భూ తగాదాలకు చెక్
అందుకే భూ రికార్డుల ప్రక్షాళన: హరీశ్
► రైతుల భూముల వివరాలు ఆన్‌లైన్‌లో..
► వాటి ఆధారంగానే ఎకరాకు రూ.4 వేలు
► ఎవరు అడ్డుపడినా కాళేశ్వరం ఆగదని స్పష్టీకరణ
సాక్షి, సిద్దిపేట /నంగునూరు: భూ రికార్డుల ను ప్రక్షాళన చేసి భూ తగాదాలు, లంచాలకు చెక్ పెడతామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట, నంగునూరు మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిజాం కాలం నాటి భూ రికార్డులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, వాటిని ప్రక్షాళన చేసి రైతులకు భూములపై హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తోందని చెప్పారు.
రికార్డులు సక్రమంగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఫలితంగా తరచూ భూ వివాదాలు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజల నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ నాయకులు పేదల భూములను పట్టాలు చేయించుకున్నారని ఆయన ఆరోపించారు. అవి తిరిగి పేదలకు అందుతాయనే భయంతోనే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి భూ సర్వేపై కోర్టులో కేసులు వేస్తామని చెబుతున్నారని చెప్పారు.
రైతుల భూముల వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామని, వీటి ఆధారంగానే వచ్చే ఏడాది నుంచి ఎకరాలకు నాలుగు వేల చొప్పున ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. ఎవరు అడ్డుపడినా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. గోదావరి జలాలతో రెండు పంటలకు నీరందించి బీడు భూములను సస్యశ్యామలం చేస్తామన్నారు. 70 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి కేవలం మూడేళ్లలో చేసి చూపించామని చెప్పారు. ఏడాదిలోపు రంగనాయక సాగర్ నిర్మాణం పనులు పూర్తి చేసి సాగు నీరందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో ప్రజలు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారని, దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు దొడ్డిదారిన అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని మంత్రి మండిపడ్డారు.