
సాక్షి వనపర్తి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ వ్యవసాయరంగానికి ప్రాధాన్యం కల్పించేలా ఉంది. ఈ బడ్జెట్‌ను లోతుగా పరిశీలిస్తే ఇటీవల ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చే ప్రయత్నం చేశారని స్పష్టమవుతోంది. మొత్తం బడ్జెట్ రూ.1,82,017 లక్షల కోట్లు కాగా ఇందులో ప్రగతి పద్దు రూ.లక్ష 7 వేల 302 కోట్లు, నిర్వహణ వ్యయం రూ.74,715 కోట్లుగా కేటాయించారు. ఇప్పటికే సంక్షేమ రంగంలో రాకెట్‌లా దూసుకెళ్తున్న తెలంగాణ మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేయనున్నడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల దృష్టి తెలంగాణపై పడింది.
మరింత ఆసరా...
టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడానికి ఆసరా పింఛన్‌లే ప్రధాన కారణమనే విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల హమీల్లో భాగంగా సీఎం కేసీఆర్ పింఛన్ డబ్బులను రెట్టింపు చేశారు. వనపర్తి జిల్లాలో 28,521 మంది వృద్ధులు, 27,705 మంది వితంతువులు, 701 మంది చేనేత కార్మికులు, 460 గీత కార్మికులు, 1004 మంది బీడీ కార్మికులు, 2,604 మంది ఒంటరి మహిళలు ఉన్నారు. వీరికి నెలకు రూ. 1,000 చొప్పున పింఛన్ అందిస్తున్నారు. 11,329 మంది వికలాంగులకు నెలకు రూ.1500 చొప్పున అందిస్తున్నారు. ఏప్రిల్ నెల నుంచి రూ.1000 ఇస్తున్న వారికి రూ. 2016, రూ. 1500 తీసుకుంటున్న వికలాంగులకు నెలకు రూ.3016 ఇవ్వనున్నారు. జిల్లాలో ప్రస్తుతం ప్రతి నెల ఆసరా ఫించన్‌లకు ప్రభుత్వం రూ.8 కోట్ల 33 లక్షల 78 వేలను ఖర్చు చేస్తోంది. ఇకమీదట ఇది రెట్టింపు కానుంది.
పెరిగిన ‘రైతుబంధు’ సాయం
తెలంగాణ ప్రభుత్వం 2018 మే నెలలో ప్రారంభించిన రైతుబంధు పథకం కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాలను విశేషంగా ఆకట్టుకుంది. దీనిని ఆదర్శంగా తీసుకునే కేంద్రంలోని మోదీ సర్కార్ ఎకరానికి రూ.6 వేల చొప్పున ఇస్తామని కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకాన్ని రూపకల్పన చేసింది. రైతుబంధు పథకంలో జిల్లాలో రెండో విడతలో 1,30,737 మంది రైతులకు గాను 1,07,528 మంది రైతులకు రూ.117 కోట్ల 51 లక్షల 66 వేలను ఎకరానికి రూ.4 వేల చొప్పున అందించారు. రెండు పంటలకు కలిపి రూ. 8 వేలు చెల్లించారు. ప్రస్తుతం బడ్జెట్‌లో దానిని రూ.10 వేలకు పెంచారు. దీనివల్ల రైతులకు అదనంగా ఎకరానికి రూ. 2 వేలు అందనున్నాయి.
నిరుద్యోగ యువతకు భరోసా..
ఎన్నికల్లో ఇచ్చిన మరో ప్రధానమైన హమీ నిరుద్యోగ భృతి. ఈ పథకం వల్ల డిగ్రీ చదువుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఎంతో మేలు చేకూరనుంది. ఈ పథకం అమలుకోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.1,810 కోట్లు కేటాయించింది. ఈ పథకం అమలు కోసం విధి విధానాలను రూపకల్పన చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది.
వ్యవసాయరంగానికి పెద్దపీట
ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందనే చెప్పాలి. రైతులను ఆదుకునేందుకు మరోసారి రుణ మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. బడ్జెట్‌లో రుణమాఫీ పథకానికి రూ.6000 కోట్లు కేటాయించారు. వనపర్తి జిల్లాలో 3.87 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి 1.52 లక్షల మంది రైతులు ఉన్నారు. 2018 డిసెంబర్ 11వ తేదీ నాటికి బ్యాంకులో వ్యవసాయానికి తీసుకున్న లక్ష రూపాయల వరకు రుణ మాఫీ కానుంది. ఇప్పటికే రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ప్రభుత్వం పుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ల ఏర్పాటుకు నడుం బిగించింది. జిల్లాలో ఇప్పటికే వనపర్తి మండలంలోని దత్తాయిపల్లిలో వేరుశనగ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పి మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంతో పాటు, స్థానికంగా ఎక్కువగా ఉత్పత్తి అయ్యే వేరుశనగకు మంచి మార్కెటింగ్ కల్పించేందుకు కలెక్టర్ శ్వేతామహంతి కృషి చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటివి మరిన్ని పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment