సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: చక్కెర పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి, కలెక్టర్ స్మితా సబర్వాల్ చెరకు మద్దతు ధరపై యాజమాన్యాలతో చర్చిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. రైతుల డిమాండ్లను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతున్న యాజమాన్యాలు మద్దతు ధర ప్రకటించకుండానే క్రషింగ్ ప్రారంభించాయి. మద్దతు ధర మాట ఎలా ఉన్నా తమ ఫ్యాక్టరీలకు రైతులు చెరకు తరలించక తప్పని పరిస్థితిని యాజమాన్యాలు సృష్టిస్తున్నాయి. ఓ వైపు రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నా ఇతర ప్రాంతాల నుంచి (ఆఫ్ జోన్) చెరకును తరలిస్తూ రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి.
టన్నుకు కనీసం రూ.3 వేలు మద్దతు ధర చెల్లించాలని రైతు సంఘాల ప్రతినిధులు డిమాండు చేస్తున్నాయి. మంత్రి గీతారెడ్డి సమక్షంలో జరిగిన చర్చల్లోనూ ధర చెల్లింపుపై పురోగతి కనిపించలేదు. టన్నుకు రూ. 2,600కు మించి చెల్లించేది లేదంటూ యాజమాన్యాలు తెగేసి చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో 30 మంది రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు సోమవారం చెరకు పరిశ్రమల శాఖ కమిషనర్‌ను కలిసేందుకు సమాయత్తమవుతున్నారు. బహిరంగ మార్కెట్లో చక్కెర ధరను సాకుగా చూపుతూ ఫ్యాక్టరీల యాజమాన్యాలు మద్దతు ధరపై మొండికేస్తున్నాయి.
చక్కెర అమ్మకాలపై వ్యాట్, ఎక్సైజ్ సుంకం తొలగిస్తే ఫ్యాక్టరీ యాజమాన్యాలు రైతులు డిమాండు చేస్తున్న మేర మద్దతు ధర ప్రకటించే అవకాశముందని రైతు సంఘాలు కమిషనర్‌కు విన్నవించాలని నిర్ణయించారు. ప్రస్తుతం చక్కెరపై ఐదు శాతం, చెరకుపై ఆరు శాతం ఎక్సైజ్ ట్యాక్స్‌ను ప్రభుత్వం వసూలు చేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో చక్కెరపై వ్యాట్ వసూలు లేనందున స్థానికంగా కూడా ఎత్తేయాలని రైతులు డిమాండు చేస్తున్నారు.
ఆందోళన బాట
జిల్లాలోని గణపతి, ట్రైడెంట్, నిజాం డక్కన్ చక్కెర కర్మాగారాలు టన్ను చెరకుకు రూ.2,600 చొప్పున చెల్లించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. మద్దతు ధరపై రైతుల అభ్యంతరాల నేపథ్యంలోనే యాజమాన్యాలు చెరకు క్రషింగ్ ప్రారంభించాయి. సంగారెడ్డిలోని గణపతి షుగర్స్, జహీరాబాద్‌లోని ట్రైడెంట్ ఫ్యాక్టరీలు చెరకు గానుగ ప్రారంభించాయి. గణపతి షుగర్స్ 7,600 హెక్టార్ల పరిధిలో రైతులతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఫ్యాక్టరీ క్రషింగ్ సామర్థ్యం మాత్రం రెట్టింపుగా ఉండటంతో ఆఫ్‌జోన్ అంటే ఒప్పందం లేని జహీరాబాద్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున చెరకు తరలిస్తోంది. ఇందుకోసం ఏజెంట్ల ద్వారా రైతులను మచ్చిక చేసుకుంటూ లోపాయికారిగా కొంత మొత్తం అదనంగా చెల్లించేందుకు సిద్ధమవుతున్నట్లు రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం, ఫ్యాక్టరీల యాజమాన్యాలు మొండిపట్టు వీడని పక్షంలో ఆందోళన తప్పదని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు నర్సింహారెడ్డి వ్యాఖ్యానించారు.
ధర తేలకుండానే క్రషింగ్!
Published Sun, Dec 1 2013 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 1:10 AM
Advertisement
Advertisement