సాక్షి, మహబూబాబాద్: భూరికార్డుల ప్రక్షాళనలో జరిగిన తప్పులను సరిదిద్ది, వాస్తవ సాగుదారులకు పాస్‌పుస్తకాలు వచ్చేదాకా పోరాటం చేస్తామని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మానుకోట, జనగామలో సోమవారం నిర్వహించిన రైతు దీక్షల్లో ఆయన మాట్లాడారు. రైతుల సమస్యలు పరిష్కరించకుంటే సెప్టెంబర్‌లో ప్రభుత్వంతో యుద్ధం చేస్తామని స్పష్టం చేశారు.
భూప్రక్షాళనలో భూమి ఎక్కువ వస్తే.. సరిచేయాల్సింది పోయి రైతుల నుంచి లాక్కోవడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కౌలు రైతులపై సీఎం చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని పేర్కొన్నారు. నిరుద్యోగులు, రైతులు ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో తప్పులు దొర్లాయని, నిజమైన రైతులకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.
తెలంగాణ జనసమితి ప్రత్యక్షంగా రైతుల అభిప్రాయాలను సేకరించిందన్నారు. పేరు, విస్తీర్ణం, కులం, సర్వే నంబర్లలో 9,11,241 తప్పులు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. జూన్ 20 వరకు తప్పులు సరిదిద్దుతామని సీఎం చెప్పారని, జూలై 30 వరకైనా రైతులకు పాస్‌పుస్తకాలు ఇస్తారా అని అడిగారు. ఆగస్టులో ప్రభుత్వ పెద్దలను కలసి సమస్యలను వివరిస్తామన్నారు.
ప్రజా ఉద్యమాల్లో ఉన్నవారికే టికెట్లు
సాక్షి, కొత్తగూడెం: అన్ని అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగుతామని, ప్రజా ఉద్యమాల్లో ఉన్న వారికే టికెట్లు ఇస్తామని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. కొత్తగూడెంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయాలు ప్రజా సమస్యలకు కేంద్ర బిందువుగా ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment