రైతన్నల్లో ‘వర్షా’తిరేకం | Rains Bring Happiness To Farmers | Sakshi
Sakshi News home page

రైతన్నల్లో ‘వర్షా’తిరేకం

Published Sat, Sep 21 2019 10:53 AM | Last Updated on Sat, Sep 21 2019 10:53 AM

Rains Bring Happiness To Farmers - Sakshi

వేపాడలో కురుస్తున్న భారీ వర్షం

సాక్షి, విజయనగరం గంటస్తంభం:  జిల్లాపై వరుణుడు కరుణచూపాడు. రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిపించాడు. దీంతో చెరువుల్లో నీరు చేరింది. వరి సాగుపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వరి నాట్లు కాస్త ఆలస్యమైనా.. వెద పద్ధతిలో సాగుచేసిన వరి చేను ఆశాజనకంగా ఉండడం, వర్షానికి పొలాల్లో నీరు చేరడంతో రైతులు సంబరపడుతున్నారు. మరోవైపు రానున్న రోజుల్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. దీంతో పంటలకు ఇబ్బంది ఉం డదని, అక్టోబర్‌లో వరుణుడు కరుణిస్తే పంట చేతికి అందుతుందని రైతులు ఆశపడుతున్నారు.

రెండు రోజులుగా భారీ వర్షాలు..
రాష్ట్ర వ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధి కారులు ప్రకటించినట్టే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. విజయనగరం జిల్లాలోని సగానికిపైగా మండలాల్లో వర్షించింది. గుర్ల మండలంలో అత్యధికంగా 5.8 సెంటీమీటర్లు, మక్కువలో 4.1 సెంటీమీటర్లు, నెల్లిమర్లలో 3.8, వేపాడ, పూసపాటిరేగ, సీతానగరంలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మిగతా మండలాల్లో ఒకటి, రెండు సెంటీమీటర్ల వర్షం పడిం ది. దీంతో జిల్లాలో సగటున 2.1 సెంటీమీటరు వర్షపాతం నమోదైంది. ఇదిలాఉండగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. శని, ఆదివారాల్లో వర్షాలు అంతగా కురవకపోయినా సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తులు నిర్వహణశాఖ అధికారులు జిల్లా అధికారులు వెల్లడించారు.

రైతుల్లో హర్షం..
వర్షాలతో పొలాల్లో నీరు చేరింది. పంటలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు సంతోషపడుతున్నారు. కలుపుతీత, ఎరువువేయడంలో బిజీ అయ్యారు. వర్షాలకు జలాశయాలు, చెరువులు నిండితే పంట చేతికొస్తుందని ధీమా వ్యక్తంచేస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది ఖరీఫ్‌ కొంత నిరాశజనకంగా ప్రారంభమైంది. ఆలస్యంగా వర్షాలు ప్రారంభమయ్యాయి. ఆగష్టు వరకు సరైన వర్షాలు లేవు. అయితే, సెప్టెంబర్‌ నెల రైతులకు కలిసొచ్చింది. ఇప్పటికే కురవాల్సి వర్షాలు కంటే ఎక్కువ వర్షాలు పడ్డాయి. దీంతో ఈ నెలారంభం నాటికి వేసిన వరి, ఇతర పంటలు సాగుకు భరోసా లభించగా వరినాట్లు వేయని ప్రాంతాల్లో రైతులు వేసుకున్నారు. వరికి ప్రస్తుతం నీరు అవసరమైన సమయంలో వర్షాలు పడుతుండడంతో ఆనందపడుతున్నారు. రానున్న రోజుల్లో మరింత వర్షాలు పడితే ఈఏడాది గంటెక్కినట్లేనని చెబుతున్నారు.  

ఆనందంగా ఉంది..
వర్షాలు కురుస్తుండడం, పొలాల్లో నీరు చేరడంతో ఆనందంగా ఉంది. ఈ ఏడాది ఖరీఫ్‌ పంటలు చేతికందవు అనుకున్నాం. గతేడాది మాదిరిగా కరువు తప్పదనుకున్నాం. ఆలస్యంగానైనా వర్షాలు అనుకూలించాయి. రెండురోజులపాటు కురిసిన భారీ వర్షాలతో ధీమా కలిగింది. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిస్తే రైతులకు మేలు జరుగుతుంది. 
– పి.గోపి, పిడిశీల, గజపతినగరం మండలం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement