సాక్షి, హైదరాబాద్: భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల యంత్రాంగాన్ని ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 31వ తేదీ కల్లా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, అందుకు అనుగుణంగా తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని నిర్దేశించింది.
ఈ మేరకు ఇటీవల జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కేవలం నాలుగు కేటగిరీలు తప్ప మిగిలిన అన్ని భూముల వివరాలను క్లియర్ చేయాలని.. అసైన్డ్, అటవీ, సాదాబైనామా, కోర్టు కేసులున్న భూముల వివరాలను మాత్రమే పెండింగ్‌లో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆదేశించారు. వివాదాస్పద అంశాల జోలికి పోకుండా కేవలం రికార్డులను పరిశీలించి వీలున్న మార్పులు చేయాలని ఆయన సూచించారు.
ఇప్పటికి పూర్తయింది కొంతే!
అయితే, రికార్డుల ప్రక్షాళన ప్రారంభమై దాదాపు 50 రోజులు గడుస్తున్న నేపథ్యంలో ఇంకా మూడోవంతు ప్రక్రియ మాత్రమే పూర్తయింది. కానీ, ఉన్నతాధికారులు మాత్రం మరో సగం రోజుల గడువులోనే మిగిలిన 65 శాతానికి పైగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. గడువు సమీపిస్తుండటంతో జిల్లా స్థాయి అధికారుల్లో హడావుడి పెరిగింది.
ఇంకా చాలా జిల్లాల్లో 15–20 శాతమే భూ రికార్డుల ప్రక్షాళన జరిగిందని, ఈ తరుణంలో డిసెంబర్ 31లోపు కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో శాస్త్రీయత లోపించే అవకాశం ఉందని క్షేత్రస్థాయి అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్.మీనా, భూ రికార్డుల ప్రక్షాళన మిషన్ డైరెక్టర్ వాకాటి కరుణ కూడా పాల్గొన్న ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
♦ టైటిళ్లపై స్పష్టమైన ఆదేశాలతో కోర్టుల్లో కేసులున్న భూములు, సరిహద్దుల విషయంలో అటవీ శాఖ అభ్యంతరం చెపుతున్న భూములు, అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములు, సాదాబైనామా భూముల వివరాలు తప్ప మిగిలిన అన్ని భూముల రికార్డులను క్లియర్ చేయాలి. ఈ నాలుగు వివరాలను కేటగిరీ–బీలో, మిగిలిన భూముల వివరాలను కేటగిరీ–ఏలో నమోదు చేసి మొబైల్‌యాప్‌లో అప్‌లోడ్ చేయాలి.
♦ అటవీశాఖతో వివాదాలున్న భూముల్లో ఎక్కువ విస్తీర్ణం ఉన్న భూముల వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలి. అటవీశాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని వాటిని రాష్ట్రస్థాయిలో పరిష్కరించుకోవాలి.
♦ కోర్టు కేసుల విషయంలో టైటిల్‌పై స్పష్టమైన స్టే ఆర్డర్ ఉంటేనే కేటగిరీ–బీలో చేర్చాలి.
♦ అవసరమైన చోట్ల కలెక్టర్లు లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించుకోవచ్చు.
♦ క్లరికల్ విధులు, రికార్డుల అప్‌డేషన్ కోసం రిటైర్డ్ ఉద్యోగులు లేదా అదనపు కంప్యూటర్ ఆపరేటర్లను ఔట్‌సోర్సింగ్ విధానంలో నియమించుకోవాలి.
♦ గతంలో తిరస్కరించిన సాదాబైనామా దరఖాస్తులు మళ్లీ వస్తే వాటిని అనుమతించాలి.
గురువారం నాటికి భూ రికార్డుల ప్రక్షాళన గణాంకాలివి..
రాష్ట్రంలో మొత్తం సర్వే నంబర్లు: 1,78,27,308
ఇప్పటివరకు పరిశీలించినవి: 64,73,101
సక్రమంగా ఉన్నవి: 44,71,669
సరిచేయాల్సినవి: 20,01,432
కోర్టుకేసులున్నవి: 15,012
పట్టాదారుల పేర్లు సరిపోలనివి: 1,02,669
పౌతీ చేయాల్సినవి: 2,86,553
ఆన్‌లైన్ చేయాల్సిన మ్యుటేషన్లు: 57,109
పెండింగ్ మ్యుటేషన్లు: 64,057
పట్టాదారుల పేర్లలో క్లరికల్ తప్పిదాలు: 4,11,391
రికార్డుల్లో కన్నా ఎక్కువ, తక్కువ భూములన్నవి: 1,96,691
పాస్‌బుక్‌లు ఆన్‌లైన్ చేయాల్సినవి: 9,011
సర్వే నంబర్లలో క్లరికల్ తప్పిదాలు: 70,616
అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములు: 39,379
వ్యవసాయేతర భూములు: 1,54,939
ఇతర తప్పిదాలు: 3,47,180
Comments
Please login to add a commentAdd a comment