వేపాడ, న్యూస్‌లైన్: ప్రజాభిప్రాయాన్ని గుట్టుగా ఉంచాల్సిన ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనిపై ప్రశ్నించిన పాత్రికేయులపై ‘మీరు బయటికి పొండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో శుక్రవారం నిర్వహించిన స్థానిక పోలింగ్‌లో భాగంగా వేపాడ మండలంలో రూట్ నంబర్ 7లో ఉన్న నీలకంఠరాజపురం ఎంపీటీసీ సెగ్మెంట్‌లో నంబర్ 40వ బూత్‌లో ఎన్నికలు ప్రక్రియ పూర్తిచేశారు. పోలింగ్ పూర్తయిన తర్వాత శుక్రవారం రాత్రి 7.30 గంటల అనంతరం బ్యాలెట్ పెట్టెలకు సీళ్లు వేసిన ఎన్నికల సిబ్బంది ఎన్నికల విధుల కోసం కేటాయించిన ఆర్టీసీ బస్‌లో వేపాడ మండల కేంద్రానికి బయల్దేరారు.
భరతవానిపాలెం గ్రామానికి ముందున తాడవానిచెరువు మలుపు తిరుగుతుండగా బస్‌లో ఉన్న 40వ బూత్‌కు చెందిన బ్యాలెట్ బాక్స్ రోడ్డుపై పడింది. దీంతో బ్యాలెట్ బాక్స్ సీల్ ఊడిపోయి బ్యాలెట్ పేపర్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. వెంటనే అప్రమత్తమైన ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ పేపర్లను ఏరి బాక్స్‌లో వేశారు. ఇది గమనించిన భరతవానిపాలెం గ్రామస్తులు సహాయం చేయబోగా ఎస్కార్ట్‌గా ఉన్న పోలీసులు ఎవ్వరినీ దరి చేరనీయలేదు. బ్యాలెట్‌పత్రాలు ఏరుకుని బ్యాలెట్ బాక్స్‌లో వేసి, బ్యాలెట్‌బాక్స్‌తో సహా వేపాడ చేరారు. గ్రామస్తుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న పాత్రికేయులు ఆర్‌ఓ, ఏఆర్‌ఓలకు సంఘటన వివరాలు చెప్పి వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని బదులిచ్చారు.
ఈ సంఘటనను రూడీ చేసుకోవటానికి వల్లంపూడి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న విలేకరులు ఎస్.ఐ బాలాజీరావును వివరణ కోరగా ఆయన తన పోలీస్ సిబ్బందితో మాట్లాడి ‘బాక్స్ పడిపోవటం నిజం. సీల్ ఊడిపోయిందట. ఏమయిందో తెలీదు. పూర్తి వివరాలు తెలియాలి.’ అంటూ చెప్పారు. దీంతో విలేకరులతో పాటూ నీలకంఠరాజపురానికి చెందిన వైఎస్సార్సీపీ నేతలు వేచలపు చినరాయునాయుడు, పోతల రమణ, కండిపల్లి పెదనాయుడులు అంతా ఆర్‌ఓ, ఏఆర్‌ఓలకు ఫిర్యాదు చేశారు.
అయితే నేతల ప్రశ్నలకు ఆర్‌ఓ మాధరావు, ఏఆర్‌ఓ గ్లాడ్‌సలు సరిగ్గా స్పందించలేదు. ‘మేము చూడం. మాకు ఫిర్యాదు లేదు. మీరు బయటికి పొండి. పీఓ వస్తే చెబితే అప్పుడు చూస్తాం. అడిగేందుకు మీరెవ్వరు’ అంటూ సమాధానం దాటవేశారు. దీంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. నేతలకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అదే సమయంలో సీల్ లేని బ్యాలెట్ బాక్స్ ఎంపీడీఓ ఆఫీసుకు చేరుకుంది.
ఇది చూసిన పార్టీ నేతలు, విలేకరులు ‘ఇది ఎలా తెరుచుకుంది? ఎవరు తెరిచారు? ఈ ఘటనకు బాధ్యులు ఎవరు. మీకు భాద్యత లేదా..?’ అంటూ నిలదీశారు. అయితే ఎవరూ సమాధానం చెప్పకపోవడంతో వైఎస్‌ఆర్ సీపీ నేతలు అక్కడ ఎంపీడీఓ కార్యాలయంలో బైఠాయించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు జి.భారతి, కె.గోవింద, కాంగ్రెస్ నేతలు ఎం.సత్యంనాయుడు తదితరులు వచ్చి అధికారుల తీరును నిరసించారు. 40వ బూత్‌కు ప్రిసైడింగ్ అధికారిగా బాధ్యతలు నిర్వహించిన ఎల్.దాలినాయుడును ఘటన పై వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ ‘టర్నింగ్‌లో బాక్స్ కిందపడింది నిజం.
సీల్ ఊడిపోయింది, నాలుగు బ్యాలెట్ పేపర్లు పడిపోయాయి. వెంటనే ఏఆర్‌ఓకు చెప్పాం. బాక్స్ ఆఫీస్‌కు తెచ్చేయమన్నారు. తెచ్చి అప్పగించాం’ అన్నారు. 7వ రూట్‌అధికారి సతీష్ కూడా ఇలాగే చెప్పారు. అనంతరం జోనల్ అధికారి కె.ఆర్.వి.పైడిరాజు మాట్లాడుతూ ‘నాలుగు రూట్‌లు చూశాను. ఆర్‌ఓల నుంచి మెటీరియల్ తీసుకుంటుండగా విషయం తెలిసింది. ఏమైందీ నాకూ పూర్తిగా తెలియదు అంటూ చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆర్.ఓ ఎ.మాధవరావు, ఎ.ఆర్.ఓ గ్లాడ్స్‌లు మాత్రం పెదవివిప్పలేదు.
బస్సులోంచి పడిన బ్యాలెట్ బాక్స్
Published Sat, Apr 12 2014 4:05 AM | Last Updated on Tue, Aug 14 2018 5:41 PM
Advertisement
Advertisement