సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: జిల్లాలోని సహజ వనరులు, ఖనిజాలు లూ టీ అవుతున్నాయి. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అన్నట్టుగా మారింది పరిస్థితి. అనుమతులు లేనివారు ఖనిజాలను యథేచ్ఛగా దోచుకుంటూ లక్షల రూపాయలు గడిస్తున్నారు. అనుమతి పొందిన వారిలో కొం దరు పరిమితికి మించి ఖనిజాలు, వనరులను తవ్వుకుంటున్నట్టు తెలుస్తోంది. దర్జా గా వనరుల దోపిడీ జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతుంది. ఇది లావుంటే సీనరేజీ పేరిట జిల్లాకు కేటాయించాల్సిన నిధులనూ ప్రభుత్వం విడుదల చేయడం లేదు. దీంతో జిల్లాలో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి.
ఖనిజాలు తవ్వితే సీనరేజీ తప్పనిసరి..
సహజ వనరులు, ఖనిజాల తవ్వకాలకు మైనింగ్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు అనుమతులు ఇవ్వడంతోపాటు సీనరేజీ చార్జీలు వసూలు చేయాల్సి ఉంటుంది. జిల్లాలో రాళ్లు, పలుగురాళ్లు, సున్నం నిల్వలు, స్పటిక, ఇసుక, మొరం నిల్వలు అపారంగా ఉన్నాయి. దీనికితోడు ఇటుకల తయారీకి వినియోగించి నల్లమట్టి సైతం ఉంది. ఇళ్ల నిర్మాణానికి వినియోగించి గనేట్, కంకర రాళ్ల తవ్వకాలకు సంబంధించి మైనింగ్‌శాఖ అనుమతులు ఇస్తోంది.
సీనరేజీ చార్జీలు ఇలా...
లెసైన్స్ పొందిన వారు రాళ్లు, గనేట్, కంకర క్యూబిక్ మీటర్‌కు రూ.33 చొప్పున సీనరేజీ చార్జి చెల్లించాల్సి ఉంటుంది. సున్నపురాయి మెట్రిక్ టన్నుకు సుమారు రూ.40 నుంచి రూ.50, మొరం, మట్టి, గ్రావెల్ మెట్రిక్ టన్నుకు రూ.13 చొప్పున సీనరేజీని రెవెన్యూ, పంచాయతీ శాఖలకు కట్టాలి. మెట్రిక్ టన్ను ఇసుకకు రూ.30, లక్ష ఇటుకలకు రూ.3,500 చొప్పున సీనరేజీ చెల్లించాలి.
నేరుగా ఖజానాకు..
వనరులు, ఖనిజాల తవ్వకాలకు మైనింగ్, రెవె న్యూ, పంచాయతీ శాఖ నుంచి అనుమతులు పొందిన వ్యాపారులు నేరుగా ప్రభుత్వం నిర్దేశించిన అకౌంట్‌లలో సీనరేజీ చార్జీలను చలాన రూపంలో జమచేయాలి. అయితే అనుమతులు పొందిన వారిలో కొందరు పరిమితికి మించి వనరులను దోచుకుంటున్నట్టు తెలుస్తోంది. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో యథేచ్ఛగా లూటీ చేస్తున్నట్టు సమాచారం. ఇదిలావుంటే అనుమతులు తీసుకోని వారు సైతం అక్రమంగా తోడేస్తున్నారు. విలువైన ఖనిజాలు మాయమవుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు.
జిల్లాకు కేటాయించే విధానం ఇది..
జిల్లాలో మైనింగ్ శాఖ లెసైన్స్ ఉన్నవారు రాళ్లు, సున్నపురాళ్లు, స్పటిక, ఇసుక, మొరం తవ్వకాలు జరుపుతున్నవారు, ఇటుకల తయారీ దారులు సీన రేజీ చెల్లిస్తుంటారు. ఇది నేరుగా ప్రభుత్వం ఖాతాలో జమ అవుతుంది. ఈ నిధుల్లో జిల్లా వాటాను తిరిగి జిల్లాకు కేటాయించాల్సి ఉంటుంది. ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఏడాదికి నాలుగు విడతల్లో సీనరేజీ నిధులను జిల్లాకు విడుదల చేస్తుంది. 25 శాతం జడ్పీ, 50 శాతం మండల పరిషత్, 25 శాతం పంచాయతీలకు సీనరేజీ నిధులను ప్రభుత్వం కేటాయిస్తూ ఉంటుంది.
2006 నుంచి జిల్లాకు మొండి చెయ్యి..
2006 నుంచి జిల్లాకు పూర్తిస్థాయిలో సీనరేజీ నిధులు రావటంలేదు. 2006 నుంచి 2012 వరకు జిల్లాకు రూ.90.16 కోట్ల సీనరేజీ నిధులు రావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం కేవలం రూ.6.59 కోట్ల నిధులు మాత్రమే విడుదల చేసింది. ఇంకా రూ.83.57 కోట్ల సీనరేజీ నిధులు జిల్లాకు రావాల్సి ఉంది. సీనరేజీ బకాయిలు రాబట్టేందుకు అధికారులు విఫలయత్నం చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతుంది. నిధుల కోసం గత కలెక్టర్ సురేశ్ కుమార్ ఆరు దఫాలుగా ప్రభుత్వానికి లేఖలు రాసినట్టు సమాచారం. ప్రస్తుత కలెక్టర్ దినకర్‌బాబు సైతం గత ఫిబ్రవరిలో సీనరేజీ చెల్లింపుల గురించి ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. అయినా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించటం లేదు.
ప్రజాప్రతినిధులు ఒత్తిడి అవసరం
సీనరేజీ నిధులపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఆసక్తి చూపటంలేదు. దీంతో ప్రభుత్వం నుంచి జిల్లాకు రావాల్సిన నిధులు రావటంలేదు. డీఆర్‌సీ సమావేశాల్లో పలువురు ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని ప్రస్తావించినా ఫలితం కానరావటంలేదు. జిల్లా నుంచి డిప్యూటీ సీఎంతోపాటు ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తే నిధులు విడుదలయ్యే అవకాశాలు ఉ న్నాయి. అలా జరిగిన పక్షంలో స్థానిక సంస్థల కు జనరల్ ఫండ్‌లో సీనరేజీ నిధులు జమ అవుతాయి. తద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులకు అవకాశం ఉంటుంది.
తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత..
Published Sun, Sep 1 2013 12:09 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM
Advertisement
Advertisement