జోరుగా వానలు
Published Tue, Sep 17 2013 12:29 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా ఆది, సోమవారాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. సంగారెడ్డి రెవెన్యూ డివిజన్‌లో కుండపోతగా వర్షం కురిసింది. జిల్లాలో 15.9 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కాగా సంగారెడ్డి డివిజన్‌లోనే 2.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొండాపూర్‌లో అత్యధికంగా 9.2 సెం.మీటర్ల వర్షం కురవగా, అత్యల్పంగా కొండపాకలో 1.2 మి.మీటర్ల వర్షం కురిసింది. మెదక్ డివిజన్‌లో 1.1 సెంటీమీటర్లు, సిద్దిపేట డివిజన్‌లో 1.5 సెం.మీటర్ల వర్షం పాతం నమోదైంది. నంగనూరులో 4.2 సెం.మీటర్లు, కోహీర్ మండలంలో 5.3 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. నర్సాపూర్‌లో 4.4, నంగనూరులో 4.2 సెం.మీటర్ల వర్షం కురవగా జగదేవ్‌పూర్, శివ్వంపేట మండలాల్లో 3 సెం.మీటర్లకు పైగా, తూప్రాన్, చిన్నకోడూరు, హత్నూర, కౌడిపల్లి, చిన్నశంకరంపేట మండలాల్లో 2 సెం.మీటర్ల చొప్పున వర్షం కురిసింది. కొండాపూర్, సంగారెడ్డి మండలాల్లో చెరువులు, కుంటల్లోకి వర్షం నీరు భారీగా వచ్చి చేరింది. పలు గ్రామాల్లో పంటలు నీటమునిగాయి. దీంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా వర్షాలతో చెరకు, మొక్కజొన్న, కంది, పత్తి, వరి తదితర పంటలకు లాభం చేకూరనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
పొంగిపొర్లుతున్న ‘నారింజ’
జహీరాబాద్: జహీరాబాద్‌లో రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు నారింజ ప్రాజెక్టు పొంగి ప్రవహిస్తోంది. ఆదివారం, సోమవారం భారీ వర్షం కురియడంతో జహీరాబాద్, కోహీర్ మండలాల నుంచి వర్షం నీరు నారింజ ప్రాజెక్టులోకి భారీగా వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు షటర్ల పైనుంచి నీరు బయటకు ప్రవహిస్తోంది. గతంలో కురిసిన వర్షాలకే ప్రాజెక్టు సామర్థ్యం మేరకు నిండింది. ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న నీరంతా కర్ణాటక వైపు పరుగులు పెడుతోంది. వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి మరింత వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. దీంతో ప్రాజెక్టు షటర్లను పెకైత్తే విషయాన్ని నీటి పారుదల శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. మంగళవారం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. కోహీర్ మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టులోకి సైతం వరద నీరు వచ్చి చేరింది. దీంతో అదనపు నీరు అలుగుపై నుంచి ప్రవహిస్తోందని గ్రామస్థులు పేర్కొన్నారు. భారీ వర్షాలకు సంబంధించి పంట నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని రెవెన్యూ అధికారులు తెలిపారు. వర్షం కారణంగా జహీరాబాద్‌లోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి.
Advertisement