చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఓ వ్యవసాయ పొలంలో నాట్లు వేస్తున్న కూలీలు
వారం రోజులుగా జిల్లాలో కురుస్తున్న మోస్తరు వర్షాలతో రైతులు ఆనంద పడుతున్నారు. రెండు నెలలుగా వరుణుడు కరుణించకపోవడంతో దిగాలుగా ఉన్న రైతులు ప్రస్తుతం వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు. కొందరు ఇప్పటికీ విత్తనాలు వేస్తుండగా.. మరికొందరు గుంటుక తోలుతున్నారు.
సాక్షి, మెదక్ : ఈ సీజన్‌లో ఇప్పటివరకు భారీ వర్షం పడకపోవడంతో చెరువులు, కుంటలు బోసిగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ముసురేసిన వాన ఆరుతడి పంటలకు ఊపిరి పోస్తుండగా.. నల్లరేగడి నేలలో వేసిన పత్తికి దెబ్బేనని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు జిల్లాలో ఇప్పటివరకు లోటు వర్షపాతమే నమోదైంది. భారీ వర్షాలు కురిసి జలాశయాలు, చెరువులు, కుంటలు జలకళ సంతరించుకోవడంతోపాటు భూగర్భ జలమట్టం పెరిగితేనే రైతులు ఈ ఖరీఫ్‌లో గట్టెక్కే పరిస్థితులు ఉన్నాయి.
లోటు వర్షపాతమే..
జిల్లాలో జూన్ నుంచి ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 8303.3 మిల్లీ మీటర్లు.. ఇప్పటివరకు కురిసింది 7604.2 మి.మీటర్లే. ఈ మేరకు లోటు వర్షపాతం 699.1 మి.మీలు. సగటున లెక్కేస్తే జిల్లాలో సాధారణ వర్షపాతం 415.2 మి.మీలు.. కురిసింది 380.2 మి.మీలు మాత్రమే. అంటే లోటు వర్షపాతం ఎనిమిది శాతం నమోదైనట్లు తెలుస్తోంది.
ఐదు మండలాల్లో అత్యల్పం..
జిల్లాలో 20 మండలాలు ఉండగా.. ఏడు మండలాల్లో మాత్రమే సాధారణం కంటే ఎక్కువ కురిసినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. మిగిలిన 13 మండలాల్లోనూ లోటు వర్షపాతమే నమోదైంది. జిల్లాలో పాపన్నపేట మండలంలో ఇప్పటివరకు అధిక వర్షపాతం 43.7 శాతం నమోదైంది. మొత్తం మూడు మండలాల్లో అధిక, 12 మండలాల్లో సాధారణం, మిగిలిన 5 మండలాల్లో అత్యల్పంగా వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.
వరి సాగు పెరిగే అవకాశం..
జిల్లాలో ఈ ఖరీఫ్‌లో సాధారణ సాగు అన్ని పంటలు కలిపి అంచనా 83,373 హెక్టార్లు.. ఇప్పటివరకు 55,109 హెక్టార్లలో రైతులు పంటలు వేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో జిల్లాలో వరి సాగు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో వరి సాగు అంచనా 34,985 హెక్టార్లు కాగా.. ఇప్పటివరకు 20,000 హెక్టార్లలో రైతులు సాగు చేశారు. వరి నాటేందుకు ఆగస్టు 15 వరకు సమయం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్న క్రమంలో ఇంకా సుమారు 8,000 హెక్టార్ల మేర సాగు పెరగనున్నట్లు తెలుస్తోంది.
అంచనాలు తారుమారు..
రెండు నెలలుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వ్యవసాయ అధికారులు వేసిన పంట అంచనాలు తారుమారయ్యాయి. ఆరుతడి పంటలకు చెందిన రాగులు, కొర్రలను గతంలో తక్కువగా పండించేవారు. వీటికి వ్యవసాయాధికారులు అంచనా కూడా వేయలేదు. కానీ జిల్లాలో ఇప్పటివరకు పలువురు రైతులు 100 హెక్టార్లలో రాగులు, 110 హెక్టార్లలో కొర్రలు సాగు చేశారు. 600 హెక్టార్లలో జొన్న సాగు చేస్తారనే అంచనా కాగా.. 410 హెక్టార్లలో సాగైంది. అదేవిధంగా.. జిల్లాలో 13,000 హెక్టార్లలో పత్తి సాగవుతుందని భావించగా.. 17,000 హెక్టార్లలో రైతులు పంట వేశారు. 22,000 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేస్తారని అధికారులు అంచనా వేయగా.. 13500 హెక్టార్లలో మాత్రమే మక్క సాగైంది. పలువురు మక్క రైతులు పత్తి వైపు దృష్టి సారించడంతో జిల్లాలో తెల్లబంగారం సాగు పెరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.
తెగుళ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి..
ప్రస్తుతం ప్రతిరోజూ వర్షం కురుస్తోంది. వరి సాగు పెరిగే అవకాశం ఉంది. రేగడి భూముల్లో పత్తి పంట వేసిన వారు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే వేరుకుళ్లు తెగులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా.. వాతావరణంలో తేమతో పలు పంటలకు అగ్గితెగులు వంటివి సోకుతాయి. ఈ మేరకు రైతులు వ్యవసాయాధికారులు సూచించిన మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి.
– రెబల్‌సన్, జిల్లా నోడల్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment