సాక్షి, న్యూఢిల్లీ: ఊహించినట్టుగానే ఎన్నికల వేళ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో నరేంద్రమోదీ సర్కారు పలు ప్రజాకార్షక పథకాలకు పెద్దపీట వేసింది. అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునేవిధంగా సంచలనాత్మకరీతిలో మధ్యంతర బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. తాత్కాలికంగా ఆర్థికమంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్న పీయూష్ గోయల్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక చిట్టాలో ఆద్యంతం ఓటర్ల మనోభావాలను సంతృప్తి పరిచేలా ప్రతిపాదనలు చేశారు. ఎన్నికల వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఓటర్లపై వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా మధ్యతరగతి వేతనజీవులు, రైతులు, అసంఘటిత రంగ కార్మికులు, అంగన్‌వాడీ టీచర్లు.. ఇలా అన్ని వర్గాలను ఆకర్షించేవిధంగా.. గోయల్ తన బడ్జెట్‌లో తాయిలాలు కురిపించారు. నూటికి నూరుశాతం ఎన్నికల బడ్జెట్‌ను తలపించేలా గోయల్ చిట్టాపద్దులు సాగాయి.
ఎన్నికల ముందు వేతన జీవులకు మోదీ సర్కారు భారీ ఊరటనిచ్చింది. ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని ఏకంగా రెట్టింపు చేస్తూ.. మధ్యతరగతి ఉద్యోగులపై వరాల జల్లు కురిపించింది. ఇప్పటివరకు వార్షికాదాయం రూ. 2.50 లక్షలు దాటితే ఉద్యోగులు పన్ను కట్టాల్సి ఉండగా.. ఇప్పుడు ఆ పరిమితిని ఏకంగా రూ. 5 లక్షలకు పెంచుతూ మోదీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక, అదేవిధంగా గృహరుణాలు, ఇంటి అద్దెలు, ఇన్సురెన్స్‌లు కలిపి 6.50 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను ఉండబోదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న మూడు కోట్ల మంది మధ్యతరగతి ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఇక, స్టాండర్డ్ డిడక‌్షన్ రూ.50 వేలకు పెంచినట్టు ప్రకటించిన గోయల్.. పొదుపు ఖాతాలపై వచ్చే వడ్డీ 10 వేల నుంచి 40 వేలకు పెంచుతున్నట్టు తెలిపారు. నెలకు 50 వేల జీతం వరకు టీడీఎస్ వర్తించబోదని, సొంతిల్లు అద్దెకు ఇస్తే వచ్చే ఆదాయంపై రూ. 2.50 లక్షల వరకు పన్ను ఉండదని స్పష్టం చేశారు. ఇవన్నీ మధ్యతరగతి ఓటర్లను సంతృప్తిపరిచే నిర్ణయాలే కావడం గమనార్హం.
రైతులకు ఆర్థిక చేయూత
వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు మోదీ సర్కారు ముందుకొచ్చింది. ఎన్నికల నేపథ్యంలో అన్నదాతలను తమవైపు తిప్పుకునేందుకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ఒక కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ద్వారా చిన్నసన్నకారు రైతులకు ఏడాదికి రూ. 6వేల నగద సాయం నేరుగా అందజేస్తామని, ఐదెకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాలకు ఈ నగదును మళ్లిస్తామని గోయల్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఈ పథకం కోసం రూ. 75 వేల కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తెలిపారు. మూడు విడతల్లో నగదు అందజేస్తామని, 2018 డిసెంబర్ నుంచి ఈ పథకం అమల్లో ఉంటుందని, తొలి విడతగా రూ.2వేల సాయం తక్షణమే రైతులకు అందజేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఈ నగదు నేరుగా రైతుల ఖాతాలోకి మళ్లిస్తామని చెప్పారు. ఈ పథకంతో దేశవ్యాప్తంగా ఉన్న 12 కోట్ల రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇక, కిసాన్ క్రెడిట్ కార్డుల కింద రుణాలు అందిస్తామని, రుణాలు సకాలంలో చెల్లించినవారికి రాయితీలు చెల్లిస్తామని పేర్కొంది. ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన రైతుల రుణాల రీషెడ్యూల్ చేస్తామని హామీ ఇచ్చింది. పాడి పరిశ్రమ రుణాలు సకాలంలో చెల్లించే వారికి అదనంగా మూడు శాతం వడ్డీ రాయితీ ఇస్తామని చెప్పారు.
అసంఘటిత రంగ కార్మికులకూ భారీ ఊరట..
దేశంలోని అసంఘటితరంగ కార్మికులకూ మోదీ సర్కారు తన మధ్యంతర బడ్జెట్‌లో భారీ ఊరటనిచ్చింది. ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్ పేరుతో అసంఘటిత కార్మికులకు పింఛన్ పథకాన్ని కేంద్రం ప్రకటించింది. 60 ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి నెలా రూ.3వేలు పింఛన్ వచ్చే విధంగా ఈ పథకం రూపొందించారు. ఈ పథకంలో భాగంగా నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్ల దాటిన తర్వాత రూ.3వేల పింఛన్ పొందవచ్చు. అసంఘటిత రంగంలోని 10 కోట్లమంది కార్మికులకు ఈ పథకం వర్తించనుంది. ఇక ఉపాధి అవకాశాలు మెరుగుపరడటంతో ఈపీఎఫ్‌వో సభ్యులు పెరిగారని, ఈపీఎఫ్‌వో బోనస్ పరిమితిని 21వేలకు పెంచుతున్నట్టు గోయల్ తెలిపారు. గ్రాట్యూటీ పరిధిని 10 లక్షల నుంచి 30 లక్షల పెంచారు. ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు కార్మికులు, ఉద్యోగులకు అందాలని ఈ సందర్భంగా గోయల్ పేర్కొన్నారు. ఎన్‌పీఎస్ విధానంలో ప్రభుత్వ వాటాను 14 శాతానికి పెంచుతున్నట్టు తెలిపారు.
అదేవిధంగా 2022 నాటికి ప్రతి ఒక్కరికి ఇళ్లు, దేశవ్యాప్తంగా అత్యంత వెనుకబడిన 150 జిల్లాలపై ప్రత్యేక దృష్టి, దేశంలో ప్రస్తుతం 21 ఎయిమ్స్, త్వరలోనే హరియాణలో 22వ ఎయిమ్స్ ఏర్పాటు, అంగన్‌వాడీ టీచర్ల జీతం 50 శాతం పెంపు, ఈఎస్‌ఐ పరిధి 15 వేల నుంచి 21 వేలకు పెంపు తదితర ప్రతిపాదనల ద్వారా మధ్యంతర బడ్జెట్‌లో మోదీ సర్కారు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసినట్టు కనిపిస్తోంది. అయితే, ఇది నూటికి నూరుపాళ్లు ఎన్నికల బడ్జెట్ అని, నాలుగేళ్లు ప్రజాసంక్షేమ పథకాలు అమలు చేయని మోదీ సర్కారు.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే.. ఈ విధంగా అన్నివర్గాల వారికీ తాయిలాలు ప్రకటించిందని, ఇది ఎన్నికల గిమ్మిక్కు అని విపక్షాలు కొట్టిపారేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment