సాక్షి, హైదరాబాద్: భూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభమై మూడేళ్లు పూర్తయినా... సుమారు 15 లక్షల ఎకరాలకు సంబంధించిన భూముల యాజమాన్య హక్కులపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. పలు కారణా లను చూపుతూ 9.67 లక్షల ఖాతాలకు డిజిటల్ సంతకం చేయకుండా పెండింగ్‌లో పెట్టిన రెవెన్యూశాఖ... వీటికి పరిష్కారమార్గం చూపడంలో చేతులెత్తే ్తసింది. దీంతో పట్టాదార్ పాస్‌పుస్తకాలు రాక, రైతు బంధు సహాయం అందక భూ యజమానులు ఇబ్బందులు పడు తున్నారు. తమ భూములపై పడిన గొళ్లెం వీడేదెప్పుడో తెలియక ఆందోళన చెందు తున్నారు. భూ వివాదాలు, సాంకేతిక కార ణాలు, సివిల్ కేసులు, ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల మధ్య సరిహద్దు తగాదాలు, వ్యవ సాయేతర అవసరాలకు మళ్లిన భూములు.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 15,69,209 ఎకరాల భూముల హక్కులు 30 కారణాలతో పెండింగ్‌లో పడిపోయాయి.
ఎన్ని ఖాతా ల్లోని, ఎంత విస్తీర్ణంలో ఉన్న భూములకు, ఏ కారణంతో యాజమాన్య హక్కులపై స్పష్టత ఇవ్వలేదో వివరిస్తూ భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) వర్గాలు ఇటీవల ఓ నివేదిక తయారు చేశాయి. మరోవైపు కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసు కొచ్చిన ప్రభుత్వం.. భూ వివాదాలను పరిష్కరించే అధికారాలను రెవెన్యూ కోర్టుల నుంచి తొలగిం చింది. ఏ వివాదమైనా సివిల్ కోర్టులను ఆశ్రయిం చాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ పరిణామాల నేపథ్యంలో రెవెన్యూ కార్యా లయాల్లో మగ్గుతున్న లక్షలాది ఖాతాలకు పరిష్కారం ఎలా చూపుతారనే దానిపై స్పష్టత కరువైంది. కొత్త చట్టం అమలుపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తే తప్ప ఈ భూముల భవితవ్యమేమిటో ఆర్థంకాని పరిస్థితి. ఎందుకు పక్కనపెట్టారంటే పట్టణీకరణతో అనేక ప్రాంతాల్లో సాగు భూమలు వ్యవసాయేతర అవసరాలకు మళ్లాయి. అయితే, భూ వినియోగ మార్పిడి జరగకుండానే వీటిని వ్యవసాయేతర అవసరాలకు మళ్లించడం... కొంత మేర ప్లాట్లు, కొంత విస్తీర్ణంలో వ్యవసాయం సాగుతుండడంతో వీటికి పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఇచ్చే అంశంపై రెవెన్యూశాఖ స్పష్టమైన విధానం ప్రకటించలేదు.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా 2.15 లక్షల ఎకరాలపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ సమస్య కొలిక్కి రావాలంటే క్షేత్రస్థాయి సర్వే అనివార్యం. మరోవైపు ఆధార్ వివరాలు సరిగా లేకపోవడంతో ఏకంగా 3.9 లక్షల ఖాతాల డిజిటిల్ సంతకాల ప్రక్రియ నిలిచిపోయింది. ఇలా 4.5 లక్షల ఎకరాల భూ విస్తీర్ణానికి ఇంకా గ్రహణం వీడలేదు. వారసత్వ పంచాయతీలతో 38,504 ఖాతాలు..33,682 ఎకరాల మేర పెండింగ్‌లో పడింది. అలాగే పీవోటీ కేటగిరీలో 64,722 ఖాతాలు... 82,439 ఎకరాల యాజమాన్యాలపై మెలిక పడింది. విస్తీర్ణంలో వ్యత్యాసాలున్న కేటగిరీలో 43,475 ఖాతాలకు సంబంధించి 65,316 ఎకరాలకు పాస్‌పుస్తకాలు పెండింగ్‌లో ఉంచారు. ఇవేగాకుండా ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల మధ్య సరిహద్దు వివాదాలతోనే వేలాది ఎకరాలకు సంబంధించిన భూ హక్కులపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వీటిపై ప్రభుత్వస్థాయిలో విధానపరమైన నిర్ణయం జరగలేదు, స్పష్టమైన మార్గదర్శకాలు లేవు కాబట్టి తహసీల్దార్లు డిజిటిల్ సంతకం చేయకుండా పక్కనపెట్టారు.
కొత్త చట్టం రాకముందే...!
తాజాగా అమలులోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టంతో ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందా? లేదా? అనేదానిపై కూడా అనిశ్చితి నెలకొంది. గతంలో భూ వివాదాలపై ఆర్జీల పరిష్కారం అధికారుల పరిధిలో ఉండేది. వివాదాలైతే రెవెన్యూ కోర్టుల్లో పరిష్కారం లభించేది. కొత్త చట్టంలో రెవెన్యూ కోర్టులను ప్రభుత్వం రద్దు చేసింది. అంతేగాకుండా రెవెన్యూ కేసులను పరిష్కరించుకోవాలంటే ఇకపై న్యాయస్థానాలనే ఆశ్రయించాలని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో వివిధ కారణాలతో నిలిపివేసిన పాస్‌పుస్తకాలకు మోక్షం ఎప్పుడు.. ఎలా కలుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సీసీఎల్‌ఏ చెపుతున్న 30 కారణాలతో పెండింగ్‌లో పడిన భూములకు పరిష్కారం కలగాలంటే సమగ్ర సర్వే ఒక్కటే మార్గమని, దీని ద్వారానే వివాదాలకు తెరపడుతుందని భూచట్టాల నిపుణులు చెపుతున్నారు. అయితే, ధరణి పోర్టల్ అప్‌డేట్ చేసి అధికారికంగా కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చే లోపే ఈ వివాదాస్పద భూముల విషయంలోనూ పరిష్కారం రావాల్సి ఉంటుందని, లేదంటే భవిష్యత్తులో ఈ భూములకు మరిన్ని ఇబ్బందులు వస్తాయని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment