ముంపుబారిన 1.60 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు
10 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలకు దెబ్బ
సాక్షి, అమరావతి: భారీ వర్షాలకు పెద్దఎత్తున వ్యవసాయ, ఉద్యాన పంటలు ముంపునకు గురవుతున్నాయి. బుడమేరు, ఎర్రకాలువలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఎన్టీఆర్, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని వేలాది ఎకరాలు ముంపునకు గురయ్యాయి. ఇక ఉద్యాన పంటల విషయానికొస్తే అత్యధికంగా కూరగాయలు, అరటి, పసుపు, మిరప, తమలపాకు పంటలకు అపార నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. కూరగాయల పంటలే ఎక్కువగా దెబ్బతిన్నట్లు అంచనా వేస్తున్నారు.
ఈ వర్షాలవల్ల 30వేల మందికి పైగా రైతులు ప్రభావితమైనట్లు సమాచారం. ప్రస్తుతం వరి పంట దుబ్బులు కట్టే దశలో ఉండడంతో ఈ వర్షాలు మేలుచేస్తాయని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. అయితే, ముంపునీరు 5–6 రోజులకు మించి చేలల్లో ఉంటే మాత్రం పంటలకు నష్టం వాటిల్లే అవకాశముందని చెబుతున్నారు. నిజానికి.. సీజన్ ఆరంభం నుంచి రైతులు తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఖరీఫ్ సాగుచేస్తున్నారు. ఇప్పటికే జులైలో కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతినడంతో నష్టపోయిన రైతులు రెండోసారి విత్తుకున్నారు. తాజాగా.. కురుస్తున్న వర్షాలు వారిని మరింత కలవరపెడుతున్నాయి.
13 జిల్లాల్లో పంటలపై తీవ్ర ప్రభావం..
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో.. 135 మండలాల పరిధిలోని 581 గ్రామాల్లో భారీ వర్షాలవల్ల పంటలు ముంపునకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ప్రాథమిక అంచనా ప్రకారం శనివారం రాత్రికి 1.60 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 10 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు ముంపునకు గురైనట్లు గుర్తించారు. ఇది ఇంకా ఎక్కువే ఉంటుందని క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారం. ఈ వర్షాలు ఉభయ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, నంద్యాల, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి.
Comments
Please login to add a commentAdd a comment