మోర్తాడ్ (బాల్కొండ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం కింద రబీ సీజనుకు గాను రైతులకు పెట్టుబడి సహాయం నాలుగు విడతల్లో విడుదలైంది. జిల్లాలోని రైతులకు ఇప్పటికి రూ.42 కోట్ల, 40 లక్షల, 62 వేల, 310 అందింది. 25 శాతం సొమ్ము విడుదల కాగా మరి కొద్ది రోజుల్లో మిగిలిన 75 శాతం సొమ్ము కూడా రైతుల ఖాతాలకు చేరనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన కారణంగా రబీ పెట్టుబడి సహాయం చెక్కుల రూపంలో పంపిణీకి ఎన్నికల కమిషన్ అభ్యంతరం తెలిపింది. అయితే రైతుల ఖాతాలకు నగదు బదిలీ ద్వారా పెట్టుబడి సహాయం అందించవచ్చని కమిషన్ సూచించడంతో రైతుల ఖాతాల నంబర్లు, ఇతర వివరాలను సేకరించే పనిలో వ్యవసాయ శాఖ అధికారులు నిమగ్నం అయ్యారు.
ఖరీఫ్ సీజనుకు గాను జిల్లాలోని 2 లక్షల, 271 మంది రైతులకు రూ.204.44 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. ఇందులో 5,518 మంది రైతులు మరణించినట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. మరణించిన రైతులను మినహాయించి ఇతర రైతులకు మాత్రమే రబీ సీజను పెట్టుబడి సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరణించిన రైతులను మినహాయిస్తే జిల్లాలో 1,94,753 మంది రైతులకు పెట్టుబడి సహాయం అందించాల్సి ఉంది. ఇప్పటి వరకు సేకరించిన రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో ఏఈవోలు నమోదు చేయగా వ్యవసాయాధికారులు ఆమోదం తెలిపి పెట్టుబడి సహాయం సొమ్ము రైతుల ఖాతాలకు బదిలీ కోసం వ్యవసాయ శాఖ కమిషనరేట్‌కు పంపించారు. వ్యవసాయ శాఖ కమిషనరేట్ అధికారులు బ్యాంకులలో ఉన్న నిధుల ఆధారంగా రైతులకు దశల వారీగా నగదు బదిలీకి చర్యలు తీసుకుంటున్నారు.
క్షేత్ర స్థాయిలో రైతుల నుంచి ఆధార్ నంబర్, పట్టా పాసు పుస్తకం జిరాక్సు, బ్యాంకు ఖాతా వివరాలను వ్యవసాయ విస్తీర్ణ అధికారులు ఇంకా సేకరిస్తున్నారు. రైతుల నుంచి సేకరించిన వివరాలను ఏఈవోలు తమకు గతంలో ప్రభుత్వం జారీ చేసిన ట్యాబ్‌లలో అప్‌లోడ్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో రైతుల వివరాలు నమోదు కావడం, వ్యవసాయ శాఖ తమ వద్ద ఉన్న నిధులను దశల వారీగా రైతుల ఖాతాల్లోకి జమ చేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని జిల్లా వ్యవసాయాధికారి మేకల గోవింద్ తెలిపారు. ఖరీఫ్ పెట్టుబడి సహాయం అందుకున్న ప్రతి రైతుకు రబీ పెట్టుబడి సహాయం అందుతుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment