ఒక్కసారి నాటితే వందేళ్ల వరకూ దిగుబడి.. | Areca Nut Farming Farmers Getting More Revenue In AP | Sakshi
Sakshi News home page

ఒక్కసారి నాటితే వందేళ్ల వరకూ దిగుబడి..

Published Wed, Oct 27 2021 11:01 PM | Last Updated on Thu, Oct 28 2021 12:04 PM

Areca Nut Farming Farmers Getting More Revenue In AP - Sakshi

అమరాపురం: వక్క తోట సిరులు కురిపిస్తోంది. ఐదేళ్ల సంరక్షణ అనంతరం రాబడి మొదలవుతుంది. ఏటా దిగుబడి పెరగడంతో పాటు ఆదాయమూ రెట్టింపవుతుంది. చెట్లకు అవసరమైన మేరకు నీరు, పేడ, మట్టిని అందిస్తే చాలు. పెద్దగా ఖర్చు చేయాల్సింది లేదు. ధరలు నిలకడగా ఉండటంతో రైతులు నిశ్చింతగా ఉండొచ్చు. ఒక్కసారి పంట సాగు చేస్తే వంద సంవత్సరాల వరకు దిగుబడులు వస్తూనే ఉంటాయి.

అనంతపురం జిల్లాలో సంప్రదాయ పంట వేరుశనగ. అత్యధిక శాతం రైతులు ఈ పంటను సాగు చేస్తుంటారు. అయితే అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల చాలాసార్లు పంట చేతికందకుండానే పోతోంది. పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితులు లేకపోవడంతో బోరుబావులు కలిగిన కొందరు రైతులు,  వక్క తోటలపై మక్కువ చూపుతున్నారు. అమరాపురం, రొళ్ల, అగళి, గుడిబండ, మడకశిర, కుందుర్పి, రాయదుర్గం తదితర మండలాల్లో వక్క తోటల సాగు అధికంగా ఉంది. ఒక్క మడకశిర నియోజకవర్గంలోనే ఐదు వేల ఎకరాలకు పైగా వక్క సాగవుతోంది.


నారు పోయడం 
సాగు చేయడానికి ముందు ఎండిన ఒలిసిన వక్కను రైతులు తీసుకొచ్చి నారు పోస్తారు. పాలిథిన్‌ కవర్‌ తీసుకుని అందులో విత్తనం వేసి నీరు పోస్తారు. పది రోజుల తరువాత వక్క విత్తనం నుంచి మొక్క బయటికి వస్తుంది. ఇలా సంవత్సరం, రెండు సంవత్సరాల వరకు నీరు, ఎరువు అందించి మొక్కను తోటలో లేదా ఇంటి ఆవరణలో పెంచుతారు.

సాగు పద్ధతులు 
వక్క మొక్క రెండేళ్ల వయసుకు వచ్చిన తరువాత రైతులు తమ పొలాల్లో 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పులో నాటుతారు. ఒక ఎకరాకు 400 మొక్కలు నాటవచ్చు. ఇలా సాగు చేసిన 5 సంవత్సరాలకు పంట దిగుబడి ప్రారంభమవుతుంది. ఒక ఎకరా తోట నుంచి ఎండబెట్టిన వక్కలు ఆరు క్వింటాళ్ల వరకూ వస్తాయి   

నిలకడగా వక్క ధరలు 
రెండేళ్ల నుంచి వక్క ధరలు నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో వక్క క్వింటాలు ధర రూ.48 వేల నుంచి రూ. 52 వేల వరకు పలుకుతోంది. కిలో వక్క రూ.500. అంటే ఒక ఎకరాలో ఆరు క్వింటాళ్ల దిగుబడి వస్తే మొత్తం రూ.3 లక్షల ఆదాయం వస్తుంది. ఈ లెక్కన నెలకు రూ.25 వేల ఆదాయం వచ్చినట్లే. దీంతో ఈ ప్రాంతంలోని రైతులు వక్క పంటను అధికంగా సాగు చేస్తున్నారు. 

కర్ణాటక రైతులే స్ఫూర్తి 
మడకశిర నియోజకవర్గం కర్ణాటకకు ఆనుకుని ఉంది. ముఖ్యంగా మడకశిర మండలం తప్ప మిగతా నాలుగు మండలాల్లో కన్నడ ప్రజలతో బంధుత్వాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కర్ణాటకలోని హిరియూర్, శిర, మధుగిరి, పావగడ, తుమకూరు, హుళియార్‌ తదితర ప్రాంతాల్లో వక్కతోటలను రైతులు అధికంగా సాగు చేస్తారు. అక్కడి రైతుల స్ఫూర్తితో మడకశిర నియోజకవర్గ రైతులు కూడా వక్క సాగుకు శ్రీకారం చుట్టారు.  

నెలకోసారి కోత..  
వక్క పంట కోత సాధారణంగా జూలై నెలలో ప్రారంభమవుతుంది. డిసెంబర్‌ ఆఖరు వరకు కోస్తారు. నెలకు ఒక సారి పంట కోత ఉంటుంది. పచ్చి గెలలను కోసిన తరువాత వాటి నుంచి వక్కను వేరు చేస్తారు. అనంతరం మహిళా కూలీలు, వక్క వలిచే యంత్రాల సహకారంతో చిప్పను, వక్క ఉండలను వేరు చేస్తారు. అనంతరం నీళ్లలో ఉడకబెట్టి తరువాత 8 రోజుల పాటు ఎండకు ఆరబెట్టి సంచుల్లో నింపి నిల్వ చేస్తారు. మార్కెట్లో మంచి ధర ఉన్నపుడు అమ్మకాలు చేస్తారు. ఇలా వక్క పంటను ఈ ప్రాంతంలోని రైతులు బోరు బావుల కింద సాగు చేసి అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.  

వేసవిలో ఇబ్బంది 
వేసవి కాలంలో వక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధిక ఉష్టోగ్రతలకు తోడు బోరు బావుల్లో నీటిమట్టం పడిపోవడంతో వక్క తోటలకు సరిగా నీరు అందడంలేదు. దీంతో రైతులు లక్షలు ఖర్చు చేసి మరో బోరు తీయడానికి ప్రయత్నిస్తున్నారు.  నీరు పడితే అదృష్టం.. లేకపోతే పంటతో పాటు బోరు పెట్టుబడి కూడా పోతోంది.

ఏపీలో మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలి 
మడకశిర నియోజకవర్గంలో వక్కతోటలు పెద్ద ఎత్తున ఉన్నాయి. వక్క ఉత్పత్తి కూడా ఏటా పెరుగుతూనే ఉంది. ఏపీలో వక్క మార్కెటింగ్‌కు  సౌకర్యంలేదు. దీంతో రైతులు కర్ణాటకలోని భీమసముద్రం, శిర, తుమకూర్, శివమొగ్గ, చన్నగిరి తదితర ప్రాంతాల మార్కెట్లలో వక్కను విక్రయిస్తున్నారు. ఈ మార్కెట్లలో దళారుల బెడద కూడా ఎక్కువగా ఉంది. గతంలో అమరాపురంలో మార్కెట్‌ ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. ఇందుకు ప్రజాప్రతినిధులూ సానుకూలంగా హామీ ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వమైనా చర్యలు తీసుకొని వక్క మార్కెట్‌ను స్థానికంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  – రంగప్ప, రైతు గౌడనకుంట, అమరాపురం మండలం

వక్కతోట ఉంటే ఉద్యోగం ఉన్నట్టే 
నాకున్న ఐదెకరాల పొలంలో మూడున్నర ఎకరాల్లో వక్క తోట సాగు చేశా. వక్క తోట ఉంటే ఇంటిలో ఒక ఉద్యోగం ఉన్నట్లే. ఎందుకంటే ఒక ఎకరా తోట ఆరు క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. దీంతో ప్రస్తుత ధర ప్రకారం రూ.2.5 లక్షల ఆదాయం వస్తుంది. ఉన్న ఊరిలోనే వక్కతోట సాగు చేసి అధిక ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం రెండున్నర ఎకరాల్లో కొత్తగా వక్క పంట సాగు చేశా.  – మంజునాథ రైతు, తమ్మడేపల్లి, అమరాపురం మండలం 

ఉపాధి దొరుకుతోంది 
వక్క తోటలతో రోజూ ఉపాధి దొరుకుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తా. కూలి రూ.400 ఇస్తారు. అలాగే భోజనం, టిఫిన్‌ పెడతారు. వక్క తోటల వల్ల ఆడ, మగ తేడా లేకుండా అందరికీ పని లభిస్తోంది. పని కూడా నీడలోనే చేస్తాం. ఎటువంటి ఇబ్బందీ లేదు.  – జయన్న, కూలీ, గౌడనకుంట, అమరాపురం మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement