురిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి.  

బంధువుల పేర్లమీదకు..
దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని భూ వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమానికి రెవెన్యూ అధికారులు, సిబ్బంది చెదలు పట్టించారు. రికార్డుల్లో ఉన్న వివరాలు, తప్పొప్పులను సరి చేయడం, ఫౌతి, వారసత్వ భూముల బదలాయింపు, పట్టామార్పిడీ, సవరణల కోసం అనేక మంది కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పనిభారం ఎక్కువగా ఉండడంతో ఆయా మండలాల్లో తహసీల్దార్లు ఆన్‌లైన్‌లో లాగిన్‌ తీసుకుని వీఆర్వోలకు, వీఆర్‌ఏలకు పనులు అప్పగించారు. సరైన పద్ధతిలో రికార్డులను నిర్వహించాల్సిన సిబ్బంది.. అవకాశం దొరకడంతో అవకతవకలకు పాల్పడినట్లు చాలా సంఘటనల్లో వెల్లడైంది. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో రికార్డులు తారుమారు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటి వరకు కొన్ని వ్యవహారాలు మాత్రమే అధికారుల దృష్టికి వచ్చాయి.

మాచారెడ్డి మండలం ఇసాయిపేట, ఎల్లంపేట గ్రామాలకు చెందిన వీఆర్‌ఏలు, తమ పేర్లమీద, తమ బంధువుల పేర్ల మీద ప్రభుత్వ భూములను రికార్డులలో నమోదు చేయించినట్లు అధికారులు గుర్తించారు. వాడి వీఆర్‌ఏ సైతం రికార్డుల నమోదులో అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో సస్పెండ్‌ చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల పరిధిలో ప్రభుత్వ భూములను తమ బంధువులు, సన్నిహితుల పేరిట వీఆర్వోలు, వీఆర్‌ఏలు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. జిల్లాలో రికార్డుల ప్రక్షాళన వివరాల ప్రకారం 20 వేలకు పైగా ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయి. రైతుబంధు పథకం డబ్బులను కాజేసేందుకే ఆయా గ్రామాల్లో వీఆర్‌ఏలు, వీఆర్‌వోలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. జిల్లాలోని అన్ని గ్రామాల పరిధిలో ఇలాంటి వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన ఆవసరం ఉంది.  

ఫోన్‌ఇన్‌ ద్వారా వెలుగులోకి..
రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని వందశాతం పూర్తి చేయాలనే సంకల్పంతో కలెక్టర్‌ సత్యనారాయణ రెండు నెలల క్రితం ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన జేసీతో కలిసి రోజూ ఉదయం గంట పాటు ఫోన్‌ ద్వారా రైతులనుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత మండలాల అధికారులను ఆదేశిస్తున్నారు. ఫోన్‌ఇన్‌లో భాగంగా జిల్లాలోని ఆయా గ్రామాల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో ఎక్కువ అధికారుల అక్రమాలు, నిర్లక్ష్యంపైనే ఉంటున్నాయి. ఫోన్‌ఇన్‌ ప్రారంభమయ్యాక వీఆర్వోలు, వీఆర్‌ఏలు పాల్పడిన అవినీతిని కలెక్టర్, జేసీల దృష్టికి తీసుకువస్తున్నారు. దీంతో ఉన్నతాధికారులు ఆ ఫిర్యాదులపై విచారణ జరిపిస్తున్నారు. ఇలా నలుగురు వీఆర్వోలు, పలువురు వీఆర్‌ఏలపై వచ్చిన ఫిర్యాదుల మీద విచారణకు ఆదేశించడంతో జరుగుతున్న అవకతవకలు నిర్ధారణ అయ్యాయి. మాచారెడ్డి మండలం బండరామేశ్వర్‌పల్లి వీఆర్వో సూర్యవర్ధన్‌ను వసూళ్లు, అవినీతి ఆరోపణలపై సస్పెండ్‌ చేస్తు కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సోమార్‌పేట్‌ వీఆర్వో మల్లేశ్‌ విధుల్లో నిర్లక్ష్యం కనబరచడం, ఇతర ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురయ్యారు.

ఇసాయిపేట, ఎల్లంపేట వీఆర్‌ఏలు ప్రభుత్వ భూములను తమ బంధువుల పేర్ల మీదకు మార్చినట్లు రుజువు కావడంతో అధికారులు సస్పెండ్‌ చేశారు. వాడి వీఆర్‌ఏ కూడా గతంలో రికార్డుల నమోదులో అక్రమాలకు పాల్పడ్డట్లు నిర్ధారణ కావడంతో ఇటీవల సస్పెండ్‌ చేశారు. భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి వీఆర్‌ఏ నర్సింలు సైతం రికార్డులలో తప్పులు, అనుచిత ప్రవర్తన కారణంగా çసస్పెన్షన్‌కు గురయ్యారు. నెలరోజుల క్రితం రామారెడ్డి మం డలం మోషంపూర్‌ గ్రామానికి చెందిన ఇద్దరు వీఆర్‌ఏలు గ్రామానికి చెందిన మరొకరి భూమిని వారి పేర్ల మీదకు మార్చేందుకు ప్ర యత్నించగా అధికారులకు ఫిరఘ్యదులు వచ్చా యి. విచారణలో వాస్తవమేనని తేలడంతో స స్పెండ్‌ చేశారు. వీఆర్‌ఏల పనితీరుపై దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఫిర్యాదులు వస్తున్నాయి.  

పక్షం రోజుల్లో..
పక్షం రోజుల్లో పలు మండలాలకు చెందిన ఐదుగురు వీఆర్‌ఏలు, ఇద్దరు వీఆర్‌వోలు అవినీతి ఆరోపణలపై సస్పెండ్‌ కావడం చూస్తుంటే రెవెన్యూశాఖలో అవినీతి ఏ స్థాయిలో పెరిగిందో తెలుస్తుంది. జిల్లాలోని మరో వీఆర్‌వో ఏకంగా ఏసీబీకి పట్టుబడ్డాడు. అంతేగాకుండా రైతుల పేరిట రికార్డులను నమోదు చేయడం, పట్టాదారు పాసుపుస్తకాలను ఇప్పించడంలోనూ జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నట్లు అనేక ఫిర్యాదులు ఉన్నతాధికారుల దృష్టికి వస్తున్నాయి.  

చర్యలు తప్పవు 
గతంలో రెవెన్యూ రికార్డుల నమోదులో జరిగిన అవకతవకలు మా దృష్టికి వచ్చాయి. కలెక్టర్‌ ఆదేశాల మేరకు విచారణ జరిపించాం. తప్పిదాలకు పాల్పడిన వారిపై విచారణ జరిపి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.  
– శ్రీనివాసరావు, తహసీల్దార్, మాచారెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement