జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ జాతీయ వాణిజ్య బ్యాంక్‌లతో పోటీ పడుతోంది. రైతుల బ్యాంక్‌గా అవతరించిన డీసీసీబీ రైతులతో పాటు ప్రజలకు బ్యాంక్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సాంకేతికపరంగా అభివృద్ధి దిశగా అడుగులు వేసింది. జిల్లా వ్యాప్తంగా జిల్లాలో 20 బ్రాంచ్‌లు కలిగి 177 మంది సిబ్బందితో లక్షలాది మంది రైతులు, ప్రజలకు విస్తృత సేవలు అందిస్తోంది.
నెల్లూరు (వీఆర్సీసెంటర్): వందేళ్ల చరిత్ర కలిగిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) నేడు నూతన సాంకేతికతను వినియోగించుకుని జిల్లా రైతులకు, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు శ్రీకారం చుట్టింది. మారుతున్న సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగించుకుని దేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంక్‌ల్లో ఒకటిగా డీసీసీబీ రైతులకు, ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు ఐడీఏ సాంకేతికతను వినియోగించుకుంటున్న డీసీసీబీ తాజాగా టీసీఎస్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకుంటూ మెరుగైన, త్వరితగతిన సేవలు అందిస్తోంది. ఈ నూతన సాఫ్ట్‌వేర్‌తో బ్యాంకు ఖాతాదారులు మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగించుకునే అవకాశం కూడా ఏర్పడనుంది.
రాష్ట్ర ప్రభుత్వం చేయూత
కరోనా విపత్కర సమయంలో డీసీసీబీ ఆశించిన స్థాయిలో సేవలు అందించలేకపోవడంతో బ్యాంక్ అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2020–21 ఆర్థిక సంవత్సరానికి రూ.33 కోట్లు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ.40 కోట్లు మెత్తం రూ.77 కోట్లు షేర్ క్యాపిటల్ అందించడంతో బ్యాంక్ ఆర్థికంగా నిలదొక్కుకుంది. రెండేళ్లలో రూ.వెయ్యి కోట్ల లావాదేవీలను అధిగమించి రూ.1,485 కోట్ల మేర వ్యాపార లావాదేవీల స్థాయికి పెరిగింది.
బ్యాంకు పురోగతి
2021–22లో డీసీసీబీ రూ.13.68 కోట్లు ఆదాయాన్ని గడించి అద్వితీయమైన పురోగతి సాధించింది. రూ.80 కోట్ల డిపాజిట్లు సేకరించడంతో మొత్తం రూ.397 కోట్లకు చేరింది. రూ.224 కోట్ల మేర రుణాలు అందించింది. మొత్తంగా రూ.1,485 కోట్ల లావాదేవీలకు పెరిగింది. జిల్లా లో డీసీసీబీ నూతనంగా 6 ఏటీఎం సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు, ఒక నూతన మొబైల్ ఏటీఎం వాహనాన్ని ఏర్పాటు చేసింది. రైతులకు బంగారు రుణాలు ఇచ్చేందుకు జిల్లాలోని కొత్తపాళెం, ఊసుగుంటపాళెం, ఆల్తూరుపాడు, లింగసముద్రం, పడుగుపాడు, తోటపల్లిగూడూరు సహకార సంఘాలకు స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేస్తోంది.
చదవండి: (అజీజ్ భాయ్ ఏ క్యా హై!)
బ్యాంకు ద్వారా రుణాలు
డీసీసీబీ ద్వారా జిల్లాలోని రైతాంగానికి, ఖాతా దారులకు వ్యక్తిగత రుణాల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3.72 కోట్లు అందించింది. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టుకుని రూ.కోటి రుణాలు అందించింది. రూ.2.30 కోట్లు హౌసింగ్, రూ.5.50 కోట్లు చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, రూ.19 కోట్లు 182 స్వయం సహాయక గ్రూపులకు రుణాల రూపంలో అందజేసింది. 134 సమష్టి భాగస్వామ్య బృందాలకు రూ.3 కోట్లు, వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలు రూ.6.50 కోట్లు అందిచడం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పీఎం స్వానిధి, జగనన్న తోడు పథకాల ద్వారా అర్హులైన వారికి రూ.10 కోట్లు రుణాలు అందిస్తోంది.
సీఎం సహకారంతో అభివృద్ధి
డీసీసీబీ అభివృద్ధికి రెండేళ్లుగా షేర్ క్యాపిటల్ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.77 కోట్లు ఆర్థిక సాయం అందించారు. ఆయన అందించిన సహాయంతో ఈ బ్యాంకు ఆర్థికంగా నిలదొక్కుకుంది. రానున్న కాలంలో బ్యాంకు మరింత అభివృద్ధి పథంలో పయనిచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం. జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, శాసనసభ్యులు, జిల్లా అధికారుల సూచనలతో రాష్ట్రంలో నెల్లూరు డీసీసీబీని అగ్రగామిగా నిలిచేలా కృషి చేస్తా.
– కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, డీసీసీబీ చైర్మన్
మెరుగైన సేవలు అందిస్తాం
డీసీసీబీలో నూతనంగా ఏర్పాటు చేసిన టీసీఎస్ సాఫ్ట్‌వేర్ ద్వారా రైతులకు, ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు వీలు పడింది. ఎస్‌ఓడీ రుణాలతో పాటు తక్కువ వడ్డీకే గృహ రుణాలు, ఎస్టీ లోన్లను విరివిగా ఇస్తున్నాం. రైతులకు స్వల్పకాలిక, దీర్ఘాకాలిక రుణాలను అందిస్తూ , జిల్లాలో రైతుల మన్ననలను పొందుతోంది
– డాక్టర్ శంకర్‌బాబు, సీఈఓ
Comments
Please login to add a commentAdd a comment