సాక్షి, హైదరాబాద్: నిషేధిత భూముల జాబితా (22–ఏ)పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఈ జాబితాలో ఉన్న భూముల విషయంలో తప్పులున్నాయని, చాలా చోట్ల ప్రభుత్వ భూములు ఈ జాబితాలో లేవని, కొన్నిచోట్ల ప్రజావసరాల కోసం సేకరించి పరిహారం చెల్లించిన భూములూ ఆయా పట్టాదా రుల పేర్ల మీదనే ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం వెంటనే ఈ జాబి తాను మళ్లీ తయారు చేయడంపై దృష్టి పెట్టా లని కలెక్టర్లను ఆదేశించింది. జాబితాలో మార్పుచేర్పులు, తొలగింపుల ప్రక్రియ ప్రారంభించి వారంలో నివేదిక పంపాలని సీసీఎల్‌ఏ కార్యాలయ వర్గాలు కలెక్టర్లకు పంపిన ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి.
విభజన... ఆధునీకరణ
ప్రస్తుతం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖకు అందుబాటులో ఉన్న నిషేధిత భూముల జాబితాలో చాలా మార్పులు చేయాల్సి ఉంది. ముఖ్యంగా గతంలో ఓ సర్వే నంబర్‌ను పూర్తిగా ఈ జాబితాలో చేర్చిన కారణంగా ఆ సర్వే నంబర్ పరిధిలో భూములున్న పట్టాదారులు కూడా వారి భూముల క్రయవిక్రయ లావాదేవీలు జరగక ఇబ్బందులు పడ్డారు. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా వేలాది కేసులున్నాయి. దీంతో ఈ సమస్యను కలెక్టర్లతో సమావేశంలో సీఎం దృష్టికి రెవెన్యూ అధికారులు తీసుకొచ్చారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎం ఆదేశించడంతో ఇప్పుడు ఆ సర్వే నంబర్లను విభజించే పని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్లకు సీసీఎల్‌ఏ దిశానిర్దేశం చేసింది.
ప్రభుత్వ భూములు, పట్టా భూములను ఒకే సర్వే నంబర్‌లో సబ్ డివిజన్లుగా చేసి కేవలం ప్రభుత్వ భూములన్న డివిజన్లనే నిషేధిత జాబితాలో ఉంచి మిగిలిన వాటిని ఆ జాబితా నుంచి తొలగించాలని ఆదేశించింది. ఇలాంటి తప్పులపై వచ్చిన దరఖాస్తులను కలెక్టర్లు స్వయంగా పరిశీలించి ఆ భూములపై నిర్ణయం తీసుకుంటూ నివేదిక పంపాలని పేర్కొంది. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌లు తుది నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో వివరించింది.
అలాగే అనేక సందర్భాల్లో ప్రజావసరాల కోసం సేకరించిన భూములు ఇంకా పట్టాదారుల పేరిటే ఉన్నాయని, రైతులు లేదా పట్టాదారులకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాక కూడా ఆ భూముల పట్టాలు వారి పేరిటే ఉండటంతో అనేక ప్రభుత్వ సబ్సిడీలు, ప్రోత్సాహకాలను ఈ భూములపై పొందుతున్నారని, వెంటనే వాటిని సవరించాలని కలెక్టర్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై జరిగే భూసేకరణలో పరిహారం చెల్లింపునకు ముందే ఆ భూముల సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో చేర్చాలని కూడా పేర్కొంది.
నెల దాటనివ్వద్దు
ప్రభుత్వ భూముల పరిరక్షణకు కూడా కలెక్టర్లు నడుంబిగించాలని సీసీఎల్‌ఏ సూచించింది. ఈ భూముల జాబితాలో ఉన్న తప్పొప్పులను నెల రోజుల్లోగా తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని తెలిపింది. అలాగే భూసేకరణ ద్వారా ప్రభుత్వానికి సంక్రమించిన భూములు, నిషేధిత జాబితాలో చేర్చాల్సిన భూములు, ఆ జాబితా నుంచి తొలగించాల్సిన భూముల వివరాలను నిర్దేశిత ఫార్మాట్లలో వారంలో తమకు పంపాలని ఆ ఉత్తర్వుల్లో సీసీఎల్‌ఏ కలెక్టర్లను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment