ఇకపై సబ్సిడీ ధరకే విత్తనాల సరఫరా | Now, Seeds to be supplied for Subsidy | Sakshi
Sakshi News home page

ఇకపై సబ్సిడీ ధరకే విత్తనాల సరఫరా

Published Fri, Jun 6 2014 2:07 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Now, Seeds to be supplied for Subsidy

* తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం  
* విత్తన కంపెనీలకు ముందే సబ్సిడీ చెల్లింపు
* విధానాన్ని మార్చనున్న రాష్ర్ట ప్రభుత్వం
* అన్నదాతలకు తొలగనున్న ఇబ్బందులు
* వ్యవసాయ శాఖ వర్గాలతో కేసీఆర్ సమీక్ష
* విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలకు ఆదేశం
* గ్రామ స్థాయిలోనూ విత్తనాల సరఫరా

 
సాక్షి, హైదరాబాద్: రైతులకు సబ్సిడీ విత్తనాలనే సరఫరా చేయాలని తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం విత్తనాలకు రైతులు పూర్తి ధర చెల్లిస్తే తర్వాత వారి ఖాతాల్లోకి సబ్సిడీ సొమ్ము చేరుతోంది. అయితే ఈ విధానాన్ని మార్చాలని, విత్తన కంపెనీలకు ముందే సబ్సిడీ చెల్లించి ఆ మేరకు రైతులకు సబ్సిడీ ధరకే విత్తనాలు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా నిర్ణయించారు. గురువారం ఆయన సచివాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటెల రాజేందర్, హరీశ్ రావు, వ్యవ సాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్సిడీ విత్తనాల సరఫరాపై చర్చ జరిగింది.
 
 నిజానికి చాలా ఏళ్లుగా ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలనే సరఫరా చేస్తూ వచ్చింది. కొన్ని విత్తనాలను 50 శాతం సబ్సిడీపై, మరి కొన్నింటిని 33 శాతం సబ్సిడీపై రైతులకు అందించింది. అయితే రెండేళ్లుగా ఈ పద్ధతిని మార్చారు. సబ్సిడీని నగదు రూపేణా చెల్లించాలన్న ఉద్దేశంతో విత్తనాల మొత్తం ధరను రైతులు ముందే చెల్లించే విధంగా మార్పులు తీసుకువచ్చారు. ఇందులో భాగంగా విత్తనాలు కావాల్సిన రైతు నిర్ధారిత ధర మేరకు మీసేవలో డబ్బులు చెల్లించి టోకెన్ తీసుకోవాలి. ఈ టోకెన్‌ను విత్తన సరఫరా కేంద్రంలో ఇచ్చి విత్తనాలు పొందవచ్చు. ఆ తర్వాత ఆ రైతుకు అందాల్సిన సబ్సిడీ సొమ్ము అతని బ్యాంకు ఖాతాలో జమ చేసేవారు. ఈ విధానంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు.
 
 ఈ ఏడాది కూడా ఇదే విధానం అమలు చే స్తూ విత్తనాల సరఫరాకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే తాజాగా దీనిపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్ పాత పద్ధతికే మొగ్గు చూపారు. రాష్ట్రంలో సీడ్స్ కార్పొరేషన్, హాకా, మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్ వంటి సంస్థలు సబ్సిడీ విత్తనాలను సరఫరా చేస్తున్నాయి. సబ్సిడీ నిధులను ప్రభుత్వం ఈ సంస్థలకు నేరుగా అందించనుంది. దీంతో ఇకపై రైతులు సబ్సిడీపోగా మిగిలిన డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. కాగా, విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కేసీఆర్ ఈ సందర్భంగా ఆదేశించారు. మరోవైపు తొలకరి సమీపిస్తున్న నేపథ్యంలో తగినన్ని విత్తనాలు, ఎరువులను సిద్ధంగా ఉంచినట్టు మంత్రి పోచారం ఈ సమీక్ష అనంతరం మీడియాకు తెలిపారు. విత్తనాల కోసం రైతులు రోడ్ల మీదకు వచ్చి అందోళన చేసే పరిస్థితి రాకుండా సబ్సిడీ విత్తనాలను గ్రామ స్థాయిలో సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వరి విత్తనాలు అవసరమైన స్థాయిలో ఉన్నాయన్నారు.
 
 అలాగే ఈ సీజన్‌లో సుమారు 1.75 లక్షల క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలు అవసరం కాగా ఇప్పటికే 1.10 లక్షల క్వింటాళ్ల విత్తనాలను పింపిణీకి సిద్ధంగా ఉంచామన్నారు. మిగిలిన విత్తనాలను కూడా త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. అలాగే 17.44 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటికే 6 లక్షల టన్నుల ఎరువుల్ని సమకూర్చామన్నారు. పంటలు వేసే సమయానికి మిగిలిన ఎరువులనూ అందుబాటులో ఉంచుతామని మంత్రి భరోసా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement