వడలిన తోటలు
జూన్ ముగుస్తున్నా తగ్గని ఎండలు, వడగాడ్పులు
నీటితడి లేక ఎండుతున్న తమలపాకులు
సాగుకు అనుకూలించని వాతావరణం
రూ.లక్షలు పెట్టుబడి పెట్టినా రైతుకు దక్కని ప్రతిఫలం
ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రుతుపవనాల రాక ఆలస్యం కావడం, జూన్ మాసాంతంలోనూ వడగాడ్పుల తీవ్రత తగ్గక పోవడంతో తోటలు ఎండుముఖం పడుతున్నాయి. నీరు సమృద్ధిగా అందక ముఖ్యంగా తమలపాకులు వడలి పోతున్నాయి. వాతావరణంలో తేమశాతం తక్కువగా ఉండటంతో నోరు పండించాల్సిన తమలపాకులు తోటల్లోనే ఎండిపోతున్నాయి. ఈ పంట సాగు చేస్తున్న రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది.
కౌలుదారులే అధికం..
పొన్నూరు మండలంలోని చింతలపూడి, ఆరెమండ, గాయంవారిపాలెం, దండమూడి తదితర గ్రామాల్లో సుమారు 500 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో తమలపాకు తోటలు సాగవుతున్నాయి. సారవంతమైన ఇక్కడి నేలలు తీగజాతికి చెందిన తమలపాకు సాగుకు అనుకూలమైనవి. ఈ మొక్కలను కర్రలను ఆలంబనగా మార్చి రైతులు ఎన్నో మెలకువలతో సాగు చేస్తుంటారు. ఈ పంట సాగు కాలం 18 నెలలు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ఇక్కడకు వ స్తుంటారు. 20 ఏళ్లుగా వారు ఇక్కడి పొలాలు కౌలుకు తీసుకుని తమలపాకు సేద్యం చేస్తున్నారు. తమలపాకు సాగుపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు 750 ఉన్నాయి. ఈ ప్రాంతంలో పండించే తమలపాకుకు మంచి డిమాండ్ ఉండటంతో రాష్ట్ర నలుమూలకే కాక, ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతోంది. తమలపాకు సాగు చేసే భూములు ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు కౌలు పలుకుతోంది. ఎరువుల ధరలు, కూలీ రేట్లు అధిక ం కావడంతో సాగు ఖర్చులు ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు భరించాల్సి వస్తోంది. ఈ ఏడాది వర్షాలు లేక, విద్యుత్ కోతల కారణంగా తోటలకు నీరందక తోటలు వడలిపోయాయి. వర్షాలు కురవాల్సిన సమయంలోనూ ఎండల ఉద్ధృతి తగ్గకపోవడంతో ఆకులు ఎండిపోయాయి. వాతావరణం అనుకూలించి పంట బాగా పండితే ఎకరాకు రూ. 50,000 వరకు మిగిలేది. కానీ ఈ సంవత్సరం 40,000 నష్టపోవాల్సి వచ్చింది.
ప్రభుత్వం ఆదుకోవాలి.. గత ఏడాది కంటే ఈ ఏడాది తమలపాకు రైతులు కోలుకోని విధంగా దెబ్బతిన్నారు. ఒక వైపు విపరీతమైన ఎం డ, వడగాలులతో తోటలు మొత్తం ఎండిపోయాయి.. ప్రభుత్వం స్పందించి తమలపాకు రైతులను ఆదుకోవాలి.
- చిలుకూరి వెంకటనరసింహారావు, చింతలపూడి, పొన్నూరు మండలం
కరెంటు కోసం పడిగాపులు కాస్తున్నాం..
నీటి కొరతతో తోటలు పూర్తిగా పాడైపోయాయి. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక కంటిమీద కునుకు లేకుండా పోలాల గట్లపైనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. తెగిన కరెంటు వైర్లను సరిచేయాలన్నా, పోయిన ఫీజులు వేయాలన్నా అధికారులు స్పందించటం లేదు. ఫోన్లు చేసినప్పటికీ పట్టించుకునే వారు లేరు.
- బెజవాడ రామకృష్ణ, చింతలపూడి, పొన్నూరు మండలం