నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో ఇప్పటివరకు ఖరీఫ్ ప్రణాళికలను వ్యవసాయ శాఖ సిద్ధం చేయలేదు. జూన్ రెండో వారంలో సాగు పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే వేసవి దుక్కులను దున్నుకునే పనిలో రైతులు బిజీగా ఉన్నారు. వ్యవసాయ శాఖ మే మొదటి వారంలోనే ఖరీఫ్ పంటల సాగుకు సంబంధించిన ప్ర ణాళికలను రూపొందించి రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్‌కు పంపించాల్సి ఉంటుంది. జిల్లా వ్యవసాయ శాఖ పంపించిన ప్రణాళికల ఆధారంలో జిల్లాలో ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు కానున్నాయో తెలుసుకుని దానికి అనుగుణంగా సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, ఇతర సబ్సిడీలను కేటాయించే అవకాశం ఉంటుంది.
కానీ ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ ప్రణాళికలను రూపొందించకపోవడం వల్ల ఖరీఫ్‌లో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. జిల్లాలో ముఖ్యంగా పత్తి పంటలను ఆగ్రభాగంలో సాగుచేస్తుంటారు. ప్రణాళికలను తయారు చేయడంలో ఆలస్యం కావడం వల్ల పత్తి విత్తనాలకు రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రతి సంవత్సరం ఖరీఫ్‌సాధారణ సాగు విస్తీర్ణానికి అదనంగా మరో పదిశాతం ఎక్కువగా అంచనా వేసి రాష్ట్ర వ్యవసాయశాఖ అనుమతి కోసం పంపిస్తారు. కానీ ఫిబ్రవరి మాసం నుంచి రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కారణంగా జిల్లా వ్యవసాయశాఖ అధికారులతోపాటు మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులకు ఎన్నికల విధులు కేటాయించారు. ఈ కారణంగానే ఖరీఫ్ ప్రణాళికలను తయాను చేయడంలో ఆలస్యమవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఖరీఫ్‌లో పత్తి సాగు పెరిగే అవకాశం
గత సంవత్సరం ఖరీఫ్‌లో పత్తి 2,38,635 హెక్టార్లలో సాగు చేయగా ప్రస్తుత ఖరీఫ్‌లో 2లక్షల 75 వేల హెక్టార్ల వరకు సాగు అయ్యే అవకాశం ఉంటుందని అనధికారికంగా వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గత ఖరీఫ్‌లో పత్తికి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో రైతులు ఈ సాగుపైనే మొగ్గు చూసే అవకాశం ఉంటుంది. అదే విధంగా వరి 78 వేల హెక్టార్లలో గత సంవత్సరం సాగైంది. ప్రస్తుతం 90వేల హెక్టార్ల వరకు పెరిగి అవకాశం ఉంటుంది. కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ ఇతర పంటలు గత ఖరీఫ్‌లో 23వేల హెక్టార్లలో సాగు కాగా, ప్రస్తుత ఖరీఫ్‌లో 30వేల హెక్టార్లలో సాగు అయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
ఆలస్యమైతే రైతులకు ఇబ్బందులే..
ఖరీఫ్ ప్రణాళికలను తయారు చేయడం ఆలస్యమైతే రైతులకు రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యవసాయ శాఖ ముందస్తుగా జూన్ మొదటి వారంలోపే విత్తనాలు, ఎరువులను సిద్ధంగా ఉంచాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులలో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం నానా అవస్థలకు గురికావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్టె విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికే రైతులు ప్రైవేటు డీలర్ల వద్ద కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సబ్సిడీపై జనుము, పిల్లపెసర తదితర పచ్చిరొట్టె ఎరువుల విత్తనాలను ముందస్తుగా రైతులకు అందుబాటులో ఉంచేది. ఏ సమయంలో వర్షాలు కురిసినా వెంటనే ఈ విత్తనాలను చల్లి పొలాలలో దుక్కులను దున్నుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ప్రణాళికలను సిద్దం చేయకపోవడంతో సబ్సిడీపై పచ్చిరొట్టె, ఇతర వరి, కంది, పెసర వంటి విత్తనాలు రైతులకు అందుబాటులో లేని పరిస్థితి.
నెలాఖరుకు పూర్తి చేస్తాం
వరుస ఎన్నికల కారణంగా వ్యవసాయశాఖ సిబ్బంది, అధికారులందరూ ఎన్నికల విధుల్లో ఉన్నారు. దీంతో ఖరీఫ్ ప్రణాళికను తయారు చేయడంలో ఆలస్యమవుతోంది. ఈ నెలాఖరు వరకు ప్రణాళికను పూర్తి చేసి రాష్ట్ర కమిషనరేట్‌కు పంపిస్తాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. –శ్రీధర్‌రెడ్డి, జేడీఏ
Comments
Please login to add a commentAdd a comment