![Those Raithwari Pattas are valid - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/22/lands.jpg.webp?itok=lo0Z4-eh)
సాక్షి, అమరావతి : గ్రామ సర్వీసు ఈనాం భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ భూములపై ఉన్న ఆంక్షలను తొలగించేందుకు ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అందుకనుగుణంగా గ్రామ సర్విసు ఈనాం భూములకు జారీ చేసిన రైత్వారీ పట్టాలు చెల్లుబాటవుతాయని రెవెన్యూ శాఖ తెలిపింది.
ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ జీఓ నంబర్ 310 జారీ చేశారు. ఈ భూములకు గతంలో జారీ చేసిన రైత్వారీ పట్టాదారుల పేర్లను అన్ని రికార్డుల్లోకి ఎక్కించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. పట్టాదారులు లేని పక్షంలో వారి వారసులు (లీగల్ హైర్స్), లేకపోతే వారి నుంచి కొనుగోలు చేసిన వ్యక్తుల పేర్లను రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు.
రీ సర్వే రికార్డుల్లోనూ వారి పేర్లను చేర్చాలని స్పష్టం చేశారు. దీంతో 1.13 లక్షల మందికి చెందిన 1.68 లక్షల ఎకరాలు గ్రామ సర్విసు ఈనాం భూములు 22 (ఎ) జాబితా నుంచి తొలగి, ఆ కుటుంబాలకు మేలు కలుగుతుంది.
ఈనాం భూముల చట్ట సవరణతో 22 (ఎ)లోకి సర్విసు ఈనాం భూములు
దశాబ్దాల క్రితం గ్రామానికి సేవ చేసే కుల వృత్తుల వారి జీవన భృతి కోసం ఈనాంగా భూములిచ్చారు. 1956 ఈనాం (రద్దు, రైత్వారీ పట్టాలుగా మార్పు) చట్టం ప్రకారం కొన్ని ఈనాం భూములు రద్దవగా, కొన్ని రైత్వారీ భూములుగా మారాయి. రైత్వారీ భూములకు అప్పట్లోనే రైత్వారీ పట్టాలు జారీ చేశారు. ఈనాందారులు తమ భూములను ఎవరికైనా అమ్ముకునే హక్కు కూడా ఈనాం చట్టం కల్పించింది. దీంతో ఆ భూములను కొన్న వారికి రక్షణ ఏర్పడింది.
అయితే గ్రామ సర్వీసు చేసిన వారికే కాకుండా ధా ర్మిక సంస్థలు, దేవాలయాల మనుగడ కోసం వాటికి ఈనాంగా భూములిచ్చారు. ఆ దేవాలయాల భూములు చాలావరకు ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఆ దేవాలయాల్లో ఏ సేవల కోసం భూమి ఇచ్చారో ఆ సేవలు కూడా ప్రస్తుతం లేవు. దీంతో వాటి రక్షణ కోసం 2013లో ఈనాం చట్టానికి సవరణలు చేశారు. దీని ప్రకారం ఈనాం భూములన్నింటిపైనా ఆంక్షలు విధించి వాటిని నిషేధిత జాబితా 22 (ఎ)లో చేర్చారు.
దీంతో దేవాలయాల ఈనాం భూములతోపాటు గ్రామ సర్విసు ఈనాం కింద పొందిన రైత్వారీ పట్టా భూములు కూడా 22 (ఎ) జాబితాలో చేరిపోయాయి. రాష్ట్రంలో భూముల రీ సర్వే జరుగుతున్న క్రమంలో గ్రామ సర్విసు ఈనాం భూములపై రైతుల నుంచి పెద్దఎత్తున వినతులు వచ్చాయి. రైత్వారీ పట్టాలు పొందిన వారి నుంచి తాము కొన్నామని, తమ పేర్లను రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కించడంలేదని, తమకు న్యాయం చేయాలని కోరారు.
ధార్మిక సంస్థల ఈనాం, సర్విసు ఈనాం భూముల మధ్య తేడా ఇదే
ఈ వినతులను పరిశీలించిన ప్రభుత్వం దేవాలయ, ధార్మిక సంస్థల ఈనాం, గ్రామ సర్వీసు ఈనాం భూముల మధ్య ఉన్న తేడాపై స్పష్టత ఇచ్చింది. ధా ర్మిక సంస్థల ఈనాం భూములను కేవలం ఆ దేవాలయాలు, అందులోని దేవుడి సేవల కోసం మాత్రమే ఇచ్చారు. అవి ఎప్పటికీ దేవాలయాలవే తప్ప వేరే వ్యక్తులు పొందే అవకాశం ఉండదు. గ్రామ సర్విసు ఈనాం భూములను అందరి మేలు కోసం పనిచేసిన కుల వృత్తుల వారికి (క్షురకులు, చాకలి, మంగలి వంటి వృత్తులు) ఇచ్చారు.
ఆ భూములు ఆ వ్యక్తులు, వారి వారసులకు వస్తాయి. ఇలా సర్వీసు చేసిన కుల వృత్తుల వారి సంఖ్య గ్రామాల్లో చాలా పెద్ద సంఖ్యలో ఉండడం వల్లే వారికి రైత్వారీ పట్టాలు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో 2013లో ఈనాం చట్టానికి చేసిన సవరణలు గ్రామ సర్వీసు ఈనాం భూములకు వర్తించవని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ భూములన్నింటినీ 22(ఎ) నుంచి తొలగించాలని, వారి పేర్లను రికార్డుల్లోకి ఎక్కించాలని జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment