కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో రైతులు, మధ్యతరగతి ప్రజలపై వరాలు జల్లు కురిపించింది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు పెద్దపీట వేసిన ఎన్డీయే సర్కారు ఒడిదుడుకుల్లో ఉన్న వ్యవసాయానికి దన్నుగా నిలవడానికి సాయం ప్రకటించింది. మరోవైపు ఆదాయ పరిమితిని పెంచడంతో ఉద్యోగులకు పన్నుల నుంచి కొంత ఉపశమనం లభించనుంది. అంగన్‌వాడీ ఉద్యోగులకు 50 శాతం మేర జీతాలు పెంచనుండటంతో వారిలో ఆనందం నెలకొంది. పింఛన్ ప్రకటనతో అసంఘటిత రంగ కార్మికుల్లో భరోసా పెరిగింది.
సాక్షి, వరంగల్ రూరల్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోఝెల్ శుక్రవారం పార్లమెంట్‌లో శుక్రవారం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ రైతులు, అసంఘటిత రంగ కార్మికుల్లో భరోసా నింపేలా.. ఉద్యోగ వర్గాలకు ఊరటనిచ్చేలా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని లక్షలాది మందికి లబ్ధి చేకూరేలా ఉండగా.. ఆయా వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగులో గిరిజన యూనివర్సిటీకీ నిధులు కేటాయించడంతో గిరిజనుల ఉన్నత విద్యపై ఆశలు రేకెత్తుతున్నాయి. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వర్యం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా అంశం ప్రస్తావనకు రాలేదు. వరంగల్ రూరల్ జిల్లాలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు సాయమందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా.. కేంద్రం స్పందించలేదు.
రైతులకు చేయూత
ప్రధానమంత్రి కిసాన్ సమ్మిట్ పేరుతో రైతులకు ప్రతి నాలుగు నెలలకోసారి రూ.2000 చొప్పున ఏడాదికి రూ.6000 వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు పీయూష్ గోయల్ పార్లమెంట్‌లో బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6,29,110 మంది రైతులు ఉన్నారు. ఇందులో ఐదెకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన చిన్న, సన్నకారు రైతులు జిల్లాలో 5 లక్షలకు పైగా మంది ఉన్నట్లు అంచనా. ఈ మేరకు వీరందరి ఖాతాల్లో నగదు జమ కానుంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం 2018లోనే ఎకరానికి రూ.4000 చొప్పున జిల్లాలోని 6,29,110 మంది రైతులకు రెండు విడతలుగా రైతుబంధు పథకం ద్వారా నగదు పంపిణీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం లాగానే కేంద్రం కూడా రైతులకు ఆర్థిక సాయం చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కార్మికులకు పెన్షన్
ప్రధానమంత్రి శ్రమ యోగి మన్‌ధన్ పథకం ద్వారా కొత్త పింఛన్ పథకాన్ని అసంఘటితరంగ కార్మికులకు ప్రకటించింది. రూ.15వేల లోపు ఆదాయం కలిగిన వారందరూ నెలకు రూ.100 ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3000 చొప్పున పింఛన్ వస్తుంది. దీని ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 2 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులు లబ్ధి పొందే అవకాశముంది.
రూ.5 లక్షల వరకు పన్ను లేదు..
కేంద్ర బడ్జెట్‌లో వేతన జీవులకు శుభవార్త చెప్పారు. సంవత్సరాదాయం రూ.5 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని.. ప్రావిడెంట్ ఫండ్స్, నిర్దేశిత ఈక్విటీలలో రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన వారికి కూడా పన్ను మినహాయింపు లభిస్తుందని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఈ లెక్కన ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, రెండు లక్షలకు పైగా ప్రైవేట్ ఉద్యోగులకు ఊరట లభించనుంది. 50 శాతం వేతనం పెంపుతో అంగన్‌వాడీ టీచర్లకు ప్రయోజనం చేకూరనుంది.
గిరిజన యూనివర్సిటీకి నిధులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ములుగులో ఏర్పాటు చేయనున్న గిరిజన యూనివర్సిటీకి బడ్టెట్‌లో రూ.4 కోట్లు కేటాయించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు రూ.10 కోట్లు కేటాయించింది. తాజాగా కేంద్రం నిధులు కేటాయించడంతో గిరిజనులకు ఉన్నత విద్య అందుబాటులోకి రానుంది.
కోరినా స్పందించని కేంద్రం..
ముఖ్యమంత్రిగా రెండో సారి ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కేసీఆర్ గత ఏడాది డిసెంబర్ 26న ప్రధానితో తొలిసారిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వరంగల్ రూరల్ జిల్లాలో ఏర్పాటు చేయనున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు రూ.1000 కోట్లు కేటాయించాలని కోరారు. దీంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ములుగులో గిరిజన యూనివర్సిటీ, కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుతోపాటు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై వినతిపత్రం సమర్పించారు. ఇందులో ఒక్క గిరిజన యూనివర్సిటీకి రూ.4 కోట్లు కేటాయించారు. టెక్స్‌టైల్ పార్కు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఊసే లేదు.
భరోసా.. ఊరట
Published Sat, Feb 2 2019 11:18 AM | Last Updated on Wed, Mar 6 2019 8:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment