సాక్షి, న్యూఢిల్లీ : ‘మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెస్ (కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన)’ అన్నది 2014లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇటు నరేంద్ర మోదీ అటు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ప్రధాన నినాదం. అలాగే ‘పేద ప్రజల జీవితాలను మెరగుపర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలకు ప్రత్యక్ష తార్కాణం. మేము అధికారంలోకి వస్తే సాంఘిక సంక్షేమ తాయిలాల జోలికి వెళ్లకుండా కొత్త ఉద్యోగాలను సష్టించడం ద్వారా, ఆర్థిక అవకాశాలను పెంచడం ద్వారా ప్రజల ప్రగతిని సాధిస్తాం’ అదే ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ విస్తతంగా చేసిన ప్రచారం.
‘కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన’ నినాదానికి కట్టుబడి నరేంద్ర మోదీ 2014, మే నెలలో కేవలం 45 మందితో కేంద్ర కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. అంతకుముందు మన్మోహన్ సింగ్ నేతత్వంలోని యూపీఏ ప్రభుత్వం కేబినెట్‌లో 71 మంది సభ్యులు ఉన్నారు. 2014, నవంబర్‌లో మోదీ తన కేబినెట్‌ను 66 మంది సభ్యులకు విస్తరించారు. ఆ తర్వాత 2016, జూలై నెలలో మోదీ తన కేబినెట్‌ను మరోసారి విస్తరించి 78 మంది సభ్యులకు చేర్చారు. అంటే మన్మోహన్ సింగ్ కేబినెట్ కన్నా ఏడుగురు సభ్యులు ఎక్కువ. ఈ లెక్కన ఆయన కనిష్ట ప్రభుత్వం అనే నినాదం కాలగర్భంలో కలిసి పోయింది. ఇక గరిష్ట పాలన గురించి చెప్పాలంటే ‘పెద్ద నోట్ల రద్దు’ నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థనే చిన్నాభిన్నం చేశారు. కొత్త ఉద్యోగాలను సష్టించే మాట దేవుడెరుగు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కారణంగా ప్రైవేటు రంగంలో 86 లక్షల నుంచి కోటి ఉద్యోగాల వరకు ప్రజలు కోల్పోయారని పలు సర్వేలు ఇప్పటికే తేల్చాయి. ‘స్వచ్ భారత్’ లాంటి విస్తృత ప్రచార పథకం ఏమేరకు విజయం సాధించిందో ప్రజలకు తెల్సిందే.
సాంఘిక సంక్షేమ కార్యక్రమాల జోలికి వెళ్లనన్న నరేంద్ర మోదీ 2016లో చాలా ఆర్భాటంగా ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ పథకాన్ని ప్రవేశ పెట్టారు. దారిద్య్ర దిగువనున్న పేద మహిళలకు ఉచితంగా ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి, సబ్సిడీపై సిలిండర్లను సరఫరా చేయడం ఈ పథకం ఉద్దేశం. మొదటిసారి సరఫరా చేసిన సిలిండర్ ఖర్చు కాగానే మెజారిటీ గ్యాస్ కనెక్షన్లన్నీ అటకెక్కాయి. ఖర్చుతో కూడిన గ్యాస్ కనెక్షకన్నా ఉచితంగా దొరికే వంట చెరకును పేద ప్రజలు ఆశ్రయించడం వల్ల ఈ పథకం 20 శాతం కూడా విజయం సాధించలేదు. అతిపెద్ద సాంఘిక సంక్షేమ కార్యక్రమంగా పేరుపొందిన జాతీయ గ్రామీణ పథకాన్ని అమలు చేయడంలో కూడా మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలం అవుతోంది. గతేడాది నవంబర్ 15 నాటి బకాయిలను తెలుగు రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాలకు ఇంతవరకు కేంద్రం విడుదల చేయలేదు.
మోదీ ప్రభుత్వం శుక్రవారం నాడు పార్లమెంట్ సమావేశంలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో కూడా ఎక్కువగా సాంఘిక సంక్షేమ తాయిలాలే ఉన్నాయి. రైతులకు ఏడాదికి ఆరువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం, అసంఘటిత రంగంలో నెలకు 15 వేల రూపాయలకు మించని వేతన జీవులకు నెలకు మూడు వేల రూపాయల పింఛను ఇస్తామనడం, వ్యక్తిగత ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని రెండున్నర లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచడం సంక్షేమ తాయిలాలు కావా? వీటి జోలికి వెల్లకుండా కొత్త ఉద్యోగాలను సష్టిస్తానన్న మోదీ, ఆ దిశగా బడ్జెట్‌లో ఒక్క చర్య కూడా తీసుకోలేదు. పైగా మూడు నెలల తాత్కాలిక బడ్జెట్ అంటూ పూర్తి బడ్జెట్‌ను సమర్పించడం ఎంతమేరకు సమంజసం. ‘కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన’ పూర్తిగా తిరగబడింది.
Comments
Please login to add a commentAdd a comment