పార్ట్‌–బీ.. పరేషాన్‌! | Millions Of Acres Of Unresolved Land Disputes In Land Records Cleansing | Sakshi
Sakshi News home page

పార్ట్‌–బీ.. పరేషాన్‌!

Published Sat, Oct 3 2020 1:46 AM | Last Updated on Sat, Oct 3 2020 1:46 AM

Millions Of Acres Of Unresolved Land Disputes In Land Records Cleansing - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లికి చెందిన మహబూబ్‌రెడ్డికి నిజాం కాలంలో 552 ఎకరాల భూమి 91 సర్వే నంబర్‌లో ఉంది. ఇందులో 294 ఎకరాలను భూదాన చట్టం కింద, 121 ఎకరాలను సీలింగ్‌ యాక్టు కింద అప్పట్లోనే పేదలకు పంపిణీ చేశారు. అందులో కర్ర యాకూబ్‌ అనే వ్యక్తికి భూదాన చట్టం ద్వారా 3 ఎకరాలు పట్టా అయ్యి సంక్రమిం చింది. ఇప్పుడు భూరికార్డుల ప్రక్షాళనకు వచ్చిన అధికారులు యాకూబ్‌ అనుభవిస్తున్న భూమి అటవీ శాఖకు చెందిందని అంటున్నారు. ఆయన భూదాన పట్టాను రద్దు చేసి ఆ భూమిని పార్ట్‌–బీలో చేర్చారు. దీంతో తన భూమి పట్టా కోసం యాకూబ్‌ చెప్పులరి గేలా తిరుగు తున్నాడు. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల పరిధిలోనే సుమారు 9వేల ఎకరాల భూమి పట్టాలు ఇలా రద్దయ్యాయి.

కొత్తగూడ, గంగారం మండలాల్లో మాత్రమే కాదు రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల భూములకు సంబంధించిన యాజమాన్య హక్కులు, పట్టాలు ఇంకా పెండింగ్‌ లోనే ఉన్నాయి. కారణమేదైనా వారి భూములకు సంబంధించిన సమస్యలు తీరనే లేదు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6 లక్షల ఖాతాల్లోని భూములు పెండింగ్‌లో ఉన్నాయని రెవెన్యూ అధికారులు చెపుతు న్నారు. ఈ భూములకు పరిష్కారం ఎలా లభిస్తుందో... కొత్త చట్టంలో ఏముందో అని ఆయా భూముల యజమానులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. 

అసలు పార్ట్‌–బీ అంటే...
భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలోని భూములను రెవెన్యూ యంత్రాంగం రెండు విభాగాలుగా చేసింది. అందులో మొదటిది పార్ట్‌–ఏ. ఇందులో ఎలాంటి వివాదాలు లేని భూములను చేర్చి ఆయా భూముల యజమానులకు కొత్త పాస్‌పుస్తకాలు ఇచ్చేశారు. పార్ట్‌–బీలో వివాదాస్పద భూములను చేర్చారు. అంటే... ప్రభుత్వ భూములు/ ఆస్తులు, అటవీ, దేవాదాయ, వక్ఫ్‌ భూములతో వివిధ ప్రభుత్వ శాఖలకు లేదా ప్రైవేటు వ్యక్తులకు పంచాయతీ ఉన్న భూములు, విస్తీర్ణంలో తేడాలున్న భూములు, కోర్టు కేసులు, కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు, అసైన్‌ చేసిన భూమికి– క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడా ఉన్న కేసులను ఈ కేటగిరిలో చేర్చి వాటిని పెండింగ్‌లో పెట్టారు.

భూరికార్డుల ప్రక్షాళనకు అధికారులు వచ్చే సమయంలో ఎవరైనా ఏదేని భూమిపై చిన్న ఫిర్యాదు ఇచ్చినా దాన్ని అడ్డుపెట్టుకుని పార్ట్‌–బీలోకి నెట్టేసి పాస్‌పుస్తకాలను పెండింగ్‌లో పెట్టింది రెవెన్యూ యంత్రాంగం. కొన్నిచోట్ల అయితే ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు వర్గాల మధ్య పంచాయతీలున్న భూములను కనీసం సర్వే కూడా చేయకుండా ఇప్పుడు ఏకంగా అది ప్రభుత్వ భూమి అంటూ రికార్డు చేసేసింది. మరికొన్ని చోట్ల వివాదాల పేరుతో పక్కకు పెట్టేసింది రెవెన్యూ యంత్రాంగం. ఇలా వివాదాలున్న భూముల విషయంలో కొత్త రెవెన్యూ చట్టం ఏం చెపుతుందోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది. కోర్టు కేసుల విషయంలో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. మిగిలిన వివాదాల విషయంలో ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. దీంతో తమ భూముల విషయంలో ఏం జరుగుతుందో అనే ఆందోళన రైతాంగంలో వ్యక్తమవుతోంది. 

స్పష్టత కరువు...
భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఇంకా పాస్‌పుస్తకాలు రాని ఖాతాలు (పార్ట్‌–ఏ లోనివే) 6 లక్షలకు పైగా ఉన్నాయి. ఇలా వివాదాస్పద భూమిగా పార్ట్‌–బీలో చేరిన భూములకు పాస్‌పుస్తకాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ వందలాది మంది ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే, కొత్త రెవెన్యూ చట్టంలో వివాదాస్పద పార్ట్‌ బీ భూములను ఎలా పరిష్కరిస్తారనే దానిపై ప్రభుత్వం ఇంకా స్పష్టతనివ్వలేదు. రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రత్యేక ట్రిబ్యునల్‌కు బదలాయిస్తామని సర్కారు పేర్కొంది. చట్టం మనుగడలోకి వచ్చిన తర్వాత ఎలాంటి భూ వివాదామైనా సివిల్‌ కోర్టుల్లోనే తేల్చుకోవాలని రెవెన్యూశాఖ తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెవెన్యూ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న లక్షలాది పార్ట్‌ బీ ఖాతాలకు ఎలాంటి పరిష్కార మార్గం చూపుతారనేది ఆసక్తికరంగా మారింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూములు
మొత్తం భూములు: 2.75 కోట్ల ఎకరాలు
పట్టా భూములు: 1.50 కోట్ల ఎకరాలు
అటవీ భూములు: 60 లక్షల ఎకరాలు
(ప్రజావసరాలకు సంబంధించిన భూములు: 65 లక్షల ఎకరాలు (ప్రభుత్వ సంస్థలు, రహదారులు, మౌలిక సదుపాయాలు, గ్రామకంఠం, నదులు, పట్టణాలు సహా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement