సాక్షి, అమరావతి: చిట్ ఫండ్ కంపెనీల కార్యకలాపాలు, లావాదేవీలన్నీ ఇకపై ఆన్‌లైన్‌లో కనిపించనున్నాయి. ప్రస్తుతం చిట్ ఫండ్ కంపెనీల గురించి తెలుసుకోవడం చాలా కష్టమైన పని. ఆ కంపెనీలు చెబితేనో, లేకపోతే చిట్స్ రిజిస్ట్రార్ ద్వారానో కొంత సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. కంపెనీలు తమ వివరాలను ప్రతి నెలా మాన్యువల్‌గా చిట్స్ రిజిస్ట్రార్ ఆఫీసులకు సమర్పిస్తున్నాయి. ఫైళ్ల ద్వారానే ఇవన్నీ జరుగుతుండటంతో రోజువారీగా ఆ కంపెనీల పనితీరును పరిశీలించడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మాన్యువల్ విధానంతోపాటు ఆన్‌లైన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయించింది.
సంబంధిత కంపెనీల పనితీరు ప్రజలందరికీ తెలిసేలా వాటి వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరచాలని నిర్దేశించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. 13 జిల్లా కేంద్రాల్లో ఉన్న చిట్స్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో దీనిని అనుసంధానం చేసింది. ఆయా జిల్లాల్లో రిజిస్టరైన చిట్‌ఫండ్ కంపెనీలు మాన్యువల్‌గా సమర్పించిన వివరాలను కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారా ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యాలయాల్లో దీనిని పరీక్షిస్తున్నారు. 15 నుంచి 20 రోజులపాటు టెస్టింగ్ పీరియడ్‌లో వచ్చిన సమస్యలను పరిశీలించి వాటిని పరిష్కరించేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు, చేర్పులు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇవన్నీ పూర్తి చేసి ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి ఆన్‌లైన్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకొస్తారు.
520కి పైగా చిట్‌ఫండ్ కంపెనీలు
రాష్ట్రంలో ప్రస్తుతం 520కి పైగా చిట్‌ఫండ్ కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. ఆ కంపెనీలు నడుపుతున్న చిట్లు, వాటి చందాదారులు, ప్రతి నెలా వాటిలో జరుగుతున్న వేలం, చిట్టీ ఎవరు పాడుకున్నారు, ఎంతకి పాడారు, చిట్స్ నుంచి బయటకు వెళుతున్న వారు, కొత్తగా చేరుతున్న వారు, ఆ కంపెనీల టర్నోవర్ వంటి వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలి. కొత్తగా ప్రవేశపెట్టే ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా చిట్ ఫండ్ కంపెనీలు ఎప్పటికప్పుడు వివరాలు సమర్పిస్తున్నాయా లేదా? ఏవైనా తేడాలున్నాయా? వంటి వివరాలు క్షణాల్లో తెలిసిపోతాయి. తద్వారా కంపెనీల పనితీరును పర్యవేక్షించడం సులభమవుతుంది. ఆ కంపెనీల్లో చిట్లు కడుతున్న వారు, కొత్తగా కట్టాలనుకునే వారు వెబ్‌సైట్‌లో వాటి పనితీరును తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల చిట్ ఫండ్ కంపెనీలపై పూర్తిస్థాయి నిఘా ఉంటుంది. ఆ కంపెనీలు చేసే మోసాలను నివారించే అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు.
పారదర్శకత కోసం కొత్త వ్యవస్థ
చిట్‌ఫండ్ కంపెనీల సమాచారం అంతా ఆన్‌లైన్‌లో ఉండేలా కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. దీనివల్ల అంతా పారదర్శకంగా ఉంటుంది. చిట్‌ఫండ్ కంపెనీలు చేసే మోసాలు కూడా తగ్గుతాయి. నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నాం.
– ఎంవీ శేషగిరిబాబు, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ
ఇవీ చదవండి:
ఏపీ: సర్కారు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు రెట్టింపు
6న అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు
Comments
Please login to add a commentAdd a comment