సాక్షి, హైదరాబాద్: భూ రికార్డుల ప్రక్షాళనలో రెండో దశ ప్రారంభం కానుంది. తొలి, రెండో విడతల్లో కలిపి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 వేల గ్రామాల్లో సర్వే నంబర్లవారీ భూ రికార్డుల పరిశీలన కొనసాగుతుండగా ఇందులో గుర్తించిన తప్పొప్పులు, వివాదాలను పరిష్కరించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది.
ఇందుకు అవసరమైన కొత్త సాఫ్ట్‌వేర్‌ను కూడా ఆన్‌లైన్‌లో నేటి నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ అన్ని జిల్లాల కలెక్టర్లకు తెలియజేశారు. అయితే తొలి విడత పరిష్కార ప్రక్రియలో కూడా తేలని, అత్యంత వివాదాస్పదమై సర్వే అవసరమైన భూ రికార్డులను డిసెంబర్ 15 నుంచి పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
25% తప్పొప్పులు సరి చేసే అవకాశం
భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 28 లక్షలకుపైగా సర్వే నంబర్లలోని 39 లక్షల ఎకరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అయితే అందులో కోర్టు కేసులున్నవి, పట్టాదారుల పేర్లు సరిపోలనివి, చనిపోయిన పట్టాదారుల పేర్లున్నవి, పట్టాదారుల పేర్లలో అచ్చు తప్పిదాలున్నవి, ఆన్‌లైన్‌లో నమోదుకాని మ్యుటేషన్లు, రికార్డులకన్నా ఎక్కువ, తక్కువ ఉన్న భూములున్నవి, సర్వే నంబర్లలో తప్పిదాలున్నవి, ఇతర తప్పిదాలున్న సర్వే నంబర్లు 8 లక్షలకుపైగానే ఉన్నాయి.
ఈ సర్వే నంబర్లలో క్లరికల్ తప్పిదాలు, ఫౌతి చేయాల్సినవి, పట్టాదారుల పేర్లు మార్చాల్సిన వాటిని రెవెన్యూ యంత్రాంగమే రికార్డులు, స్థానిక పరిస్థితుల ఆధారంగా సరి చేయవచ్చు. కానీ పట్టాదారుల పేర్ల మార్పిడిలో వివాదాస్పదమైన భూములు, రికార్డులకన్నా ఎక్కువ, తక్కువ ఉన్న భూములను సరిచేయాలంటే కొంత కసరత్తు అవసరం. ఆ కసరత్తును వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.
అన్ని సర్వే నంబర్లవారీ ప్రక్షాళన పూర్తయిన తర్వాత అన్ని తప్పులనూ ఒకేసారి సవరించేకన్నా రెండు ప్రక్రియలు సమాంతరంగా కొనసాగితే సమయం ఆదా అవుతుందన్న ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. అయితే రికార్డుల పరిష్కార ప్రక్రియను జాగ్రత్తగా చేయాలని, తాము సూచించిన ఫార్మాట్‌లో, ఆర్‌ఓఆర్ చట్టాలకు అనుగుణంగానే పూర్తి చేసి భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూసుకోవాలని ప్రభుత్వం రెవెన్యూ యంత్రాం గానికి సూచించింది.
ఇందుకు కావాల్సిన సాఫ్ట్‌వేర్‌ను కూడా శనివారం నుంచే అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేసింది. దీంతో అన్ని జిల్లాల్లో ఇప్పటివరకు పరిశీలన పూర్తయిన సర్వే నంబర్లలోని సమస్యల పరిష్కారం ప్రారంభం కానుంది. ఇప్పటివరకు గుర్తించిన తప్పొప్పులు 29 శాతం ఉండగా అందులో 20–25 శాతం వరకు సరిచేయగలమని గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు ధీమా వ్యక్తం చేసినట్టు సమాచారం. కోర్టు కేసులున్న భూములను మినహాయిస్తే 1–2 శాతం భూముల రికార్డుల ప్రక్షాళనపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వారు చెప్పినట్టు రెవెన్యూ వర్గాలంటున్నాయి.
డిసెంబర్ 15–31 వరకు సంక్లిష్ట రికార్డుల సవరణ...
వాస్తవానికి భూ రికార్డుల ప్రక్షాళన నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు కొనసాగనుంది. అయితే డిసెంబర్ 15 వరకే రికార్డుల పరిశీలన చేపట్టి మిగిలిన 15 రోజులపాటు సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. అయితే సాధారణ సమస్యల పరిష్కారం ఇప్పుడే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సంక్లిష్టంగా ఉన్న రికార్డులను డిసెంబర్ 15 నుంచి పరిష్కరించాలని జిల్లా యంత్రాంగాలకు సూచించింది. సర్వే అవసరమైన భూములు, ప్రైవేటు వ్యక్తుల మధ్య తీవ్ర విభేదాలున్న భూములను అప్పుడు పరిష్కరించాలని ఎస్పీ సింగ్ కలెక్టర్లను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment