చేతక్ వీడర్
కరోనా నేపథ్యంలో పట్టణాల నుంచి స్వగ్రామాలకు తిరిగి వచ్చి వ్యవసాయం కొనసాగిస్తున్న కొందరు రైతులు సృజనాత్మక ఆలోచనలతో తమకు అవసరమైన వ్యవసాయ పరికరాలను, యంత్రాలను రూపొందించుకొని వాడుకుంటున్నారు. ఈ రైతు ఆవిష్కర్తల్లో కొందరు నేలతల్లి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌లో సభ్యులు కావటం విశేషం. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామం కేంద్రంగా ఇది పనిచేస్తున్నది. కష్టకాలంలో సులువుగా తక్కువ కూలీలతో పనులు చేసుకునే ఆవిష్కరణలు చేసిన వీరికి వాటర్ లైవ్‌లీహుడ్ ఫౌండేషన్ సంస్థ ఆర్థిక తోడ్పాటును అందించి ప్రోత్సహించింది.
గుంటక : కలుపు నిర్మూలనతో పాటు ఎరువు వేయడానికి ఉపయోగకరం.
దంతె : దుక్కి చేయటంతోపాటు విత్తనం, ఎరువు వేయడానికి ఉపయోగపడుతుంది. రూ. పది వేల ఖర్చుతో వీటిని రూపొందించిన రైతు పేరు రుద్రపాక నరసింహ. అతనిది సంస్థాన్ నారాయణపూర్ మండలం సుర్వైల్ గ్రామం.
గడ్డి ఏరే పరికరం: వరి పంటను యంత్రంతో కోయించిన తర్వాత చెల్లాచెదురుగా పడిన గడ్డిని పోగెయ్యటం ఖర్చుతో కూడిన పని. అందువల్ల కొందరు రైతులు గడ్డికి నిప్పు పెడుతున్నారు. దీనివల్ల భూసారం దెబ్బతినటమే కాకుండా గాలి కలుషితమవుతోంది. ఈ పరికరంతో తక్కువ సమయంలో గడ్డిని కుప్ప వేయవచ్చు. రూ.700 ఖర్చుతో దీన్ని రూపొందించిన రైతు వంకా శ్యాంసుందర్‌రెడ్డి. ఇతనిది జనగాం జిల్లా లింగాల ఘనపురం మండలంలోని వనపర్తి.
చేతక్ వీడర్ : పాత ఇనుప సామాను షాపులో చేతక్ స్కూటర్ విడిభాగాలు తీసుకొని అనేక పనులు చేసేలా రూ. 30 వేల ఖర్చుతో రూపొందించిన రైతు బొల్లం శ్రీనివాస్. ఇతనిది లింగాల ఘనపూర్ మండలం వనపర్తి. గేర్ బాక్స్ కూడా ఉండటంతో ఇది సమర్థవంతంగా పనిచేస్తోంది. దుక్కికి, విత్తనాలు వేసుకోవడానికి, కలుపు నిర్మూలించడానికి గుంటక/దంతె మాదిరిగా, బెడ్ మేకర్‌గా, పంపును అనుసంధానం చేసి కాలువ నుంచి నీళ్లు తోడటానికి కూడా ఉపయోగిస్తున్నారు.
ట్రాలీ స్ప్రేయర్ : పురుగుమందులు, కషాయాలు, జీవామృతం వంటి ద్రావణాలను పంటలపై తక్కువ శ్రమతో, తక్కువ ఖర్చు పిచికారీ చేయడానికి ఇది ఉపయోగపడుతోంది. ట్యాంకును మోయటం కన్నా ట్రాలీపై పెట్టుకొని పిచికారీ చేసుకోవచ్చు. మనిషి తన వెనుక ఈ ట్రాలీని పెట్టుకొని.. దీన్ని లాక్కుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలు. బొల్లం శ్రీనివాస్ ఈ ట్రాలీని రూ. 2,100 ఖర్చుతో తయారు చేసి, ట్యాంకర్‌ను దానిపై అమర్చాడు.
చేతక్ వీడర్ నడుపుతున్న రైతు బొల్లం శ్రీనివాస్
ఈ పరికరాల గురించి మరిన్ని వివరాలకు.. నేలతల్లి ఎఫ్‌పిఓ సీఈవో కె.సురేందర్‌రెడ్డి – 99517 93862
Comments
Please login to add a commentAdd a comment