ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా పెండింగ్‌లో పెట్టిన పార్ట్–బీ భూముల నిగ్గు తేల్చడంలో ప్రభుత్వం ముందడుగు వేయడం లేదు. అక్కడక్కడా కొన్నింటికి పరిష్కారమార్గం చూపినా ఇప్పటికీ లక్షలాది ఖాతాల వ్యవహారం కొలిక్కి రాలేదు. 2017 సెప్టెంబర్ 15న రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ప్రతి భూమికి హక్కుదారు ఎవరనేది తేల్చాలని నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ రికార్డులను పరిశీలించి కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేసింది. అయితే, ప్రభుత్వ భూములు/ఆస్తులు, అటవీ, వక్ఫ్, దేవాదాయ తదితర భూములతోపాటు వ్యవసాయేతర భూములను పార్ట్–బీ కేటగిరీలో చేర్చింది. ఇదే అదనుగా వివాదాస్పద, అభ్యంతరకర భూములను రెవెన్యూ యంత్రాంగం బీ కేటగిరీలో జొప్పించింది. రైతులకు పెట్టుబడి సాయం (రైతుబంధు) పథకానికి కొత్త పట్టాదార్ పాస్‌పుస్తకాలను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించడంతో ఆగమేఘాల మీద ఏ–కేటగిరీ భూముల విషయాన్ని తేల్చేసింది.
పెండింగ్‌లో 7.96 లక్షల ఖాతాలు!
రాష్ట్రవ్యాప్తంగా బీ–కేటగిరీలో 7,96,792 ఖాతాలున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 4,56,155 ఖాతాలకు పాస్ పుస్తకాలు జారీ చేయాలని నిర్ణయించినా డిజిటల్ సంతకాలు కాకపోవడంతో పెండింగ్‌లో పడ్డాయి. దీంతో గత ఏడాదిన్నరగా ఈ భూముల యజమానులు తహసీల్‌దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. మొత్తం 7.96 లక్షల ఖాతాల్లోని 69,85,478 ఎకరాల మేర విస్తీర్ణానికి సంబంధించిన పార్ట్–బీ భూములపై అస్పష్టత నెలకొనడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా ప్రభుత్వ భూముల పొరుగున ఉన్న ఖాతాలకే ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీనికితోడు చాలాచోట్ల పట్టణీకరణతో వ్యవసాయ భూములు కాస్తా స్థిరాస్తి రంగం వైపు మళ్లాయి. వ్యవసాయేతర అవసరాలకు మళ్లినా భూమార్పిడి జరగడంలేదు. దీంతో నాలా(నాన్ అగ్రికల్చర్ లెవీ అసెస్‌మెంట్) రుసుం రాకుండా పోయింది. భూరికార్డుల ప్రక్షాళనలో గుర్తించిన ఇలాంటి భూములను కూడా పెండింగ్‌లో పెట్టారు. ఈ అంశంలో కొన్ని భూములు అకారణంగా ఇరుక్కుపోయాయి. ఉదాహరణకు ఒక సర్వే నంబర్‌లోని 10 ఎకరాల భూమిలో నాలుగు ఎకరాలను నాలా కింద మార్చుకుని స్థిరాస్తి రంగంలోకి మళ్లిస్తే అధికారులు ఆ సర్వే నంబర్‌ను పూర్తిగా నాలా కింద చేర్చారు. సదరు సర్వే నంబర్‌లో వ్యవసాయ అవసరాలకు వినియోగిస్తున్న భూములకు కూడా పాసుపుస్తకాలు ఇవ్వడం లేదు. వీటితోపాటు గతంలో వక్ఫ్, దేవాదాయ భూములను పరిరక్షించిన అనుభవదారులకు కూడా పాసుపుస్తకాలు నిలిపివేశారు. ఈ భూములను ఆయా శాఖలు గెజిట్ ద్వారా తమ ఖాతాలోకి వేసుకుని పట్టాదారుగా మారిపోయాయి. దీంతో ఇప్పటివరకు అనుభవంలో ఉన్నవారికి పాసుపుస్తకాలు ఇవ్వకుండా నిలిపివేశారు. పట్టా భూముల్లో ప్రభుత్వ ఆస్తులు ఉండడంతో వాటిని కూడా పార్ట్–బీ కింద చేర్చారు. దీంతో సదరు రైతాంగం లబోదిబోమంటోంది. ఈ భూముల హక్కులు కోల్పోతే న్యాయపరమైన చిక్కులు వస్తాయని భావిస్తున్న సర్కారు త్వరగా తేల్చకుండా కాలయాపన చేస్తోంది.
పార్ట్–బీ కేటగిరీలో చేర్చిన భూములు ఇవే..
భూవిస్తీర్ణంలో తేడాలున్నవి కోర్టు కేసులతో పెండింగ్‌లో ఉన్నవి అన్నదమ్ముల భూపంపకాల్లో విస్తీర్ణంలో వ్యత్యాసం ఉన్నవి అసైన్డ్ భూములకు ఇచ్చిన పట్టాల్లో ఉన్న భూమికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడాలున్నవి ఫారెస్టు, రెవెన్యూ శాఖల మధ్య వివాదాలున్నవి ఫారెస్టు, పట్టా భూముల మధ్య వివాదాలున్నవి ఇతరుల అనుభవంలో ఉన్న వక్ఫ్, దేవాదాయ శాఖల భూములు
Comments
Please login to add a commentAdd a comment