పంటలకు ప్రాణమొచ్చింది
♦ ప్రస్తుత వర్షాలతో సోయా, మొక్కజొన్నలకు ఉపయోగం
♦ వరి నాట్లకు మాత్రం సరిపోని వానలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న వానలతో పంటలకు ప్రాణం పోసినట్లయిందని వ్యవసాయశాఖ పేర్కొం టోంది. అనేకచోట్ల సోయా, పత్తి, మొక్కజొన్న, కంది వంటి పంటలు ఎండిపోయే దశలో ఉండగా.. తాజా వర్షాలతో ముప్పు తప్పిందని స్పష్టం చేసింది. మరో పది రోజుల తర్వాత కూడా ఇదే స్థాయిలో మళ్లీ వర్షాలు కురిస్తేనే లాభమని.. లేకుంటే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదముందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
అయితే వరికి మాత్రం ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో పెద్దగా ఉపయోగమేమీ ఉండదని పేర్కొంటున్నారు. చెరువులు, కుంట లు, జలాశయాలు నిండితేనే వరి సాగుకు ప్రయోజనకరమని.. లేకుంటే ముందస్తు రబీనే దిక్కు అని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవడం లేదని, మహ బూబ్‌నగర్ జిల్లాలో చిన్న పాటి జల్లులు తప్ప మంచి వర్షం లేదని స్పష్టం చేస్తున్నారు.
ఊపందుకోని సాగు: రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ సాగు 1.08 కోట్ల ఎకరాలుకాగా.. ఈసారి ఇప్పటివరకు 85.12 లక్షల ఎకరాల్లో సాగు మొదలైంది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 41.90 లక్షల ఎకరాలుకాగా.. 44.41 లక్షల ఎకరాలకు పెరిగింది. వరి సాధారణ సాగు 23.35 లక్షల ఎకరాలుకాగా.. ఇప్పటివ రకు 11.65 లక్షల ఎకరాల (50 శాతం)కే పరిమితమైంది. సోయా 5.80 లక్షల ఎకరాల కుగాను 4.02 లక్షల ఎకరాల్లో సాగైంది. మిరప సాగు 1.70లక్షల ఎకరాలకుగాను.. ఇప్పటివ రకు కేవలం 12,500 ఎకరాలకే పరిమిత మైంది. గతేడాది మిరపకు సరైన ధర రాకపోవ డంతో రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
ఇంకా 11 జిల్లాల్లో లోటే
రాష్ట్రంలో జూన్ ఒకటో తేదీ నుంచి బుధవారం నాటికి వర్షపాతం లెక్కలను పరిశీలిస్తే... ఇప్పటివరకు 11 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లాలో ఏకంగా 43 శాతం లోటు నమోదుకాగా.. మంచిర్యాల జిల్లాలో 40 శాతం, జగిత్యాల, కుమ్రంభీం జిల్లాల్లో 38 శాతం, నిజామాబాద్‌లో 35 శాతం, పెద్దపల్లిలో 32 శాతం, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో 29 శాతం, రాజన్న జిల్లాలో 25 శాతం, వికారాబాద్ జిల్లాలో 22 శాతం చొప్పున లోటు వర్షపాతం నమోదైంది.