Sangareddy division
-
పిల్లల కిడ్నాప్‌పై పుకార్లు షికార్లు
సంగారెడ్డి క్రైం : సంగారెడ్డి డివిజన్ పరిధిలో కొన్ని రోజులుగా పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారంటూ వదంతులు జోరుగా సాగుతున్నాయి. దీంతో పిల్లల తల్లిదండ్రులు తీ వ్ర ఆందోళనకు గురవుతున్నారు. పట్టణమంతా ఈ కిడ్నాప్ వదంతులు వ్యాపించాయి. ఏ నోటా విన్నా పిల్లలను పట్టుకెళ్లే వారు తిరుగుతున్నారట.. అంటూ చ ర్చించుకోవడమే కనిపిస్తోంది. దీంతో పిల్లల తల్లిదండ్రులంతా తమ పిల్లలపై ఓ కన్నేసి ఉంచుతున్నారు. స్కూళ్లకు, బయటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి తిరిగొచ్చే వరకు పిల్లల తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలో ఏ ఒక్కరు కూడా అపరిచితులు కనిపిస్తే వారిపై ప్రజలు ఓ కన్నేసి ఉంచుతున్నా రు. ఇక రాత్రి సమయాల్లో ఎవరైనా అపరిచిత వ్యక్తులు కాలనీల్లోకి వస్తే చాలు వారు పిల్లలను కిడ్నాప్ చేసే వారంటూ చితకబాదుతున్నారు. తర్వాత పోలీసులకు అప్పగిస్తున్నారు. పోలీసులు ఆ అపరిచిత వ్యక్తుల గురించి ఆరా తీయగా వారు ఏదో పనిపై వస్తున్నారని తేలుతోంది. చిన్నారుల కిడ్నాప్ జరుగుతుందని వదంతులు వ్యాపిస్తున్నాయే తప్ప ఎక్కడా కూడా పిల్లలను సంగారెడ్డి డివిజన్, పట్టణంలో నుంచి కిడ్నాప్ చేసిన సంఘటనలు లేవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. పలు గ్రామాల్లో డప్పు చాటింపులు సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ఖాన్ పేట పరిధిలోని గౌడిచెర్లలో పిల్లల కిడ్నాప్‌పై అప్రమత్తంగా ఉండాలంటూ సర్పంచ్ ఆధ్వర్యంలో డప్పు చప్పుడు చాటింపు సైతం వేయించారు. కొండాపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ కిడ్నాప్ వదంతులు ఇంకా జోరందుకున్నాయి. దాదాపు అన్ని గ్రామాల్లో పిల్లల అప్రమత్తతపై డప్పుతో చాటింపులు చేశారు. సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో చెత్త కాగితాలు ఏరుకునే వారు కొందరు కాలనీలో తిరుగుతుండగా గ్రామస్తులు వారిని అనుమానించి చితకబాదారు. తర్వాత సంగారెడ్డి రూరల్ పోలీసులకు అప్పగించారు. చైల్డ్ లైన్‌కు చెందిన సభ్యులు కొందరు నారాయణరెడ్డికాలనీకి మంగళవారం రాత్రి వచ్చి పంద్రాగస్టు రోజున జెండా ఎగురవేస్తామని, ఇక్కడ పిల్లలు ఉన్నారా? అని అడగడంతో కాలనీవాసులంతా వారిని పట్టుకున్నారు. పిల్లలు కిడ్నాప్ చేసేవారు మీరేనా? అంటూ వారిని చితకబాది పోలీసులకు అప్పగించారు. పిల్లలను కిడ్నాప్ చేసి రంగారెడ్డి జిల్లాలోని శివారు గ్రామాల్లో గుప్త నిధుల వెలికి తీసేందుకు నర బలి ఇస్తున్నారని, అందుకే పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతుంది. ఇదిలా ఉంటే పిల్లల కిడ్నాప్‌పై పాఠశాలల యాజమాన్యాలు సైతం అప్రమత్తమయ్యాయి. తమ పిల్లలకు తాము బాధ్యులం కాదని, పిల్లలను స్వయంగా పాఠశాలలకు వచ్చి, స్కూల్ బస్సుల వద్దకు వచ్చి తీసుకెళ్లాలని ఎస్ఎంఎస్ల ద్వారా పిల్లల తల్లిదండ్రులకు సమాచారం సైతం అందించాయి. ఏ ఒక్క పిల్లవాడిని సైతం బయటకు రాకుండా సెక్యూరిటీ గార్డులతో పాఠశాల పరిసరాల్లో నిఘా కట్టుదిట్టం చేశాయి. పిల్లల తల్లిదండ్రులు తప్ప ఏ ఇతర వ్యక్తులను పాఠశాలలోకి యాజమాన్యం అనుమతినివ్వడం లేదు. -
జయహో తెలంగాణ
అంతా జోష్.. హుషార్.. తీన్మార్.. ధూంధాం.. జై తెలంగాణ.. జైజై తెలంగాణ.. మిన్నంటిన నినాదాలు.. అరవై ఏళ్ల కల సాకారమైన వేళ.. మా రాష్ట్రం.. మా పాలన అని లక్షలాది గొంతుకలు ఆడిపాడాయి.. ఆదివారం అర్ధరాత్రి నుంచే జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో ఆవిర్భావ వేడుకలు నింగినంటాయి. తెలంగాణవాదుల ఉరిమే ఉత్సాహానికి అద్దంపట్టేలా దిక్కులు పిక్కటిల్లేలా... భూమ్యాకాశాలు దద్దరిల్లేలా.. కళ్లు మిరిమిట్లు గొలిపేలా సంబురాలు అంబరాన్ని తాకాయి. సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: సమైక్యరాష్ట్రం నుంచి విడివడి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన వేళ మెతుకుసీమ ఆవిర్భావ వేడుకలతో పులకించింది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన వెంటనే జిల్లాలోని పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా అంతటా తెలంగాణకు స్వాగతం పలుకుతూ ప్రజలు, నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులు ఆనందోత్సాహాల మధ్య సంబురాలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరుణంలో వందలాది గొంతుకలు జై తెలంగాణ అంటూ హోరెత్తాయి.. మరోవైపు టపాసుల మోతలు మో గాయి.. యువకులు, విద్యార్థులు కేరింతలుకొడుతూ నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. మరోవైపు తెలంగాణ జేఏసీ నాయకులు, తెలంగాణవాదులు, ఉద్యోగులు, టీఆర్ఎస్, జేఏసీ నాయకులు పలుపార్టీల నేతలు తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ ధూంధాం కళాకారుల ఆటపాటలతో తెలంగాణ సంబరాలు అంబరాన్నంటాయి. వేడుకల్లో భాగంగా తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో కేక్‌లు కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మదన్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. టీఎన్జీవో యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు సంగారెడ్డిలోని కలెక్టరేట్ కార్యాలయంలో సంబురాలు జరుపుకున్నారు. వేడుకల్లో కలెక్టర్ స్మితా సబర్వాల్ పాలుపంచుకున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కట్ చేశారు. ఉద్యోగులకు కలెక్టరేట్ ఆవరణలో పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చి తమ సంతోషాన్ని పంచుకున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో టీజేఏసీ ఆధ్వర్యంలో కొత్తబస్టాండు వద్ద తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. వేడుకల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ, టీజేఏసీ చైర్మన్ వై.అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కళాకారుడు దుర్గేశ్ఆధ్వర్యంలో నిర్వహించిన దూంధాం కార్యక్రమం పట్టణ ప్రజలను ఆకట్టుకుంది. యువకులు, విద్యార్థులు, టీఆర్ఎస్వీ కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. టీఎన్జీవో ఉద్యోగులు కలెక్టరేట్లో తెలంగాణ సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలకు నిర్వహించారు. పటాన్చెరు నియోజకవర్గంలో తెలంగాణ సంబరాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. బీహెచ్ఈఎల్, బీరంగూడ, పటాన్చెరు, ఇస్నాపూర్‌లో తెలంగాణ ఆవిర్భావ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చటంతోపాటు మిఠాయిలు పంచిపెట్టారు. బీహెచ్ఈఎల్ చౌరస్తా, ఇస్నాపూర్‌లో నిర్వహించిన ధూంధాం కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మెదక్‌లో టీఎన్జీవోభవన్, పాతబస్టాండు వద్ద నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొని కేక్‌కట్‌చేశారు. టీఆర్ఎస్, జేఏసీ నాయకులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని టపాసులు కాల్చారు. సిద్దిపేటలో పాతబస్టాండు చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం ఎదుట టీజేఏసీ, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ సంబరాలు ఘనంగా జరిగాయి. నారాయణఖేడ్‌లో రాజీవ్చౌక్వద్ద టీజేఏసీ, టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీజేఏసీ నాయకులు కిష్టయ్యమాస్టారు, శంకర్, నారాయణ పాల్గొన్నారు. జహీరాబాద్‌లో టీజేఏసీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు వేర్వేరుగా సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు ఆంబేద్కర్ విగ్రహాం దగ్గర దూంధాం కార్యక్రమం నిర్వహించారు. జోగిపేటలో టీఆర్ఎస్, జేఏసీ నాయకులు సంయుక్తంగా తెలంగాణ సంబరాలు జరుపుకున్నారు. నర్సాపూర్‌లో టీఆర్ఎస్, జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండు వద్ద వేడుకలు జరిగాయి. -
ధర తేలకుండానే క్రషింగ్!
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: చక్కెర పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి, కలెక్టర్ స్మితా సబర్వాల్ చెరకు మద్దతు ధరపై యాజమాన్యాలతో చర్చిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. రైతుల డిమాండ్లను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతున్న యాజమాన్యాలు మద్దతు ధర ప్రకటించకుండానే క్రషింగ్ ప్రారంభించాయి. మద్దతు ధర మాట ఎలా ఉన్నా తమ ఫ్యాక్టరీలకు రైతులు చెరకు తరలించక తప్పని పరిస్థితిని యాజమాన్యాలు సృష్టిస్తున్నాయి. ఓ వైపు రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నా ఇతర ప్రాంతాల నుంచి (ఆఫ్ జోన్) చెరకును తరలిస్తూ రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి. టన్నుకు కనీసం రూ.3 వేలు మద్దతు ధర చెల్లించాలని రైతు సంఘాల ప్రతినిధులు డిమాండు చేస్తున్నాయి. మంత్రి గీతారెడ్డి సమక్షంలో జరిగిన చర్చల్లోనూ ధర చెల్లింపుపై పురోగతి కనిపించలేదు. టన్నుకు రూ. 2,600కు మించి చెల్లించేది లేదంటూ యాజమాన్యాలు తెగేసి చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో 30 మంది రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు సోమవారం చెరకు పరిశ్రమల శాఖ కమిషనర్‌ను కలిసేందుకు సమాయత్తమవుతున్నారు. బహిరంగ మార్కెట్లో చక్కెర ధరను సాకుగా చూపుతూ ఫ్యాక్టరీల యాజమాన్యాలు మద్దతు ధరపై మొండికేస్తున్నాయి. చక్కెర అమ్మకాలపై వ్యాట్, ఎక్సైజ్ సుంకం తొలగిస్తే ఫ్యాక్టరీ యాజమాన్యాలు రైతులు డిమాండు చేస్తున్న మేర మద్దతు ధర ప్రకటించే అవకాశముందని రైతు సంఘాలు కమిషనర్‌కు విన్నవించాలని నిర్ణయించారు. ప్రస్తుతం చక్కెరపై ఐదు శాతం, చెరకుపై ఆరు శాతం ఎక్సైజ్ ట్యాక్స్‌ను ప్రభుత్వం వసూలు చేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో చక్కెరపై వ్యాట్ వసూలు లేనందున స్థానికంగా కూడా ఎత్తేయాలని రైతులు డిమాండు చేస్తున్నారు. ఆందోళన బాట జిల్లాలోని గణపతి, ట్రైడెంట్, నిజాం డక్కన్ చక్కెర కర్మాగారాలు టన్ను చెరకుకు రూ.2,600 చొప్పున చెల్లించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. మద్దతు ధరపై రైతుల అభ్యంతరాల నేపథ్యంలోనే యాజమాన్యాలు చెరకు క్రషింగ్ ప్రారంభించాయి. సంగారెడ్డిలోని గణపతి షుగర్స్, జహీరాబాద్‌లోని ట్రైడెంట్ ఫ్యాక్టరీలు చెరకు గానుగ ప్రారంభించాయి. గణపతి షుగర్స్ 7,600 హెక్టార్ల పరిధిలో రైతులతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఫ్యాక్టరీ క్రషింగ్ సామర్థ్యం మాత్రం రెట్టింపుగా ఉండటంతో ఆఫ్జోన్ అంటే ఒప్పందం లేని జహీరాబాద్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున చెరకు తరలిస్తోంది. ఇందుకోసం ఏజెంట్ల ద్వారా రైతులను మచ్చిక చేసుకుంటూ లోపాయికారిగా కొంత మొత్తం అదనంగా చెల్లించేందుకు సిద్ధమవుతున్నట్లు రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం, ఫ్యాక్టరీల యాజమాన్యాలు మొండిపట్టు వీడని పక్షంలో ఆందోళన తప్పదని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు నర్సింహారెడ్డి వ్యాఖ్యానించారు. -
జోరుగా వానలు
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా ఆది, సోమవారాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. సంగారెడ్డి రెవెన్యూ డివిజన్లో కుండపోతగా వర్షం కురిసింది. జిల్లాలో 15.9 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కాగా సంగారెడ్డి డివిజన్‌లోనే 2.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొండాపూర్‌లో అత్యధికంగా 9.2 సెం.మీటర్ల వర్షం కురవగా, అత్యల్పంగా కొండపాకలో 1.2 మి.మీటర్ల వర్షం కురిసింది. మెదక్ డివిజన్లో 1.1 సెంటీమీటర్లు, సిద్దిపేట డివిజన్లో 1.5 సెం.మీటర్ల వర్షం పాతం నమోదైంది. నంగనూరులో 4.2 సెం.మీటర్లు, కోహీర్ మండలంలో 5.3 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. నర్సాపూర్‌లో 4.4, నంగనూరులో 4.2 సెం.మీటర్ల వర్షం కురవగా జగదేవ్‌పూర్, శివ్వంపేట మండలాల్లో 3 సెం.మీటర్లకు పైగా, తూప్రాన్, చిన్నకోడూరు, హత్నూర, కౌడిపల్లి, చిన్నశంకరంపేట మండలాల్లో 2 సెం.మీటర్ల చొప్పున వర్షం కురిసింది. కొండాపూర్, సంగారెడ్డి మండలాల్లో చెరువులు, కుంటల్లోకి వర్షం నీరు భారీగా వచ్చి చేరింది. పలు గ్రామాల్లో పంటలు నీటమునిగాయి. దీంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా వర్షాలతో చెరకు, మొక్కజొన్న, కంది, పత్తి, వరి తదితర పంటలకు లాభం చేకూరనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. పొంగిపొర్లుతున్న ‘నారింజ’ జహీరాబాద్: జహీరాబాద్‌లో రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు నారింజ ప్రాజెక్టు పొంగి ప్రవహిస్తోంది. ఆదివారం, సోమవారం భారీ వర్షం కురియడంతో జహీరాబాద్, కోహీర్ మండలాల నుంచి వర్షం నీరు నారింజ ప్రాజెక్టులోకి భారీగా వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు షటర్ల పైనుంచి నీరు బయటకు ప్రవహిస్తోంది. గతంలో కురిసిన వర్షాలకే ప్రాజెక్టు సామర్థ్యం మేరకు నిండింది. ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న నీరంతా కర్ణాటక వైపు పరుగులు పెడుతోంది. వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి మరింత వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. దీంతో ప్రాజెక్టు షటర్లను పెకైత్తే విషయాన్ని నీటి పారుదల శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. మంగళవారం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. కోహీర్ మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టులోకి సైతం వరద నీరు వచ్చి చేరింది. దీంతో అదనపు నీరు అలుగుపై నుంచి ప్రవహిస్తోందని గ్రామస్థులు పేర్కొన్నారు. భారీ వర్షాలకు సంబంధించి పంట నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని రెవెన్యూ అధికారులు తెలిపారు. వర్షం కారణంగా జహీరాబాద్‌లోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. -
తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత..
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: జిల్లాలోని సహజ వనరులు, ఖనిజాలు లూ టీ అవుతున్నాయి. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అన్నట్టుగా మారింది పరిస్థితి. అనుమతులు లేనివారు ఖనిజాలను యథేచ్ఛగా దోచుకుంటూ లక్షల రూపాయలు గడిస్తున్నారు. అనుమతి పొందిన వారిలో కొం దరు పరిమితికి మించి ఖనిజాలు, వనరులను తవ్వుకుంటున్నట్టు తెలుస్తోంది. దర్జా గా వనరుల దోపిడీ జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతుంది. ఇది లావుంటే సీనరేజీ పేరిట జిల్లాకు కేటాయించాల్సిన నిధులనూ ప్రభుత్వం విడుదల చేయడం లేదు. దీంతో జిల్లాలో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. ఖనిజాలు తవ్వితే సీనరేజీ తప్పనిసరి.. సహజ వనరులు, ఖనిజాల తవ్వకాలకు మైనింగ్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు అనుమతులు ఇవ్వడంతోపాటు సీనరేజీ చార్జీలు వసూలు చేయాల్సి ఉంటుంది. జిల్లాలో రాళ్లు, పలుగురాళ్లు, సున్నం నిల్వలు, స్పటిక, ఇసుక, మొరం నిల్వలు అపారంగా ఉన్నాయి. దీనికితోడు ఇటుకల తయారీకి వినియోగించి నల్లమట్టి సైతం ఉంది. ఇళ్ల నిర్మాణానికి వినియోగించి గనేట్, కంకర రాళ్ల తవ్వకాలకు సంబంధించి మైనింగ్‌శాఖ అనుమతులు ఇస్తోంది. సీనరేజీ చార్జీలు ఇలా... లెసైన్స్ పొందిన వారు రాళ్లు, గనేట్, కంకర క్యూబిక్ మీటర్‌కు రూ.33 చొప్పున సీనరేజీ చార్జి చెల్లించాల్సి ఉంటుంది. సున్నపురాయి మెట్రిక్ టన్నుకు సుమారు రూ.40 నుంచి రూ.50, మొరం, మట్టి, గ్రావెల్ మెట్రిక్ టన్నుకు రూ.13 చొప్పున సీనరేజీని రెవెన్యూ, పంచాయతీ శాఖలకు కట్టాలి. మెట్రిక్ టన్ను ఇసుకకు రూ.30, లక్ష ఇటుకలకు రూ.3,500 చొప్పున సీనరేజీ చెల్లించాలి. నేరుగా ఖజానాకు.. వనరులు, ఖనిజాల తవ్వకాలకు మైనింగ్, రెవె న్యూ, పంచాయతీ శాఖ నుంచి అనుమతులు పొందిన వ్యాపారులు నేరుగా ప్రభుత్వం నిర్దేశించిన అకౌంట్లలో సీనరేజీ చార్జీలను చలాన రూపంలో జమచేయాలి. అయితే అనుమతులు పొందిన వారిలో కొందరు పరిమితికి మించి వనరులను దోచుకుంటున్నట్టు తెలుస్తోంది. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో యథేచ్ఛగా లూటీ చేస్తున్నట్టు సమాచారం. ఇదిలావుంటే అనుమతులు తీసుకోని వారు సైతం అక్రమంగా తోడేస్తున్నారు. విలువైన ఖనిజాలు మాయమవుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. జిల్లాకు కేటాయించే విధానం ఇది.. జిల్లాలో మైనింగ్ శాఖ లెసైన్స్ ఉన్నవారు రాళ్లు, సున్నపురాళ్లు, స్పటిక, ఇసుక, మొరం తవ్వకాలు జరుపుతున్నవారు, ఇటుకల తయారీ దారులు సీన రేజీ చెల్లిస్తుంటారు. ఇది నేరుగా ప్రభుత్వం ఖాతాలో జమ అవుతుంది. ఈ నిధుల్లో జిల్లా వాటాను తిరిగి జిల్లాకు కేటాయించాల్సి ఉంటుంది. ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఏడాదికి నాలుగు విడతల్లో సీనరేజీ నిధులను జిల్లాకు విడుదల చేస్తుంది. 25 శాతం జడ్పీ, 50 శాతం మండల పరిషత్, 25 శాతం పంచాయతీలకు సీనరేజీ నిధులను ప్రభుత్వం కేటాయిస్తూ ఉంటుంది. 2006 నుంచి జిల్లాకు మొండి చెయ్యి.. 2006 నుంచి జిల్లాకు పూర్తిస్థాయిలో సీనరేజీ నిధులు రావటంలేదు. 2006 నుంచి 2012 వరకు జిల్లాకు రూ.90.16 కోట్ల సీనరేజీ నిధులు రావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం కేవలం రూ.6.59 కోట్ల నిధులు మాత్రమే విడుదల చేసింది. ఇంకా రూ.83.57 కోట్ల సీనరేజీ నిధులు జిల్లాకు రావాల్సి ఉంది. సీనరేజీ బకాయిలు రాబట్టేందుకు అధికారులు విఫలయత్నం చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతుంది. నిధుల కోసం గత కలెక్టర్ సురేశ్ కుమార్ ఆరు దఫాలుగా ప్రభుత్వానికి లేఖలు రాసినట్టు సమాచారం. ప్రస్తుత కలెక్టర్ దినకర్‌బాబు సైతం గత ఫిబ్రవరిలో సీనరేజీ చెల్లింపుల గురించి ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. అయినా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించటం లేదు. ప్రజాప్రతినిధులు ఒత్తిడి అవసరం సీనరేజీ నిధులపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఆసక్తి చూపటంలేదు. దీంతో ప్రభుత్వం నుంచి జిల్లాకు రావాల్సిన నిధులు రావటంలేదు. డీఆర్సీ సమావేశాల్లో పలువురు ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని ప్రస్తావించినా ఫలితం కానరావటంలేదు. జిల్లా నుంచి డిప్యూటీ సీఎంతోపాటు ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తే నిధులు విడుదలయ్యే అవకాశాలు ఉ న్నాయి. అలా జరిగిన పక్షంలో స్థానిక సంస్థల కు జనరల్ ఫండ్‌లో సీనరేజీ నిధులు జమ అవుతాయి. తద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులకు అవకాశం ఉంటుంది. -
పెరిగిన ఎంపీటీసీ స్థానాలు 58
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: జిల్లాలో మండల ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యింది. పునర్విభజన అనంతరం జిల్లాలో కొత్తగా 58 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటయ్యాయి. ఈ మేరకు జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల్లో తుది జాబితాను మంగళవారం ప్రకటించారు. పునర్విభజన ప్రక్రియతో మొత్తం ఎంపీటీసీ స్థానాల సంఖ్య 686కు చేరుకుంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా మండల పరిషత్ అధికారులు ఎంపీటీసీ స్థానాల పునర్విభజన ప్రక్రియ చేపట్టారు. గత ఎంపీటీసీ ఎన్నికల ప్రకారం జిల్లాలో 664 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. జిల్లాలో కొత్తగా నాలుగు నగర పంచాయతీల ఏర్పాటు కావటంతో ఎంపీటీసీ స్థానాలు 628కు తగ్గాయి. 2011 జనాభా లెక్కలతో పునర్విభజనతో చేయటంతో కొత్తగా 58 ఎంపీటీసీ స్థానాలు అధికమయ్యాయి. పునర్విభజన ప్రక్రియ ముగియటంతో ఇక రాజకీయ నాయకుల దృష్టి స్థానిక సంస్థల రిజర్వేషన్లపై పడింది. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైన పక్షంలో త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ రిజర్వేషన్లు చేపట్టే అవకాశం ఉంది. అయితే రాష్ర్టంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఇప్పట్లో స్థానిక ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదిఏమైనా జిల్లాలో కొత్తగా మరో 58 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు కావటం రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఎంపీటీసీగా పోటీ చేయాలనుకునే అశావహుల్లో సైతం హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పునర్విభజనతో జిల్లాలో అత్యధికంగా జిన్నారం మండలంలో ఏడు కొత్త ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటవుతుండగా, ఆ తర్వాత పటాన్చెరు మండలంలో కొత్తగా ఐదు ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు కానున్నాయి. ఆయా మండలాల్లో జనాభా శాతం పెరగటంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య గణనీయంగా పెరిగాయి. ఇదిలా ఉంటే ఎంపీటీసీ స్థానాల పునర్విభజనను పరిగణనలోకి తీసుకుంటే అత్యధికంగా జహీరాబాద్‌లో 28 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, అత్యల్పంగా రామచంద్రాపురం మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.