సాక్షి, హైదరాబాద్: భూరికార్డుల ప్రక్షాళన ప్రక్రియ పూర్తయి, నివేదికలు వచ్చాక రాష్ట్రంలోని వక్ఫ్, దేవాదాయ భూములపై స్పష్టత వస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. కబ్జాలతో వక్ఫ్, దేవాదాయ భూములకు అన్యాయం జరిగిందన్నారు. చాలావరకు వక్ఫ్ భూములు పార్ట్–బి (వివాదంలో ఉన్న భూముల కేటగిరీ)లో ఉన్నాయని.. వాటికి రెవెన్యూ అధికారులు సైతం పరిష్కారం చూపలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
భూరికార్డుల ప్రక్షాళన అంశంపై మంగళవారం శాసనసభలో జరిగిన స్వల్ప కాలిక చర్చలో విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ బదులిచ్చారు. వక్ఫ్ భూముల కబ్జాపై బుధవారం శాసనసభలో చర్చిద్దామని, ఈ సమస్యకు మంచి ముగింపు ఇద్దామని చెప్పారు. పాఠశాలలు, సబ్‌స్టేషన్లు, బస్టాండులు, స్మశానాల కోసం కొంత మంది విరాళంగా ఇచ్చిన భూముల యాజమాన్య హక్కులు ఇంకా వారి పేర్ల మీదే ఉన్నాయని... చెరువుల శిఖం, నీటి పారుదల కాల్వల భూములు అన్యాక్రాంతం అయ్యాయని పేర్కొన్నారు. అలాంటివన్నీ భూరికార్డుల ప్రక్షాళనలో బయటపడతాయని స్పష్టం చేశారు.
పరిరక్షణకు చర్యలు చేపడతాం..
రాష్ట్రంలో 56 వేల ఎకరాల దేవాదాయ భూములు కబ్జాకు గురయ్యాయని.. వాటిని పంపిణీ చేసేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించాయని కేసీఆర్ చెప్పారు. న్యాయస్థానాలు అడ్డుకోవడంతో ఆ పంపకాలు నిలిచిపోయాయన్నారు. దేవాలయాల భూముల హక్కులను ఎవరూ హరించలేరని, వాటి పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇక భద్రాచలం రామాలయానికి చెందిన 930 ఎకరాల భూములు ఏపీలోని మూడు గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నాయని.. ఆ గ్రామాలను తెలంగాణలో విలీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆ గ్రామాల విలీనానికి సూత్రప్రాయంగా అంగీకరించారని, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఢిల్లీకి వెళ్లి ఈ అంశంపై కేంద్రంతో మాట్లాడుతారని వెల్లడించారు.
ఉచితంగా క్రమబద్ధీకరిస్తాం
జీవో 58 కింద 125 చదరపు అడుగులలోపు ప్రభుత్వ స్థలాలను 100 శాతం ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని.. ఆ స్థలంలో ఎన్ని అంతస్తుల భవనాలను నిర్మించినా ఎలాంటి రుసుము వసూలు చేయమని కేసీఆర్ ప్రకటించారు. జీవో 58 కింద 125 చదరపు అడుగుల్లోపు స్థలాల్లో ఒక అంతస్తు భవనం ఉన్నా 10 శాతం భూమి విలువ చెల్లించాలంటూ అధికారులు ఇబ్బంది పెడుతున్నారన్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ప్రస్తావన మేరకు సీఎం ఈ వివరణ ఇచ్చారు.
జీవో 59 కింద స్థలాల క్రమబద్ధీకరణ ద్వారా ప్రభుత్వానికి రూ.530 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా.. ఇప్పటివరకు రూ.330 కోట్లు వచ్చాయన్నారు. ఇక ప్రభుత్వ భూముల కబ్జాలపై ఏర్పాటు చేసిన సభాసంఘం మూడేళ్లు గడిచినా నివేదిక ఇవ్వలేదని.. త్వరగా నివేదిక తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని అక్బరుద్దీన్ సూచించగా.. ఆ అంశం స్పీకర్ పరిధిలో ఉందన్నారు.
గిరిజనేతరులకు హక్కులు
ఏజెన్సీ ప్రాంత భూములపై గిరిజనులకే హక్కు ఉండేలా కేంద్ర చట్టం 1/70 అమల్లో ఉండడంతో.. ఆ ప్రాంతంలోని భూములను యాభై అరవై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న గిరిజనేతర రైతులకు హక్కులు కల్పించడం సాధ్యం కావట్లేదని కేసీఆర్ పేర్కొన్నారు. దీనిపై రాజకీయపక్షాలు ఏకాభిప్రాయానికి వస్తే.. ఆ భూములను భూసేకరణ చట్టం కింద గిరిజనుల నుంచి సేకరించి గిరిజనేతర రైతులకు పంపిణీ చేస్తామన్నారు.
దేవాదాయ భూములపై సర్వే జరపాలి
రాష్ట్రంలోని 20 వేలకుపైగా ఆలయాల పరిధిలో 86 వేల ఎకరాల భూములుండగా.. అందులో 56 వేల ఎకరాలు కబ్జా అయ్యా యని అక్బరుద్దీన్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న వక్ఫ్ భూముల రెండో సర్వే తరహాలోనే దేవాదాయ భూముల సర్వేకు ఆదేశించాలని ప్రభుత్వానికి సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో వక్ఫ్, దేవాదాయ భూములను ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ ఎస్సీ, ఎస్టీ రైతులకు పంపిణీ చేశారని.. భూరికార్డుల ప్రక్షాళనలో ఆ భూములను ప్రభుత్వ భూములుగా పరిగణిస్తే వక్ఫ్, దేవాదాయ భూములకు అన్యాయం జరుగుతుందన్నారు.
ఉమ్మడి రాష్ట్ర పాలకులు తెలంగాణలోని భూములను అడ్డగోలుగా విక్రయించి ఏపీ ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేశారని అక్బరుద్దీన్ ఆరోపించారు. హజ్రత్ హుస్సేన్ షావలి దర్గాకు చెందిన భూములను అప్పటి ప్రభుత్వం ఐటీ రంగ అభివృద్ధి కోసం ల్యాంకో సంస్థకు కేటాయించగా.. ల్యాంకో అక్కడ నివాస భవనాలు నిర్మించి ఉల్లంఘనలకు పాల్పడిందని, దీనిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment