రాళ్ల భూముల్లోనూ ఇక పంట సిరులు! | Engineer Snadeep Invent Low Cost Harvester Clears Stones And Makes Land Cultivable | Sakshi
Sakshi News home page

రాళ్ల భూముల్లోనూ ఇక పంట సిరులు!

Published Tue, Aug 24 2021 11:07 AM | Last Updated on Tue, Aug 24 2021 11:07 AM

Engineer Snadeep Invent Low Cost Harvester Clears Stones And Makes Land Cultivable - Sakshi

రాళ్లు, రప్పలతో నిండిన భూములు పంటల సాగుకు పనికిరావు. రాళ్లు రప్పలు ఎక్కువగా ఉన్న భూములను పడావుగా వదిలేస్తూ ఉండటం మెట్ట ప్రాంతాల్లో సర్వసాధారణం. ఒక మోస్తరుగా రాళ్లుండే భూముల్లో కూలీలను పెట్టి రాళ్లను ఏరి వేయించటం వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. తవ్వేకొద్దీ రాళ్లు బయటపడుతూ ఉంటుండడంతో.. ఏటేటా కూలీలతో రాళ్లను ఏరించాల్సిన పరిస్థితి. ఈ బాధలు పడలేక ఆ భూములపై ఆశలు వదులుకుంటున్న రైతులు ఎందరో కనిపిస్తారు. ఈ రాళ్ల కష్టాల నుంచి రైతులను గట్టెక్కించి, సాగు భూమి విస్తీర్ణం పెంచుకునేందుకు ఉపకరించే ప్రత్యేక యంత్రాన్ని ఆవిష్కరించారు ఓ యువ ఇంజనీర్‌. 

వేలాది ఎకరాలు.. 
సంగారెడ్డి జిల్లా మనురు మండలం బొరంచకు చెందిన రైతు కుటుంబంలో పుట్టిన కె.దీపక్‌రెడ్డి హైదరాబాద్‌ మీర్‌పేట్‌లోని టీకేఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో 2016లో బీటెక్‌ పూర్తి చేశారు. ఉద్యోగంలో చేరకుండా సొంత పరిశోధనలను కొనసాగించారు. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న తమ స్వగ్రామం పరిసరాల్లోనే పది వేల ఎకరాల వరకు ఉన్న రాళ్ల భూములను సాగు యోగ్యంగా మార్చుకోవడానికి ఏమైనా యంత్రాన్ని కనిపెడితే బాగుంటుంది అని ఆలోచన చేశారు. 3.5 ఏళ్లుగా మల్టీపర్పస్‌ హెర్వెస్టర్‌ పరిశోధనలపైనే దృష్టిని కేంద్రీకరించి, పట్టుదలతో విజయం సాధించారు. ఇప్పటి వరకు సొంత డబ్బు రూ. 5 లక్షల ఖర్చు పెట్టారు. 

ఎకరానికి 4 గంటలు చాలు..
దీపక్‌రెడ్డి రూపొందించిన హార్వెస్టర్‌ను 50, అంతకన్నా ఎక్కువ అశ్వ శక్తి కలిగిన ట్రాక్టర్‌కు అనుసంధానించి ఉపయోగించాలి. మట్టిని తవ్వుకుంటూ జల్లెడ పట్టి రాళ్లను లేదా ఉల్లి, బంగాళదుంప వంటి గుండ్రటి పంట ఉత్పత్తులను సేకరించి.. వాటిని ఈ యంత్రంలోనే ఉన్న బక్కెట్‌లో నిల్వచేస్తుంది. రైతులకు ఖర్చు తగ్గడంతో పాటు, సమయం కూడా ఆదా అవుతుందని చెబుతున్నారు. ఎకరం భూమిలో ఉన్న రాళ్లన్నింటినీ కేవలం 3–4 గంటల్లో రూ. మూడు వేల నుంచి నాలుగు వేల ఖర్చుతో ఏరివేయవచ్చన్నది దీపక్‌రెడ్డి మాట.

కూలీలతో ఈ పని చేయిస్తే కనీసం రూ. 12 వేలకు పైగా ఖర్చవుతుందన్నారు. ఎకరంలో రాళ్లు ఏరివేయాలంటే కూలీలు రోజుల తరబడి పనిచేయాల్సి వస్తుంది. పైగా భూమి పైపైన ఉన్న రాళ్లను మాత్రమే కూలీలు తీయగలుగుతారు. కానీ ఈ యంత్రం సహాయంతో కనీసం తొమ్మిది అంగుళాల లోతులో ఉన్న రాళ్లను కూడా ఏరెయ్యవచ్చని తెలిపారు. 

రూ. 10 లక్షల ఐసీఏఆర్‌ గ్రాంటు 
స్టార్టప్‌ కంపెనీ రిజిస్ట్రేషన్‌ కోసం ఇటీవలే దరఖాస్తు చేసిన దీపక్‌రెడ్డి.. దీన్ని వాణిజ్యపరంగా విక్రయించేందుకు మరో ఏడాది సమయం పడుతుందంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఇన్నోవేషన్‌ టూ ఎంటర్‌పెన్యూర్‌ (ఐ టు ఏ)కు దరఖాస్తు చేశారు. ‘నిధి ప్రయాస్‌’ పథకం కింద భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) రూ. పది లక్షల గ్రాంటును విడుదల చేసింది. ఇప్పటి వరకు సొంత డబ్బుతోనే తిప్పలు పడుతున్న దీపక్‌రెడ్డికి ఐసీఏఆర్‌ గ్రాంటుతో కొండంత బలం వచ్చింది. ఇతర వనరుల నుంచి నిధులు సమకూర్చుకోవడానికి కూడా ఐసీఏఆర్‌ గుర్తింపు ఉపకరిస్తుందని ఆశిస్తున్నారు.

ఈ ఉత్సాహంతో యంత్రాన్ని మరింత అభివృద్ధి చేసి, ఏడాదిలో రైతులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నానని దీపక్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఓ రైతు ఇటీవల టర్కీ నుంచి ఇలాంటి ఓ యంత్రాన్ని రూ. 12 లక్షలతో దిగుమతి చేసుకున్నారన్నారు. తాను రూపొందించిన హార్వెస్టర్‌ను రూ. 2.5 లక్షలకే రైతులకు అందుబాటులో తేబోతున్నానన్నారు. రాళ్ల భూముల్లోనే తన బంగారు భవిష్యత్తును వెతుక్కుంటూ కలలు పండించుకుంటున్న రైతుబిడ్డ, సృజనశీలి దీపక్‌రెడ్డికి శుభాభినందనలు!
– పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి 

ఆలుగడ్డ, ఉల్లిగడ్డలనూ తవ్వి తీస్తుంది!
పొలంలో రాళ్లను ఏరివేయడంతోపాటు దుంప పంటల కోతలకు కూడా ఈ బహుళ ప్రయోజనకారి అయిన ఈ హార్వెస్టర్‌ ఉపయోగపడుతుంది. ఆలుగడ్డ, ఉల్లిగడ్డలను తవ్వి తీయడానికి కూడా ఈ యంత్రం ఉపయోగపడుతుంది. ఎకరానికి 3–4 గంటల సమయం పడుతుంది. మార్కెట్‌లో యంత్రాలు ఉన్నప్పటికీ.. ధర రూ. 8 లక్షల వరకు ఉండటం వల్ల రైతులకు అందుబాటులో లేవని దీపక్‌రెడ్డి తెలిపారు. రూ. 2.50 లక్షలకే తాను అందుబాటులోకి తేనున్న హార్వెస్టర్‌ రైతులను కష్టాల నుంచి గట్టెక్కించడానికి తోడ్పడుతుందని దీపక్‌రెడ్డి ఆశిస్తున్నారు.

మూడున్నరేళ్లు శ్రమించా..!
మంజీరా నది మాకు దగ్గర్లో ఉన్నప్పటికీ రాళ్లు, రప్పల కారణంగా మా ప్రాంతంలో భూమి వేల ఎకరాలు పడావు పడి ఉంటున్నది. మాకు కూడా 2 ఎకరాల రాళ్ల పొలం ఉంది. ఏదైనా పంటలు వేస్తే ఎండల తీవ్రతకు రాళ్లు వేడెక్కి పంటలు, తోటలను దెబ్బతీస్తున్నందున వేలాది ఎకరాల్లో పంటలు పండించలేని పరిస్థితి ఉంటుంది. ఏటా ఎండాకాలంలో కూలీలను పెట్టి రాళ్లను ఏరివేయించడం ఇబ్బందికరంగా మారింది.

ఈ సమస్య పరిష్కరం కోసం మార్గం ఏమిటా అని అన్వేషించాను. ఇతర దేశాల్లో రైతులకు అందుబాటులో ఉన్న యంత్రాలను ఆన్‌లైన్‌లో పరిశీలించాను. మెకానికల్‌ ఇంజనీర్‌గా నాకున్న పరిజ్ఞానంతో మన పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా యంత్రాన్ని రూపొందించే పరిశోధన ప్రారంభించాను. మూడున్నరేళ్లుగా ఇదే పని మీద ఉన్నాను. ఎట్టకేలకు మల్టీపర్పస్‌ హార్వెస్టర్‌ యంత్రం ప్రొటోటైప్‌ను రూపొందించాను. పొలాల్లో ప్రయోగించి సత్ఫలితాలు సాధించాను.
– కె. దీపక్‌రెడ్డి, 
బొరంచ, మనురు మండలం, సంగారెడ్డి జిల్లా  

► పాలేకర్‌ ఆన్‌లైన్‌ పాఠాలు 
భారతీయ ప్రకృతి వ్యవసాయ పితామహులు డా. సుభాష్‌ పాలేకర్‌ ‘తిరిగి ప్రకృతిలోకి..’ సిరీస్‌లో భాగంగా సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో తన యూట్యూబ్‌ ఛానల్‌లో 5 రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. టెర్రస్‌ గార్డెనింగ్, కిచెన్‌ గార్డెనింగ్, ఔషధాలతో పనిలేని మానవ జీవనం, ఆధ్యాత్మిక జీవన విధానం, సుభాష్‌ పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయదారులు, వినియోగదారులంతా ఒకే కుటుంబం.. తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. సెప్టెంబర్‌ 12, 26 తేదీలు, అక్టోబర్‌ 3, 10,17 తేదీల్లో మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు) 6 గంటల పాటు శిక్షణ ఇస్తారు. పాలేకర్‌ వాట్సప్‌ నంబరు: 98503 52745. ఇతర వివరాలకు.. అమిత్‌ పాలేకర్‌ – 96731 62240 
యూట్యూబ్‌లో  ్ఖఆఏఅ ఏ ్కఅఔఉఓఅఖఓఖ్ఖ ఏఐ ఛానల్‌ని సబ్‌స్రైబ్‌ చేసుకొని ఈ శిక్షణ పొందవచ్చు.

► పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్‌ ప్రమాణాలపై శిక్షణ
మార్కెట్లకు తరటించే క్రమంలో పండ్లు, కూరగాయలను ప్యాక్‌ చేయడానికి సంబంధించిన నూతన పద్ధతులు, పదార్థాలు, యంత్రాలు, ప్యాక్‌ హౌస్‌ నిర్వహణ, కోల్డ్‌స్టోరేజ్‌ రవాణా, లేబెలింగ్‌ ప్రమాణాలపై అవగాహన కలిగించడానికి తంజావూరులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ’ ఈ నెల 31న ఉ. 10 గం. నుంచి 1.30 గం వరకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇవ్వనుంది. ఫీజు రూ. 590 (జిఎస్టీ అదనం). ఈనెల 30 లోగా రిజిస్టర్‌ చేసుకోవచ్చు. వివరాలకు.. 97509 68415, 88482 55361

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement