Chit fund fraud
-
చిట్‌ఫండ్ అక్రమాలు బట్టబయలు
సాక్షి, అమరావతి: చిట్‌ఫండ్ కంపెనీల ముసుగులో జరుగుతున్న అక్రమాలు, మోసాలు బట్టబయలయ్యాయి. రాష్ట్రంలోని అనేక కంపెనీలు చిట్ల పేరుతో సామాన్యులు చెమటోడ్చి సంపాదించుకున్న సొమ్మును దుర్వినియోగం చేస్తున్నట్లు స్పష్టమైంది. చిట్‌ఫండ్ కంపెనీలపై జిల్లాల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తుండడంతో ఇటీవల రిజిస్ట్రేషన్లశాఖ రాష్ట్రవ్యాప్తంగా పలు కంపెనీల్లో తనిఖీలు చేసింది. జీఎస్టీ, పోలీసు అధికారులను కూడా తనిఖీ బృందాల్లో ఉంచి ఆ కంపెనీల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ తనిఖీల్లో పలు కంపెనీల్లో అక్రమాలు, మోసాలు జరిగినట్లు గుర్తించారు. చాలా కంపెనీలు చిట్స్ ద్వారా వసూలు చేసిన డబ్బును ఇతర కార్యకలాపాలకు మళ్లిస్తున్నట్లు గుర్తించారు. పలు కంపెనీలు చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆ డబ్బును వడ్డీలకు తిప్పుతున్నట్టు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినట్టు స్పష్టమైంది. కొన్ని కంపెనీలు వసూలు చేసిన చిట్స్ డబ్బును తమ అనుబంధ కంపెనీలకు మళ్లించి వ్యాపారం చేసుకుంటున్నట్లు తేలింది. చిట్ల రికార్డులు, ఖాతాలు కూడా సరిగ్గా నిర్వహించడం లేదని వెల్లడైంది. చిట్స్ పాడుకున్నవారికి వాటి కాలం తీరిన తర్వాత కూడా చెల్లించని ఘటనలు లెక్కలేనన్ని ఉన్నట్లు తెలిసింది. అనుమతులు లేకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తూ కొన్ని కంపెనీలు ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నట్టు తేలింది. చిట్లు పాడిన తర్వాత, గ్యారెంటీల ప్రక్రియ ముగిసేలోపు ఆ డబ్బును ప్రత్యేక బ్యాంకు ఖాతాలకు కాకుండా వేరేరకంగా వినియోగించుకున్నట్లు వెల్లడైంది. కొన్నిచోట్ల ప్రత్యేక ఖాతాల్లో ఉంచిన డబ్బును అదేరోజు వెనక్కి తీసుకున్న సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే తాము నిర్వహిస్తున్న చిట్లపై ప్రభుత్వానికి తప్పుడు ఓచర్లు సమర్పిస్తున్నట్టు తేలింది. నగదు నిర్వహణలో తీవ్ర ఉల్లంఘనలు జరిగాయి. చిట్ల డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేయకపోవడం, ఆ డబ్బుకు సంబంధించి నగదు రశీదులు.. వోచర్లు ఇవ్వకపోవడాన్ని తనిఖీ అధికారులు గుర్తించారు. కొన్ని లావాదేవీలపై నేరుగా ఆదాయపన్ను శాఖ పెనాల్టీ పడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. జీఎస్టీ చట్టాన్ని కూడా చిట్‌ఫండ్ కంపెనీలు ఉల్లంఘిస్తున్నట్టు తేలింది. తనిఖీల్లో గుర్తించిన అంశాలతో స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అక్రమాలు జరిగిన కంపెనీలు, వాటి వివరాలను అందులో పొందుపరిచారు. వాటి ఆధారంగా అక్రమాలు జరిగిన కంపెనీలపై చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. -
చిట్ ఫండ్స్: లావాదేవీలను ఆన్లైన్లో నమోదు చేయాల్సిందే..
సాక్షి, అమరావతి: చిట్ ఫండ్ కంపెనీల కార్యకలాపాలు, లావాదేవీలన్నీ ఇకపై ఆన్లైన్లో కనిపించనున్నాయి. ప్రస్తుతం చిట్ ఫండ్ కంపెనీల గురించి తెలుసుకోవడం చాలా కష్టమైన పని. ఆ కంపెనీలు చెబితేనో, లేకపోతే చిట్స్ రిజిస్ట్రార్ ద్వారానో కొంత సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. కంపెనీలు తమ వివరాలను ప్రతి నెలా మాన్యువల్‌గా చిట్స్ రిజిస్ట్రార్ ఆఫీసులకు సమర్పిస్తున్నాయి. ఫైళ్ల ద్వారానే ఇవన్నీ జరుగుతుండటంతో రోజువారీగా ఆ కంపెనీల పనితీరును పరిశీలించడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మాన్యువల్ విధానంతోపాటు ఆన్లైన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయించింది. సంబంధిత కంపెనీల పనితీరు ప్రజలందరికీ తెలిసేలా వాటి వివరాలను వెబ్సైట్లో పొందుపరచాలని నిర్దేశించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. 13 జిల్లా కేంద్రాల్లో ఉన్న చిట్స్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో దీనిని అనుసంధానం చేసింది. ఆయా జిల్లాల్లో రిజిస్టరైన చిట్‌ఫండ్ కంపెనీలు మాన్యువల్‌గా సమర్పించిన వివరాలను కొత్త సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యాలయాల్లో దీనిని పరీక్షిస్తున్నారు. 15 నుంచి 20 రోజులపాటు టెస్టింగ్ పీరియడ్‌లో వచ్చిన సమస్యలను పరిశీలించి వాటిని పరిష్కరించేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు, చేర్పులు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇవన్నీ పూర్తి చేసి ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి ఆన్లైన్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకొస్తారు. 520కి పైగా చిట్‌ఫండ్ కంపెనీలు రాష్ట్రంలో ప్రస్తుతం 520కి పైగా చిట్‌ఫండ్ కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. ఆ కంపెనీలు నడుపుతున్న చిట్లు, వాటి చందాదారులు, ప్రతి నెలా వాటిలో జరుగుతున్న వేలం, చిట్టీ ఎవరు పాడుకున్నారు, ఎంతకి పాడారు, చిట్స్ నుంచి బయటకు వెళుతున్న వారు, కొత్తగా చేరుతున్న వారు, ఆ కంపెనీల టర్నోవర్ వంటి వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలి. కొత్తగా ప్రవేశపెట్టే ఆన్లైన్ వ్యవస్థ ద్వారా చిట్ ఫండ్ కంపెనీలు ఎప్పటికప్పుడు వివరాలు సమర్పిస్తున్నాయా లేదా? ఏవైనా తేడాలున్నాయా? వంటి వివరాలు క్షణాల్లో తెలిసిపోతాయి. తద్వారా కంపెనీల పనితీరును పర్యవేక్షించడం సులభమవుతుంది. ఆ కంపెనీల్లో చిట్లు కడుతున్న వారు, కొత్తగా కట్టాలనుకునే వారు వెబ్సైట్లో వాటి పనితీరును తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల చిట్ ఫండ్ కంపెనీలపై పూర్తిస్థాయి నిఘా ఉంటుంది. ఆ కంపెనీలు చేసే మోసాలను నివారించే అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు. పారదర్శకత కోసం కొత్త వ్యవస్థ చిట్‌ఫండ్ కంపెనీల సమాచారం అంతా ఆన్లైన్లో ఉండేలా కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. దీనివల్ల అంతా పారదర్శకంగా ఉంటుంది. చిట్‌ఫండ్ కంపెనీలు చేసే మోసాలు కూడా తగ్గుతాయి. నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నాం. – ఎంవీ శేషగిరిబాబు, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇవీ చదవండి: ఏపీ: సర్కారు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు రెట్టింపు 6న అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు -
చీటీల పేరుతో రూ. 2 కోట్ల టోకరా!
సాక్షి, విశాఖపట్నం: చీటీల పేరుతో నగరంలో భారీ మోసం జరిగింది. ఓ ప్రబుద్ధుడు చీటీల పేరుతో ప్రజల్ని నమ్మించి సుమారు రెండు కోట్ల రూపాయలు టోకరా వేశాడు. దీంతో 140 కుటుంబాలు లబోదిబోమంటున్నాయి. కొణతాల లక్ష్మీమాధురీ, అప్పలరాజు దంపతులు చంద్రానగర్‌లో నివాసముంటున్నారు. అప్పలరాజు రైల్వే ఉద్యోగి కావడంతో స్థానికులు, బంధువులు అతని వద్ద నమ్మకంగా చీటీ వేశారు. దీంతో రైల్వేలో సీనియర్ కమర్షియల్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న అప్పలరాజు కోట్ల రూపాయలు వసూలు చేసి చేతులెత్తేశాడు. ఇటీవల భార్య లక్ష్మీమాధురీ మరణంతో చెల్లింపుల బాధ్యత తీసుకున్న అప్పలరాజు నెలలు గడుస్తున్నా పైసా కూడా చెల్లించలేదు. డబ్బుల కోసం నిలదీయగా అప్పలరాజు రాత్రికి రాత్రే ఇల్లు మారిపోయినట్టు తెలిసింది. అతని వద్ద చీటీ వేసినవారు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. -
పరిగిలో ఘరానా మోసం
సాక్షి, వికారాబాద్: అతి తక్కువ ధరలకే హోంనీడ్స్ ఇస్తామని చెప్పి ఘరానమోసం చేసిన ఘటన జిల్లాలోని పరిగిలో చోటుచేసుకుంది. హోంనీడ్స్ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసగాళ్లు రాత్రికిరాత్రే బిచాణా ఎత్తేశారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన వ్యక్తులు పరిగిలో హోంనీడ్స్ ఇచ్చే పేరుతో ‘రోజా ట్రేడర్స్’ను నిర్వస్తున్నారు. వస్తువు విలువలో సగం డబ్బులు చెల్లించి.. వారం రోజుల తర్వాత తీసుకుంటే సగం ధరకే ఆ వస్తువులు ఇస్తామని మోసగాళ్లు నమ్మబలికారు. దీంతో వారి మాటలు నమ్మి వినియోగదారులు వేల రూపాయలు చెల్లించారు. వినియోగదారులు చెల్లించిన డబ్బులను తీసుకున్న రోజా ట్రేడర్స్ యాజమాన్యం రాత్రికిరాత్రే పరారైంది. ఈ విషయం తెలుసుకున్న బాధితులు స్థానిక పరిగి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తామని తెలిపారు. బాధితులు దాదాపు రూ.కోటి వరకు మోస పోయినట్లు అనుమానం వ్యక్తం అవుతోంది. -
చీటీల పేరుతో మోసం చేసిన జంట అరెస్ట్
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని నర్సాపురంలో చిట్‌ఫండ్ పేరుతో సుమారు రూ. 6 కోట్లు టోకరా వేసి పరారైన కంచన రమేష్, దివ్య దంపతులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ వ్యవహరంలో మొదటి నుంచి వారికి సహకారం అందిస్తున్న సమీప బంధవు సూరత్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు రూ. 20 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చిట్ ఫండ్‌తో పాటు అధిక వడ్డీ ముసుగులో జిల్లాకి చెందిన పలువురిని మోసానికి గురి చేశారు. అంతేకాకుండా తమ స్నేహితులు, సన్నిహితుల నుంచి బంగారం తీసుకుని చివరికి వారికి కూడా కుచ్చు టోపీ పెట్టారు. అయితే తిరిగి నగలు, నగదు అడిగే సరికి ఆ జంట మొఖం చాటేశారు. దీంతో పోలీసులను ఆశ్రయించిన బాధితులు తమకు న్యాయం చేయాలని కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి చేతిలో మోసపోయిన వారి సంఖ్య 60 మంది పైనే ఉంటుందని డీఎస్పీ నాగేశ్వర రావు మీడియాకు వెల్లడించారు. -
నమ్మకంగా నడిపించి.. నట్టేట ముంచి
శంకర్పల్లి : సంఘం పేరుతో చిట్టీలు, డిపాజిట్ చేయించుకొని రాత్రికి రాత్రి ఉడాయించిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధి తులిచ్చిన సమాచారం ప్రకారం... మండల కేంద్రంలో వీరభద్రియ సంఘం చాలా సంవత్సరాలుగా ఉంది. అందులోని సభ్యులు వీరభద్రియ సంఘం పేరు మీద చిట్టీల దందా చేసేవారు. చాలామంది రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు సంఘంలో డబ్బులు డిపాజిట్ చేసుకొని నెలనెలా వడ్డీ తీసుకునేవారు. ఎక్కువ వడ్డీ వస్తుండటంతో వీరభద్రియ సంఘంలో కోట్ల రూపాయల డిపాజిట్లు చేశారు. అయితే నెలనెలా చిట్టీల డబ్బులను సంఘం వారు వాడుకోవడంతోపాటు ఇతర కార్యక్రమాలకు ఉపయోగించేవారు. గత రెండేళ్లుగా సంఘంలో డిపాజిట్ చేసిన వారి డబ్బులు సరిగా ఇవ్వకపోవడం, చిట్టీ డబ్బులు లేపిన తరువాత సరిగా ఇవ్వకపోవడంతో తమ డబ్బులు ఇచ్చేయాలని డిపాజిట్‌దారులు ఒత్తిడి చేయడం ఎక్కవైంది. సంఘం సభ్యులు నేడు రేపు నెలా, రెండు నెలలు అంటూ కాలం గడిపారు. ఈ నేపథ్యం లో శుక్రవారం రాత్రి సమయంలో సంఘం సభ్యు లు ఎవరికీ చెప్పకుండా ఇళ్లు ఖాళీ చేసి సంఘానికి తాళం వేసి వెళ్లిపోయారు. ఉదయం సంఘానికి తాళం వేసి ఉండటం చూసిన డిపాజిట్ దారులు ఆందోళనకు దిగారు. పైసాపైసా కూడబెట్టి దాచుకున్న డబ్బులతో ఉడాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది సంఘం ముందు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూశారు. అయితే డబ్బులు సంఘంలో డిపాజిట్ చేసిన వారు ఒక్కరూ పోలీస్‌స్టేషకు వెళ్లి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. అయితే సంఘంలో ఎంత మంది ఎంతెంత డబ్బులు డిపాజిట్ చేశారనే వివరాలు పోలీసులకు అందిన ఫిర్యాదులను బట్టే తెలియరానున్నాయి. -
వీవీఐపీ గ్యాలరీలో చిట్‌ఫండ్ నిందితుడు
భువనేశ్వర్: చిట్‌ఫండ్ మోసాల్లో నిందితునిగా తెరపైకి వచ్చిన శుభంకర్ నాయక్ ఇటీవల కటక్ బారాబటి స్టేడియంలో ముగిసిన టీ–20 క్రికెట్ మ్యాచ్‌ను పురస్కరించుకుని ప్రత్యక్షమయ్యారు. మ్యాచ్‌ను తిలకించేందుకు విశిష్ట, అతిరథ, మహారథుల వర్గానికి కేటాయించిన గ్యాలరీలో ఆయన ప్రత్యక్షం కావడం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. చిట్‌ఫండ్ మోసాల దర్యాప్తు, విచారణలో నిందిత శుభంకర్ నాయక్‌కు రాజకీయ, పాలన వగైరా రంగాల్లో అతిరథ మహారథులతో ప్రత్యక్ష లింకులు ఉన్నట్లు ఆరోపణ. కోర్టు మంజూరు చేసిన బెయిల్‌తో జైలు నుంచి వచ్చిన శుభంకర్ నాయక్ ఈ విశిష్ట వర్గాలతో చెలిమి యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తాజా సంఘటన స్పష్టం చేస్తోంది. మంత్రులు, సర్వోన్నత అధికారులు, క్రికెటర్ల కుటుంబీకులు ఇతరేతర వర్గాలకు కేటాయించి ఓసీఏ బాక్స్ గ్యాలరీలో శుభంకర్ నాయక్ కూడా ఆసీనులయ్యారు. ఈ సంఘటనపట్ల క్రికెట్ మ్యాచ్ నిర్వాహక వర్గం ఒడిశా క్రికెట్ అసోసియేషన్ స్పందించింది. కోట్లాది రూపాయల మోసాల్లో నిందితుడు? శుభంకర్ నాయక్ పేరు గల వ్యక్తులకు బాక్స్ గ్యాలరీ టికెట్ జారీ కానట్లు ఈ సంస్థ వర్కింగ్ చైర్మన్ ధీరేన్ పొలై తెలిపారు. వేరొకరికి జారీ చేసిన టికెట్‌తో ఆయన ప్రవేశించి ఉంటారనే సందేహాన్ని వ్యక్తం చేశారు. క్రికెట్ మ్యాచ్ టికెట్లు బదిలీ చేసేందుకు వీలు కాని పరిస్థితుల్లో శుభంకర్ నాయక్‌ను బాక్స్ గ్యాలరీకి అనుమతించడంపై కూడా సందేహాల్ని రేకెత్తుతున్నాయి. టీ20 క్రికెట్మ్యాచ్ చిట్‌ఫండ్ మోసాల వ్యవహారాలను కొత్త మలుపు తిప్పింది. సీ–షోర్ గ్రూపు చిట్‌ఫండ్ కోట్లాది రూపాయల మోసాల్లో శుభంకర్ నాయక్ పాత్రధారిగా ఆరోపణ. రూ.2 లక్షల బాండు, సమాన విలువతో ఇద్దరు పూచీదార్ల హామీతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో శుభంకర్ నాయక్ ఈ ఏడాది ఆగస్టులో జైలు నుంచి విడుదలయ్యారు. 2014వ సంవత్సరం నవంబరు 18వ తేదీన సీ–షోర్ గ్రూపు చిట్‌ఫండ్ మోసాల వ్యవహారాల్లో నిందితునిగా ఆయనను సీబీఐ దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. -
బోర్డు తిప్పేసిన చిట్‌ఫండ్ కంపెనీ
అఫ్జల్‌గంజ్‌లో శుక్రవారం రామ్రాజ్ చిట్‌ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. సుమారు రూ. 3 కోట్లకు పైగా కుచ్చు టోపీ పెట్టింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో బాధితులు అంతకంతకూ పెరుగుతున్నారు. ఈ విషయమై చందాదారులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చిట్టీల పేరుతో రూ.50 లక్షలు కుచ్చుటోపీ
చిట్టీల పేరుతో ఓ వ్యక్తి సుమారు రూ.50 లక్షల వరకు టోకరా వేశాడు. బాధితులు శనివారం హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హయత్‌నగర్ డివిజన్లోని పద్మావతికాలనీలో నివసించే అంజిరెడ్డి గత పదేళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కొంత కాలంగా చిట్టీ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడు. శనివారం ఉదయం బాధితులు అంజిరెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను నిలదీసి గొడవపడ్డారు. తాను చిట్టీలలో నష్టపోయానని బుకాయించడంతో బాధితులు హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 25 మంది బాధితులకు రూ.50 లక్షల వరకు చెల్లించాల్సి ఉందని ఈ మేరకు అంజిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా డబ్బుల కోసం అంజిరెడ్డి ఇంటికి వెళ్లిన బాధితులు అతనిపై దాడి చేయగా అంజిరెడ్డి వారిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిట్ ఫండ్ పేరు తో కుచ్చుటోపీ
నమ్మకంగా ఉంటూ చిట్టీలు నడుపుతున్న నిర్వాహకులు.. వినియోగదారులకు సంబంధించిన రూ.కోటి వసూలు చేసుకుని కనిపించకుండా పోయిన ఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మారుతి చిట్‌ఫండ్ సంస్థ కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో చిట్టీలు నిర్వహిస్తోంది. అయితే, ఇటీవల చిట్టీలు పాడుకున్న వారికి నిర్వాహకులు డబ్బులు ఇవ్వలేదు. గత రెండు రోజులుగా నిర్వాహకులు సంస్థ కార్యాలయానికి తాళం వేసి ఉడాయించారు. అనుమానం వచ్చిన బాధితులు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో సుమారు 50 మంది బాధితులు నేరేడ్మెట్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చిట్ ఫండ్స్ డైరెక్టర్లు సునీల్ కుమార్, పుష్పరాజ్, ప్రదీప్ కుమార్ లపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఖాతాదారుల వద్ద సుమారు రూ.కోటి వసూలు చేసి ఉంటారని భావిస్తున్నారు. -
చిట్టిల పేరుతో ఘరానా మోసం
చిట్టిల పేరుతో ఓ మహిళ జనానికి రూ. కోటి కుచ్చు టోపి పెట్టి.... అర్థరాత్రి తట్టా బుట్టా సర్ధుకుని ఉడాయించింది. ఆ ఘటన గుంటూరు జిల్లా బాపట్లలోని రెల్లి కాలనీలో చోటు చేసుకుంది. రెల్లి కాలనీలో నివసిస్తున్న నాంచరమ్మ అనే మహిళ స్థానిక మహిళలతో ఎంతో చనువు, నమ్మకంగా ఉంటూ వారితో చీటీలు కట్టించుకుంటుంది.ఆ క్రమంలో కొంత కాలం వరకు సక్రమంగా చిట్టిల డబ్బులు చెల్లించేది. కొంతకాలం తర్వాత నగదు చెల్లించాలంటూ చిట్టిల కట్టిన సదరు మహిళలు వస్తుండటంతో తర్వాత ఇస్తానంటూ చెబుతు వస్తుంది. దాంతో చిట్టి వేసిన మహిళలు తమకు డబ్బు చెల్లించాలంటూ ఆమెపై ఒత్తిడి చేశారు. దాంతో గత అర్థరాత్రి ఆమె ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయింది. శుక్రవారం ఆ విషయాన్ని గమనించిన బాధితులు లబోదిబోమంటూ బాపట్ల పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.