భూ రికార్డుల ప్రక్షాళనలో ‘తిరగరాత’ | News about Land records cleansing | Sakshi
Sakshi News home page

భూ రికార్డుల ప్రక్షాళనలో ‘తిరగరాత’

Published Fri, Dec 8 2017 1:50 AM | Last Updated on Fri, Dec 8 2017 1:50 AM

News about Land records cleansing  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన కొత్త మలుపు తిరిగింది. కంప్యూటర్‌లో అందుబాటులో ఉన్న రికార్డులను చూసి చేతితో పహాణీలు రాయించి సిబ్బంది సంతకాలు తీసుకోవాలని, సరిచేసిన ఆ వివరాలనే కంప్యూటర్‌లో అప్‌లోడ్‌ చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఇప్పటివరకు కేవలం రికార్డుల పరిశీలన, సరిచేతకే పరిమితమైన క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బందిపై ‘తిరగరాత’పెనుభారాన్ని మోపుతోంది. మరో పక్క ఈ వివరాలను రాయాల్సిన గ్రామరెవెన్యూ అధికారుల (వీఆర్వో) పోస్టుల్లో మూడో వంతు ఖాళీగా ఉండడంతో ఒక్కో వీఆర్వో తనకు కేటాయించిన దాదాపు 10 గ్రామాల పహాణీలు తయారు చేయలేక తీవ్ర ఒత్తిడితో పడరాని పాట్లు పడుతుండడం గమనార్హం.  

ముందే చెప్పకుండా..
వాస్తవానికి, భూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభమై దాదాపు 90 రోజులు కావస్తోంది. ఈ 90 రోజుల్లో దాదాపు 1.30 కోట్ల సర్వే నంబర్లలోని 1.5 కోట్ల ఎకరాల భూములకు సంబంధించిన రికార్డులను రెవెన్యూ యంత్రాంగం పరిశీలించింది. ముందుగా రైతులకు ఆన్‌లైన్‌ 1బీలు ఇచ్చి, రికార్డులను సరిచేసిన తర్వాత మరోసారి 1బీలను రైతులకు అందజేసి వారితో సంతకాలు తీసుకుంది. రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయిన చోట్ల కూడా లిఖితపూర్వకంగా తీసుకుని వాటిని సరిచేస్తోంది.

ఈ వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తోంది. మరో 20 రోజులు గడిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చేలా సజావుగా సాగుతోంది. అయితే, గత 10 రోజుల క్రితం జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్‌ ఈ ప్రక్షాళన ప్రక్రియను పూర్తిగా మలుపు తిప్పింది. భూ రికార్డులన్నింటినీ కచ్చితంగా మాన్యువల్‌గా రాయాలని, వీఆర్వోల స్వదస్తూరితో పెన్నుతో రాసిన పహాణీలను పరిశీలించి వాటిలో తప్పులు సరిచేసి భద్రపర్చాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో ఇప్పుడు క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగమంతా పెన్నూ, పేపర్లు పట్టుకుని మాన్యువల్‌ పహాణీలు తయారు చేసే పనిలో పడింది.  

తిరగరాత ఎందుకో?  
అయితే, భవిష్యత్తులో ఏవైనా తప్పులు వస్తే రెవెన్యూ సిబ్బందిని బాధ్యులు చేసేందుకు ఈ మాన్యువల్‌ పహాణీలు ఉపయోగపడతాయని ఉన్నతస్థాయి అధికారులంటున్నారు. కానీ, కంప్యూటర్‌లో ఉన్న వివరాలను పేపర్‌పై పెట్టి అక్కడ తప్పులు సరిచేసి, మళ్లీ కంప్యూటర్‌లోకి ఎక్కించడం వృథా ప్రయాస అవుతుందని, దీని ద్వారా ఎక్కువ తప్పులు దొర్లే అవకాశం ఉందని క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది వాపోతున్నారు.

కంప్యూటర్‌లో ఉన్న వివరాలను చూసి చేత్తో రాసేదాని కన్నా కంప్యూటర్‌ నుంచే ప్రింట్లు తీసుకుని తప్పు వచ్చిన వివరాలను సరిచేసి మళ్లీ కంప్యూటర్‌లో నమోదు చేసి ఫైనల్‌ కాపీలు తీసుకుంటే సరిపోతుందని, ఈ ఫైనల్‌ కాపీకి ప్రొసీడింగ్స్‌ తయారు చేసి అందరి సంతకాలు తీసుకుంటే బాధ్యులను చేసినట్టే అవుతుందని యంత్రాం గమంటోంది. కానీ, ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను చేతిరాతతో కూడిన పహాణీలు ఉండాల్సిందేనని మొండిపట్టు పడుతున్న నేపథ్యంలో భూ రికార్డుల ప్రక్షాళన అనుకున్న గడువులోపు పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదని అంటున్నారు.   


వీఆర్వోలు ఏరీ?
రాష్ట్రంలో మొత్తం 10,815 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఇప్పుడు మాన్యువల్‌ పహాణీలను ఈ రెవెన్యూ గ్రామాల వారీగా తయారు చేయాల్సి ఉంది. ప్రతి సర్వే నంబర్, బైసర్వే నంబర్ల వారీగా, రైతువారీ వివరాలతో 31 కాలమ్‌లతో కూడిన పహాణీని వీఆర్వోలు తయారు చేయాలి. అయితే, రాష్ట్రంలో మొత్తం 7,032 వీఆర్వో పోస్టులు మంజూరు కాగా, అందులో కేవలం 5,854 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఒక్కో వీఆర్వో కింద 3–4 గ్రామాల క్లస్టర్‌లుండగా, వీఆర్వోలు లేని చోట్ల ఇన్‌చార్జులు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, రాష్ట్రంలో పనిచేస్తున్న వీఆర్వోలందరూ పహాణీలు తయారు చేయగలిగినంత అక్షరాస్యత ఉన్నవారు కాదు.

ఈ నేపథ్యంలో ఒక్కో వీఆర్వో సగటున 4–5 రెవెన్యూ గ్రామాల నుంచి 10 గ్రామాల వరకు పహాణీలు తయారు చేయాల్సి వస్తోంది. గ్రామంలో ఉన్న రికార్డులను బట్టి ఒక్కో గ్రామానికి 3 నుంచి 10 రోజులు రాస్తే కానీ పహాణీలు తయారు కావని వీఆర్వోలంటున్నారు. దీనికి తోడు సమయం మరో 20 రోజులు మాత్రమే ఉన్నందున హడావుడిగా రికార్డులను పరిశీలించాల్సి వస్తోందని, ఇప్పుడు ఈ తిరగరాత మొదలవడంతో అసలు ఏం చేయాలో పాలుపోవడం లేదని వీఆర్వోలు, ఆర్‌ఐలు, తహసీల్దార్‌ స్థాయి అధికారులు వాపోతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement