Arecanuts
-
ఒక్కసారి నాటితే వందేళ్ల వరకూ దిగుబడి..
అమరాపురం: వక్క తోట సిరులు కురిపిస్తోంది. ఐదేళ్ల సంరక్షణ అనంతరం రాబడి మొదలవుతుంది. ఏటా దిగుబడి పెరగడంతో పాటు ఆదాయమూ రెట్టింపవుతుంది. చెట్లకు అవసరమైన మేరకు నీరు, పేడ, మట్టిని అందిస్తే చాలు. పెద్దగా ఖర్చు చేయాల్సింది లేదు. ధరలు నిలకడగా ఉండటంతో రైతులు నిశ్చింతగా ఉండొచ్చు. ఒక్కసారి పంట సాగు చేస్తే వంద సంవత్సరాల వరకు దిగుబడులు వస్తూనే ఉంటాయి. అనంతపురం జిల్లాలో సంప్రదాయ పంట వేరుశనగ. అత్యధిక శాతం రైతులు ఈ పంటను సాగు చేస్తుంటారు. అయితే అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల చాలాసార్లు పంట చేతికందకుండానే పోతోంది. పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితులు లేకపోవడంతో బోరుబావులు కలిగిన కొందరు రైతులు, వక్క తోటలపై మక్కువ చూపుతున్నారు. అమరాపురం, రొళ్ల, అగళి, గుడిబండ, మడకశిర, కుందుర్పి, రాయదుర్గం తదితర మండలాల్లో వక్క తోటల సాగు అధికంగా ఉంది. ఒక్క మడకశిర నియోజకవర్గంలోనే ఐదు వేల ఎకరాలకు పైగా వక్క సాగవుతోంది. నారు పోయడం సాగు చేయడానికి ముందు ఎండిన ఒలిసిన వక్కను రైతులు తీసుకొచ్చి నారు పోస్తారు. పాలిథిన్ కవర్ తీసుకుని అందులో విత్తనం వేసి నీరు పోస్తారు. పది రోజుల తరువాత వక్క విత్తనం నుంచి మొక్క బయటికి వస్తుంది. ఇలా సంవత్సరం, రెండు సంవత్సరాల వరకు నీరు, ఎరువు అందించి మొక్కను తోటలో లేదా ఇంటి ఆవరణలో పెంచుతారు. సాగు పద్ధతులు వక్క మొక్క రెండేళ్ల వయసుకు వచ్చిన తరువాత రైతులు తమ పొలాల్లో 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పులో నాటుతారు. ఒక ఎకరాకు 400 మొక్కలు నాటవచ్చు. ఇలా సాగు చేసిన 5 సంవత్సరాలకు పంట దిగుబడి ప్రారంభమవుతుంది. ఒక ఎకరా తోట నుంచి ఎండబెట్టిన వక్కలు ఆరు క్వింటాళ్ల వరకూ వస్తాయి నిలకడగా వక్క ధరలు రెండేళ్ల నుంచి వక్క ధరలు నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో వక్క క్వింటాలు ధర రూ.48 వేల నుంచి రూ. 52 వేల వరకు పలుకుతోంది. కిలో వక్క రూ.500. అంటే ఒక ఎకరాలో ఆరు క్వింటాళ్ల దిగుబడి వస్తే మొత్తం రూ.3 లక్షల ఆదాయం వస్తుంది. ఈ లెక్కన నెలకు రూ.25 వేల ఆదాయం వచ్చినట్లే. దీంతో ఈ ప్రాంతంలోని రైతులు వక్క పంటను అధికంగా సాగు చేస్తున్నారు. కర్ణాటక రైతులే స్ఫూర్తి మడకశిర నియోజకవర్గం కర్ణాటకకు ఆనుకుని ఉంది. ముఖ్యంగా మడకశిర మండలం తప్ప మిగతా నాలుగు మండలాల్లో కన్నడ ప్రజలతో బంధుత్వాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కర్ణాటకలోని హిరియూర్, శిర, మధుగిరి, పావగడ, తుమకూరు, హుళియార్ తదితర ప్రాంతాల్లో వక్కతోటలను రైతులు అధికంగా సాగు చేస్తారు. అక్కడి రైతుల స్ఫూర్తితో మడకశిర నియోజకవర్గ రైతులు కూడా వక్క సాగుకు శ్రీకారం చుట్టారు. నెలకోసారి కోత.. వక్క పంట కోత సాధారణంగా జూలై నెలలో ప్రారంభమవుతుంది. డిసెంబర్ ఆఖరు వరకు కోస్తారు. నెలకు ఒక సారి పంట కోత ఉంటుంది. పచ్చి గెలలను కోసిన తరువాత వాటి నుంచి వక్కను వేరు చేస్తారు. అనంతరం మహిళా కూలీలు, వక్క వలిచే యంత్రాల సహకారంతో చిప్పను, వక్క ఉండలను వేరు చేస్తారు. అనంతరం నీళ్లలో ఉడకబెట్టి తరువాత 8 రోజుల పాటు ఎండకు ఆరబెట్టి సంచుల్లో నింపి నిల్వ చేస్తారు. మార్కెట్లో మంచి ధర ఉన్నపుడు అమ్మకాలు చేస్తారు. ఇలా వక్క పంటను ఈ ప్రాంతంలోని రైతులు బోరు బావుల కింద సాగు చేసి అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. వేసవిలో ఇబ్బంది వేసవి కాలంలో వక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధిక ఉష్టోగ్రతలకు తోడు బోరు బావుల్లో నీటిమట్టం పడిపోవడంతో వక్క తోటలకు సరిగా నీరు అందడంలేదు. దీంతో రైతులు లక్షలు ఖర్చు చేసి మరో బోరు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. నీరు పడితే అదృష్టం.. లేకపోతే పంటతో పాటు బోరు పెట్టుబడి కూడా పోతోంది. ఏపీలో మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి మడకశిర నియోజకవర్గంలో వక్కతోటలు పెద్ద ఎత్తున ఉన్నాయి. వక్క ఉత్పత్తి కూడా ఏటా పెరుగుతూనే ఉంది. ఏపీలో వక్క మార్కెటింగ్‌కు సౌకర్యంలేదు. దీంతో రైతులు కర్ణాటకలోని భీమసముద్రం, శిర, తుమకూర్, శివమొగ్గ, చన్నగిరి తదితర ప్రాంతాల మార్కెట్లలో వక్కను విక్రయిస్తున్నారు. ఈ మార్కెట్లలో దళారుల బెడద కూడా ఎక్కువగా ఉంది. గతంలో అమరాపురంలో మార్కెట్ ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. ఇందుకు ప్రజాప్రతినిధులూ సానుకూలంగా హామీ ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వమైనా చర్యలు తీసుకొని వక్క మార్కెట్‌ను స్థానికంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – రంగప్ప, రైతు గౌడనకుంట, అమరాపురం మండలం వక్కతోట ఉంటే ఉద్యోగం ఉన్నట్టే నాకున్న ఐదెకరాల పొలంలో మూడున్నర ఎకరాల్లో వక్క తోట సాగు చేశా. వక్క తోట ఉంటే ఇంటిలో ఒక ఉద్యోగం ఉన్నట్లే. ఎందుకంటే ఒక ఎకరా తోట ఆరు క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. దీంతో ప్రస్తుత ధర ప్రకారం రూ.2.5 లక్షల ఆదాయం వస్తుంది. ఉన్న ఊరిలోనే వక్కతోట సాగు చేసి అధిక ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం రెండున్నర ఎకరాల్లో కొత్తగా వక్క పంట సాగు చేశా. – మంజునాథ రైతు, తమ్మడేపల్లి, అమరాపురం మండలం ఉపాధి దొరుకుతోంది వక్క తోటలతో రోజూ ఉపాధి దొరుకుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తా. కూలి రూ.400 ఇస్తారు. అలాగే భోజనం, టిఫిన్ పెడతారు. వక్క తోటల వల్ల ఆడ, మగ తేడా లేకుండా అందరికీ పని లభిస్తోంది. పని కూడా నీడలోనే చేస్తాం. ఎటువంటి ఇబ్బందీ లేదు. – జయన్న, కూలీ, గౌడనకుంట, అమరాపురం మండలం -
‘వక్కలు అమ్మి సున్నం పెట్టేశాడు’..!
నాగపూర్: సనత్ జయసూర్య పేరు వింటే చాలు క్రికెట్ అభిమానులందరికీ అతని వీర విధ్వంసక బ్యాటింగ్ విన్యాసాలు గుర్తుకొస్తాయి. వన్డే క్రికెట్ రాత మార్చిన వారిలో ఒకడిగా అతని స్థానం ప్రత్యేకం. అయితే రిటైర్మెంట్ తర్వాత సెలక్టర్‌గా, రాజకీయ నాయకుడిగా పలు వివాదాల్లో భాగంగా నిలిచిన జయసూర్య ఇప్పుడు తీవ్ర ఆరోపణల్లో చిక్కుకున్నాడు. శ్రీలంక నుంచి భారత్‌కు అక్రమంగా వక్కలను తరలించాడని అతనిపై పోలీసులు స్మగ్లింగ్ కేసు నమోదు చేశారు. ఇందులో జయసూర్యతో పాటు మరో ఇద్దరు లంక క్రికెటర్లు కూడా భాగస్వాములుగా ఉన్నారు. నాగపూర్ కేంద్రంగా జరుగుతున్న నకిలీ, నాసిరకం వక్కల తయారీపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు ఇటీవల తనిఖీలు జరిపారు. ఇందులో భారీ ఎత్తున నాసిరకం వక్కలను స్వాధీన పర్చుకోగా, విచారణలో జయసూర్య పేరు బయటకు వచ్చింది. రెవెన్యూ ఇంటెలిజెన్స్ టీమ్ అతడిని ఇప్పటికే ప్రశ్నించినట్లు సమాచారం. దీనిపై భారత అధికారుల నుంచి అందిన లేఖ మేరకు శ్రీలంక ప్రభుత్వం తదుపరి విచారణ కూడా జరపనుంది. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలపై జయసూర్య వివరణ ఇచ్చాడు. ‘ఆ వార్త పచ్చి అబద్ధం. వక్కలకు సంబంధించిన ఎలాంటి వ్యాపారమూ నేను చేయలేదు. పత్రికలో వచ్చిన కథనాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా. పరువుకు నష్టం కలిగించే తప్పుడు వార్తలు ప్రచురించినవారిపై నా న్యాయవాదులు తగిన చర్యలు తీసుకునే పనిలో ఉన్నారు’ అని జయసూర్య ట్వీట్ చేశాడు. -
వక్క లెక్కే వేరు!
ప్రయోగ శీలి అయిన రైతే కొండంత ధైర్యంతో సరికొత్త పంటలను పలకరించగలడు. అటువంటి విలక్షణ రైతే వేమూరి కోటేశ్వరరావు. ఒక్కసారి నాటితే 25–30 ఏళ్ల దిగుబడినిచ్చే వక్క, జాజి, మిరియం వంటి అరుదైన పంటలను శ్రద్ధతో సాగు చేస్తూ.. గణనీయమైన నికరాదాయాన్ని పొందుతున్నారు. వేసవి పగటి ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా నమోదయ్యే జిల్లాల్లో వక్క దిగుబడి కొంత తక్కువగా ఉంటుందని.. జాజి, మిరియాల దిగుబడి బాగానే వస్తుందంటున్నారాయన. ప్రకృతి వ్యవసాయదారుడు కోటేశ్వరరావు అనుభవ పాఠాలు ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం.. ఉద్యాన తోటల సాగును కొత్తపుంతలు తొక్కిస్తున్న అన్నదాత వేమూరి కోటేశ్వరరావు. ఆయన ప్రకృతి వ్యవసాయ క్షేత్రం కొత్త పంటలకు, ఔషధ పంటలకు నిలయం. కృష్టా జిల్లా పమిడిముక్కల మండలం పడమట లంకపల్లి గ్రామం నుంచి∙1999లో విజయనగరం జిల్లా మక్కువ మండలం మార్కొండపుట్టి పంచాయితీ బట్టివలస గ్రామానికి కోటేశ్వరరావు వలస వచ్చి స్థిరపడి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వక్కతోపాటు ఔషధ మొక్కలను కలిపి సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ రైతు అవార్డును అందుకున్నారు. మొదట్లో చేదు అనుభవం... కర్ణాటకలోని శృంగేరీలో వక్క పంట సాగు పద్ధతులను తెలుసుకున్నారు. అక్కడి నుంచి మంగళ, సుమంగళ, శ్రీమంగళ, మెహిత్‌నగర్ రకాల విత్తనాన్ని తెప్పించారు. అస్సాం రాష్ట్రానికి చెందిన మెహిత్‌నగర్ రకం అధిక దిగుబడినిస్తుంది. 2003లో ఆయిల్‌పామ్ తోటలో అంతరపంటగా వక్క సాగు ప్రారంభించారు. కానీ, ఆ విధానం వల్ల రెండు పంటలూ దెబ్బతిన్నాయి. దీంతో వక్క తీసేశారు. 2009లో మళ్లీ రెండెకరాల్లో వక్క సాగు మొదలు పెట్టారు. ఐదు సంవత్సరాలకు ఫలసాయం రావటం మొదలైంది. ఆ ఉత్సాహంతో మరో ఐదెకరాల్లో వక్క మొక్కలు వేశారు. అలా ఏటా పెంచుకుంటూ వెళ్లి ప్రస్తుతం 14 ఎకరాల్లో వక్క సాగు చేస్తున్నారు. సాధారణంగా ఐదున్నరేళ్లకు తొలి దిగుబడినిచ్చే వక్క పంట ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తున్న కోటేశ్వరరావు పొలంలో నాలుగున్నరేళ్లకే ఫలసాయాన్ని అందిస్తున్నది. అరటి+ వక్క+మిరియం+జాజి... వక్క సాగు కొత్త కావటంతో కోటేశ్వరరావు తొలుత సాళ్లమధ్య, మొక్కల మధ్య 6 అడుగుల దూరంలో వక్క నాటారు. చెట్లు పెరిగేటప్పటికి బాగా వత్తుగా అయి, ఎత్తు పెరిగిపోతున్నాయి. పొలం మొత్తాన్నీ 7.5 అడుగుల దూరంలో బోదెలు తోలుకొని.. రెండు వరుసలు ఎటు చూసినా 7.5 అడుగుల దూరంలో వక్క నాటుకోవాలి. మూడో వరుసలో జాజి మొక్కలు నాటుకోవాలని కోటేశ్వరరావు తెలిపారు. వక్క ఎత్తు పెరిగాక మిరియం తీగలు పాకించాలి. మొదట్లోనే వక్క మొక్కలు నాటకూడదు. ఎండకు తట్టుకోలేవు. మొదట అరటి మొక్కలు నాటి నాలుగైదు అడుగుల ఎత్తు పెరిగిన తర్వాత వక్క మొక్కలు నాటుకోవాలి. విజయనగరం జిల్లా వాతావరణానికి వచ్చినంతగా కృష్ణా తదితర జిల్లాల్లో వక్క దిగుబడి రాదు. మార్చిలో వక్క పిందె వస్తుంది. ఎండలకు పిందె కొంత రాలుతుంది కాబట్టి దిగుబడి తగ్గుతుంది. మిరియం, జాజి దిగుబడి ఆ జిల్లాల్లోనూ బాగానే వస్తున్నదంటున్నారని కోటేశ్వరరావు వివరించారు. వక్క ఆదాయం ఎకరానికి రూ. లక్షన్నర ఒక చెట్టు నుంచి రెండు కేజీల వక్క కాయలు ఏటా లభ్యమవుతాయి. వక్క, జాజి చెట్లు ఒక్కసారి నాటితే 25–30 ఏళ్ల వరకు ఆదాయాన్నిస్తాయి. కేజీ వక్క రూ.120 నుంచి రూ.200 వరకు ధర పలుకుతుంది. ఎకరా పొలంలో 750 వరకూ వక్క మొక్కలు నాటుకోవచ్చు. అంతర పంటలు లేకుంటే వెయ్యి మొక్కలు నాటుకోవచ్చు. దగ్గరగా వేస్తే ఎత్తుగా పెరుగుతుంది. దానివల్ల గెలలు కోయడానికి ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఏడాదికి ఎకరాకి రూ.1.5 లక్షలకు పైబడి ఆదాయం లభిస్తుంది. అంతరపంటగా వేసిన జాజి, మిరియం కూడా మంచి ఆదాయాన్నిస్తుంది. వక్కలో ఏడేళ్ల తర్వాత దిగుబడి పెరుగుదల నిలిచిపోతుంది. జాజిలో ప్రతి ఏటా దిగుబడి పెరుగుతుందని కోటేశ్వరరావు అంటున్నారు. రసాయనిక ఎరువులకు బదులుగా జీవామృతాన్ని, వేస్ట్ డీ కంపోజర్ ద్రావణాన్ని సాగుకు వినియోగిస్తున్నారు. వ్యవసాయంతో పాటు ఆయన సాగుచేస్తున్న ఔషధ మొక్కలతో పలువురు రోగులకు వైద్యాన్ని అందిస్తున్నారు. మండలంలో ఎవరికైనా పాము కరిస్తే ముందు గుర్తుచ్చేది కోటేశ్వరరావే. ఉల్లిపాము(రక్తపింజరి) కాటుకు ఆయుర్వేద మందును కోటేశ్వరరావు ఉచితంగా అందిస్తుంటారు. మిశ్రమ పంటల సాగు లాభదాయకం వక్క పంట విత్తనాలను మొక్కలుగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం, అంబాజీపేట వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. వారు మన రాష్ట్రంతో పాటుæ హైదరాబాద్, కర్ణాటక పట్టణాలకు తరలిస్తున్నారు. వ్యాపారులు ఒక్కో మొక్క రూ.16 నుంచి రూ.20 చొప్పున కొనుగోలు చేసి తీసుకువెళుతున్నారు. వక్క చెట్టు మట్టల(జంటలు)తో చక్కని పేపరు ప్లేట్లు తయారు చేసుకోవచ్చని ఆయన అంటున్నారు. ఈ పంట అధికంగా కర్ణాటకలో సాగులో ఉంది. ఇందులో మిశ్రమ పంటలు వేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. అంతే కాకుండా ఆయుర్వేదిక్ మార్కెట్లో గిరాకి కలిగిన అతిమధురం, సరస్వతి, నేలవేము, దుంపరాష్ట్రం తదితర ఔషధ పంటలతో పాటు మిరియాలు వంటి సుగంధ ద్రవ్య పంటలను కూడా సాగు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం లేదు! ఉత్తరాంధ్రలో వక్క పంటను ప్రత్యేకంగా సాగు చేస్తున్నది నేనొక్కడినే. వక్క పంట సాగుకు ప్రత్యేక వాతావరణం అవసరం. ఈ మొక్కలు అత్యల్ప, అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేవు. నేలలో తేమ మాత్రమే ఉండాలి. నీరు నిల్వ ఉండకూడదు. మక్కువ మండలంలో ఇలాంటి వాతావరణం ఉండటం వల్ల వక్క సాగుకు అనుకూలత ఏర్పడింది. దీంతో ఇతర జిల్లాలతో పోలిస్తే మన దగ్గర దిగుబడి బాగుంటుంది. కుళ్లిన అరటి చెట్ల ఆకులు, గోమూత్రం, పేడ సేంద్రియ ఎరువులుగా ఉపయోగపడుతున్నాయి. అంతర పంటల ఆదాయంతో పెట్టుబడి ఖర్చులు తీరిపోతాయి. వక్కలో అంతరపంట మిరియాలతో వచ్చిన ఆదాయంతో వక్క పంటకు వెచ్చించిన ఖర్చు వచేస్తుంది. ఈ ఏడాది జాజికాయ, నల్ల మిరియాల పంటల సాగు ప్రారంభించాలనుకుంటున్నాను. ఇతర రాష్ట్రాల్లో వక్క పంట సాగుకు ప్రభుత్వ రాయితీలున్నాయి. మన రాష్ట్రంలో అలాంటివేమీ లేవు. దాంతో, ఎంతగా అవగాహన కల్పించినా వక్క సాగు చేసేందుకు మన రైతులు ఆసక్తి కనబరచడం లేదు. ఉభయగోదావరి జిల్లాల్లో ఇటీవలే జాజికాయ సాగు మొదలుపెట్టారు. ఉత్తరాంధ్ర జిల్లాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వక్క మొక్కల నర్సరీ ఆకు ముడత రానివ్వదు! ఇది సిక్కిం రాష్ట్రానికి చెందిన దేశవాళీ మిరప రకం. ఆకు ముడతను దరి చేరనివ్వకపోవడం, ఒకసారి నాటితే అనేక సంవత్సరాలు దిగుడినివ్వటం (బహువార్షిక రకం), చక్కని వాసన కలిగి ఉండటం.. ప్రత్యేకతలు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు బాలరాజు(98663 73183) దీన్ని ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. ఇతర వివరాలకు సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త డా. జి. రాజశేఖర్– 83329 45368. చీడపీడల నివారణలో.. చేతిని మించిన సాధనం లేదు! కాకర ఆకుల మీద పసుపు రంగు నల్లులు చేరి పత్రహరితాన్ని తింటాయి. ఆకులన్నీ అస్థిపంజరాల వలె అవుతాయి. నివారణ ఏ మందులూ అవసరం లేదు. చీడపీడల నివారణలో, చేతిని మించిన సాధనం లేదు! ఆకులపై నల్లులు కనిపిస్తే చేతి వేళ్లతో నలిపేయాలి. అలా వరుసగా రెండు, మూడు రోజులు చెయ్యాలి. ఈ పని చేస్తే నల్లుల సమస్య సునాయాసంగానే పోతుంది. – తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దె తోట నిపుణులు – వేమూరి కోటేశ్వరరావు (94407 45555), వక్క రైతు, బట్టివలస, మక్కువ మండలం, విజయనగరం జిల్లా దివంగత వైఎస్సార్ నుంచి అవార్డు స్వీకరిస్తున్న కోటేశ్వరరావు వక్కల చెట్లకు పాకిన మిరియాల పాదులు – బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, విజయనగరం ఫొటోలు: బత్తెన శాంతీశ్వరరావు, మక్కువ -
వడలిన తోటలు
జూన్ ముగుస్తున్నా తగ్గని ఎండలు, వడగాడ్పులు నీటితడి లేక ఎండుతున్న తమలపాకులు సాగుకు అనుకూలించని వాతావరణం రూ.లక్షలు పెట్టుబడి పెట్టినా రైతుకు దక్కని ప్రతిఫలం ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రుతుపవనాల రాక ఆలస్యం కావడం, జూన్ మాసాంతంలోనూ వడగాడ్పుల తీవ్రత తగ్గక పోవడంతో తోటలు ఎండుముఖం పడుతున్నాయి. నీరు సమృద్ధిగా అందక ముఖ్యంగా తమలపాకులు వడలి పోతున్నాయి. వాతావరణంలో తేమశాతం తక్కువగా ఉండటంతో నోరు పండించాల్సిన తమలపాకులు తోటల్లోనే ఎండిపోతున్నాయి. ఈ పంట సాగు చేస్తున్న రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. కౌలుదారులే అధికం.. పొన్నూరు మండలంలోని చింతలపూడి, ఆరెమండ, గాయంవారిపాలెం, దండమూడి తదితర గ్రామాల్లో సుమారు 500 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో తమలపాకు తోటలు సాగవుతున్నాయి. సారవంతమైన ఇక్కడి నేలలు తీగజాతికి చెందిన తమలపాకు సాగుకు అనుకూలమైనవి. ఈ మొక్కలను కర్రలను ఆలంబనగా మార్చి రైతులు ఎన్నో మెలకువలతో సాగు చేస్తుంటారు. ఈ పంట సాగు కాలం 18 నెలలు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ఇక్కడకు వ స్తుంటారు. 20 ఏళ్లుగా వారు ఇక్కడి పొలాలు కౌలుకు తీసుకుని తమలపాకు సేద్యం చేస్తున్నారు. తమలపాకు సాగుపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు 750 ఉన్నాయి. ఈ ప్రాంతంలో పండించే తమలపాకుకు మంచి డిమాండ్ ఉండటంతో రాష్ట్ర నలుమూలకే కాక, ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతోంది. తమలపాకు సాగు చేసే భూములు ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు కౌలు పలుకుతోంది. ఎరువుల ధరలు, కూలీ రేట్లు అధిక ం కావడంతో సాగు ఖర్చులు ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు భరించాల్సి వస్తోంది. ఈ ఏడాది వర్షాలు లేక, విద్యుత్ కోతల కారణంగా తోటలకు నీరందక తోటలు వడలిపోయాయి. వర్షాలు కురవాల్సిన సమయంలోనూ ఎండల ఉద్ధృతి తగ్గకపోవడంతో ఆకులు ఎండిపోయాయి. వాతావరణం అనుకూలించి పంట బాగా పండితే ఎకరాకు రూ. 50,000 వరకు మిగిలేది. కానీ ఈ సంవత్సరం 40,000 నష్టపోవాల్సి వచ్చింది. ప్రభుత్వం ఆదుకోవాలి.. గత ఏడాది కంటే ఈ ఏడాది తమలపాకు రైతులు కోలుకోని విధంగా దెబ్బతిన్నారు. ఒక వైపు విపరీతమైన ఎం డ, వడగాలులతో తోటలు మొత్తం ఎండిపోయాయి.. ప్రభుత్వం స్పందించి తమలపాకు రైతులను ఆదుకోవాలి. - చిలుకూరి వెంకటనరసింహారావు, చింతలపూడి, పొన్నూరు మండలం కరెంటు కోసం పడిగాపులు కాస్తున్నాం.. నీటి కొరతతో తోటలు పూర్తిగా పాడైపోయాయి. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక కంటిమీద కునుకు లేకుండా పోలాల గట్లపైనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. తెగిన కరెంటు వైర్లను సరిచేయాలన్నా, పోయిన ఫీజులు వేయాలన్నా అధికారులు స్పందించటం లేదు. ఫోన్లు చేసినప్పటికీ పట్టించుకునే వారు లేరు. - బెజవాడ రామకృష్ణ, చింతలపూడి, పొన్నూరు మండలం