యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 346లో ఉన్న 20 ఎకరాల 17 గుంటల భూమిలో ఓ భాగం ఇది. రెవెన్యూ కార్యాలయంలో ఇది పట్టా భూమిగానే నమోదైనా చౌటుప్పల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మాత్రం ప్రభుత్వ భూముల నిషేధిత జాబితా 22 (ఏ)లో ఉంది. ఆ భూముల్లో 14 మంది రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు. అవసరానికి వేరే వ్యక్తికి అమ్మాలనుకొని కొనుగోలుదారుడికి రిజిస్టర్ చేసేందుకు వెళ్లగా అందులో 2 ఎకరాల 10 గుంటల భూమి రిజిస్ట్రేషన్ జరగలేదు. మిగిలింది తమ కుటుంబ సభ్యుల పేర్ల మీద మారుద్దామన్నా కుదరట్లేదు. ఇందుకు కారణం ఆ సర్వే నంబర్ 22 (ఏ) జాబితాలో ఉండటమే.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిషేధిత భూముల నమోదులో గందరగోళం కారణంగా ఏళ్ల తరబడి పేద రైతులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడు తున్నారు. నిషేధిత భూముల జాబితాను ఎప్పుడో తయారు చేసిన రెవెన్యూ అధికారులు... ఆ తర్వాత వాటిని సరిదిద్దే కసరత్తు చేయక పోవడంతో ఒకే సర్వే నంబర్‌లో ప్రభుత్వ, పట్టా భూములన్న ప్రాంతాల్లో పట్టా భూముల రిజిస్ట్రేషన్లు జరగట్లేదు. ఇలా 22 (ఏ) జాబితాలో సమస్యలున్న భూములు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8 లక్షల ఎకరాలుంటాయని అంచనా. ఈ భూములు కొందరికి పీటముడిగా మారితే అక్రమార్కులకు వరంగా మారాయి. వాటి మాటున రూ. వందల కోట్లు చేతులు మారాయి. ఈ భూముల రిజిస్ట్రేషన్లు జరగాలంటే జిల్లా కలెక్టర్ నుంచి ఎన్‌వోసీ కావాలని, అది తేవా లంటే ‘ఖర్చ’వుతుందని రెవెన్యూ శాఖలో పనిచేసే కిందిస్థాయి అధికారులు చెబుతున్నా రన్న ఆరోపణలు ఉన్నాయి.
దీంతో వారు అడిగి నంత డబ్బు ముట్టజెప్పుకున్నవారు కొందరైతే, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగలేక, అడిగినంత లంచాలు ఇవ్వలేక... అయిన వారికి భూమిపై హక్కుల మార్పిడి చేయ లేక, అవసరానికి అమ్ముకోలేక లక్షలాది మంది ఇప్పటికీ అవస్థలు పడుతున్నారు. కొత్త రెవెన్యూ చట్టంతో అయినా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందేమోననే ఆశతో ఎదురుచూస్తున్నారు.
ఎన్నాళ్లున్నా... అంతేనా?
వివిధ ప్రభుత్వ శాఖలు, అటవీ, వక్ఫ్, దేవాదాయ భూముల రిజిస్ట్రేషన్లు జరగకుండా... ప్రభుత్వ భూములను ఎవరూ కబ్జా చేయకుండా కాపాడేందుకు ఈ నిషేధిత భూముల జాబితాను తయారు చేశారు. ప్రతి గ్రామంలోని ఫైసల్ పహాణీ ఆధారంగా ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ భూముల సర్వే నంబర్లను గుర్తించి వాటిపై లావీదేవీలు నిషేధించారు. అక్కడే అధికారులు తప్పులో కాలేశారు. ప్రభుత్వ భూముల పేరుతో పట్టా భూములను కూడా ఈ జాబితాలో చేర్చారు. ఒకే సర్వే నంబర్‌లో ప్రభుత్వ, పట్టా భూములుంటే ఆ భూములను విభజించకుండా, సర్వే నంబర్లను బై చేయకుండా సర్వే నంబర్ మొత్తాన్ని 22 (ఏ) జాబితాలో చేర్చారు.
దీంతో సమస్య ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం 2017లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలోనూ ఈ సమస్యకు మోక్షం కలగలేదు. నిషేధిత భూముల జాబితాను సవరించాలని ఎన్నిసార్లు ప్రభుత్వం సూచించినా, ప్రజలు ఫిర్యాదులు చేసినా వాటిని సవరించడంలో రెవెన్యూ యంత్రాంగం విఫలమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లోని ఏదో ఒక గ్రామంలో ఈ నిషేధిత భూములతో ప్రజలు తంటాలు పడుతూనే ఉన్నారు.
పట్టా భూమిగా మార్చాలి
మా భూమి రెవెన్యూ కార్యాలయంలో పట్టాగా చూపుతున్నా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్తే ప్రభుత్వ భూమి అంటున్నారు. అధికారుల చుట్టూ భూమి కోసం తిరుగుతూనే ఉన్నాం. మాది ప్రభుత్వ భూమి కాదు. దాన్ని పట్టా భూమిగా గుర్తించి క్రయవిక్రయ లావాదేవీలు జరిపేందుకు మాకు అధికారం ఇవ్వాలి.
– మర్రి చిన్నజంగారెడ్డి, పుట్టపాక
ప్రభుత్వ భూమి అంటున్నారు
పుట్టపాకలోని సర్వే నంబర్ 346లో 7 ఎకరాలు కొన్నాను. రెవెన్యూ కార్యాలయంలో అడిగితే పట్టా భూమే కొనుక్కోమన్నారు. కానీ రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారులు అది ప్రభుత్వ భూమి అంటున్నారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ప్రభుత్వం ఈ సమస్య నుంచి ఇప్పటికైనా రైతులను బయట పడేయాలి.
– కుక్కల రఘపతి, పుట్టపాక
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలోని సర్వే నంబర్ 587లో ఉన్న భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం పట్టా భూమి. కానీ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మాత్రం ఇది 22 (ఏ) జాబితాలో ఉంది. ఆ భూమిలో 1996లోనే వెంచర్ చేసి ప్లాట్లుగా విక్రయించారు. రిజిస్ట్రేషన్ సమయానికి వచ్చేసరికి చిక్కుముడి పడింది. నిషేధిత భూముల జాబితాలో ఉన్న ఈ సర్వే నంబర్‌లో రిజిస్ట్రేషన్లు జరగవని అధికారులు తేల్చిచెప్పారు. దీంతో గత 24 ఏళ్లుగా అక్కడ ప్లాట్లు కొన్న వారు భూముల రిజిస్ట్రేషన్ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం దక్కలేదు. కందుకూరులోని మరో సర్వే నంబర్ 911లోనూ ఇదే పరిస్థితి. ఇలా మండలంలోని చాలా గ్రామాల్లో ఈ నిషేధిత భూముల సమస్య ఉంది.
కేస్ స్టడీ–3
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మెదక్ అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఏసీబీకి పట్టుబడ్డ వ్యవహారానికి కూడా ఈ నిషేధిత సమస్యే మూలం. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) ఇచ్చే పనిని తనకు అనుకూలంగా మార్చుకొనేందుకు ఆయన ప్రయత్నించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని చిప్పల్‌తుర్తి గ్రామంలోని 58, 59 సర్వే నంబర్లలో ఉన్న లావణీ భూములకు ఎన్‌వోసీ ఇచ్చేందుకు లంచం అడిగి అడ్డంగా దొరికిపోయారు. ఎకరానికి రూ. లక్ష ఇస్తే ఎన్‌వోసీ ఇస్తానని ఒప్పందం కుదుర్చుకొని బుక్కయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment