సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన తప్పుల తడకగా ఉన్నట్లు తమ సర్వేలో తేలిందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఆరోపించింది. మొత్తం 9 రకాల అంశాల్లో 9,11,241 తప్పులు దొర్లినట్లు తేలిందని వెల్లడించింది. ఫలితంగా లక్షలాది మంది రైతులకు నష్టం వాటిల్లిందని తెలిపింది. 125 మండలాల్లోని గ్రామాల్లో తాము చేసిన సర్వేలో 3,500 మంది రైతులతో మాట్లాడి వాస్తవాలను క్రోడీకరించినట్లు తెలిపింది.
త్వరలోనే వాటిన్నింటిపై పూర్తి స్థాయి నివేదికను అధికారులు, ప్రజల ముందు ఉంచుతామని తెలిపింది. సోమ వారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో టీజేఎస్ అధ్యక్షు డు ప్రొఫెసర్ కోదండరామ్ ఈ అంశాలను వెల్లడిం చారు. ప్రభుత్వం ఈ నెలాఖరులోగా భూ రికార్డుల్లో దొర్లిన తప్పులును సవరించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఈ నెల 23న అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్ల ముందు రైతు దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. నెలాఖరులో హైదరాబాద్‌లోనూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామన్నారు. రికార్డుల్లో తప్పులకు సంబంధించి ముద్రించిన కరపత్రాలను, 23న తలపెట్టిన రైతు దీక్ష పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు.
రికార్డుల్లో తప్పులపై టీజేఏస్ వెల్లడించిన కొన్ని అంశాలు..
♦ చాలా మంది చిన్న, సన్నకారు రైతులకు పట్టా పుస్తకాలు లేవు. కొందరికి సీలింగ్ భూములు, అటవీ భూములు, ఇనాం భూములు, ప్రభుత్వ భూములపై ఎన్నో ఏళ్లుగా యాజమాన్య హక్కులు ఉన్నాయి. వాటిని గ్రామాలు అంగీకరిస్తున్నాయి. కొన్ని చట్టబద్ధ హక్కులు ఉన్నాయి. ఖాస్తుకారు కాలంలో వారి పేరు నమోదైంది. అటవీ భూములు దున్నుకుంటున్న వారు అటవీ హక్కుల చట్టం ప్రకారం పత్రాలు పొం దారు. చాలామంది రైతులు కొన్న భూములకు సాదా బైనామాలు ఉన్నాయి. వాటన్నింటినీ చట్టబద్ధం చేయకుండా రికార్డుల ప్రక్షాళనలో రద్దు చేశారు. ఫలితంగా లక్షల మందికి నష్టం వాటిల్లించింది.
♦ సేత్వార్‌లో ఉండాల్సిన దానికన్నా వాస్తవ పహా ణీ ల్లో ఎక్కువ భూమి ఉందని భూవిస్తీర్ణాన్ని కుదించా రు. ఇది చట్ట విరుద్ధం. సర్వే చేయకుండా విస్తీర్ణంలో మార్పు చేశారు. పహాణీల ప్రకారం ఉండాల్సిన దాని కన్నా 60 లక్షల ఎకరాలు ఎక్కువగా ఉంది. అమ్మిన వారి పేర్లను తొలగించకుండా ఏకపక్షంగా భూమి కుదించారు.
♦అటవీ–రెవెన్యూశాఖల మధ్య 17 లక్షల ఎకరాలు వివాదం ఉంది. ఆ భూమిని సర్వే చేయకుండా అటవీ శాఖ డిమాండ్‌తో రైతులకు హక్కు చేశారు.
♦ రైతులకు సంప్రదాయపరంగా ఉన్న హక్కులను గుర్తించకుండా వారి యాజమాన్య హక్కులను ప్రభుత్వం కాలరాసింది. అనుభవంలేని సిబ్బంది, హడావుడిగా పూర్తి చేయాలన్న ఒత్తిడి వల్ల కూడా అనేక తప్పులు దొర్లాయి. రైతులు రూ. 4 వేల చొప్పున పొందడం కాదు.. సొంత భూములపై హక్కులను కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment