మరో 48 గంటలు.. పుర ఉత్కంఠ | suspense another 48 hours .. Pura | Sakshi
Sakshi News home page

మరో 48 గంటలు.. పుర ఉత్కంఠ

Published Sat, May 10 2014 1:34 AM | Last Updated on Wed, Aug 29 2018 6:13 PM

మరో 48 గంటలు.. పుర ఉత్కంఠ - Sakshi

మరో 48 గంటలు.. పుర ఉత్కంఠ

విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల జాతకాలు మరో రెండు రోజుల్లో తేలనున్నాయి. ఎన్నికలు జరిగి సుమారు 40 రోజులయినప్పటికీ వారికి నిరీక్షణ తప్పలేదు. తమ జయాపజయాలపై ఇన్నాళ్లూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు  మరో రెండు రోజుల పాటు టెన్షన్ భరించవలసి ఉంది. ఈవీఎం లలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం ఈ నెల 12న తేలిపోనుంది. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల ఎన్నికల లెక్కింపు అదే రోజున జరగనుంది. మధ్యాహ్నం ఒంటిగంట లోపే ఫలితాలు ప్రకటించనున్నారు.

 ఓట్ల లెక్కింపునకు తక్కువ సమయం పట్టినా, అభ్యర్థుల నుంచి సంతకాలు తీసుకోవడం తదితరాలకు ఇంకొంత సమ యం పడుతుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు. భద్రతా చర్యలు దృష్ట్యా విజయనగరం మున్సిపాలిటీతో పాటు సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీలకు చెందిన ఈవీఎంలను జిల్లా కేంద్రంలోని రాజీవ్ క్రీడామైదానంలో భద్రపరిచారు. ఏ మున్సిపాలిటీకి సంబంధించిన ఓట్లను అక్కడే లెక్కించాలని కలెక్టర్ కాంతీలాల్‌దండే సూచించారు.

ఈ మేరకు వాటిని శనివారం ఆయా మున్సిపాలిటీలకు తరలించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. విజయనగరం మున్సిపాలిటీకి సంబంధించి ఈవీఎంలు భద్రపరిచిన రాజీవ్‌స్టేడియంలోనే లెక్కింపు నిర్వహించనున్నట్టు  కమిషనర్ ఆర్.సోమన్నారాయణ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.

మొదట పోస్టల్ బ్యాలె ట్ల లెక్కింపు..
ఓట్ల లెక్కింపులో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. ఉదయం ఎనిమి ది గంటలకు లెక్కిపు ప్రారంభం కానుంది. ఈ మేరకు అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు ముందుగానే లెక్కింపు కేంద్రానికి చేరుకోవలసి ఉంటుంది.

ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి సెల్‌ఫోన్ సైతం అనుమతించరు.
ఓట్ల లెక్కింపును ఎన్నికల సిబ్బంది ప్రారంభించే సమయంలో అభ్యర్థికానీ అతని ఏజెంట్ కానీ విధిగా ఉండాలి. ఇందుకోసం వారికి ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు మున్సిపాలిటీ అధికారులు జారీ చేస్తున్నారు. గుర్తింపు కార్డు ఉన్న వారినే లోపలికి అనుమతిస్తారు.
ఓట్ల సంఖ్య ప్రకారం రౌండ్లు ఖరారు చేస్తారు. ఆయా వార్డుల్లోని మొత్తం ఓట్లు, ఆయా అభ్యర్థులకు వచ్చిన ఓట్ల సంఖ్యతో సరిపోయాక ఫలితం వెల్లడిస్తారు.  

లెక్కింపు కేంద్రాలు..
విజయనగరం మున్సిపాలిటీకి సంబంధించి పట్టణంలోని రాజీవ్ క్రీడామైదానంలో, సాలూరు, పార్వతీపు రం, బొబ్బిలి మున్సిపాలిటీలకు సంబంధించి ఆయా మున్సిపల్ కార్యాలయాల్లో ఓట్లు లెక్కిస్తారు. ఒక్కొక్క లెక్కింపు కేంద్రం వద్ద ప్రాథమికంగా 20 టేబుళ్ల ఏర్పాటు చేస్తారు.

ఫలితాల కోసం ఎదురుచూస్తున్న 534 మంది అభ్యర్థులు
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా మొత్తం 534 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరంతా గత నలభై రోజులుగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో జిల్లా కేంద్ర ం విజయనగరం మున్సిపాలిటీలో 40 వార్డుల నుంచి 169 మంది   పోటీ పడ్డారు. బీజేపీ నుంచి నలుగురు, సీపీఎం  నుంచి ఐదుగురు, సీపీఐ నుంచి ఇద్దరు, కాంగ్రెస్ నుంచి 38 మంది, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 39 మంది, టీడీపీ నుంచి 40 మంది, లోక్‌సత్తా నుంచి ఆరుగురు పోటీ చేయగా.. మరో 35 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టీడీపీ అధిక వార్డుల్లో పోటీలో నిలిచాయి. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు కూడా గట్టిపోటీ నివ్వడంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

- బొబ్బిలి మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులుండగా 117 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో బీఎస్పీ, బీజేపీ, సీపీఐల నుంచి ఒక్కొక్కరు పోటీ చేయగా.. సీపీఎం నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి 30 మంది, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 30 మంది, టీడీపీ నుంచి 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. లోక్‌సత్తా నుంచి ముగ్గరు, స్వతంత్ర అభ్యర్థులుగా  17 మంది పోటీ చేశారు.
- సాలూరు మున్సిపాలిటీలో 29 వార్డులుండగా 95 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఇందులో బీజేపీ, సీపీఐల నుంచి ఒకొక్కక్కరూ పోటీ చేయగా.. సీపీఎం నుంచి ఇద్దరు, కాంగ్రెస్ నుంచి 20 మంది, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 27 మంది, టీడీపీ నుంచి 29 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 15 మంది అభ్యర్థులు ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు.
- పార్వతీపురం మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులుండగా 153 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో బీజేపీ నుంచి నలుగురు, సీపీఎం నుంచి ఏడుగురు, కాంగ్రెస్ నుంచి ఏడుగురు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 30 మంది, టీడీపీ నుంచి 30 మంది, లోక్‌సత్తా పార్టీ నుంచి ఐదుగురుతో పాటు మరో 50 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement