సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పాత రికార్డులతో పోలిస్తే సర్వేనంబర్లే కాదు.. భూ విస్తీర్ణం కూడా పెరుగుతోంది. గతంలో వెబ్‌ల్యాండ్ అప్‌డేషన్ సమయంలో ఆన్‌లైన్‌లో వివరాలు సరిగ్గా నమోదు చేయకపోవడమే కారణమా.. లేక ఇప్పుడేమైనా పొరపాట్లు దొర్లాయా? అనే అంశంపై రెవెన్యూ యంత్రాంగం ఆరా తీస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 1.7 కోట్లకు పైగా సర్వే నంబర్లలో 2.4 కోట్ల ఎకరాల భూములు ఉండగా, ఇప్పుడు సర్వే నంబర్ల సంఖ్య 2 కోట్ల వరకు చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన భూరికార్డుల ప్రక్షాళన అనంతరం ఏకంగా 11 జిల్లాల్లో గతంలో ఉన్న సర్వే నెంబర్ల కంటే ఎక్కువ సర్వే నంబర్లు నమోదు కావడం విశేషం. మిగిలిన జిల్లాల్లోనూ ఈ సర్వే నంబర్ల సంఖ్య పెరుగుతుందని, ఆ మేరకు భూమి విస్తీర్ణం కూడా పెరగనుందని రెవెన్యూ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నవీకరణలో నంబర్ల తంటా
రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 15వ తేదీన భూ రికార్డుల ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సాహసోపేతంగా.. వినూత్నంగా మొదలు పెట్టిన ఈ కార్యక్రమంలో రికార్డులన్నింటినీ పకడ్బందీగా నవీకరించాలని నిర్ణయించింది. అందుకనుగుణంగా రెవెన్యూ బృందాలు గ్రామాల్లోనే తిష్టవేసి రికార్డుల ప్రక్షాళన ప్రక్రియను నిర్వహించాయి. అయితే, మరో మూడు రోజుల్లో రికార్డుల ప్రక్షాళనకు ముగింపు పడుతుందనే సమయంలో తేలిన అంకెలను చూసి రెవెన్యూ యంత్రాంగం ఆశ్చర్యపోయింది.
చాలాచోట్ల గతంలో ఉన్న సర్వే నంబర్ల సంఖ్యకు.. తాజాగా వెల్లడైన అంకెలకు ఏ మాత్రం పొంతన కుదరడం లేదు. అలాగే భూ విస్తీర్ణం విషయంలోనూ తేడా వస్తోంది. దీంతో ఈ వ్యత్యాసానికి దారితీసిన పరిస్థితులపై అధికార గణం తర్జనభర్జనలు పడుతోంది. భూ రికార్డుల ప్రక్షాళనకు ముందు ప్రభుత్వం వెబ్‌ల్యాండ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరిచి.. ‘మా భూమి’వెబ్‌సైట్ ద్వారా ప్రజల దరికి చేర్చింది. ఈ క్రమంలోనే తప్పులు దొర్లినట్లు తాజాగా ప్రభుత్వం ప్రాథమిక అంచనాకొచ్చింది.
అప్పట్లో పకడ్బందీగా రికార్డులు నమోదు చేయాలనే అభిప్రాయానికొచ్చింది. దీనికితోడు ప్రైవేటు డీటీపీ ఆపరేటర్ల చేతివాటం కూడా రికార్డుల అప్‌డేషన్లో తప్పులు దొర్లేందుకు మూలం కావచ్చని తేల్చింది. అంతేగాకుండా వివాదాస్పద భూముల రికార్డుల ఆన్‌లైన్‌లో నమోదు చేసే విషయంలో జరిగిన గందరగోళం కూడా తాజా గణాంకాల వ్యత్యాసానికి ఒక కారణమని తెలుస్తోంది. కోర్టు కేసులు, దాయాదుల మధ్య వివాదాల్లాంటి అభ్యంతరకర భూములను రికార్డుల్లోకి ఎక్కించే అంశంపై వీఆర్‌ఓలు ఆచితూచి వ్యవహరించారు.
దీని వల్లే ప్రస్తుతం జరుగుతున్న రికార్డుల్లో భారీ తేడా కనిపిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన రెవెన్యూ యంత్రాంగం.. మరో నాలుగు రోజుల్లో రికార్డుల శుద్ధీకరణ ప్రక్రియ ముగుస్తున్న క్రమంలో అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ ప్రక్షాళన తంతు ముగిసేసరికి ఎన్ని సర్వే నంబర్లలో ఎంత భూమి పెరుగుతుందనేది తమకు కూడా ఆసక్తిని కలిగిస్తోందని రెవెన్యూ వర్గాలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment