sugarcane support price
-
అన్నదాతకు ‘కొత్త’ కానుక
సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని చెరకు రైతులకు ప్రభుత్వం నూతన సంవత్సర కానుకను ప్రకటించింది. టన్ను చెరకుకు 2,650 రూపాయల మద్దతు ధరను ప్రకటించింది. రాష్ట్ర సచివాలయంలో శనివారం మంత్రి మండలి సమావేశమైంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, విభాగాల వారీగా ప్రగతి, నిధుల కేటాయింపులు, కలెక్టర్ల మహానాడులో చర్చించి తీసుకున్న నిర్ణయాల మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, పథకాలపై చర్చించారు. వ్యవసాయ ఉత్పత్తులు, రాష్ర్టంలో సాగవుతున్న పంటల ఉత్పత్తి తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం చెరకు మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. టన్నుకు రూ. 2650 : రాష్ర్టంలో 8.65 లక్షల ఎకరాల్లో చెరకు సాగువుతోంది. చెరకు రైతులకు ప్రతి ఏటా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తూ వస్తోందని సీఎం జయలలిత గుర్తుచేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, రుణాల పంపిణీ గురించి విశదీకరించారు. చక్కెర ఉత్పత్తి పెంపు లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్రం చెరకు మద్దతు ధర ప్రకటించినప్పుడల్లా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా కొంత మొత్తాన్ని చేరుస్తూ, అన్నదాతకు అందజేస్తోందని గుర్తు చేశారు. ఈ ఏడాది టన్నుకు రూ.2100 కేంద్రం నిర్ణయించగా, రవాణా ఖర్చు రూ.100తో పాటుగా రూ.550ను రాష్ట్ర ప్రభుత్వ వాటాగా పెంచామన్నారు. టన్ను మద్దతు ధర రూ.2650గా నిర్ణయించామన్నారు. 2013-14 సంవత్సరానికి మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ప్రకటించినా, రాష్ర్ట వాటాలో చడీచప్పుడు కాకుండా రూ.వంద కోత పెట్టడం గమనార్హం. 2011-12లో కేంద్రం రూ.1450ను ప్రకటించగా, రవాణా ఖర్చు రూ.100తో పాటుగా650ను ప్రభుత్వం ఇచ్చింది. అలాగే, 2012-13కు గాను కేంద్రం రూ.1700 నిర్ణయించగా, రవాణా ఖర్చు రూ.100తోపాటుగా 650ను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. అయితే, తాజాగా రూ.650, నుంచి రూ.550 కావడం గమనించాల్సిందే. -
ధర తేలకుండానే క్రషింగ్!
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: చక్కెర పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి, కలెక్టర్ స్మితా సబర్వాల్ చెరకు మద్దతు ధరపై యాజమాన్యాలతో చర్చిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. రైతుల డిమాండ్లను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతున్న యాజమాన్యాలు మద్దతు ధర ప్రకటించకుండానే క్రషింగ్ ప్రారంభించాయి. మద్దతు ధర మాట ఎలా ఉన్నా తమ ఫ్యాక్టరీలకు రైతులు చెరకు తరలించక తప్పని పరిస్థితిని యాజమాన్యాలు సృష్టిస్తున్నాయి. ఓ వైపు రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నా ఇతర ప్రాంతాల నుంచి (ఆఫ్ జోన్) చెరకును తరలిస్తూ రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి. టన్నుకు కనీసం రూ.3 వేలు మద్దతు ధర చెల్లించాలని రైతు సంఘాల ప్రతినిధులు డిమాండు చేస్తున్నాయి. మంత్రి గీతారెడ్డి సమక్షంలో జరిగిన చర్చల్లోనూ ధర చెల్లింపుపై పురోగతి కనిపించలేదు. టన్నుకు రూ. 2,600కు మించి చెల్లించేది లేదంటూ యాజమాన్యాలు తెగేసి చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో 30 మంది రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు సోమవారం చెరకు పరిశ్రమల శాఖ కమిషనర్‌ను కలిసేందుకు సమాయత్తమవుతున్నారు. బహిరంగ మార్కెట్లో చక్కెర ధరను సాకుగా చూపుతూ ఫ్యాక్టరీల యాజమాన్యాలు మద్దతు ధరపై మొండికేస్తున్నాయి. చక్కెర అమ్మకాలపై వ్యాట్, ఎక్సైజ్ సుంకం తొలగిస్తే ఫ్యాక్టరీ యాజమాన్యాలు రైతులు డిమాండు చేస్తున్న మేర మద్దతు ధర ప్రకటించే అవకాశముందని రైతు సంఘాలు కమిషనర్‌కు విన్నవించాలని నిర్ణయించారు. ప్రస్తుతం చక్కెరపై ఐదు శాతం, చెరకుపై ఆరు శాతం ఎక్సైజ్ ట్యాక్స్‌ను ప్రభుత్వం వసూలు చేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో చక్కెరపై వ్యాట్ వసూలు లేనందున స్థానికంగా కూడా ఎత్తేయాలని రైతులు డిమాండు చేస్తున్నారు. ఆందోళన బాట జిల్లాలోని గణపతి, ట్రైడెంట్, నిజాం డక్కన్ చక్కెర కర్మాగారాలు టన్ను చెరకుకు రూ.2,600 చొప్పున చెల్లించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. మద్దతు ధరపై రైతుల అభ్యంతరాల నేపథ్యంలోనే యాజమాన్యాలు చెరకు క్రషింగ్ ప్రారంభించాయి. సంగారెడ్డిలోని గణపతి షుగర్స్, జహీరాబాద్‌లోని ట్రైడెంట్ ఫ్యాక్టరీలు చెరకు గానుగ ప్రారంభించాయి. గణపతి షుగర్స్ 7,600 హెక్టార్ల పరిధిలో రైతులతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఫ్యాక్టరీ క్రషింగ్ సామర్థ్యం మాత్రం రెట్టింపుగా ఉండటంతో ఆఫ్జోన్ అంటే ఒప్పందం లేని జహీరాబాద్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున చెరకు తరలిస్తోంది. ఇందుకోసం ఏజెంట్ల ద్వారా రైతులను మచ్చిక చేసుకుంటూ లోపాయికారిగా కొంత మొత్తం అదనంగా చెల్లించేందుకు సిద్ధమవుతున్నట్లు రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం, ఫ్యాక్టరీల యాజమాన్యాలు మొండిపట్టు వీడని పక్షంలో ఆందోళన తప్పదని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు నర్సింహారెడ్డి వ్యాఖ్యానించారు.