land records cleansing
-
15 లక్షల ఎకరాలు.. 30 కారణాలు
సాక్షి, హైదరాబాద్: భూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభమై మూడేళ్లు పూర్తయినా... సుమారు 15 లక్షల ఎకరాలకు సంబంధించిన భూముల యాజమాన్య హక్కులపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. పలు కారణా లను చూపుతూ 9.67 లక్షల ఖాతాలకు డిజిటల్ సంతకం చేయకుండా పెండింగ్‌లో పెట్టిన రెవెన్యూశాఖ... వీటికి పరిష్కారమార్గం చూపడంలో చేతులెత్తే ్తసింది. దీంతో పట్టాదార్ పాస్‌పుస్తకాలు రాక, రైతు బంధు సహాయం అందక భూ యజమానులు ఇబ్బందులు పడు తున్నారు. తమ భూములపై పడిన గొళ్లెం వీడేదెప్పుడో తెలియక ఆందోళన చెందు తున్నారు. భూ వివాదాలు, సాంకేతిక కార ణాలు, సివిల్ కేసులు, ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల మధ్య సరిహద్దు తగాదాలు, వ్యవ సాయేతర అవసరాలకు మళ్లిన భూములు.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 15,69,209 ఎకరాల భూముల హక్కులు 30 కారణాలతో పెండింగ్‌లో పడిపోయాయి. ఎన్ని ఖాతా ల్లోని, ఎంత విస్తీర్ణంలో ఉన్న భూములకు, ఏ కారణంతో యాజమాన్య హక్కులపై స్పష్టత ఇవ్వలేదో వివరిస్తూ భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) వర్గాలు ఇటీవల ఓ నివేదిక తయారు చేశాయి. మరోవైపు కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసు కొచ్చిన ప్రభుత్వం.. భూ వివాదాలను పరిష్కరించే అధికారాలను రెవెన్యూ కోర్టుల నుంచి తొలగిం చింది. ఏ వివాదమైనా సివిల్ కోర్టులను ఆశ్రయిం చాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ పరిణామాల నేపథ్యంలో రెవెన్యూ కార్యా లయాల్లో మగ్గుతున్న లక్షలాది ఖాతాలకు పరిష్కారం ఎలా చూపుతారనే దానిపై స్పష్టత కరువైంది. కొత్త చట్టం అమలుపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తే తప్ప ఈ భూముల భవితవ్యమేమిటో ఆర్థంకాని పరిస్థితి. ఎందుకు పక్కనపెట్టారంటే పట్టణీకరణతో అనేక ప్రాంతాల్లో సాగు భూమలు వ్యవసాయేతర అవసరాలకు మళ్లాయి. అయితే, భూ వినియోగ మార్పిడి జరగకుండానే వీటిని వ్యవసాయేతర అవసరాలకు మళ్లించడం... కొంత మేర ప్లాట్లు, కొంత విస్తీర్ణంలో వ్యవసాయం సాగుతుండడంతో వీటికి పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఇచ్చే అంశంపై రెవెన్యూశాఖ స్పష్టమైన విధానం ప్రకటించలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 2.15 లక్షల ఎకరాలపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ సమస్య కొలిక్కి రావాలంటే క్షేత్రస్థాయి సర్వే అనివార్యం. మరోవైపు ఆధార్ వివరాలు సరిగా లేకపోవడంతో ఏకంగా 3.9 లక్షల ఖాతాల డిజిటిల్ సంతకాల ప్రక్రియ నిలిచిపోయింది. ఇలా 4.5 లక్షల ఎకరాల భూ విస్తీర్ణానికి ఇంకా గ్రహణం వీడలేదు. వారసత్వ పంచాయతీలతో 38,504 ఖాతాలు..33,682 ఎకరాల మేర పెండింగ్‌లో పడింది. అలాగే పీవోటీ కేటగిరీలో 64,722 ఖాతాలు... 82,439 ఎకరాల యాజమాన్యాలపై మెలిక పడింది. విస్తీర్ణంలో వ్యత్యాసాలున్న కేటగిరీలో 43,475 ఖాతాలకు సంబంధించి 65,316 ఎకరాలకు పాస్‌పుస్తకాలు పెండింగ్‌లో ఉంచారు. ఇవేగాకుండా ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల మధ్య సరిహద్దు వివాదాలతోనే వేలాది ఎకరాలకు సంబంధించిన భూ హక్కులపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వీటిపై ప్రభుత్వస్థాయిలో విధానపరమైన నిర్ణయం జరగలేదు, స్పష్టమైన మార్గదర్శకాలు లేవు కాబట్టి తహసీల్దార్లు డిజిటిల్ సంతకం చేయకుండా పక్కనపెట్టారు. కొత్త చట్టం రాకముందే...! తాజాగా అమలులోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టంతో ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందా? లేదా? అనేదానిపై కూడా అనిశ్చితి నెలకొంది. గతంలో భూ వివాదాలపై ఆర్జీల పరిష్కారం అధికారుల పరిధిలో ఉండేది. వివాదాలైతే రెవెన్యూ కోర్టుల్లో పరిష్కారం లభించేది. కొత్త చట్టంలో రెవెన్యూ కోర్టులను ప్రభుత్వం రద్దు చేసింది. అంతేగాకుండా రెవెన్యూ కేసులను పరిష్కరించుకోవాలంటే ఇకపై న్యాయస్థానాలనే ఆశ్రయించాలని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో వివిధ కారణాలతో నిలిపివేసిన పాస్‌పుస్తకాలకు మోక్షం ఎప్పుడు.. ఎలా కలుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సీసీఎల్ఏ చెపుతున్న 30 కారణాలతో పెండింగ్‌లో పడిన భూములకు పరిష్కారం కలగాలంటే సమగ్ర సర్వే ఒక్కటే మార్గమని, దీని ద్వారానే వివాదాలకు తెరపడుతుందని భూచట్టాల నిపుణులు చెపుతున్నారు. అయితే, ధరణి పోర్టల్ అప్డేట్ చేసి అధికారికంగా కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చే లోపే ఈ వివాదాస్పద భూముల విషయంలోనూ పరిష్కారం రావాల్సి ఉంటుందని, లేదంటే భవిష్యత్తులో ఈ భూములకు మరిన్ని ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. -
పార్ట్–బీ.. పరేషాన్!
సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లికి చెందిన మహబూబ్రెడ్డికి నిజాం కాలంలో 552 ఎకరాల భూమి 91 సర్వే నంబర్లో ఉంది. ఇందులో 294 ఎకరాలను భూదాన చట్టం కింద, 121 ఎకరాలను సీలింగ్ యాక్టు కింద అప్పట్లోనే పేదలకు పంపిణీ చేశారు. అందులో కర్ర యాకూబ్ అనే వ్యక్తికి భూదాన చట్టం ద్వారా 3 ఎకరాలు పట్టా అయ్యి సంక్రమిం చింది. ఇప్పుడు భూరికార్డుల ప్రక్షాళనకు వచ్చిన అధికారులు యాకూబ్ అనుభవిస్తున్న భూమి అటవీ శాఖకు చెందిందని అంటున్నారు. ఆయన భూదాన పట్టాను రద్దు చేసి ఆ భూమిని పార్ట్–బీలో చేర్చారు. దీంతో తన భూమి పట్టా కోసం యాకూబ్ చెప్పులరి గేలా తిరుగు తున్నాడు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల పరిధిలోనే సుమారు 9వేల ఎకరాల భూమి పట్టాలు ఇలా రద్దయ్యాయి. కొత్తగూడ, గంగారం మండలాల్లో మాత్రమే కాదు రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల భూములకు సంబంధించిన యాజమాన్య హక్కులు, పట్టాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. కారణమేదైనా వారి భూములకు సంబంధించిన సమస్యలు తీరనే లేదు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6 లక్షల ఖాతాల్లోని భూములు పెండింగ్‌లో ఉన్నాయని రెవెన్యూ అధికారులు చెపుతు న్నారు. ఈ భూములకు పరిష్కారం ఎలా లభిస్తుందో... కొత్త చట్టంలో ఏముందో అని ఆయా భూముల యజమానులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలు పార్ట్–బీ అంటే... భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలోని భూములను రెవెన్యూ యంత్రాంగం రెండు విభాగాలుగా చేసింది. అందులో మొదటిది పార్ట్–ఏ. ఇందులో ఎలాంటి వివాదాలు లేని భూములను చేర్చి ఆయా భూముల యజమానులకు కొత్త పాస్‌పుస్తకాలు ఇచ్చేశారు. పార్ట్–బీలో వివాదాస్పద భూములను చేర్చారు. అంటే... ప్రభుత్వ భూములు/ ఆస్తులు, అటవీ, దేవాదాయ, వక్ఫ్ భూములతో వివిధ ప్రభుత్వ శాఖలకు లేదా ప్రైవేటు వ్యక్తులకు పంచాయతీ ఉన్న భూములు, విస్తీర్ణంలో తేడాలున్న భూములు, కోర్టు కేసులు, కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు, అసైన్ చేసిన భూమికి– క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడా ఉన్న కేసులను ఈ కేటగిరిలో చేర్చి వాటిని పెండింగ్‌లో పెట్టారు. భూరికార్డుల ప్రక్షాళనకు అధికారులు వచ్చే సమయంలో ఎవరైనా ఏదేని భూమిపై చిన్న ఫిర్యాదు ఇచ్చినా దాన్ని అడ్డుపెట్టుకుని పార్ట్–బీలోకి నెట్టేసి పాస్‌పుస్తకాలను పెండింగ్‌లో పెట్టింది రెవెన్యూ యంత్రాంగం. కొన్నిచోట్ల అయితే ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు వర్గాల మధ్య పంచాయతీలున్న భూములను కనీసం సర్వే కూడా చేయకుండా ఇప్పుడు ఏకంగా అది ప్రభుత్వ భూమి అంటూ రికార్డు చేసేసింది. మరికొన్ని చోట్ల వివాదాల పేరుతో పక్కకు పెట్టేసింది రెవెన్యూ యంత్రాంగం. ఇలా వివాదాలున్న భూముల విషయంలో కొత్త రెవెన్యూ చట్టం ఏం చెపుతుందోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది. కోర్టు కేసుల విషయంలో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. మిగిలిన వివాదాల విషయంలో ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. దీంతో తమ భూముల విషయంలో ఏం జరుగుతుందో అనే ఆందోళన రైతాంగంలో వ్యక్తమవుతోంది. స్పష్టత కరువు... భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఇంకా పాస్‌పుస్తకాలు రాని ఖాతాలు (పార్ట్–ఏ లోనివే) 6 లక్షలకు పైగా ఉన్నాయి. ఇలా వివాదాస్పద భూమిగా పార్ట్–బీలో చేరిన భూములకు పాస్‌పుస్తకాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ వందలాది మంది ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే, కొత్త రెవెన్యూ చట్టంలో వివాదాస్పద పార్ట్ బీ భూములను ఎలా పరిష్కరిస్తారనే దానిపై ప్రభుత్వం ఇంకా స్పష్టతనివ్వలేదు. రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రత్యేక ట్రిబ్యునల్‌కు బదలాయిస్తామని సర్కారు పేర్కొంది. చట్టం మనుగడలోకి వచ్చిన తర్వాత ఎలాంటి భూ వివాదామైనా సివిల్ కోర్టుల్లోనే తేల్చుకోవాలని రెవెన్యూశాఖ తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెవెన్యూ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న లక్షలాది పార్ట్ బీ ఖాతాలకు ఎలాంటి పరిష్కార మార్గం చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూములు మొత్తం భూములు: 2.75 కోట్ల ఎకరాలు పట్టా భూములు: 1.50 కోట్ల ఎకరాలు అటవీ భూములు: 60 లక్షల ఎకరాలు (ప్రజావసరాలకు సంబంధించిన భూములు: 65 లక్షల ఎకరాలు (ప్రభుత్వ సంస్థలు, రహదారులు, మౌలిక సదుపాయాలు, గ్రామకంఠం, నదులు, పట్టణాలు సహా) -
మ్యుటేషన్.. నో టెన్షన్
రెవెన్యూ శాఖలో వేళ్లూనుకునిపోయిన అవినీతి, గత ప్రభుత్వం చేపట్టిన భూరికార్డుల సంస్కరణలు భూ యజమానుల హక్కులు.. చిక్కులుగా మారాయి. మ్యుటేషన్ (హక్కుల మార్పుల) కోసం చేసుకున్న చేసుకున్న దరఖాస్తులు కొన్నేళ్లుగా రెవెన్యూ కార్యాలయాల్లో కుప్పలు తెప్పలుగా పడిపోయి ఉన్నాయి. సిటిజన్ చార్ట్ ప్రకారం నిర్దేశిత సమయంలో దరఖాస్తులను పరిష్కరించాల్సిన రెవెన్యూ శాఖ హక్కుల పత్రాలు పరిశీలన చేయకుండా విచ్చలవిడిగా తిరస్కరించేశారు. అమ్యామ్యాలు సమర్పించిన వారివి మాత్రం పరిష్కరించారు. ఇంకా జిల్లా వ్యాప్తంగా 6 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టి భూ సమస్యలను సమూలంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. పైలెట్ ప్రాజెక్ట్‌గా జిల్లాలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టనుంది. అనంతరం జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామ రికార్డులను స్వచ్ఛీకరించే ప్రణాళిక రూపొందించనుంది. సాక్షి, నెల్లూరు: జిల్లాలో భూమి రికార్డులు అస్తవ్యస్తంగా మారాయి. గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ రికార్డుల నవీకరణ పేరుతో భూములను ఇష్టానుసారంగా సబ్డివిజన్ల ప్రక్రియ చేపట్టారు. ఇలా సబ్ డివిజన్ జరిగిన భూములు తాత్కాలిక ఖాతాల్లో ఉండిపోయాయి. ఇలాంటి ఖాతాలను శాశ్వత ఖాతాలుగా మార్పుకునేందుకు యాజమానులు ఇచ్చిన వినతులు బుట్టదాఖలు అయ్యాయి. ఈ క్రమంలో దశాబ్దాలుగా యజమానుల పేరుతో ఉన్న భూముల విస్తీర్ణాలు మరొకరి ఖాతాల్లో నమోదైపోయాయి. పట్టాదారు పాస్ పుస్తకాలు మాత్రం యజమానుల దగ్గర ఉన్నా.. ఆన్లైన్ అడంగళ్‌లో మాత్రం భూములు కనిపించకపోవడం, అధిక విస్తీర్ణం ఉండడం ఇలా లోపాలు తలెత్తాయి. వీటితో పాటు కొత్తగా భూములు కొనుగోలు చేసిన, వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ల ప్రక్రియ సాగడం లేదు. యజమానులకు తలనొప్పిగా మ్యుటేషన్ సాగుభూమి కొన్నామనే సంతోషం కొనుగోలు దారులకు దక్కాలంటే అంతా ఆషామాషీ కాదు. ఆ భూమి వారు పేరున మారాలంటే (మ్యుటేషన్) మాటల్లో అయ్యే పనికాదు. ఓ సర్వే నంబర్లో భూమి వివాదంలో ఉంటే.. ఆ పరిధిలోని అందరి భూములూ వివాదం జాబితాలోకి చేరిపోతాయి. ఫలితంగా వారికి మీ సేవ కేంద్రాల్లో అడంగళ్, 1బీ పత్రాలు రావటం లేదు. సంవత్సరం కిందట పత్రాల్లో మీ భూమి పూర్తి వివరాలుంటాయి. ఇప్పుడొకసారి పరిశీలిస్తే కొంత భూమి తగ్గిపోతుంది. అదేమని అధికారులను ప్రశ్నిస్తే దరఖాస్తు చేయండి సర్వే చేసి మార్పులు చేర్పులు చేస్తామంటారు. ఈ ప్రక్రియకు రోజులు.. నెలలు సంవత్సరాలు పట్టుతోంది. ఫలితంగా పంట రుణాలు అందక.. అప్పుల ఊబిలో రైతులు నలిగిపోతున్నారు. మ్యుటేషన్ ప్రక్రియ ఇలా.. రైతుల భూములకు సంబంధించి రికార్డుల్లో పేర్లు మార్పులు, చేర్పులు చేయాలంటే మీ–సేవలో దరఖాస్తు చేసుకోవాలి. నిబంధనల పేరుతో 30 రోజుల పాటు జాప్యం జరుగుతున్నందున రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నెల రోజులు దాటిన మ్యుటేషన్ కాకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. పంట రుణాలను పొందడానికి వీలు పడటం లేదు. భూముల క్రయ విక్రయాలు జరిగినా తర్వాత ఆ భూమి పేరు మారకపోతే రుణాలను పొందే అవకాశం ఉండడం లేదు. గతంలో దరఖాస్తు చేసినా.. మ్యుటేషన్ ప్రక్రియను మీ–సేవలో దరఖాస్తు చేసిన తర్వాత ఫారం–8 డ్రాప్ట్, నోటీసు వస్తుంది. 15 రోజుల తర్వాత దీనిపై విచారణ చేస్తారు. ఆ తర్వాత విచారణలో ఎలాంటి అభ్యంతరాలు లేవని వీఆర్వో, ఆర్ఐ, డీటీలు పేర్కొంటే తహసీల్దార్‌కు వెళుతుంది. అక్కడ సంతకం అయిన తర్వాత కంప్యూటరీకరణకు చేరుతుంది. ఆన్లైన్లో నవీకరించిన తర్వాత తహసీల్దార్ డిజిటల్ సంతకం చేస్తారు. ఆ తర్వాత ఆన్లైన్ పేరు మారినట్లు కనిపిస్తుంది. ఈ ప్రక్రియకు మొత్తం 30 రోజుల సమయం పడుతుంది. 30 రోజుల్లోగా పూర్తికాకపోతే ఆటో మ్యుటేషన్‌లోకి వెళుతుంది. సాంకేతికంగా ఎలాంటి సమస్యలు లేకపోతే కంప్యూటరే మ్యుటేషన్ చేస్తుంది. అయితే ఈ లోపే ఏదొక కారణంతో ఆటో మ్యుటేషన్‌కు వెళ్లకుండా అధికారులు చేస్తున్నారనేది ఆరోపణ. ఇక అక్రమాలకు అడ్డుకట్ట.. తాజాగా నూతన సర్కార్ ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్–2019ని తీసుకొచ్చింది. 1937 తర్వాత భూముల రీ సర్వే జరగలేదు. కొత్త చట్టం ద్వారా రీ సర్వే చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. భ యజమానులకు కొనుగోలు చేసిన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రికార్డులను పకడ్బందీగా ఉంచేందుకు చట్టం ఉపకరిస్తుంది. అన్నీ ఉన్నా చాలా మంది భూమిపై పూర్తి స్థాయిలో హక్కులు పొందలేక పోతున్నారు. న్యాయస్థానాలు ప్రాథమిక ఆధారాలుగా మాత్రమే గుర్తిస్తున్నాయి. భూ వివాదాలు ఏర్పడితే పరిష్కారం లభించడంతో జాప్యం జరుగుతోంది. భూమి హక్కు నిరూపించుకోవాలంటే పట్టాదారు పాసుపుస్తకం ఉండాలి. 1బీ అడంగళ్‌లో పేరు నమోదు ఉండాలి. ఆ రికార్డుల్లోని వివరాలు వందల సంవత్సరాల కిందట తయారైన ఆర్ఎస్ఆర్లోని వివరాలకు ఆ తర్వాత రుపొందించిన అడంగళ్‌కు అనుసంధానం కుదరాలి. లింక్ డాక్యుమెంట్లు ఉండాలి. ఇలాంటి ఆధారాలున్నా హక్కులు నిరూపణ కష్టంగా మారింది. కొత్త చట్టం ద్వారా ఒకే రికార్డు భూ యజమాన్య హక్కుల నిరూపణకు సరిపోతుంది. రికార్డుల్లో ఉన్న వివరాలకు ప్రభుత్వం హామీ ఇస్తుంది. దీనినే టైటిల్ గ్యారెంటీగా పేర్కొంటున్నారు. ఈ ప్రక్రియ చేపట్టడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రెండు నెలల్లో భూముల రికార్డుల ప్రక్షాళనను లోప రహితంగా చేసి యజమానులకు భరోసా కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగాంగా జిల్లాలో ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి పైలెట్ ప్రాజెక్ట్‌గా భూరికార్డులు ప్రక్షాళన, రీ సర్వే ప్రక్రియ చేపట్టనుంది. ఇది పూర్తయితే జిల్లా వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈ ప్రక్రియ చేపడుతుంది. భూ యజమానుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూ హక్కుల రిజిస్ట్రేషన్‌కు ప్రత్యేక వ్యవస్థ చట్టం అమల్లోకి వచ్చిన మరుక్షణమే భూ యజమానులకు భద్రత కల్పించే వ్యవస్థను తీసుకు రానున్నారు. భూ హక్కులను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఏర్పడుతుంది. భూమి ఏ విధంగా సంక్రమించినా కార్యాలయంలో నమోదు చేసుకోవాలి. కోర్టు వివాదాలు ఉన్నా, భూసేకరణ జరిగినా, ప్రభుత్వమే భూ లావాదేవీలు జరిపినా, భూమి కుదువ పెట్టినా, పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినా రిజిస్ట్రేషన్ ఆఫీసుకు తెలపాల్సి ఉంటుంది. దేశంలోనే తొలిసారిగా ఈ చట్టం మన రాష్ట్రంలో అమల్లోకి రాబోతుంది. టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిని నియమిస్తారు. ల్యాండ్ టైట్లింగ్ ట్రిబ్యునల్ ఏర్పడుతుంది. రాష్ట్ర స్థాయిలో అప్పీలేట్ ట్రిబ్యునల్ న్యాయమూర్తి నేతృత్వంలో పని చేస్తుంది. రెండేళ్లుగా తిరుగుతున్నాను డీసీపల్లి రెవెన్యూ పరిధిలో 0.77 సెంట్లు భూమి నా తండ్రి పేరుతో ఉంది. ఆ భూమిని తల్లి దండ్రులు, సోదరులు కలిసి నా పేరుతో రాసిచ్చారు. రెండేళ్ల క్రితమే స్థానిక వీఆర్ఓను కలిసి పూర్తి ఆధారాలు సమర్పించా. మీ సేవలో కూడా దరఖాస్తు చేసుకున్నా. రెండేళ్లు గడిచినా కూడా మ్యుటేషన్ జరగలేదు. వీఆర్ఓకు అడంగళ్ మార్పు కోసం డబ్బులు కూడా ఇచ్చుకున్నా ఫలితం లేదు. – పోలిచర్ల కవిత, డీసీపల్లి, మర్రిపాడు మండలం మా హక్కు కలిగి అధీనంలో ఉన్న భూముల్లో ఇతరుల పేర్లు మా హక్కు అధీనంలో ఉన్న భూములను ఆన్లైన్ అడంగళ్‌లో మాత్రం ఇతరుల పేర్లు ఉన్నాయి. ఏడాది కాలంగా తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అడంగళ్‌లో పేరు మాత్రం మారలేదు. ఆ భూమి మాదేనంటూ అన్ని ఆధారాలు చూపించినా కూడా అధికారుల్లో స్పందన లేదు. పాత చట్టాలు తీసేసి కొత్త చట్టం రావాలి. మాలాంటి పేదలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా మా భూములు అడంగళ్‌లో మా పేర్లు ఉండేలా చేయాలి. – ఏసిపోగు వెంగయ్య, బోయలచిరివెళ్ల, ఆత్మకూరు మండలం -
రైతుబంధు డబ్బు కాజేసేందుకు అడ్డదారులు
సాక్షి, కామారెడ్డి: అస్తవ్యస్తంగా ఉన్న దశాబ్దాల నాటి భూ రికార్డులను సరిచేయడం కోసం చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం కొందరు రెవెన్యూ సిబ్బందికి కాసుల పంట పండించింది. రైతుబంధు డబ్బులు నొక్కేసేందుకు అడ్డదారులు తొక్కిన పలువురు రెవెన్యూ అధికారులు.. ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వ భూమిని తమ సంబంధికుల పేర్లపై రాసేశారు. కొన్ని సంఘటనలు రుజువు కావడంతో ఉన్నతాధికారులు బాధ్యులపై చర్యలు కూడా తీసుకున్నారు. అక్రమాలపై ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. భూ రికార్డులు అస్తవ్యస్తంగా ఉండడం వల్లే భూ వివాదాలు తలెత్తుతున్నాయని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ప్రస్తుత రికార్డులను సరిచేయడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా చూడాలన్నది ఈ కార్యక్రమ ఉద్దేశం. 2017 సెప్టెంబర్ 15న ఈ ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు అన్ని గ్రామాలలో రైతుల సమక్షంలో రికార్డుల ప్రక్షాళన చేపట్టారు. కొందరు అవినీతి అధికారులకు ఈ కార్యక్రమం వరంలా మారింది. అధికారులు రైతుల వద్దనుంచి డబ్బులు తీసుకుని, రికార్డుల ప్రక్షాళన చేశారన్న ఆరోపణలు వచ్చాయి. రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా రైతుల వద్ద డబ్బులు డిమాండ్ చేసి, అక్రమాలకు పాల్పడి జిల్లావ్యాప్తంగా పలువురు తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐ స్థాయి అధికారులు సైతం సస్పెండయ్యారు. ఒక తహసీల్దార్, ఒక ఆర్ఐ, ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లు, 20 మంది వీఆర్వోలు, వీఆర్ఏలపై సస్పెన్షన్ వేటు పడింది. పలువురిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. బంధువుల పేర్లమీదకు.. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని భూ వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమానికి రెవెన్యూ అధికారులు, సిబ్బంది చెదలు పట్టించారు. రికార్డుల్లో ఉన్న వివరాలు, తప్పొప్పులను సరి చేయడం, ఫౌతి, వారసత్వ భూముల బదలాయింపు, పట్టామార్పిడీ, సవరణల కోసం అనేక మంది కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పనిభారం ఎక్కువగా ఉండడంతో ఆయా మండలాల్లో తహసీల్దార్లు ఆన్లైన్లో లాగిన్ తీసుకుని వీఆర్వోలకు, వీఆర్ఏలకు పనులు అప్పగించారు. సరైన పద్ధతిలో రికార్డులను నిర్వహించాల్సిన సిబ్బంది.. అవకాశం దొరకడంతో అవకతవకలకు పాల్పడినట్లు చాలా సంఘటనల్లో వెల్లడైంది. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో రికార్డులు తారుమారు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటి వరకు కొన్ని వ్యవహారాలు మాత్రమే అధికారుల దృష్టికి వచ్చాయి. మాచారెడ్డి మండలం ఇసాయిపేట, ఎల్లంపేట గ్రామాలకు చెందిన వీఆర్ఏలు, తమ పేర్లమీద, తమ బంధువుల పేర్ల మీద ప్రభుత్వ భూములను రికార్డులలో నమోదు చేయించినట్లు అధికారులు గుర్తించారు. వాడి వీఆర్ఏ సైతం రికార్డుల నమోదులో అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో సస్పెండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల పరిధిలో ప్రభుత్వ భూములను తమ బంధువులు, సన్నిహితుల పేరిట వీఆర్వోలు, వీఆర్ఏలు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. జిల్లాలో రికార్డుల ప్రక్షాళన వివరాల ప్రకారం 20 వేలకు పైగా ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయి. రైతుబంధు పథకం డబ్బులను కాజేసేందుకే ఆయా గ్రామాల్లో వీఆర్ఏలు, వీఆర్వోలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. జిల్లాలోని అన్ని గ్రామాల పరిధిలో ఇలాంటి వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన ఆవసరం ఉంది. ఫోన్‌ఇన్ ద్వారా వెలుగులోకి.. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని వందశాతం పూర్తి చేయాలనే సంకల్పంతో కలెక్టర్ సత్యనారాయణ రెండు నెలల క్రితం ఫోన్ ఇన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన జేసీతో కలిసి రోజూ ఉదయం గంట పాటు ఫోన్ ద్వారా రైతులనుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత మండలాల అధికారులను ఆదేశిస్తున్నారు. ఫోన్ఇన్లో భాగంగా జిల్లాలోని ఆయా గ్రామాల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో ఎక్కువ అధికారుల అక్రమాలు, నిర్లక్ష్యంపైనే ఉంటున్నాయి. ఫోన్‌ఇన్ ప్రారంభమయ్యాక వీఆర్వోలు, వీఆర్ఏలు పాల్పడిన అవినీతిని కలెక్టర్, జేసీల దృష్టికి తీసుకువస్తున్నారు. దీంతో ఉన్నతాధికారులు ఆ ఫిర్యాదులపై విచారణ జరిపిస్తున్నారు. ఇలా నలుగురు వీఆర్వోలు, పలువురు వీఆర్ఏలపై వచ్చిన ఫిర్యాదుల మీద విచారణకు ఆదేశించడంతో జరుగుతున్న అవకతవకలు నిర్ధారణ అయ్యాయి. మాచారెడ్డి మండలం బండరామేశ్వర్‌పల్లి వీఆర్వో సూర్యవర్ధన్ను వసూళ్లు, అవినీతి ఆరోపణలపై సస్పెండ్ చేస్తు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమార్పేట్ వీఆర్వో మల్లేశ్ విధుల్లో నిర్లక్ష్యం కనబరచడం, ఇతర ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇసాయిపేట, ఎల్లంపేట వీఆర్ఏలు ప్రభుత్వ భూములను తమ బంధువుల పేర్ల మీదకు మార్చినట్లు రుజువు కావడంతో అధికారులు సస్పెండ్ చేశారు. వాడి వీఆర్ఏ కూడా గతంలో రికార్డుల నమోదులో అక్రమాలకు పాల్పడ్డట్లు నిర్ధారణ కావడంతో ఇటీవల సస్పెండ్ చేశారు. భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి వీఆర్ఏ నర్సింలు సైతం రికార్డులలో తప్పులు, అనుచిత ప్రవర్తన కారణంగా çసస్పెన్షన్‌కు గురయ్యారు. నెలరోజుల క్రితం రామారెడ్డి మం డలం మోషంపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వీఆర్ఏలు గ్రామానికి చెందిన మరొకరి భూమిని వారి పేర్ల మీదకు మార్చేందుకు ప్ర యత్నించగా అధికారులకు ఫిరఘ్యదులు వచ్చా యి. విచారణలో వాస్తవమేనని తేలడంతో స స్పెండ్ చేశారు. వీఆర్ఏల పనితీరుపై దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఫిర్యాదులు వస్తున్నాయి. పక్షం రోజుల్లో.. పక్షం రోజుల్లో పలు మండలాలకు చెందిన ఐదుగురు వీఆర్ఏలు, ఇద్దరు వీఆర్వోలు అవినీతి ఆరోపణలపై సస్పెండ్ కావడం చూస్తుంటే రెవెన్యూశాఖలో అవినీతి ఏ స్థాయిలో పెరిగిందో తెలుస్తుంది. జిల్లాలోని మరో వీఆర్వో ఏకంగా ఏసీబీకి పట్టుబడ్డాడు. అంతేగాకుండా రైతుల పేరిట రికార్డులను నమోదు చేయడం, పట్టాదారు పాసుపుస్తకాలను ఇప్పించడంలోనూ జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నట్లు అనేక ఫిర్యాదులు ఉన్నతాధికారుల దృష్టికి వస్తున్నాయి. చర్యలు తప్పవు గతంలో రెవెన్యూ రికార్డుల నమోదులో జరిగిన అవకతవకలు మా దృష్టికి వచ్చాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిపించాం. తప్పిదాలకు పాల్పడిన వారిపై విచారణ జరిపి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, తహసీల్దార్, మాచారెడ్డి -
వీఆర్వో వ్యవస్థ రద్దు?
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థను సమగ్రంగా మార్చాలన్న యోచనలో ఉన్న సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నారు. సత్వర సేవలు, అవినీతి నియంత్రణ లక్ష్యంతో ఈ వ్యవస్థను కొత్తపుంతలు తొక్కించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వో) వ్యవస్థ రద్దు, క్వాలిఫైడ్ వీఆర్వోలను జూనియర్ అసిస్టెంట్లుగా నిర్వచిస్తూ రెవెన్యూ శాఖలో కొనసాగించే అంశాన్ని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు మంగళ, బుధవారాల్లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపై కలెక్టర్లతో సీఎం చర్చించారు. కొత్త చట్టంలో పొందుపరిచే అంశాలపై చర్చించడమే కాకుండా.. కలెక్టర్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. చివరకు వీఆర్వో వ్యవస్థ రద్దు మంచిదనే భావనలో సీఎం ఉన్నట్లు స్పష్టమవుతోంది. వారి వల్లే చెడ్డపేరు భూ రికార్డుల ప్రక్షాళనలో వీఆర్వోల భాగ స్వామ్యంతో అక్రమాలు జరిగాయని అంచనాకొచ్చిన ప్రభుత్వం.. భూ రికార్డుల నిర్వ హణ నుంచి వారిని తప్పించాలని నిర్ణయించింది. భూ రికార్డుల్లో కాస్తు కాలమ్‌ను తొలగించినందున.. వీరి అవసరం లేదనే అంచనాకొచి్చంది. భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా రెవెన్యూ రికార్డులను సవరించే క్రమంలో వీఆర్వోల వల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందనే అభిప్రాయంతో సీఎం ఉన్నారు. ఈ వ్యవస్థను రద్దు చేస్తే ఉద్యోగవర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందని భావిస్తున్న సర్కారు.. వీరి సేవలను వేరే విధంగా వాడుకోవాలని భావిస్తోంది. విద్యార్హతలు, నైపుణ్యం, నిబద్ధత ఉన్న వారినే రెవెన్యూలో కొనసాగించి.. మిగిలిన వారిని పూలింగ్‌లో పెట్టడం ద్వారా వేరే శాఖ (పంచాయతీరాజ్, వ్యవసాయశాఖ)ల్లోకి బదిలీ చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. వీఆర్ఏలను పంచాయతీరాజ్ పరిధిలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. సర్వే ప్రైవేటుపరం!: సర్వేయర్ల వ్యవస్థ రద్దునూ ప్రభుత్వం పరిశీలిస్తోంది. రెవెన్యూ లో అవినీతికి సర్వేయర్లు ప్రధాన కారణమని అంచనాకు వచ్చిన సర్కారు.. వీరిపై వేటు వేసేలా ఆలోచన చేస్తోంది. సర్వేను ప్రైవేటు పరంచేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ బాధ్యతలను లైసెన్స్డ్ సర్వేయర్లకు అప్పగించనుంది. ఒకే రోజులో మ్యూటేషన్! భూముల మ్యూటేషన్‌ను సరళతరం చేయనుంది. రిజి్రస్టేషన్ అయిన రోజే మ్యూటేషన్ అయ్యేలా కొత్త విధానాన్ని తీసుకురానుంది. 24 గంటల్లో అభ్యంతరాలు రాకపోతే.. తహసీల్దార్ మ్యూటేషన్ ప్రోసీడింగ్స్ (ఆటోమేటిక్ డిజిటల్ సంతకం జరిగేలా) ఇవ్వడమే కాకుండా.. ఆన్లైన్ పహాణీలో నమోదు చేసేలా చట్టంలో పొందుపరచనున్నారు. అలాగే 10 రోజుల్లో పట్టాదారు పాస్ పుస్తకాన్ని నేరుగా రైతు ఇంటికే పంపనున్నారు. సమగ్ర సర్వేకు మొగ్గు: భూరికార్డుల ప్రక్షాళనను సంపూర్ణం చేసేందుకు సమగ్ర భూసర్వే చేయించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. టైటిల్ గ్యారంటీ అమలుకు ఈ సర్వే అనివార్యమైనందున భూసమగ్ర సర్వేకు ఆదేశాలివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. టైటిల్ గ్యారెంటీ చట్టం అమల్లోకి తేవడానికి ముందు సరిహద్దు వివాదాలు, క్లియర్ టైటిల్ ఉండాలనే కారణాలతోనే సమగ్ర భూసర్వే నిర్వహించనుంది. ఏపీలో ఉన్న టైటిల్ గ్యారంటీ చట్టం పేరు మారి వేరే చట్టాన్ని తీసుకురావాలని చూస్తోంది. తహసీల్దార్ల అధికారాలకు కోత? తహసీల్దార్ల అధికారాల కుదింపుపై కలెక్టర్ల భేటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమై నట్లు తెలుస్తోంది. మ్యూటేషన్లతోపాటు భూరికార్డుల మార్పులు, చేర్పుల అధికారాన్ని జాయింట్ కలెక్టర్లకు బదలాయిస్తే కొత్త సమస్యలు వస్తాయని కొందరు కలెక్టర్లు సూచించినట్లు సమాచారం. ప్రస్తుత విధానమే మంచిదనే వాదనలు వినిపించినట్లు తెలిసింది. వీరి అధికారాలపై రెవెన్యూ ముసాయిదాలో స్పష్టత రానుంది. -
పార్ట్–బీ తంటా.. ఈ రైతులకేదీ ఊరట!
సాక్షి, హైదరాబాద్: అధికారుల నిర్లక్ష్యం ఆ రైతులకు శాపంగా మారింది. భూ యాజమాన్య హక్కులపై స్పష్టతనివ్వకపోవడంతో లక్షలాది మంది రైతులకు పెట్టుబడి సాయం అందకుండా పోతోంది. ఇప్పటికీ రెండు దఫాలు రైతుబంధు సాయం పంపిణీ చేసిన సర్కారు.. తాజాగా ఖరీఫ్ సీజన్‌కు గాను నగదును బ్యాంకుల్లో జమ చేస్తోంది. అయితే, పార్ట్–బీ జాబితాలో చేర్చిన భూములకు రైతుబంధు ఇవ్వకుండా నిలిపివేసింది. వివాదాస్పద/అభ్యంతరకర భూములుగా పరిగణించిన వాటిని పార్ట్–బీ కేటగిరీ కింద పరిగణించిన సర్కారు.. ఆ భూములకు పట్టాదార్ పాస్‌పుస్తకాలను జారీ చేయలేదు. పెట్టుబడి సాయానికి పాస్‌బుక్కును ప్రాతిపదికగా తీసుకోవడంతో ఈ కేటగిరీ కింద చేరిన భూముల రైతులకు రైతుబంధు రాకుండా పోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 4,14,534 ఖాతాల్లోని 9,92,295 ఎకరాల మేర భూములను పెట్టుబడి సాయం కింద పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రతి సీజన్లో సుమారు రూ.496 కోట్ల మేర నిధులు రైతుల ఖాతాల్లోకి చేరడంలేదు. అడ్డగోలుగా నమోదు రెవెన్యూ వ్యవస్థలో సరికొత్త విప్లవానికి నాంది పలికిన కేసీఆర్ సర్కారు.. 2017లో భూ రికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత ఈ రికార్డుల ఆధారంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ పథకం కింద వివాదరహిత భూములకు పాస్ పుస్తకాలను పంపిణీ చేసింది. వివాదాస్పద, అభ్యంతర భూములకు మాత్రం వాటి జారీని పక్కనపెట్టింది. పార్ట్–బీ కేటగిరీలో ప్రభుత్వ భూములు/ఆస్తులు, అటవీ భూములు, దేవాదాయ తదితర భూములతోపాటు, వ్యవసాయేతర భూములను చేర్చింది. భూవిస్తీర్ణంలో తేడా, కోర్టు కేసులు, అన్నదమ్ముల భూపంపకాల విస్తీర్ణంలో వ్యత్యాసం, అసైన్డ్ చేసిన భూమికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడా., ఫారెస్టు, రెవెన్యూ శాఖల మధ్య తగాదా, ఫారెస్టు, పట్టా భూముల మధ్య వివాదాస్పదమైనవాటిని కూడా పార్ట్–బీలో నమోదు చేసింది. భూ రికార్డుల ప్రక్షాళనకు ప్రభుత్వం డెడ్‌లైన్ విధించడం, ఖరీఫ్‌లోపు కొత్త పాస్‌పుస్తకాలను జారీ చేసి రైతుబంధును ప్రవేశపెట్టాలనే ఒత్తిడితో రెవెన్యూ యంత్రాంగం.. లోతుగా పరిశీలించకుండా వివాదరహిత భూములను కూడా పార్ట్–బీలో నమోదు చేసింది. దాయాదులు, ఇతరత్రా ఎవరి నుంచి ఫిర్యాదు అందినా.. ఆ భూములకు పాస్‌బుక్కులు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టింది. ఈ విషయం తెలిసిన రైతులు.. తహసీళ్ల చుట్టూ ప్రదక్షణలు చేసినప్పటికీ, ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడం, ఒకసారి నమోదు చేసిన సమాచారంలో మార్పులు, చేర్పులు చేసే అధికారం లేకపోవడంతో ఈ భూముల వ్యవహారం రెవెన్యూ యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. పార్ట్–బీ భూముల జాబితాను పరిశీలించి పరిష్కారం చూపెట్టకపోవడంతో మూడు సీజన్లలోను సంబంధిత రైతులకు నిరాశే మిగిలింది. కనీసం ఈ సారైనా వివాదాస్పద/అభ్యంతరకర భూముల జాబితాను సవరించకపోతే లక్షలాది మంది అన్నదాతలకు ఆర్థిక సాయం అందని ద్రాక్షగానే మారనుంది. -
పార్ట్–బీ భూములకు మోక్షమెప్పుడో?
సాక్షి, హైదరాబాద్: భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా పెండింగ్‌లో పెట్టిన పార్ట్–బీ భూముల నిగ్గు తేల్చడంలో ప్రభుత్వం ముందడుగు వేయడం లేదు. అక్కడక్కడా కొన్నింటికి పరిష్కారమార్గం చూపినా ఇప్పటికీ లక్షలాది ఖాతాల వ్యవహారం కొలిక్కి రాలేదు. 2017 సెప్టెంబర్ 15న రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ప్రతి భూమికి హక్కుదారు ఎవరనేది తేల్చాలని నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ రికార్డులను పరిశీలించి కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేసింది. అయితే, ప్రభుత్వ భూములు/ఆస్తులు, అటవీ, వక్ఫ్, దేవాదాయ తదితర భూములతోపాటు వ్యవసాయేతర భూములను పార్ట్–బీ కేటగిరీలో చేర్చింది. ఇదే అదనుగా వివాదాస్పద, అభ్యంతరకర భూములను రెవెన్యూ యంత్రాంగం బీ కేటగిరీలో జొప్పించింది. రైతులకు పెట్టుబడి సాయం (రైతుబంధు) పథకానికి కొత్త పట్టాదార్ పాస్‌పుస్తకాలను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించడంతో ఆగమేఘాల మీద ఏ–కేటగిరీ భూముల విషయాన్ని తేల్చేసింది. పెండింగ్‌లో 7.96 లక్షల ఖాతాలు! రాష్ట్రవ్యాప్తంగా బీ–కేటగిరీలో 7,96,792 ఖాతాలున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 4,56,155 ఖాతాలకు పాస్ పుస్తకాలు జారీ చేయాలని నిర్ణయించినా డిజిటల్ సంతకాలు కాకపోవడంతో పెండింగ్‌లో పడ్డాయి. దీంతో గత ఏడాదిన్నరగా ఈ భూముల యజమానులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. మొత్తం 7.96 లక్షల ఖాతాల్లోని 69,85,478 ఎకరాల మేర విస్తీర్ణానికి సంబంధించిన పార్ట్–బీ భూములపై అస్పష్టత నెలకొనడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా ప్రభుత్వ భూముల పొరుగున ఉన్న ఖాతాలకే ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీనికితోడు చాలాచోట్ల పట్టణీకరణతో వ్యవసాయ భూములు కాస్తా స్థిరాస్తి రంగం వైపు మళ్లాయి. వ్యవసాయేతర అవసరాలకు మళ్లినా భూమార్పిడి జరగడంలేదు. దీంతో నాలా(నాన్ అగ్రికల్చర్ లెవీ అసెస్మెంట్) రుసుం రాకుండా పోయింది. భూరికార్డుల ప్రక్షాళనలో గుర్తించిన ఇలాంటి భూములను కూడా పెండింగ్‌లో పెట్టారు. ఈ అంశంలో కొన్ని భూములు అకారణంగా ఇరుక్కుపోయాయి. ఉదాహరణకు ఒక సర్వే నంబర్లోని 10 ఎకరాల భూమిలో నాలుగు ఎకరాలను నాలా కింద మార్చుకుని స్థిరాస్తి రంగంలోకి మళ్లిస్తే అధికారులు ఆ సర్వే నంబర్‌ను పూర్తిగా నాలా కింద చేర్చారు. సదరు సర్వే నంబర్లో వ్యవసాయ అవసరాలకు వినియోగిస్తున్న భూములకు కూడా పాసుపుస్తకాలు ఇవ్వడం లేదు. వీటితోపాటు గతంలో వక్ఫ్, దేవాదాయ భూములను పరిరక్షించిన అనుభవదారులకు కూడా పాసుపుస్తకాలు నిలిపివేశారు. ఈ భూములను ఆయా శాఖలు గెజిట్ ద్వారా తమ ఖాతాలోకి వేసుకుని పట్టాదారుగా మారిపోయాయి. దీంతో ఇప్పటివరకు అనుభవంలో ఉన్నవారికి పాసుపుస్తకాలు ఇవ్వకుండా నిలిపివేశారు. పట్టా భూముల్లో ప్రభుత్వ ఆస్తులు ఉండడంతో వాటిని కూడా పార్ట్–బీ కింద చేర్చారు. దీంతో సదరు రైతాంగం లబోదిబోమంటోంది. ఈ భూముల హక్కులు కోల్పోతే న్యాయపరమైన చిక్కులు వస్తాయని భావిస్తున్న సర్కారు త్వరగా తేల్చకుండా కాలయాపన చేస్తోంది. పార్ట్–బీ కేటగిరీలో చేర్చిన భూములు ఇవే.. భూవిస్తీర్ణంలో తేడాలున్నవి కోర్టు కేసులతో పెండింగ్‌లో ఉన్నవి అన్నదమ్ముల భూపంపకాల్లో విస్తీర్ణంలో వ్యత్యాసం ఉన్నవి అసైన్డ్ భూములకు ఇచ్చిన పట్టాల్లో ఉన్న భూమికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడాలున్నవి ఫారెస్టు, రెవెన్యూ శాఖల మధ్య వివాదాలున్నవి ఫారెస్టు, పట్టా భూముల మధ్య వివాదాలున్నవి ఇతరుల అనుభవంలో ఉన్న వక్ఫ్, దేవాదాయ శాఖల భూములు -
భూ సర్వే.. మరోసారి
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ముఖ్యంగా భూ రికార్డుల ప్రక్షాళన తీరును క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ఈ నెల 8న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఉన్నతాధికారుల బృందం పర్యటించనుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం తుర్కగూడ, ఎర్రకుంట, మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం లక్ష్మాపూర్‌లో గతంలో రెవెన్యూ యంత్రాంగం భూ సర్వే నిర్వహించింది. భూ సర్వే రికార్డుల నవీకరణ అనంతరం తేలిన అంశాల ఆధా రంగా రాష్ట్రవ్యాప్తంగా భూ సర్వే నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని అంచనా వేసేం దుకు అధికారులు ఈ గ్రామాల్లో పర్యటిస్తు న్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, రెవెన్యూ కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, సర్వే, సెటిల్మెంట్ కమిషనర్ శశిధర్ ఈ గ్రామాలను సందర్శించనున్నారు. -
భూ రికార్డుల సమగ్ర వివరాలు ‘మీ సేవలో’
సాక్షి, హైదరాబాద్: భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం సవరించిన సమగ్ర రికార్డులను ‘మీసేవ’లో అందుబాటులో ఉంచుతున్నట్టు ధరణి ప్రత్యేకాధికారి రజత్‌కుమార్ సైనీ తెలిపారు. ‘మా భూమి ఏమైపోయిందో’ శీర్షికన రాష్ట్రంలోని భూ రికార్డులు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో రికార్డుల్లో తమ భూమి ఎవరి పేరు మీద ఉందోననే ఆందోళనలో రైతాంగం ఉందని ‘సాక్షి’ ఈ నెల 23న కథనాన్ని ప్రచురించింది. స్పందించిన అధికారులు సమగ్ర భూ రికార్డుల వివరాలను మీసేవ కేంద్రాల్లోకి అందుబాటులో కి తెచ్చారు. మీసేవలో నిర్దేశిత ఫీజు చెల్లించి పహాణి, ఆర్వోఆర్1–బీ రికార్డులను తీసుకోవచ్చని రజత్‌కుమార్ చెప్పారు. సవరించిన రికార్డులన్నింటినీ పబ్లిక్ డొమైన్‌లోకి అందుబాటులో కి తెచ్చేందుకు మరికొంత సమయం పడుతుం దని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో రిజి స్ట్రేషన్లు, భూ రికార్డుల నిర్వహణ పరిశీలన దశలో ఉందని, పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చేందుకు కొంత సమయం పడుతుందన్నారు. -
ప్రభుత్వంతో యుద్ధం చేస్తాం
సాక్షి, మహబూబాబాద్: భూరికార్డుల ప్రక్షాళనలో జరిగిన తప్పులను సరిదిద్ది, వాస్తవ సాగుదారులకు పాస్‌పుస్తకాలు వచ్చేదాకా పోరాటం చేస్తామని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మానుకోట, జనగామలో సోమవారం నిర్వహించిన రైతు దీక్షల్లో ఆయన మాట్లాడారు. రైతుల సమస్యలు పరిష్కరించకుంటే సెప్టెంబర్‌లో ప్రభుత్వంతో యుద్ధం చేస్తామని స్పష్టం చేశారు. భూప్రక్షాళనలో భూమి ఎక్కువ వస్తే.. సరిచేయాల్సింది పోయి రైతుల నుంచి లాక్కోవడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కౌలు రైతులపై సీఎం చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని పేర్కొన్నారు. నిరుద్యోగులు, రైతులు ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో తప్పులు దొర్లాయని, నిజమైన రైతులకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ జనసమితి ప్రత్యక్షంగా రైతుల అభిప్రాయాలను సేకరించిందన్నారు. పేరు, విస్తీర్ణం, కులం, సర్వే నంబర్లలో 9,11,241 తప్పులు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. జూన్ 20 వరకు తప్పులు సరిదిద్దుతామని సీఎం చెప్పారని, జూలై 30 వరకైనా రైతులకు పాస్‌పుస్తకాలు ఇస్తారా అని అడిగారు. ఆగస్టులో ప్రభుత్వ పెద్దలను కలసి సమస్యలను వివరిస్తామన్నారు. ప్రజా ఉద్యమాల్లో ఉన్నవారికే టికెట్లు సాక్షి, కొత్తగూడెం: అన్ని అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగుతామని, ప్రజా ఉద్యమాల్లో ఉన్న వారికే టికెట్లు ఇస్తామని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. కొత్తగూడెంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయాలు ప్రజా సమస్యలకు కేంద్ర బిందువుగా ఉండాలని సూచించారు. -
భూ రికార్డుల్లో 9.11 లక్షల తప్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన తప్పుల తడకగా ఉన్నట్లు తమ సర్వేలో తేలిందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఆరోపించింది. మొత్తం 9 రకాల అంశాల్లో 9,11,241 తప్పులు దొర్లినట్లు తేలిందని వెల్లడించింది. ఫలితంగా లక్షలాది మంది రైతులకు నష్టం వాటిల్లిందని తెలిపింది. 125 మండలాల్లోని గ్రామాల్లో తాము చేసిన సర్వేలో 3,500 మంది రైతులతో మాట్లాడి వాస్తవాలను క్రోడీకరించినట్లు తెలిపింది. త్వరలోనే వాటిన్నింటిపై పూర్తి స్థాయి నివేదికను అధికారులు, ప్రజల ముందు ఉంచుతామని తెలిపింది. సోమ వారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో టీజేఎస్ అధ్యక్షు డు ప్రొఫెసర్ కోదండరామ్ ఈ అంశాలను వెల్లడిం చారు. ప్రభుత్వం ఈ నెలాఖరులోగా భూ రికార్డుల్లో దొర్లిన తప్పులును సవరించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఈ నెల 23న అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్ల ముందు రైతు దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. నెలాఖరులో హైదరాబాద్‌లోనూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామన్నారు. రికార్డుల్లో తప్పులకు సంబంధించి ముద్రించిన కరపత్రాలను, 23న తలపెట్టిన రైతు దీక్ష పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. రికార్డుల్లో తప్పులపై టీజేఏస్ వెల్లడించిన కొన్ని అంశాలు.. ♦ చాలా మంది చిన్న, సన్నకారు రైతులకు పట్టా పుస్తకాలు లేవు. కొందరికి సీలింగ్ భూములు, అటవీ భూములు, ఇనాం భూములు, ప్రభుత్వ భూములపై ఎన్నో ఏళ్లుగా యాజమాన్య హక్కులు ఉన్నాయి. వాటిని గ్రామాలు అంగీకరిస్తున్నాయి. కొన్ని చట్టబద్ధ హక్కులు ఉన్నాయి. ఖాస్తుకారు కాలంలో వారి పేరు నమోదైంది. అటవీ భూములు దున్నుకుంటున్న వారు అటవీ హక్కుల చట్టం ప్రకారం పత్రాలు పొం దారు. చాలామంది రైతులు కొన్న భూములకు సాదా బైనామాలు ఉన్నాయి. వాటన్నింటినీ చట్టబద్ధం చేయకుండా రికార్డుల ప్రక్షాళనలో రద్దు చేశారు. ఫలితంగా లక్షల మందికి నష్టం వాటిల్లించింది. ♦ సేత్వార్‌లో ఉండాల్సిన దానికన్నా వాస్తవ పహా ణీ ల్లో ఎక్కువ భూమి ఉందని భూవిస్తీర్ణాన్ని కుదించా రు. ఇది చట్ట విరుద్ధం. సర్వే చేయకుండా విస్తీర్ణంలో మార్పు చేశారు. పహాణీల ప్రకారం ఉండాల్సిన దాని కన్నా 60 లక్షల ఎకరాలు ఎక్కువగా ఉంది. అమ్మిన వారి పేర్లను తొలగించకుండా ఏకపక్షంగా భూమి కుదించారు. ♦అటవీ–రెవెన్యూశాఖల మధ్య 17 లక్షల ఎకరాలు వివాదం ఉంది. ఆ భూమిని సర్వే చేయకుండా అటవీ శాఖ డిమాండ్‌తో రైతులకు హక్కు చేశారు. ♦ రైతులకు సంప్రదాయపరంగా ఉన్న హక్కులను గుర్తించకుండా వారి యాజమాన్య హక్కులను ప్రభుత్వం కాలరాసింది. అనుభవంలేని సిబ్బంది, హడావుడిగా పూర్తి చేయాలన్న ఒత్తిడి వల్ల కూడా అనేక తప్పులు దొర్లాయి. రైతులు రూ. 4 వేల చొప్పున పొందడం కాదు.. సొంత భూములపై హక్కులను కోల్పోయారు. -
భూప్రక్షాళనలో సర్కారు వైఫల్యం: చాడ
సాక్షి, హైదరాబాద్: భూరికార్డుల ప్రక్షాళనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ భూరికార్డుల ప్రక్షాళన లోపభూయిష్టంగా ఉందన్నారు. చాలామంది రైతులకు రైతుబంధు చెక్కులు, పాసు పుస్తకాలు అందలేదన్నారు. చాలాచోట్ల పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులను సరిచేయలేదని విమర్శించారు. కొత్తగా హామీలను ఇవ్వడం, ఇచ్చిన హామీలను అమలుచేయకుండా దాటేయడం, హామీలను గుర్తుచేస్తే బెదిరించడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. సమాజాన్ని మేల్కొల్పుతున్న జర్నలిస్టులు కూడా ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక కుటుంబం, పసిపిల్లలతోసహా ఆత్మహత్యకు పాల్పడటం హృదయ విదారకంగా ఉందన్నారు. టీఆర్ఎస్ను ఓడించడానికి కేవలం వామపక్షాల బలం మాత్రమే సరిపోదని, దీనికోసమే కాంగ్రెస్, తెలంగాణ జన సమితి వంటి పార్టీలతో కలసి కొత్తవేదికను ఏర్పాటు చేస్తున్నామన్నారు. -
సాంకేతిక సమస్యలు మా నెత్తిన వేయకండి
సాక్షి, హైదరాబాద్: భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో సాంకేతిక సమస్యల వల్ల దొర్లిన తప్పులకు రెవెన్యూ ఉద్యోగులను బాధ్యులను చేయడం అన్యాయమని తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు లచ్చిరెడ్డి, అధ్యక్షుడు గౌతంకుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలిసి సమస్యలను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ధరణి వెబ్సైట్లో ఇచ్చిన ఆప్షన్లు సాంకేతికంగా, లోపభూయిష్టంగా ఉన్నాయన్నారు. ఈ వెబ్సైట్ సిబ్బందికి సరైన నైపుణ్యం లేదని ఆరోపించారు. ధరణి వెబ్సైట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాతే సబ్ రిజిస్ట్రార్‌కు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. పట్టాదారు పాస్‌పుస్తకంలో దొర్లిన తప్పులను సరి చేయడానికి జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు ఇవ్వాలని తెలిపారు. పార్టు బీ కేసులను పీఓటీ, సాదాబైనామా కేసులను పరిష్కరించడానికి తగిన సమయం ఇవ్వాలని విన్నవించారు. ఈ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి సీఎంతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. -
ఆదర్శ సేవలకు ‘టెక్స్’ పురస్కారాలు
సాక్షి, హైదరాబాద్: పరిపాలన విభాగాల్లోని వివిధ స్థాయిల్లో అధికారులు అందించిన ఆదర్శప్రాయ సేవలకుగానూ రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ ఎక్స్‌లెన్స్ (టెక్స్) పురస్కారాలు–2018’ప్రకటించింది. సాధారణ, ఆవిష్కరణలు–అమలు, ప్రధాన పథకాల అమలు అనే మూడు విభాగాల్లో వ్యక్తిగతంగా, గ్రూపుగా ఉత్తమ సేవలందించిన అధికారులను ఎంపిక చేసింది. పథకాల రూపకల్పన లేదా పథకాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దిన 13 మంది అధికారులకు పురస్కారాలను అందించాలని ప్రభుత్వానికి సెలక్షన్ కమిటీ సిఫార్సు చేసింది. మరోవైపు పరిపాలనలో అసాధారణ పనితీరు కనబరిచిన మరో ఇద్దరు అధికారుల పేర్లను సెర్చ్ కమిటీ సిఫార్సు చేసింది. సెర్చ్, సెలక్షన్ కమిటీల సిఫార్సుల మేరకు మొత్తం 15 మందికి పురస్కారాలను ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. తెలంగాణ ఎక్స్‌లెన్స్ పురస్కార విజేతలు వీరే.. - పరిపాలనలో అసాధారణ పనితీరు జి.అశోక్ కుమార్, ఐఏఎస్ (ప్రిన్సిపాల్ రెసిడెంట్ కమిషనర్, తెలంగాణ భవన్, ఢిల్లీ) వి.అనీల్ కుమార్, ఐఏఎస్ (కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ) సాధారణ విభాగం..: వ్యక్తిగత స్థాయి (గౌరవ్ ఉప్పల్, నల్లగొండ జిల్లా కలెక్టర్); గ్రూపు (బుద్ధప్రకాశ్ జ్యోతి, ఐఏఎస్, ఆదిలాబాద్ కలెక్టర్ డి.దివ్య, ఆదిలాబాద్ డీఎంహెచ్ఓ డాక్టర్ రాజీవ్ రాజ్); సంస్థ (బి.జనార్దన్‌రెడ్డి, ఐఏఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్) - ఆవిష్కరణలు...: వ్యక్తిగత (ఆర్వీ కర్ణన్, ఐఏఎస్, మంచిర్యాల జిల్లా కలెక్టర్); సంస్థ (ఎం.దానకిశోర్ ఐఏఎస్, ఎండీ, జల మండలి) ప్రధాన పథకాలు... - కేసీఆర్ కిట్..: వ్యక్తిగత (కె.సురేంద్ర మోహన్, ఐఏఎస్, సూర్యాపేట జిల్లా కలెక్టర్); గ్రూపు (సర్ఫరాజ్ అహమ్మద్, ఐఏఎస్, కరీంనగర్ జిల్లా కలెక్టర్, డాక్టర్ రాజేశం, డీఎంహెచ్ఓ, డాక్టర్ మహమ్మద్ అలీం, ఎంసీహెచ్ కేంద్రం పాలనాధికారి); సంస్థ (కరుణ వాకాటి, ఐఏఎస్, వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్) - భూ రికార్డుల ప్రక్షాళన..: గ్రూపు (ఎ.శరత్, ఐఏఎస్, జగిత్యాల జిల్లా కలెక్టర్, గంట నరేందర్, జగిత్యాల ఆర్డీఓ, నలువల వెంకటేశం, మేడిపల్లి తహసీల్దార్); సంస్థ (గౌరవ్ ఉప్పల్, నల్లగొండ జిల్లా కలెక్టర్) - పరిపాలనలో ప్రత్యేక చొరవ..: వ్యక్తిగత (అలుగు వర్షిణి, ఐఏఎస్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్); - గొర్రెల పెంపకం..: సంస్థ (ప్రశాంత్ జె పాటిల్, ఐఏఎస్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్) - ఘన వ్యర్థాల నిర్వహణ..: సంస్థ (డి.క్రిష్ణ భాస్కర్, ఐఏఎస్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్) -
పాత పాస్ పుస్తకాలేనా..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు హైసెక్యూరిటీ ఫీచర్లతో పాస్ పుస్తకాలు ఇవ్వాలన్న ప్రభుత్వ యోచన సందిగ్ధంలో పడింది. అధునాతన పాస్ పుస్తకాల ముద్ర ణపై ప్రైవేటు కంపెనీలు స్పందించకపో వడం, ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లు కూడా ముందుకు రాకపోవడంతో.. పాత తరహా పుస్తకాలతోనే సరిపెట్టు కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో కొన్ని సెక్యూరిటీ ఫీచర్ల ను తగ్గించి పాస్ పుస్తకాలను ముద్రించే దిశ గా ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ అధికారులతో రెవెన్యూ ఉన్నతాధికారులు మంతనాలు జరుపుతున్నారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో తుది నిర్ణయం వెలువడనుంది. భూప్రక్షాళన నేపథ్యంలో.. భూరికార్డుల ప్రక్షాళన అనంతరం వచ్చిన వివరాల ఆధారంగా రాష్ట్రంలోని రైతులం దరికీ కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అత్యంత భద్రతా ప్రమాణాలతో కూడిన 75 లక్షలకుపైగా పుస్తకాల ముద్రణ కోసం గత నెలలో టెండ ర్లను ఆహ్వానించింది. గత నెల 22 వరకు గడువు ఇచ్చింది. కానీ బిడ్లు రాకపోవడంతో 29వ తేదీ వరకు ఒకసారి, ఫిబ్రవరి 1 వరకు మరోసారి పొడిగించింది. అయినా ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. అటు గతంలో పాస్ పుస్తకాలను ముద్రించిన మద్రాస్ సెక్యూరిటీ ప్రింటింగ్ (ఎంఎస్పీ) ప్రెస్ కూడా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను చూసి వెనక్కు తగ్గింది. దాదాపు 20 సెక్యూరిటీ ఫీచర్లతో 20 పేజీలతో కూడిన 75 లక్షల పాస్ పుస్తకాలను 21 రోజుల్లో ముద్రించి ఇవ్వాలన్న నిబంధన కారణంగా ప్రైవేటు కంపెనీలన్నీ వెనుకడుగు వేసినట్లు చెబుతున్నారు. రంగంలోకి రాజీవ్‌శర్మ.. పాస్ పుస్తకాల ముద్రణకు ఒక్క బిడ్ కూడా రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ రంగంలోకి దిగారు. రెవెన్యూ ఉన్నతాధికారులతో భేటీ అయి, ప్రత్యామ్నా యాలపై చర్చించి సీఎంకు సమాచారమి చ్చారు. దీంతో ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్లోనే పాస్ పుస్తకాలను ముద్రించాలని సీఎం సూచించారు. ఈ మేరకు రెవెన్యూ ఉన్నతాధి కారులు మూడు, నాలుగు రోజులుగా ప్రింటింగ్ ప్రెస్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. కానీ ప్రభుత్వం కోరుతున్న సెక్యూరిటీ ఫీచర్ల విషయంలో ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ అధికారులు కూడా చేతులెత్తేసినట్టు సమాచారం. ముఖ్యంగా పాస్ పుస్తకం దిగువ భాగంలో వినియోగించా ల్సిన పలుచని వస్త్రాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని, దీనితోపాటు మరికొన్ని సెక్యూరిటీ ఫీచర్ల విషయంలోనూ ఇబ్బంది వస్తుందని తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని మింట్ కాంపౌండ్ ముద్రణాలయంలో పాస్ పుస్తకాలను ముద్రించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో రోజుకు రెండున్నర లక్షల వరకు పాస్ పుస్తకాలను ముద్రించే సౌలభ్యం ఉండడంతో.. కొన్ని సెక్యూరిటీ ఫీచర్లను తగ్గించి ముద్రణ బాధ్యత అప్పగించనున్నట్లు సమాచారం. దీనిపై ఒకటి రెండు రోజుల్లోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తంగా రైతులకు పాత తరహా పాస్ పుస్తకాలే కొత్తగా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. -
‘భూ’ మంతర్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల రికార్డుల ప్రక్షాళనలో వింతలు చోటుచేసుకున్నాయి. ఎక్కువ భూమి ఉన్న చోట తక్కువగా.. తక్కువ భూమి ఉన్న చోట ఎక్కువగా రికార్డుల్లో నమోదయ్యాయి. భూ రికార్డుల ప్రక్షాళన దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఇలా తారుమారైన భూమి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6.5 లక్షల ఎకరాలపైనే ఉందని తేలింది. దాదాపు 4.7 లక్షల సర్వే నంబర్లలో భూమి తారుమారైనట్లు ఇప్పటివరకు రెవెన్యూ యంత్రాంగం గుర్తించింది. రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఇప్పుడు ఆ తారుమారు లెక్కలను సరిచేసే పనిలో పడింది. భూరికార్డుల ప్రక్షాళన గణాంకాలను పరిశీలిస్తే ఒక్క వనపర్తి జిల్లాలోనే 10 శాతానికి పైగా సర్వే నంబర్లలో భూములు ఎక్కువ తక్కువగా నమోదయ్యాయని తేలింది. ఈ జిల్లాలో మొత్తం 5,67,638 సర్వే నంబర్లను పరిశీలిస్తే అందులో 53,789 సర్వే నంబర్లలో రికార్డుల్లో ఉన్న భూమి కన్నా క్షేత్రస్థాయిలో భూమి తక్కువ ఉందని తేలింది. రికార్డుల్లో ఉన్న భూమి కన్నా క్షేత్రస్థాయిలో ఉన్న భూమి విస్తీర్ణం ఎక్కువగా ఉన్న సర్వే నంబర్లు 8,160 ఉన్నాయని తేలింది. మహబూబ్‌నగర్‌లో 45,907, జోగుళాంబ గద్వాల 38,593, నల్లగొండలో 35,696 సర్వే నంబర్లలో అత్యధికంగా భూములు తారుమారయ్యాయని తేలింది. సర్దేది ఎలా? ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 4.7 లక్షల సర్వే నంబర్లలో.. అంటే రాష్ట్రంలోని మొత్తం సర్వే నంబర్లలో 3 శాతం నంబర్లలో భూమి తారుమారయిందని నిర్ధారణ అయింది. ఇలా నిర్ధారణ అయిన వాటిలో 3.5 లక్షల సర్వే నంబర్లలో రికార్డుల్లో ఉన్న భూమి కంటే తక్కువ భూమి క్షేత్రస్థాయిలో ఉందని, 1.2 లక్షల సర్వే నంబర్లలో రికార్డుల్లో ఉన్న భూమి కంటే తక్కువ భూమి ఉందని రెవెన్యూ యంత్రాంగం గుర్తించింది. భూమి లేకపోయినా ఏదో ఒక రైతు పేరిట ఖాతా నంబర్ తెరచి ఫలానా సర్వే నంబర్లో ఇంత భూమి ఆ రైతుకు ఉందని దఖలు పరిచారన్నమాట. ఒక సర్వే నంబర్లో 10 మంది రైతులకు భూమి ఉంటే ఇప్పుడు రికార్డుల కన్నా తగ్గిన భూమిని ఏ రైతుకు తగ్గించి సర్దుబాటు చేయాలన్నది రెవెన్యూ యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. చాలా చోట్ల రైతుల అంగీకారంతో భాగాలు పంచి, గుంటల లెక్కన భూమిని తగ్గించి 1బీ ఫారంలో నమోదు చేస్తున్నామని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. రికార్డుల్లో ఉన్న దాని కంటే ఎక్కువ భూమి ఉంటే మాత్రం ఆ మేరకు రైతుల పాసుపుస్తకాల్లో మార్పులు జరిగే అవకాశాలు కనిపించట్లేదు. మార్పులు చేయాలంటే రికార్డుల్లో ఎక్కువ, తక్కువ నమోదయిన భూములన్నింటినీ సర్వే చేయాల్సి ఉంటుందని, సర్వే ఇప్పట్లో సాధ్యం కానందున రైతుల మౌఖిక ఒప్పందం మేరకు మార్పులు చేస్తున్నామని రెవెన్యూ యంత్రాంగం చెబుతోంది. -
సర్వేనంబర్లే కాదు.. భూ విస్తీర్ణమూ పెరిగింది!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పాత రికార్డులతో పోలిస్తే సర్వేనంబర్లే కాదు.. భూ విస్తీర్ణం కూడా పెరుగుతోంది. గతంలో వెబ్‌ల్యాండ్ అప్డేషన్ సమయంలో ఆన్లైన్లో వివరాలు సరిగ్గా నమోదు చేయకపోవడమే కారణమా.. లేక ఇప్పుడేమైనా పొరపాట్లు దొర్లాయా? అనే అంశంపై రెవెన్యూ యంత్రాంగం ఆరా తీస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 1.7 కోట్లకు పైగా సర్వే నంబర్లలో 2.4 కోట్ల ఎకరాల భూములు ఉండగా, ఇప్పుడు సర్వే నంబర్ల సంఖ్య 2 కోట్ల వరకు చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన భూరికార్డుల ప్రక్షాళన అనంతరం ఏకంగా 11 జిల్లాల్లో గతంలో ఉన్న సర్వే నెంబర్ల కంటే ఎక్కువ సర్వే నంబర్లు నమోదు కావడం విశేషం. మిగిలిన జిల్లాల్లోనూ ఈ సర్వే నంబర్ల సంఖ్య పెరుగుతుందని, ఆ మేరకు భూమి విస్తీర్ణం కూడా పెరగనుందని రెవెన్యూ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నవీకరణలో నంబర్ల తంటా రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 15వ తేదీన భూ రికార్డుల ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సాహసోపేతంగా.. వినూత్నంగా మొదలు పెట్టిన ఈ కార్యక్రమంలో రికార్డులన్నింటినీ పకడ్బందీగా నవీకరించాలని నిర్ణయించింది. అందుకనుగుణంగా రెవెన్యూ బృందాలు గ్రామాల్లోనే తిష్టవేసి రికార్డుల ప్రక్షాళన ప్రక్రియను నిర్వహించాయి. అయితే, మరో మూడు రోజుల్లో రికార్డుల ప్రక్షాళనకు ముగింపు పడుతుందనే సమయంలో తేలిన అంకెలను చూసి రెవెన్యూ యంత్రాంగం ఆశ్చర్యపోయింది. చాలాచోట్ల గతంలో ఉన్న సర్వే నంబర్ల సంఖ్యకు.. తాజాగా వెల్లడైన అంకెలకు ఏ మాత్రం పొంతన కుదరడం లేదు. అలాగే భూ విస్తీర్ణం విషయంలోనూ తేడా వస్తోంది. దీంతో ఈ వ్యత్యాసానికి దారితీసిన పరిస్థితులపై అధికార గణం తర్జనభర్జనలు పడుతోంది. భూ రికార్డుల ప్రక్షాళనకు ముందు ప్రభుత్వం వెబ్‌ల్యాండ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరిచి.. ‘మా భూమి’వెబ్సైట్ ద్వారా ప్రజల దరికి చేర్చింది. ఈ క్రమంలోనే తప్పులు దొర్లినట్లు తాజాగా ప్రభుత్వం ప్రాథమిక అంచనాకొచ్చింది. అప్పట్లో పకడ్బందీగా రికార్డులు నమోదు చేయాలనే అభిప్రాయానికొచ్చింది. దీనికితోడు ప్రైవేటు డీటీపీ ఆపరేటర్ల చేతివాటం కూడా రికార్డుల అప్డేషన్లో తప్పులు దొర్లేందుకు మూలం కావచ్చని తేల్చింది. అంతేగాకుండా వివాదాస్పద భూముల రికార్డుల ఆన్లైన్లో నమోదు చేసే విషయంలో జరిగిన గందరగోళం కూడా తాజా గణాంకాల వ్యత్యాసానికి ఒక కారణమని తెలుస్తోంది. కోర్టు కేసులు, దాయాదుల మధ్య వివాదాల్లాంటి అభ్యంతరకర భూములను రికార్డుల్లోకి ఎక్కించే అంశంపై వీఆర్ఓలు ఆచితూచి వ్యవహరించారు. దీని వల్లే ప్రస్తుతం జరుగుతున్న రికార్డుల్లో భారీ తేడా కనిపిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన రెవెన్యూ యంత్రాంగం.. మరో నాలుగు రోజుల్లో రికార్డుల శుద్ధీకరణ ప్రక్రియ ముగుస్తున్న క్రమంలో అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ ప్రక్షాళన తంతు ముగిసేసరికి ఎన్ని సర్వే నంబర్లలో ఎంత భూమి పెరుగుతుందనేది తమకు కూడా ఆసక్తిని కలిగిస్తోందని రెవెన్యూ వర్గాలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
భూ రికార్డుల ప్రక్షాళనలో ‘తిరగరాత’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన కొత్త మలుపు తిరిగింది. కంప్యూటర్లో అందుబాటులో ఉన్న రికార్డులను చూసి చేతితో పహాణీలు రాయించి సిబ్బంది సంతకాలు తీసుకోవాలని, సరిచేసిన ఆ వివరాలనే కంప్యూటర్లో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఇప్పటివరకు కేవలం రికార్డుల పరిశీలన, సరిచేతకే పరిమితమైన క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బందిపై ‘తిరగరాత’పెనుభారాన్ని మోపుతోంది. మరో పక్క ఈ వివరాలను రాయాల్సిన గ్రామరెవెన్యూ అధికారుల (వీఆర్వో) పోస్టుల్లో మూడో వంతు ఖాళీగా ఉండడంతో ఒక్కో వీఆర్వో తనకు కేటాయించిన దాదాపు 10 గ్రామాల పహాణీలు తయారు చేయలేక తీవ్ర ఒత్తిడితో పడరాని పాట్లు పడుతుండడం గమనార్హం. ముందే చెప్పకుండా.. వాస్తవానికి, భూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభమై దాదాపు 90 రోజులు కావస్తోంది. ఈ 90 రోజుల్లో దాదాపు 1.30 కోట్ల సర్వే నంబర్లలోని 1.5 కోట్ల ఎకరాల భూములకు సంబంధించిన రికార్డులను రెవెన్యూ యంత్రాంగం పరిశీలించింది. ముందుగా రైతులకు ఆన్లైన్ 1బీలు ఇచ్చి, రికార్డులను సరిచేసిన తర్వాత మరోసారి 1బీలను రైతులకు అందజేసి వారితో సంతకాలు తీసుకుంది. రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయిన చోట్ల కూడా లిఖితపూర్వకంగా తీసుకుని వాటిని సరిచేస్తోంది. ఈ వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తోంది. మరో 20 రోజులు గడిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చేలా సజావుగా సాగుతోంది. అయితే, గత 10 రోజుల క్రితం జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్ ఈ ప్రక్షాళన ప్రక్రియను పూర్తిగా మలుపు తిప్పింది. భూ రికార్డులన్నింటినీ కచ్చితంగా మాన్యువల్‌గా రాయాలని, వీఆర్వోల స్వదస్తూరితో పెన్నుతో రాసిన పహాణీలను పరిశీలించి వాటిలో తప్పులు సరిచేసి భద్రపర్చాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో ఇప్పుడు క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగమంతా పెన్నూ, పేపర్లు పట్టుకుని మాన్యువల్ పహాణీలు తయారు చేసే పనిలో పడింది. తిరగరాత ఎందుకో? అయితే, భవిష్యత్తులో ఏవైనా తప్పులు వస్తే రెవెన్యూ సిబ్బందిని బాధ్యులు చేసేందుకు ఈ మాన్యువల్ పహాణీలు ఉపయోగపడతాయని ఉన్నతస్థాయి అధికారులంటున్నారు. కానీ, కంప్యూటర్లో ఉన్న వివరాలను పేపర్‌పై పెట్టి అక్కడ తప్పులు సరిచేసి, మళ్లీ కంప్యూటర్లోకి ఎక్కించడం వృథా ప్రయాస అవుతుందని, దీని ద్వారా ఎక్కువ తప్పులు దొర్లే అవకాశం ఉందని క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది వాపోతున్నారు. కంప్యూటర్లో ఉన్న వివరాలను చూసి చేత్తో రాసేదాని కన్నా కంప్యూటర్ నుంచే ప్రింట్లు తీసుకుని తప్పు వచ్చిన వివరాలను సరిచేసి మళ్లీ కంప్యూటర్లో నమోదు చేసి ఫైనల్ కాపీలు తీసుకుంటే సరిపోతుందని, ఈ ఫైనల్ కాపీకి ప్రొసీడింగ్స్ తయారు చేసి అందరి సంతకాలు తీసుకుంటే బాధ్యులను చేసినట్టే అవుతుందని యంత్రాం గమంటోంది. కానీ, ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను చేతిరాతతో కూడిన పహాణీలు ఉండాల్సిందేనని మొండిపట్టు పడుతున్న నేపథ్యంలో భూ రికార్డుల ప్రక్షాళన అనుకున్న గడువులోపు పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదని అంటున్నారు. వీఆర్వోలు ఏరీ? రాష్ట్రంలో మొత్తం 10,815 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఇప్పుడు మాన్యువల్ పహాణీలను ఈ రెవెన్యూ గ్రామాల వారీగా తయారు చేయాల్సి ఉంది. ప్రతి సర్వే నంబర్, బైసర్వే నంబర్ల వారీగా, రైతువారీ వివరాలతో 31 కాలమ్‌లతో కూడిన పహాణీని వీఆర్వోలు తయారు చేయాలి. అయితే, రాష్ట్రంలో మొత్తం 7,032 వీఆర్వో పోస్టులు మంజూరు కాగా, అందులో కేవలం 5,854 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఒక్కో వీఆర్వో కింద 3–4 గ్రామాల క్లస్టర్లుండగా, వీఆర్వోలు లేని చోట్ల ఇన్చార్జులు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, రాష్ట్రంలో పనిచేస్తున్న వీఆర్వోలందరూ పహాణీలు తయారు చేయగలిగినంత అక్షరాస్యత ఉన్నవారు కాదు. ఈ నేపథ్యంలో ఒక్కో వీఆర్వో సగటున 4–5 రెవెన్యూ గ్రామాల నుంచి 10 గ్రామాల వరకు పహాణీలు తయారు చేయాల్సి వస్తోంది. గ్రామంలో ఉన్న రికార్డులను బట్టి ఒక్కో గ్రామానికి 3 నుంచి 10 రోజులు రాస్తే కానీ పహాణీలు తయారు కావని వీఆర్వోలంటున్నారు. దీనికి తోడు సమయం మరో 20 రోజులు మాత్రమే ఉన్నందున హడావుడిగా రికార్డులను పరిశీలించాల్సి వస్తోందని, ఇప్పుడు ఈ తిరగరాత మొదలవడంతో అసలు ఏం చేయాలో పాలుపోవడం లేదని వీఆర్వోలు, ఆర్ఐలు, తహసీల్దార్ స్థాయి అధికారులు వాపోతున్నారు. -
రెవెన్యూలో ‘ప్రక్షాళన’ లొల్లి!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళనలో ఎదురవుతున్న ఇబ్బందులు రెవెన్యూ యంత్రాంగంపై ఒత్తిడి పెంచుతున్నాయి. రికార్డులను సరిచేయడంలో సొమ్ములు చేతులు మారుతున్నాయంటూ వస్తున్న ఆరోపణలు, నమోదవుతున్న కేసులతో తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో రెవెన్యూ సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదవడం.. తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందికి పెద్దపల్లి ఇన్చార్జి కలెక్టర్ చార్జి మెమోలు జారీ చేయడం వంటి ఘటనల నేపథ్యంలో.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ‘భూరికార్డుల ప్రక్షాళన’కార్యక్రమాన్నే బహిష్కరిస్తామని హెచ్చరించారు. దీనిపై తహసీల్దార్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సీఎస్‌కు వినతిపత్రం సమర్పించారు. సీఎస్ సూచన మేరకు బహిష్కరణ యోచనను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించారు. కేసులు.. మెమోలు.. భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ఊపందుకున్న నాటి నుంచి రెవెన్యూ యం త్రాంగంపై ఒత్తిడి పెరుగుతోంది. సాధారణ పని ఒత్తిడికి తోడు రికార్డులను సరిచేసే క్రమంలో స్థానికులు, రాజకీయ నాయకులు, గ్రామపెద్దల సిఫార్సులు, ఒత్తిళ్లతో రెవెన్యూ సిబ్బంది ఆందోళనలో మునిగిపోతున్నారు. రెవెన్యూ సిబ్బంది రికార్డులు సరిచేసేందుకు లంచాలు అడుగుతున్నారని, ఎకరానికి రూ.3 వేల చొప్పున ఇస్తేనే సరిచేస్తామంటున్నారని ఆరోపణలు వస్తున్నా యి. ఈ క్రమంలో ఇంతకుముందు మహబూబ్‌నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తహసీల్దార్లు, ఆర్డీవోపై కూడా కేసులు నమోదయ్యాయి. తాజాగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి తహసీల్దార్, ఇతర రెవెన్యూ సిబ్బందిపై నాన్–బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. రెవె న్యూ అధికారులు ఒక రైతు ఆత్మహత్యకు కారణమయ్యారంటూ పెట్టిన ఈ కేసు... రెవెన్యూ శాఖలో అగ్గి రాజేసింది. ఇక అనుమతి లేకుండా నిరసన తెలియజేశారన్న కారణంగా గురువారం పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ జిల్లాలోని తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందికి చార్జ్‌మెమోలు ఇవ్వడం కూడా వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ (టీజీటీఏ) ఆధ్వర్యంలో.. రాష్ట్రంలోని పలువురు ఆర్డీవోలు, తహసీల్దార్లు శుక్రవారం సీసీఎల్ఏ కార్యాలయంలో సమావేశమై చర్చించారు. అనంతరం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. డీజీపీకి ఫోన్‌చేసి ఆరా తీసిన సీఎస్ తహసీల్దార్ల అసోసియేషన్ వినతిపత్రం అందించాక.. సీఎస్ ఎస్పీ సింగ్ జగిత్యాల ఘటనకు సంబంధించి డీజీపీ మహేందర్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ఏం జరిగిందన్న దానిపై ఆరా తీసి, తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక భూరికార్డుల ప్రక్షాళన, సాదాబైనామాల క్రమబద్ధీకరణ సందర్భంగా తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందికి ఇబ్బంది కలగకుండా పోలీసులు, ఇతర ప్రభుత్వ శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై రెండు రోజుల్లో లిఖిత పూర్వక ఆదేశాలు జారీచేస్తానని సీఎస్ హామీ ఇచ్చారని టీజీటీఏ నేత వి.లచ్చిరెడ్డి తెలిపారు. దీంతో ప్రక్షాళన కార్యక్రమాన్ని బహిష్కరించాలన్న యోచనను తాత్కాలికంగా విరమించుకుంటున్నట్టు చెప్పారు. -
‘భూప్రక్షాళన’ తర్వాత లెక్కలు తేలుతాయి
సాక్షి, హైదరాబాద్: భూరికార్డుల ప్రక్షాళన ప్రక్రియ పూర్తయి, నివేదికలు వచ్చాక రాష్ట్రంలోని వక్ఫ్, దేవాదాయ భూములపై స్పష్టత వస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. కబ్జాలతో వక్ఫ్, దేవాదాయ భూములకు అన్యాయం జరిగిందన్నారు. చాలావరకు వక్ఫ్ భూములు పార్ట్–బి (వివాదంలో ఉన్న భూముల కేటగిరీ)లో ఉన్నాయని.. వాటికి రెవెన్యూ అధికారులు సైతం పరిష్కారం చూపలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. భూరికార్డుల ప్రక్షాళన అంశంపై మంగళవారం శాసనసభలో జరిగిన స్వల్ప కాలిక చర్చలో విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ బదులిచ్చారు. వక్ఫ్ భూముల కబ్జాపై బుధవారం శాసనసభలో చర్చిద్దామని, ఈ సమస్యకు మంచి ముగింపు ఇద్దామని చెప్పారు. పాఠశాలలు, సబ్స్టేషన్లు, బస్టాండులు, స్మశానాల కోసం కొంత మంది విరాళంగా ఇచ్చిన భూముల యాజమాన్య హక్కులు ఇంకా వారి పేర్ల మీదే ఉన్నాయని... చెరువుల శిఖం, నీటి పారుదల కాల్వల భూములు అన్యాక్రాంతం అయ్యాయని పేర్కొన్నారు. అలాంటివన్నీ భూరికార్డుల ప్రక్షాళనలో బయటపడతాయని స్పష్టం చేశారు. పరిరక్షణకు చర్యలు చేపడతాం.. రాష్ట్రంలో 56 వేల ఎకరాల దేవాదాయ భూములు కబ్జాకు గురయ్యాయని.. వాటిని పంపిణీ చేసేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించాయని కేసీఆర్ చెప్పారు. న్యాయస్థానాలు అడ్డుకోవడంతో ఆ పంపకాలు నిలిచిపోయాయన్నారు. దేవాలయాల భూముల హక్కులను ఎవరూ హరించలేరని, వాటి పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక భద్రాచలం రామాలయానికి చెందిన 930 ఎకరాల భూములు ఏపీలోని మూడు గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నాయని.. ఆ గ్రామాలను తెలంగాణలో విలీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆ గ్రామాల విలీనానికి సూత్రప్రాయంగా అంగీకరించారని, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఢిల్లీకి వెళ్లి ఈ అంశంపై కేంద్రంతో మాట్లాడుతారని వెల్లడించారు. ఉచితంగా క్రమబద్ధీకరిస్తాం జీవో 58 కింద 125 చదరపు అడుగులలోపు ప్రభుత్వ స్థలాలను 100 శాతం ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని.. ఆ స్థలంలో ఎన్ని అంతస్తుల భవనాలను నిర్మించినా ఎలాంటి రుసుము వసూలు చేయమని కేసీఆర్ ప్రకటించారు. జీవో 58 కింద 125 చదరపు అడుగుల్లోపు స్థలాల్లో ఒక అంతస్తు భవనం ఉన్నా 10 శాతం భూమి విలువ చెల్లించాలంటూ అధికారులు ఇబ్బంది పెడుతున్నారన్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ప్రస్తావన మేరకు సీఎం ఈ వివరణ ఇచ్చారు. జీవో 59 కింద స్థలాల క్రమబద్ధీకరణ ద్వారా ప్రభుత్వానికి రూ.530 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా.. ఇప్పటివరకు రూ.330 కోట్లు వచ్చాయన్నారు. ఇక ప్రభుత్వ భూముల కబ్జాలపై ఏర్పాటు చేసిన సభాసంఘం మూడేళ్లు గడిచినా నివేదిక ఇవ్వలేదని.. త్వరగా నివేదిక తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని అక్బరుద్దీన్ సూచించగా.. ఆ అంశం స్పీకర్ పరిధిలో ఉందన్నారు. గిరిజనేతరులకు హక్కులు ఏజెన్సీ ప్రాంత భూములపై గిరిజనులకే హక్కు ఉండేలా కేంద్ర చట్టం 1/70 అమల్లో ఉండడంతో.. ఆ ప్రాంతంలోని భూములను యాభై అరవై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న గిరిజనేతర రైతులకు హక్కులు కల్పించడం సాధ్యం కావట్లేదని కేసీఆర్ పేర్కొన్నారు. దీనిపై రాజకీయపక్షాలు ఏకాభిప్రాయానికి వస్తే.. ఆ భూములను భూసేకరణ చట్టం కింద గిరిజనుల నుంచి సేకరించి గిరిజనేతర రైతులకు పంపిణీ చేస్తామన్నారు. దేవాదాయ భూములపై సర్వే జరపాలి రాష్ట్రంలోని 20 వేలకుపైగా ఆలయాల పరిధిలో 86 వేల ఎకరాల భూములుండగా.. అందులో 56 వేల ఎకరాలు కబ్జా అయ్యా యని అక్బరుద్దీన్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న వక్ఫ్ భూముల రెండో సర్వే తరహాలోనే దేవాదాయ భూముల సర్వేకు ఆదేశించాలని ప్రభుత్వానికి సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో వక్ఫ్, దేవాదాయ భూములను ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ ఎస్సీ, ఎస్టీ రైతులకు పంపిణీ చేశారని.. భూరికార్డుల ప్రక్షాళనలో ఆ భూములను ప్రభుత్వ భూములుగా పరిగణిస్తే వక్ఫ్, దేవాదాయ భూములకు అన్యాయం జరుగుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలకులు తెలంగాణలోని భూములను అడ్డగోలుగా విక్రయించి ఏపీ ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేశారని అక్బరుద్దీన్ ఆరోపించారు. హజ్రత్ హుస్సేన్ షావలి దర్గాకు చెందిన భూములను అప్పటి ప్రభుత్వం ఐటీ రంగ అభివృద్ధి కోసం ల్యాంకో సంస్థకు కేటాయించగా.. ల్యాంకో అక్కడ నివాస భవనాలు నిర్మించి ఉల్లంఘనలకు పాల్పడిందని, దీనిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. -
ఆ 4 తప్ప అన్నీ క్లియర్ చేయండి
సాక్షి, హైదరాబాద్: భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల యంత్రాంగాన్ని ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 31వ తేదీ కల్లా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, అందుకు అనుగుణంగా తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని నిర్దేశించింది. ఈ మేరకు ఇటీవల జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కేవలం నాలుగు కేటగిరీలు తప్ప మిగిలిన అన్ని భూముల వివరాలను క్లియర్ చేయాలని.. అసైన్డ్, అటవీ, సాదాబైనామా, కోర్టు కేసులున్న భూముల వివరాలను మాత్రమే పెండింగ్‌లో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆదేశించారు. వివాదాస్పద అంశాల జోలికి పోకుండా కేవలం రికార్డులను పరిశీలించి వీలున్న మార్పులు చేయాలని ఆయన సూచించారు. ఇప్పటికి పూర్తయింది కొంతే! అయితే, రికార్డుల ప్రక్షాళన ప్రారంభమై దాదాపు 50 రోజులు గడుస్తున్న నేపథ్యంలో ఇంకా మూడోవంతు ప్రక్రియ మాత్రమే పూర్తయింది. కానీ, ఉన్నతాధికారులు మాత్రం మరో సగం రోజుల గడువులోనే మిగిలిన 65 శాతానికి పైగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. గడువు సమీపిస్తుండటంతో జిల్లా స్థాయి అధికారుల్లో హడావుడి పెరిగింది. ఇంకా చాలా జిల్లాల్లో 15–20 శాతమే భూ రికార్డుల ప్రక్షాళన జరిగిందని, ఈ తరుణంలో డిసెంబర్ 31లోపు కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో శాస్త్రీయత లోపించే అవకాశం ఉందని క్షేత్రస్థాయి అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్.మీనా, భూ రికార్డుల ప్రక్షాళన మిషన్ డైరెక్టర్ వాకాటి కరుణ కూడా పాల్గొన్న ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయి. ♦ టైటిళ్లపై స్పష్టమైన ఆదేశాలతో కోర్టుల్లో కేసులున్న భూములు, సరిహద్దుల విషయంలో అటవీ శాఖ అభ్యంతరం చెపుతున్న భూములు, అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములు, సాదాబైనామా భూముల వివరాలు తప్ప మిగిలిన అన్ని భూముల రికార్డులను క్లియర్ చేయాలి. ఈ నాలుగు వివరాలను కేటగిరీ–బీలో, మిగిలిన భూముల వివరాలను కేటగిరీ–ఏలో నమోదు చేసి మొబైల్‌యాప్‌లో అప్లోడ్ చేయాలి. ♦ అటవీశాఖతో వివాదాలున్న భూముల్లో ఎక్కువ విస్తీర్ణం ఉన్న భూముల వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలి. అటవీశాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని వాటిని రాష్ట్రస్థాయిలో పరిష్కరించుకోవాలి. ♦ కోర్టు కేసుల విషయంలో టైటిల్‌పై స్పష్టమైన స్టే ఆర్డర్ ఉంటేనే కేటగిరీ–బీలో చేర్చాలి. ♦ అవసరమైన చోట్ల కలెక్టర్లు లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించుకోవచ్చు. ♦ క్లరికల్ విధులు, రికార్డుల అప్డేషన్ కోసం రిటైర్డ్ ఉద్యోగులు లేదా అదనపు కంప్యూటర్ ఆపరేటర్లను ఔట్సోర్సింగ్ విధానంలో నియమించుకోవాలి. ♦ గతంలో తిరస్కరించిన సాదాబైనామా దరఖాస్తులు మళ్లీ వస్తే వాటిని అనుమతించాలి. గురువారం నాటికి భూ రికార్డుల ప్రక్షాళన గణాంకాలివి.. రాష్ట్రంలో మొత్తం సర్వే నంబర్లు: 1,78,27,308 ఇప్పటివరకు పరిశీలించినవి: 64,73,101 సక్రమంగా ఉన్నవి: 44,71,669 సరిచేయాల్సినవి: 20,01,432 కోర్టుకేసులున్నవి: 15,012 పట్టాదారుల పేర్లు సరిపోలనివి: 1,02,669 పౌతీ చేయాల్సినవి: 2,86,553 ఆన్లైన్ చేయాల్సిన మ్యుటేషన్లు: 57,109 పెండింగ్ మ్యుటేషన్లు: 64,057 పట్టాదారుల పేర్లలో క్లరికల్ తప్పిదాలు: 4,11,391 రికార్డుల్లో కన్నా ఎక్కువ, తక్కువ భూములన్నవి: 1,96,691 పాస్‌బుక్‌లు ఆన్లైన్ చేయాల్సినవి: 9,011 సర్వే నంబర్లలో క్లరికల్ తప్పిదాలు: 70,616 అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములు: 39,379 వ్యవసాయేతర భూములు: 1,54,939 ఇతర తప్పిదాలు: 3,47,180 -
భూ వివాదాలను పరిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: భూ రికార్డుల ప్రక్షాళనలో రెండో దశ ప్రారంభం కానుంది. తొలి, రెండో విడతల్లో కలిపి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 వేల గ్రామాల్లో సర్వే నంబర్లవారీ భూ రికార్డుల పరిశీలన కొనసాగుతుండగా ఇందులో గుర్తించిన తప్పొప్పులు, వివాదాలను పరిష్కరించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు అవసరమైన కొత్త సాఫ్ట్‌వేర్‌ను కూడా ఆన్లైన్లో నేటి నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ అన్ని జిల్లాల కలెక్టర్లకు తెలియజేశారు. అయితే తొలి విడత పరిష్కార ప్రక్రియలో కూడా తేలని, అత్యంత వివాదాస్పదమై సర్వే అవసరమైన భూ రికార్డులను డిసెంబర్ 15 నుంచి పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 25% తప్పొప్పులు సరి చేసే అవకాశం భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 28 లక్షలకుపైగా సర్వే నంబర్లలోని 39 లక్షల ఎకరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అయితే అందులో కోర్టు కేసులున్నవి, పట్టాదారుల పేర్లు సరిపోలనివి, చనిపోయిన పట్టాదారుల పేర్లున్నవి, పట్టాదారుల పేర్లలో అచ్చు తప్పిదాలున్నవి, ఆన్లైన్లో నమోదుకాని మ్యుటేషన్లు, రికార్డులకన్నా ఎక్కువ, తక్కువ ఉన్న భూములున్నవి, సర్వే నంబర్లలో తప్పిదాలున్నవి, ఇతర తప్పిదాలున్న సర్వే నంబర్లు 8 లక్షలకుపైగానే ఉన్నాయి. ఈ సర్వే నంబర్లలో క్లరికల్ తప్పిదాలు, ఫౌతి చేయాల్సినవి, పట్టాదారుల పేర్లు మార్చాల్సిన వాటిని రెవెన్యూ యంత్రాంగమే రికార్డులు, స్థానిక పరిస్థితుల ఆధారంగా సరి చేయవచ్చు. కానీ పట్టాదారుల పేర్ల మార్పిడిలో వివాదాస్పదమైన భూములు, రికార్డులకన్నా ఎక్కువ, తక్కువ ఉన్న భూములను సరిచేయాలంటే కొంత కసరత్తు అవసరం. ఆ కసరత్తును వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. అన్ని సర్వే నంబర్లవారీ ప్రక్షాళన పూర్తయిన తర్వాత అన్ని తప్పులనూ ఒకేసారి సవరించేకన్నా రెండు ప్రక్రియలు సమాంతరంగా కొనసాగితే సమయం ఆదా అవుతుందన్న ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. అయితే రికార్డుల పరిష్కార ప్రక్రియను జాగ్రత్తగా చేయాలని, తాము సూచించిన ఫార్మాట్లో, ఆర్ఓఆర్ చట్టాలకు అనుగుణంగానే పూర్తి చేసి భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూసుకోవాలని ప్రభుత్వం రెవెన్యూ యంత్రాం గానికి సూచించింది. ఇందుకు కావాల్సిన సాఫ్ట్‌వేర్‌ను కూడా శనివారం నుంచే అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేసింది. దీంతో అన్ని జిల్లాల్లో ఇప్పటివరకు పరిశీలన పూర్తయిన సర్వే నంబర్లలోని సమస్యల పరిష్కారం ప్రారంభం కానుంది. ఇప్పటివరకు గుర్తించిన తప్పొప్పులు 29 శాతం ఉండగా అందులో 20–25 శాతం వరకు సరిచేయగలమని గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు ధీమా వ్యక్తం చేసినట్టు సమాచారం. కోర్టు కేసులున్న భూములను మినహాయిస్తే 1–2 శాతం భూముల రికార్డుల ప్రక్షాళనపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వారు చెప్పినట్టు రెవెన్యూ వర్గాలంటున్నాయి. డిసెంబర్ 15–31 వరకు సంక్లిష్ట రికార్డుల సవరణ... వాస్తవానికి భూ రికార్డుల ప్రక్షాళన నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు కొనసాగనుంది. అయితే డిసెంబర్ 15 వరకే రికార్డుల పరిశీలన చేపట్టి మిగిలిన 15 రోజులపాటు సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. అయితే సాధారణ సమస్యల పరిష్కారం ఇప్పుడే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సంక్లిష్టంగా ఉన్న రికార్డులను డిసెంబర్ 15 నుంచి పరిష్కరించాలని జిల్లా యంత్రాంగాలకు సూచించింది. సర్వే అవసరమైన భూములు, ప్రైవేటు వ్యక్తుల మధ్య తీవ్ర విభేదాలున్న భూములను అప్పుడు పరిష్కరించాలని ఎస్పీ సింగ్ కలెక్టర్లను ఆదేశించారు. -
భూ తగాదాలకు చెక్
అందుకే భూ రికార్డుల ప్రక్షాళన: హరీశ్ ► రైతుల భూముల వివరాలు ఆన్లైన్లో.. ► వాటి ఆధారంగానే ఎకరాకు రూ.4 వేలు ► ఎవరు అడ్డుపడినా కాళేశ్వరం ఆగదని స్పష్టీకరణ సాక్షి, సిద్దిపేట /నంగునూరు: భూ రికార్డుల ను ప్రక్షాళన చేసి భూ తగాదాలు, లంచాలకు చెక్ పెడతామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట, నంగునూరు మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిజాం కాలం నాటి భూ రికార్డులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, వాటిని ప్రక్షాళన చేసి రైతులకు భూములపై హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తోందని చెప్పారు. రికార్డులు సక్రమంగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఫలితంగా తరచూ భూ వివాదాలు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజల నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ నాయకులు పేదల భూములను పట్టాలు చేయించుకున్నారని ఆయన ఆరోపించారు. అవి తిరిగి పేదలకు అందుతాయనే భయంతోనే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి భూ సర్వేపై కోర్టులో కేసులు వేస్తామని చెబుతున్నారని చెప్పారు. రైతుల భూముల వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తామని, వీటి ఆధారంగానే వచ్చే ఏడాది నుంచి ఎకరాలకు నాలుగు వేల చొప్పున ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. ఎవరు అడ్డుపడినా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. గోదావరి జలాలతో రెండు పంటలకు నీరందించి బీడు భూములను సస్యశ్యామలం చేస్తామన్నారు. 70 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి కేవలం మూడేళ్లలో చేసి చూపించామని చెప్పారు. ఏడాదిలోపు రంగనాయక సాగర్ నిర్మాణం పనులు పూర్తి చేసి సాగు నీరందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో ప్రజలు టీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారని, దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు దొడ్డిదారిన అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని మంత్రి మండిపడ్డారు.