suddala
-
పాటల తూటాల యోధుడు
పాట పోరాట రూపం. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లేది పాటే. అలాంటి పాటల ప్రవాహానికి బలాన్నీ, బలగాన్నీ సమకూర్చిన వాగ్గేయకారుడు సుద్దాల హనుమంతు. ‘బాంచెన్ దొర కాలు మొక్కుతా’ అన్న వారితో బందూకులను పట్టించిన పాటలు ఆయనవి. హరికథ, బుర్రకథ, యక్షగానాలతో బూజు పట్టిన నిజాం నిరంకుశ పాలకుల కోట గోడలను కూల్చివేసిన జనగీతం ఆయన. 1910లో నేటి యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో లక్ష్మీ నరసమ్మ, బుచ్చి రాములు దంపతులకు జన్మించారు. 14 ఏళ్ల వయసులోనే ఆయన పాటలు తెలంగాణలోని ప్రతి గడపగడపను తట్టి లేపాయి. హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖలో చిన్న ఉద్యోగం చేస్తూ ప్రజోద్యమాలకు ఊతం ఇచ్చేవారు. ఇది గమనించిన ప్రభుత్వాధికారులు ఆయన్ని ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు హెచ్చరించారు. దీంతో హనుమంతు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి పాటలతో నిజాం రాక్షస పాలనపై రణభేరి మోగించాడు. 1944లో 11వ ఆంధ్ర మహాసభ సమావేశాలు భువనగిరిలో జరిగాయి. హనుమంతు వాలంటీర్‌గా పని చేశారు. ఆ సమావేశాల్లో నాయకుల ప్రసంగాలను విని హనుమంతు పోరాట మార్గాన్ని ఎంచుకుని తన కలానికి గలానికి మరింత పదును పెట్టాడు. ఆంధ్ర మహాసభ ఇచ్చిన పిలుపునందుకుని ప్రతి గ్రామంలో సంఘం పెట్టడానికి ప్రజలను చైతన్యవంతం చేశాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా 1946–51 మధ్య జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో హనుమంతు కమ్యూనిస్టు పార్టీ సాంస్కృతిక దళానికి నాయకత్వం వహించారు. ‘వెట్టిచాకిరి విధానమో రైతన్న /ఎంత జెప్పిన తీరదో కూలన్న’ అంటూ దుర్మార్గమైన వ్యవస్థను సుద్దాల హనుమంతు తన పాటల్లో వర్ణించాడు. ‘పల్లెటూరి పిల్లగాడ!/ పసులగాసే మొనగాడా!/పాలు మరిసి ఎన్నాళ్ళయిందో’ అంటూ వెట్టి చాకిరీతో నలిగిపోతున్న తెలంగాణ బాల్యాన్ని హనుమంతు ప్రపంచానికి పరిచయం చేశాడు. ‘సంఘం వచ్చిందరో రైతన్న మనకు బలం తెచ్చిందిరో కూలన్న‘ అంటూ ఆయన పాడుతూ ఉంటే ప్రజలకు ఎక్కడ లేని ధైర్యం వచ్చేది. ఏయే దొర కబంధ హస్తాల్లో ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో వివరాలను సేకరించి... దొరల భూ అక్రమాలను పల్లె సుద్దుల రూపంలో చెబుతూ ప్రజలను చైతన్యపరిచారు. ఆయన పాటలు తెలంగాణ జనం నాలికల మీద నాట్యం చేసేవి. నాటి తెలంగాణ పోరాటంలో హనుమంతు రాసిన పాటలు పాడని గ్రామం లేదు. ఆయన ప్రజల భాషలో యాసలో, శైలిలో ప్రజాపయోగమైన ఎన్నో పాటలు రాసి, పాడి పలు ప్రదర్శనలు ఇచ్చారు. హనుమంతు బుర్రకథ చెబితే గడ్డిపోచ కూడా యుద్ధానికి సిద్ధమవుతుందనీ, ఫిరంగిలా పేలుతుందనేంతగా ఆనాటి ప్రజల అభిప్రాయం. రాజంపేట మండలం రేణిగుంటలో కమ్యూనిస్టు గ్రామసభలో ‘మాభూమి’ నాటకం గొల్ల సుద్దుల ప్రదర్శనలు చేస్తున్న సమయంలో నిజాం మూకలు వస్తున్నాయని తెలిసి చెట్టుకొక్కరు పుట్టకొకరుగా జనం పారిపోతున్న క్రమంలో... ఓ ముసలావిడ కర్రను హనుమంతు తీసుకొని భూమిపై కర్రతో కొడుతూ ‘వేయ్ వేయ్ దెబ్బకు దెబ్బ’ అంటూ ప్రజల్లో మనోధైర్యాన్ని నింపి నిజాం సైన్యాన్ని ఊరి పొలిమేర వరకు తరిమికొట్టారు. ఈ ఘటన తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక ఘట్టం. 1982 అక్టోబర్ 10న క్యాన్సర్ వ్యాధి కారణంగా తన జీవన ప్రస్థానాన్ని ముగించిన హనుమంతు చరిత్రను జాగ్రత్తగా భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. – అంకం నరేష్ యూఎఫ్ఆర్టీఐ తెలంగాణ కో–కన్వీనర్ -
రైతులే ఆవిష్కర్తలు!
కరోనా నేపథ్యంలో పట్టణాల నుంచి స్వగ్రామాలకు తిరిగి వచ్చి వ్యవసాయం కొనసాగిస్తున్న కొందరు రైతులు సృజనాత్మక ఆలోచనలతో తమకు అవసరమైన వ్యవసాయ పరికరాలను, యంత్రాలను రూపొందించుకొని వాడుకుంటున్నారు. ఈ రైతు ఆవిష్కర్తల్లో కొందరు నేలతల్లి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌లో సభ్యులు కావటం విశేషం. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామం కేంద్రంగా ఇది పనిచేస్తున్నది. కష్టకాలంలో సులువుగా తక్కువ కూలీలతో పనులు చేసుకునే ఆవిష్కరణలు చేసిన వీరికి వాటర్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ సంస్థ ఆర్థిక తోడ్పాటును అందించి ప్రోత్సహించింది. గుంటక : కలుపు నిర్మూలనతో పాటు ఎరువు వేయడానికి ఉపయోగకరం. దంతె : దుక్కి చేయటంతోపాటు విత్తనం, ఎరువు వేయడానికి ఉపయోగపడుతుంది. రూ. పది వేల ఖర్చుతో వీటిని రూపొందించిన రైతు పేరు రుద్రపాక నరసింహ. అతనిది సంస్థాన్ నారాయణపూర్ మండలం సుర్వైల్ గ్రామం. గడ్డి ఏరే పరికరం: వరి పంటను యంత్రంతో కోయించిన తర్వాత చెల్లాచెదురుగా పడిన గడ్డిని పోగెయ్యటం ఖర్చుతో కూడిన పని. అందువల్ల కొందరు రైతులు గడ్డికి నిప్పు పెడుతున్నారు. దీనివల్ల భూసారం దెబ్బతినటమే కాకుండా గాలి కలుషితమవుతోంది. ఈ పరికరంతో తక్కువ సమయంలో గడ్డిని కుప్ప వేయవచ్చు. రూ.700 ఖర్చుతో దీన్ని రూపొందించిన రైతు వంకా శ్యాంసుందర్‌రెడ్డి. ఇతనిది జనగాం జిల్లా లింగాల ఘనపురం మండలంలోని వనపర్తి. చేతక్ వీడర్ : పాత ఇనుప సామాను షాపులో చేతక్ స్కూటర్ విడిభాగాలు తీసుకొని అనేక పనులు చేసేలా రూ. 30 వేల ఖర్చుతో రూపొందించిన రైతు బొల్లం శ్రీనివాస్. ఇతనిది లింగాల ఘనపూర్ మండలం వనపర్తి. గేర్ బాక్స్ కూడా ఉండటంతో ఇది సమర్థవంతంగా పనిచేస్తోంది. దుక్కికి, విత్తనాలు వేసుకోవడానికి, కలుపు నిర్మూలించడానికి గుంటక/దంతె మాదిరిగా, బెడ్ మేకర్‌గా, పంపును అనుసంధానం చేసి కాలువ నుంచి నీళ్లు తోడటానికి కూడా ఉపయోగిస్తున్నారు. ట్రాలీ స్ప్రేయర్ : పురుగుమందులు, కషాయాలు, జీవామృతం వంటి ద్రావణాలను పంటలపై తక్కువ శ్రమతో, తక్కువ ఖర్చు పిచికారీ చేయడానికి ఇది ఉపయోగపడుతోంది. ట్యాంకును మోయటం కన్నా ట్రాలీపై పెట్టుకొని పిచికారీ చేసుకోవచ్చు. మనిషి తన వెనుక ఈ ట్రాలీని పెట్టుకొని.. దీన్ని లాక్కుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలు. బొల్లం శ్రీనివాస్ ఈ ట్రాలీని రూ. 2,100 ఖర్చుతో తయారు చేసి, ట్యాంకర్‌ను దానిపై అమర్చాడు. చేతక్ వీడర్ నడుపుతున్న రైతు బొల్లం శ్రీనివాస్ ఈ పరికరాల గురించి మరిన్ని వివరాలకు.. నేలతల్లి ఎఫ్పిఓ సీఈవో కె.సురేందర్‌రెడ్డి – 99517 93862 -
ముంపు ప్రాంతాలపై పాట రాస్తా
సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ వీఆర్‌పురం (రంపచోడవరం) : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం మూలంగా సర్వస్వాన్ని కోల్పోతున్న నిర్వాసితుల ఆవేదనను కళ్లకు కట్టే రీతిలో ఒక పాట రాస్తానని సినీ గేయ రచయితీ సుద్దాల అశోక్‌తేజ అన్నారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో భద్రాద్రి కళాభారతి 15వ అంతరాష్ట్ర స్థాయి నాటకోత్సవాల ముంగిపు కార్యక్రమానికి వచ్చిన ఆయన.. బుధవారం పాపికొండల ప్రాంతాన్ని వీక్షించేందుకు వచ్చారు. మండలంలోని పోచవరం బోట్ పాయింట్ నుంచి గోదావరిపై బోట్లో పేరంటపల్లిలోని శివాలయం, పాపికొండలను వీక్షించారు. ప్రకృతి అందాలు కనుమరుగైతే బాధ వేస్తుంది.. పచ్చటి అటవీ ప్రాంతం, ఆహ్లాదకర వాతావరణం, గోదావరి నది వంపు సొంపుల నడుమ ఉన్న గిరిజన పల్లెలు.. గోదావరి ఒడిలో కలిసిపోతాయంటే బాధ వేస్తుందని అశోక్‌తేజ అన్నారు. సంస్కృతి, సాంప్రదాయాలను వదిలి మరో ప్రాంతంలో వీరు బతకాలంటే కష్టమేనన్నారు. అసలు ఇంటి పేరు గుర్రం .. సుద్దాల అశోక్ తేజాగా సుప్రసిద్ధుడైన ఆయన ఇంటి పేరు గుర్రం అని చెప్పారు. నల్గొండ జిల్లా గుండాల మండలంలోని సుద్దాల గ్రామం ఆయన స్వగ్రామం. తండ్రి హనుమంతు కూడా సినీగేయ రచయితే. ఆయనను సుద్దాల హనుమంతుగా పిలిచేవారు. దీంతో ఇంటి పేరు సుద్దాలగా మారిందని ఆయన అన్నారు. గేయ రచీతగా 22 ఏళ్ల కాలంలో 1,250 సినిమాల్లో సుమారు 2,200 పైగా పాటలు రాసినట్టు చెప్పారు. పాండురంగడు చిత్రంలో రాసిన ‘మాతృదేవోభవ’ పాట అంటే తనకు ఇష్టమని చెప్పారు.