ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : రైతుబంధు వివరాలను రాష్ట్ర ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. బయటకు చెప్పకూడదని వ్యవసాయాధికారులను కట్టడి చేసింది. బయటి వ్యక్తులకే కాదు మీడియాకు కూడా వివరాలను వెల్లడించడానికి అధికారులు జంకుతున్నారు. ఉద్యోగాలు పోతాయనేంతగా భయంతో ‘ఆ ఒక్కటి అడక్కు’ అని మాట దాటేస్తున్నారు. దీంతో జిల్లాలో ఏడాది యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు నిధులు ఎంతమందికి వచ్చాయన్న లెక్కలు తెలియని పరిస్థితి నెలకొంది.
అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం వేస్తుండడమే ఇందుకు కారణమని మాత్రం తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 28 నుంచి రైతుబంధు సాయం అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో కొత్తగా 7,176 మంది రైతులను కలుపుకొని లబి్ధదారుల సంఖ్య 2,78,351 మందికి చేరుకుంది. ఇందుకు రూ.274.10కోట్లకు పైగా పెట్టుబడి సాయం అవసరమవుతోంది. తొలుత ఒకటి, రెండు, మూడెకరాలు వారికి పెట్టుబడి డబ్బులు అందగా, నాలుగు నుంచి ఆరెకరాల్లోపు ఉన్న రైతులకు ఆలస్యంగా అందాయి.
ప్రస్తుతం ఆరు ఎకరాలకు పైగా ఉన్న వారికి ఇంకొంత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పక్షం రోజులవుతున్నా తమకు రైతుబంధు రాలేదని రైతులు వ్యవసాయాధికారులకు ఫోన్లు చేస్తున్నారు. కొంత ఆలస్యమైనా డబ్బులు తప్పకుండా పడతాయని అధికారులు వారికి సముదాయిస్తున్నారు. కానీ, వరినాట్లు దాదాపు పూర్తయినప్పటికీ పంట సాయం అందకపోవడం పట్ల రైతులు ఆందోళనగా ఉన్నారు. ఎరువులు, మందుల కొనుగోలుకు చేతిలో పైసల్లేక అప్పు తెచ్చుకుంటున్నారు.
కొత్త రైతులకు అనుమానమే..
జిల్లాలో రైతుబంధు పొందే లబ్ధిదారుల జాబితాలో కొత్తగా పట్టాపాసు పుస్తకాలు పొందిన 7,176 మంది రైతులను చేర్చింది. అర్హత ఉన్న రైతులు రైతుబంధు కోసం దరఖాస్తుతో పాటు పాస్‌బుక్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ జిరాక్స్‌లను మండల వ్యవసాయాధికారులకు అందజేశారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఆ రైతుల పేర్లను మాత్రం రైతుబంధు పోర్టల్‌లో ఇంకా నమోదు చేయలేదు. దీంతో వ్యవసాయాధికారులు రైతుల వివరాలను ఎంట్రీ చేయలేకపోతున్నారు. వచ్చిన దరఖాస్తులన్నీ మండల కార్యాలయాల్లోనే పడున్నాయి. తద్వారా కొత్త రైతులకు యాసంగి పెట్టుబడి సాయం ఇప్పట్లో అందే పరిస్థితి కనిపించడం లేదు. సీసీఎల్‌ఏ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ను కొత్త పాస్‌పుస్తకాలు పొందిన రైతుల వివరాలు అందలేదని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment