ఖరీఫ్‌కు సన్నద్ధం  | Preparing For Kharif Season Medak | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌కు సన్నద్ధం 

Published Wed, May 8 2019 11:25 AM | Last Updated on Tue, Jun 4 2019 5:02 PM

Preparing For Kharif Season Medak - Sakshi

రబీలో రైతులకు నిరాశే మిగిలింది. మరో నెలరోజుల్లో ప్రారంభమయ్యే ఖరీఫ్‌ సీజన్‌పైనే గంపెడాశలు పెట్టుకుని పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. రబీలో భూ గర్భజలాలు తగ్గుముఖం పట్టడం, బోర్లలో నీటి మట్టం పడిపోవడంతో సాగుచేసిన పంటలన్నీ ఎండిపోయి తీవ్ర నష్టాలపాలయ్యారు. ఖరీఫ్‌లో వర్షాలు అనుకూలిస్తాయనే నమ్మకంతో పంటల సాగుకు జిల్లావ్యాప్తంగా సంబంధిత వ్యవసాయశాఖ అధికారులు సాగు అంచనాలు.

మెదక్‌జోన్‌: వాతావరణ శాఖ అధికారుల సూచన మేరకు ఖరీఫ్‌లో 80,014 హెక్టార్ల మేర పలు రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు ప్రణాళికను రెడీ చేశారు. ప్రధాన పంటగా వరి మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో పత్తి, మూడో స్థానంలో మొక్కజొన్న పంట సాగవుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇందుకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ఉండేందుకు ముందస్తుగా వాటిని సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా నీటివనరులైన చెరువులు, కుంటలు 2,076 ఉన్నాయి. వీటితోపాటు మధ్యతరగతి ప్రాజెక్టులైన ఘణాపూర్, హల్దీ ప్రాజెక్టులు ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 95 వేల బోరుబావులు ఉన్నాయి.

గతేడాది వర్షాలులేక..
జిల్లావ్యాప్తంగా 3.20 లక్షల ఎకరాల సాగుభూములు ఉన్నాయి. వీటిలో 1.20 లక్షల ఎకరాల మేర చెరువులు కుంటలతో పాటు  ఘణాపూర్, హల్దీప్రాజెక్టుల ఆధారంగా పంటలు సాగవుతాయి. మరో  లక్ష ఎకరాల వరకు బోరుబావులే ఆధారం. మిగతా లక్ష ఎకరాల్లో వర్షాధారంపై ఆరుతడి పంటలను సాగుచేస్తారు. గతేడాది ఖరీఫ్‌లో సరైన వర్షాలు లేక నీటివనరులన్నీ ఎడారిలా మారాయి. 65 వేల హెక్టార్లలో బోరుబావుల ఆధారంగా పంటలను సాగుచేయగా సగానికి పైగా ఎండిపోయాయి. ముందుగా కురిసిన కొద్దిపాటి వర్షాలకు ఆరుతడి పంటలను సాగుచేయగా ఆ తరువాత వర్షాలు ముఖం చాటేయడంతో ఎండిపోయాయి. ఫలితంగా సాగుకోసం పెట్టిన పెట్టుబడులు రాకపోగా రైతులకు అప్పులే మిగిలాయి.

ఎరువులు, విత్తనాలు సిద్ధం
ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగుకోసం ఎరువులు, విత్తనాల కొరతలేకుండా సాగు అంచనాకు తగ్గట్టుగా వ్యవసాయశాఖ అధికారులు ముందుగానే సిద్ధం చేశారు. సబ్సిడీపై పంపిణీ చేసేందుకు 45,450 క్వింటాళ్ల అన్నిరకాల విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 26,981 మెట్రిక్‌ టన్నుల  రసాయన ఎరువులను సైతం సిద్ధంగా ఉంచారు. జూన్‌లో ఖరీఫ్‌ ప్రారంభం కానున్నందున ముందుగా సబ్సిడీపై మొక్కజొన్న విత్తనాలతో పాటు బోర్ల ఆధారంగా సాగుచేసేందుకు దొడ్డురకానికి సంబంధించిన వరి విత్తనాలను సైతం అధికారులు సిద్ధం చేశారు.

వర్షాలు సమృద్ధిగా కురిశాకే విత్తుకోవాలి
జూన్‌లో వర్షాకాలం ప్రారంభం అవుతుంది. వర్షాలు సమృద్ధిగా కురిశాకనే పంటలను విత్తుకోవాలి. వర్షాలు లేక భూగర్భజలాలు 40 మీటర్ల లోతులోకి పడిపోయాయి. బోర్లలో సైతం నీటిఊటలు ఘణనీయంగా పడిపోయాయి. వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే బోరుబావుల్లో నీటి మట్టం పెరుగుతుంది. అప్పుడే పంటలు సాగుచేయాలి. ముందుగా పంటలను సాగుచేస్తే గత ఖరీఫ్‌ మాదిరిగా పంటలు ఎదిగాక నీటి తడులు అందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. – పరుశురాం, జిల్లా వ్యవసాయశాఖ అధికారి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement