నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో (1–2–2019) ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాజిక న్యాయానికి చాలా దూరంగా ఉంది. ఓట్ ఆన్ అకౌంట్‌గా పెట్టవలసిన బడ్జెట్‌ను 2019–20 బడ్జెట్‌గా పెట్టడం రాజ్యాంగ విరుద్ధం. పీయూష్ గోయల్ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో మొత్తం కేటాయింపులు 27.84 లక్షల కోట్లు. బడ్జెట్‌లోని కీలకాంశాలు ఇలా వున్నాయి. రైల్వేకు రూ. 64,587 కోట్లు, రక్షణ రంగంకు రూ.3,05,296 కోట్లు, పెన్షన్లు రూ.1,74,300 కోట్లు, ప్రధాన సబ్సిడీలకు రూ.2,96,684 కోట్లు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1,49,981 కోట్లు, వాణిజ్యం, పరిశ్రమలకు రూ.27,600 కోట్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ.3,000 కోట్లు, విద్యకు రూ.93,848 కోట్లు, ఇంధన రంగంకు రూ.44,101 కోట్లు, విదేశీ వ్యవహారాలకు రూ.16,062 కోట్లు, ఆర్థికశాఖకు రూ.19,812 కోట్లు, ఆరోగ్య రంగంకు రూ.63,538 కోట్లు, హోంశాఖకు రూ.1,03,927 కోట్లు, ఐటి,టెలికాంకు రూ.21,549 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.1,38,962 కోట్లు, సాంఘిక సంక్షేమాంకు రూ. 49,337 కోట్లు, రవాణా వ్యవస్ధకు రూ.1,56,187 కోట్లు, పట్టణాభివృద్ధికి రూ.48,032 కోట్లు, ఇతర రంగాలకు రూ.75,822 కోట్లు.
ఈ పద్దును పరిశీలిస్తే ఇందులో అణగారిన సామాజిక శ్రేణుల ప్రస్తావన లేకుండా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని స్పష్టంగా తెలుస్తోంది. నిజానికి ఏ బడ్జెట్‌లో అయినా దళితులు, ఆదివాసీలు, స్త్రీలు, ప్రధాన పాత్రలో ఉండాలి. అయితే మోదీ ప్రభుత్వానికి వీళ్ళు ముఖ్యులు కారు. వాళ్ల దృష్టిలో కూడా లేరు. రక్తలేమితో పిల్లల్ని కనలేక వేలాది ఆదివాసీ స్త్రీలు చనిపోతున్నారు. దోమతెరలు లేక లక్షలాది మంది గిరిజనులు చనిపోతున్నారు. వారి ప్రస్తావన మోదీ బడ్జెట్‌లో లేదు. ఓట్ల కోసం హిందువుల్ని రెచ్చగొట్టాలని గో సంపదను జన్యు పరంగా తీర్చిదిద్దాలని, రాష్ట్రీయ గోకుల్‌మిషన్ కోసం 750 కోట్లు పెంచారు. అంటే ఒక తల్లి బిడ్డను కనలేక రక్తలేమితో మరణిస్తుంటే ఆమె పౌష్టికాహారానికి ఇవ్వాల్సిన ధనాన్ని పక్కనబెట్టి గోరక్షణకు కేటాయింపులు చేశారు.
మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రూ.29 వేల కోట్లను కేటాయించింది. మొత్తం భారతదేశంలో వితంతువుల సంఖ్య ఎంత? లెక్కలున్నాయా. మీ మద్యపాన విధానాల వల్ల, రహదారుల విధానాల వల్ల ఎందరో త్వరగా మరణిస్తున్నారు. ఎంతో మంది వితంతువులుగా మిగిలిపోతున్నారు. వీరికి పునరావాస కేంద్రాలు ఏవి, వాటి నిర్మాణం ఏది? ప్రధానమంత్రి కిసాన్‌సమ్మాన్ నిధి పేరిట ఎకరాకు 6 వేలు ఇవ్వాలని మోదీ నిర్ణయించారు. కానీ దేశంలో 100కి 80% భూమిని కౌలు రైతులు సాగుచేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది గిరిజనులు, దళితులు ఉన్నారు. మరి వారి సంగతి ఏమిటి. పోడు వ్యవసాయం చేసే గిరి జనులకు పట్టా పుస్తకాలు, పాసు పుస్తకాలు లేవు.
భూయజమాన్య హక్కుల ఆధారంగా బ్యాంక్ రుణాలు తీసుకునే రైతులకు కేంద్రం నేరుగా ధనం బదిలీ అవుతుంది. ఇవి లేని దళిత, గిరిజన రైతుల పరిస్ధితి ఏమిటి? అంటే దళితులు రైతులు కాదా! సాగు చేస్తూ భూ హక్కులు లేనివారి సంఖ్య ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే 25 లక్షల పైనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 16 లక్షల మంది ఉన్నారు. ఇందులో పది లక్షల మంది దళితులే ఉన్నారు. కేసీఆర్ తెలంగాణలో దళితులను దెబ్బతీయాలని కేవలం రైతులకు నగదు బ్యాంకుల్లో వేశారు. చంద్రబాబు నీరు, చెట్టు పేరుతో దళితుల భూములు లాక్కుని సొంత కులాలకు ఇచ్చారు. ఇప్పుడు దళితుల భూములు లాక్కుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కౌలు రౌతులు ముందస్తుగా రైతులకు ఎకరాకు 30 వేలు వడ్డీలకు తెచ్చి చెల్లిస్తున్నారు. తుఫాన్‌లు వస్తే నష్టాన్ని తామే భరిస్తున్నారు. దళితులు వ్యవసాయ కూలీల నుంచి కౌలు రైతులుగా మారే క్రమంలో వారిని అప్పుల్లో ముంచే ప్రయత్నం కేంద్రం రాష్ట్రాలు చేస్తున్నాయి.
రైతుకు 6 వేల రూపాయలు మూడు విడతలుగా బ్యాంక్‌లో వేయడం కూడా జరుగుతోంది. ఇదీ రైతు కులాలకు అవమానమే. ప్రభుత్వాన్ని పోషించాల్సిన రైతును భిక్షగాళ్ళగా మార్చుతున్నారు. అడుక్కునే స్వభావాన్ని నేర్పుతున్నారు. బడ్జెట్ పద్దుల్లో ఏపీ విద్యా సంస్ధల పేర్లు ప్రత్యేకంగా చూపినప్పటికీ కేటాయిం పులు మాత్రం చేయలేదు. 2018–19లో కేటాయిం చిన రూ.49 కోట్లను మాత్రం అంచనాల సవరణ సమయానికి రూ.70.40 కోట్లకు పెంచారు.
ఈ కేంద్ర బడ్జెట్‌ను చూస్తే తప్పకుండా కేంద్రప్రభుత్వం దళిత, మైనార్టీ, స్త్రీ ద్వేషి అని అర్థం అవుతుంది. ‘హిందూ’ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి ‘గోవు’ను కేంద్రం చేసి మళ్ళీ రాజ్యానికి రావాలని చూస్తున్నారు. ఈ సందర్భంగా లౌకికవాదుల, వామపక్షవాదుల, సామాజిక ఉద్యమకారుల, హేతువాదుల ఐక్యత రాజకీయంగా పటిష్టం కావాల్సిఉంది.
వ్యాసకర్త: డా‘‘ కత్తి పద్మారావు, సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ‘ 98497 41695
Comments
Please login to add a commentAdd a comment