నాకు వారి మాదిరిగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడు తోడుగా ఉండకపోవచ్చు. నాకు దేవుడి దయ, ఆశీర్వదించే ప్రజలు ఉన్నారు. ప్రతి అక్క, చెల్లెమ్మ, అన్న, తమ్ముడు, అవ్వ, తాత తోడుగా నిలబడతారన్న నమ్మకం ఉంది. వారు అబద్ధాలను, కుట్రలను, మీడియాను, దత్తపుత్రుడిని, వారి పొత్తులను నమ్ముకుంటే.. నేను దేవుడి దయను, అక్కచెల్లెమ్మల కుటుంబాలను నమ్ముకున్నాను. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా తీసుకోండి. మంచి జరిగుంటే జగనన్నకు తోడుగా నిలవండి. – సీఎం జగన్
ఆయన గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఇలా నాలుగేళ్లో, ఐదేళ్లో కాపురం చేసి.. ఎంతో కొంత డబ్బులిచ్చి విడాకులు ఇచ్చేసి.. మళ్లీ పెళ్లి చేసుకోవడం మొదలు పెడితే.. అలా మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటూ పోతే వ్యవస్థ పరిస్థితి ఏంటి? ఆడవాళ్ల మాన ప్రాణాలు ఏం కావాలి? అక్క చెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి? ఇలాంటి నాయకులు మనకు అవసరమా.. ఆలోచించండి.
ఎవరికీ మంచి చేసిన చరిత్ర లేని వారు, వెన్నుపోటు దారులు ఎన్నికల సమయంలో రంగు రంగుల మేనిఫెస్టోలు ఇస్తారు. వాగ్దానాలు చేస్తారు. ఎన్నికల తర్వాత వాటిని చెత్తబుట్టలో వేస్తారు. మళ్లీ ప్రజలు ప్రశ్నిస్తారేమోనని కనీసం వెబ్‌సైట్లలో కూడా కనిపించకుండా చేస్తారు. ఇలాంటి వారంతా దుష్టచతుష్టయంగా ఏర్పడ్డారు. మీ బిడ్డ మీద.. మన ప్రభుత్వం మీద.. మీ ప్రభుత్వం మీద యుద్ధం చేస్తారట? ఒక్క జగన్‌ను కొట్టడానికి ఇంతమంది ఏకం అవుతుండటం ఆశ్చర్యం వేస్తోంది.
రైతులకు భూ హక్కు పత్రాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, విజయవాడ: ‘ప్రజలకు మనం మంచి చేస్తుండటాన్ని జీర్ణించుకోలేని ఆ పెద్ద మనిషి (చంద్రబాబు).. తన దత్తపుత్రుడి (పవన్ కళ్యాణ్)తో ఎలా తిట్టించారో అందరం చూశాం. మనం మూడు రాజధానుల వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని మాట్లాడుతుంటే, కాదు కాదు.. మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చంటూ ఆయన గారు సెలవివ్వడమూ విన్నాం. మంచికి, మోసానికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో మును ముందు మరెన్నో కుట్రలు కనిపిస్తాయి. వాటిన్నింటినీ తిప్పికొట్టి.. ఏది న్యాయం, ఎవరిది ధర్మమో ఆలోచించండి. న్యాయం, ధర్మం వైపు నిలబడండి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
గురువారం ఆయన 22(ఏ)1 నిషేధిత భూముల సమస్యకు పరిష్కారం చూపుతూ, కృష్ణా జిల్లా అవనిగడ్డలో రైతులకు భూ హక్కు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనందరి ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి ఎంతో మేలు చేస్తుంటే దుష్టచతుష్టయం ఓర్వలేక దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సభలో సీఎం ఇంకా ఏమన్నారంటే..
►మీ గ్రామంలో మీ కళ్ల ఎదుటే కనిపిస్తున్న మార్పులను గమనించండి. గ్రామ సచివాలయాలు, అందులో 10 మంది ఉద్యోగులైన మన పిల్లలు మనకు సేవలు అందిస్తూ.. ఉత్సాహంగా చిరునవ్వుతో కనిపిస్తారు. ప్రతి 50 ఇళ్లకూ వలంటీర్ కనిపిస్తున్నారు. ప్రతి అడుగులోనూ మనకు మంచి చేస్తూ చేదోడు, వాదోడుగా ఉన్నాడు.
►వివక్ష చూపకుండా, లంచాలు అడగకుండా 1వ తారీఖునే సూర్యోదయం అయిన వెంటనే, అది ఆదివారమైనా, పండుగ అయినా ఇంటికి వచ్చి గుడ్‌మార్నింగ్ చెప్పి పెన్షన్ డబ్బు చేతిలో పెట్టి వెళ్తాడు.
►అదే గ్రామంలో విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ రైతులను చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థ కనిపిస్తోంది. మన కళ్లెదుటనే పారదర్శకంగా ఈ–క్రాప్ జరుగుతోంది. విత్తనాలు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కల్తీ లేకుండా అందిస్తున్నారు. పంట కొనుగోలు విషయంలో అండగా నిలుస్తున్నారు.
►మరో నాలుగు అడుగులు ముందుకేస్తే విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. అక్కడ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, మిడ్ లెవల్ హెల్త్ ప్రాక్టీçషనర్ అక్కడే ఉంటూ 24 గంటలూ అందుబాటులో ఉంటూ 67 రకాల మందులిస్తూ.. 14 రకాల డయోగ్నిస్టిక్ టెస్టులు చేస్తూ.. ఆరోగ్యశ్రీకి రిఫరెల్ పాయింట్‌గా పని చేస్తున్నారు.
►ఈ నెలలోనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అమలు చేస్తున్నాం. అదే గ్రామంలో నాలుగు అడుగులు వేస్తే ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు కనిపిస్తాయి. నాడు–నేడుతో స్కూళ్ల రూపు రేఖలను మార్చాం. డిజిటల్ లైబ్రరీలు కూడా కట్టబోతున్నాం. మన గ్రామాలలో మన పిల్లల కోసం వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. మన కళ్ల ఎదుటే గ్రామాల రూపు రేఖలు మారుతున్నాయి.
►కాబట్టే మనందరి ప్రభుత్వం తరఫున మన ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలో మీ ఇంటికి ఈ మేలు చేశామని, సవినయంగా చెప్పుకుంటూ గడపగడపకూ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్రతి అక్క, చెల్లెమ్మ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఇదే సమయంలో చెప్పుకోవడానికి ఏమీ లేనివాళ్లంతా, గతంలో ప్రజలకు ఏ మేలూ చేయని వారంతా ఈ రోజు ఏం చేస్తున్నారో గమనించండి.
కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరిగిన సీఎం వైఎస్ జగన్ సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం
అవనిగడ్డకు వరాల జల్లు..
►అవనిగడ్డకు సంబంధించి కొన్ని మంచి కార్యక్రమాలకు సహాయ సహకారాలు కావాలని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ అడిగారు. అవనిగడ్డ–కోడూరు ప్రధాన రహదారి అభివృద్ధికి రూ.35 కోట్లు మంజూరు చేస్తున్నా. కృష్ణానది కుడి, ఎడమ కరకట్ట.. సముద్రపు కరకట్టను పటిష్టం చేయడానికి రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నా. పాత ఎడ్లలంక రహదారి వంతెన ఏర్పాటుకు రూ.8.50 కోట్లు మంజూరు చేస్తున్నా. అవనిగడ్డలో కంపోస్ట్ యార్డు తరలించడానికి రూ.5–10 కోట్లు.. సీసీ డ్రైన్ల ఏర్పాటుకు రూ.10–15 కోట్లు మంజూరు చేస్తున్నా. అవనిగడ్డ ఏరియా ఆసుపత్రిలో కిడ్నీ డయాలసిస్ సెంటర్‌ను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని మంజూరు చేస్తాం.
►ఈ సమావేశంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, జోగి రమేష్, ఆర్‌కే రోజా, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు కొలుసు పార్థ సారధి, పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, కైలే అనిల్‌కుమార్, జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, కల్పలతారెడ్డి, ఎండీ రుహుల్లా, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వీధి రౌడీలను మించి బూతులు
►వాళ్లు చేసిన మంచేమిటో చెప్పుకోలేరు. ఈ రోజు వాళ్లను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అందుకే బూతులు తిట్టడంలో వీధి రౌడీలను మించిపోయారు. నాయకులుగా చెప్పుకుంటున్న వారు చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతున్నారు. ఇలాంటి వారు మన నాయకులా?
►అవ్వాతాతల గురించి, అక్క చెల్లెమ్మల గురించి, ప్రతి కుటుంబంలో ఉన్న ఆడ బిడ్డల గురించి మనం ఆలోచిస్తుంటే.. దత్తపుత్రుడితో, దత్త తండ్రి ఏమేమి మాట్లాడిస్తున్నాడో అందరం చూస్తున్నాం.
►ఎవ్వరికీ, ఏ ప్రాంతానికీ అన్యాయం చేయకుండా 3 రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుందని మనం చెబుతుంటే.. కాదు, మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుంది.. మీరూ చేసుకోండి.. అని చెప్పుకుంటున్న వారి గురించి ఆలోచించండి. అలాగైతే రేపు మన ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి ఏంటి? మన కూతుళ్ల పరిస్థితి ఏంటి? మన చెల్లెమ్మల పరిస్థితి ఏంటి?
►వివక్ష, లంచాలు లేకుండా నేరుగా 87 శాతం ప్రజలకు మేలు చేసిన మన ప్రభుత్వానికి, ప్రజలకు ఏనాడూ మేలు చేయని పచ్చ రంగు పెత్తందారుల మధ్య పోరాటం జరుగుతోంది. మరో 18–19 నెలల పాటు రోజూ ఇలాంటివన్నీ కనిపిస్తాయి. ఆ దుష్టచతుష్టయం మోసాలను నమ్మొద్దు. ఆ పేపర్లను చదవొద్దు. ఆ టీవీలను చూడొద్దు.
Comments
Please login to add a commentAdd a comment