
సాక్షి, హైదరాబాద్: భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో సాంకేతిక సమస్యల వల్ల దొర్లిన తప్పులకు రెవెన్యూ ఉద్యోగులను బాధ్యులను చేయడం అన్యాయమని తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు లచ్చిరెడ్డి, అధ్యక్షుడు గౌతంకుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని కలిసి సమస్యలను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ధరణి వెబ్‌సైట్‌లో ఇచ్చిన ఆప్షన్లు సాంకేతికంగా, లోపభూయిష్టంగా ఉన్నాయన్నారు.
ఈ వెబ్‌సైట్ సిబ్బందికి సరైన నైపుణ్యం లేదని ఆరోపించారు. ధరణి వెబ్‌సైట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాతే సబ్ రిజిస్ట్రార్‌కు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. పట్టాదారు పాస్‌పుస్తకంలో దొర్లిన తప్పులను సరి చేయడానికి జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు ఇవ్వాలని తెలిపారు. పార్టు బీ కేసులను పీఓటీ, సాదాబైనామా కేసులను పరిష్కరించడానికి తగిన సమయం ఇవ్వాలని విన్నవించారు. ఈ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి సీఎంతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.