భువనేశ్వర్: చిట్‌ఫండ్ మోసాల్లో నిందితునిగా తెరపైకి వచ్చిన శుభంకర్ నాయక్ ఇటీవల కటక్ బారాబటి స్టేడియంలో ముగిసిన టీ–20 క్రికెట్ మ్యాచ్‌ను పురస్కరించుకుని ప్రత్యక్షమయ్యారు. మ్యాచ్‌ను తిలకించేందుకు విశిష్ట, అతిరథ, మహారథుల వర్గానికి కేటాయించిన గ్యాలరీలో ఆయన ప్రత్యక్షం కావడం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. చిట్‌ఫండ్ మోసాల దర్యాప్తు, విచారణలో నిందిత శుభంకర్ నాయక్‌కు రాజకీయ, పాలన వగైరా రంగాల్లో అతిరథ మహారథులతో ప్రత్యక్ష లింకులు ఉన్నట్లు ఆరోపణ. కోర్టు మంజూరు చేసిన బెయిల్‌తో జైలు నుంచి వచ్చిన శుభంకర్ నాయక్ ఈ విశిష్ట వర్గాలతో చెలిమి యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తాజా సంఘటన స్పష్టం చేస్తోంది. మంత్రులు, సర్వోన్నత అధికారులు, క్రికెటర్ల కుటుంబీకులు ఇతరేతర వర్గాలకు కేటాయించి ఓసీఏ బాక్స్ గ్యాలరీలో శుభంకర్ నాయక్ కూడా ఆసీనులయ్యారు. ఈ సంఘటనపట్ల క్రికెట్ మ్యాచ్ నిర్వాహక వర్గం ఒడిశా క్రికెట్ అసోసియేషన్ స్పందించింది.
కోట్లాది రూపాయల మోసాల్లో నిందితుడు?
శుభంకర్ నాయక్ పేరు గల వ్యక్తులకు బాక్స్ గ్యాలరీ టికెట్ జారీ కానట్లు ఈ సంస్థ వర్కింగ్ చైర్మన్ ధీరేన్ పొలై తెలిపారు. వేరొకరికి జారీ చేసిన టికెట్‌తో ఆయన ప్రవేశించి ఉంటారనే సందేహాన్ని వ్యక్తం చేశారు. క్రికెట్ మ్యాచ్ టికెట్లు బదిలీ చేసేందుకు వీలు కాని పరిస్థితుల్లో శుభంకర్ నాయక్‌ను బాక్స్ గ్యాలరీకి అనుమతించడంపై కూడా సందేహాల్ని రేకెత్తుతున్నాయి. టీ20 క్రికెట్‌మ్యాచ్ చిట్‌ఫండ్ మోసాల వ్యవహారాలను కొత్త మలుపు తిప్పింది. సీ–షోర్ గ్రూపు చిట్‌ఫండ్ కోట్లాది రూపాయల మోసాల్లో శుభంకర్ నాయక్ పాత్రధారిగా ఆరోపణ. రూ.2 లక్షల బాండు, సమాన విలువతో ఇద్దరు పూచీదార్ల హామీతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో శుభంకర్ నాయక్ ఈ ఏడాది ఆగస్టులో జైలు నుంచి విడుదలయ్యారు. 2014వ సంవత్సరం నవంబరు 18వ తేదీన సీ–షోర్ గ్రూపు చిట్‌ఫండ్ మోసాల వ్యవహారాల్లో నిందితునిగా ఆయనను సీబీఐ దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment