సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: జిల్లాలో మండల ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యింది. పునర్విభజన అనంతరం జిల్లాలో కొత్తగా 58 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటయ్యాయి. ఈ మేరకు జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల్లో తుది జాబితాను మంగళవారం ప్రకటించారు. పునర్విభజన ప్రక్రియతో మొత్తం ఎంపీటీసీ స్థానాల సంఖ్య 686కు చేరుకుంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా మండల పరిషత్ అధికారులు ఎంపీటీసీ స్థానాల పునర్విభజన ప్రక్రియ చేపట్టారు. గత ఎంపీటీసీ ఎన్నికల ప్రకారం జిల్లాలో 664 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. జిల్లాలో కొత్తగా నాలుగు నగర పంచాయతీల ఏర్పాటు కావటంతో ఎంపీటీసీ స్థానాలు 628కు తగ్గాయి. 2011 జనాభా లెక్కలతో పునర్విభజనతో చేయటంతో కొత్తగా 58 ఎంపీటీసీ స్థానాలు అధికమయ్యాయి. పునర్విభజన ప్రక్రియ ముగియటంతో ఇక రాజకీయ నాయకుల దృష్టి స్థానిక సంస్థల రిజర్వేషన్లపై పడింది.
ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైన పక్షంలో త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ రిజర్వేషన్లు చేపట్టే అవకాశం ఉంది. అయితే రాష్ర్టంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఇప్పట్లో స్థానిక ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదిఏమైనా జిల్లాలో కొత్తగా మరో 58 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు కావటం రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఎంపీటీసీగా పోటీ చేయాలనుకునే అశావహుల్లో సైతం హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పునర్విభజనతో జిల్లాలో అత్యధికంగా జిన్నారం మండలంలో ఏడు కొత్త ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటవుతుండగా, ఆ తర్వాత పటాన్‌చెరు మండలంలో కొత్తగా ఐదు ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు కానున్నాయి. ఆయా మండలాల్లో జనాభా శాతం పెరగటంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య గణనీయంగా పెరిగాయి. ఇదిలా ఉంటే ఎంపీటీసీ స్థానాల పునర్విభజనను పరిగణనలోకి తీసుకుంటే అత్యధికంగా జహీరాబాద్‌లో 28 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, అత్యల్పంగా రామచంద్రాపురం మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.
పెరిగిన ఎంపీటీసీ స్థానాలు 58
Published Wed, Aug 28 2013 1:24 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
Advertisement